విశాఖ స్టీల్ మీద జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఒక గమ్మత్తు…

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ (RINL) భూములను అమ్మేందుకు  డాక్టర్ ఇఎఎస్ శర్మ వంటి మేధావులు వ్యతిరేకత చూపుతున్నసమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ ప్రధానికి లేఖ రాస్తూ కంపెనీకి  ఉన్న  మిగులు భూమిలో  కొంత భాగాన్ని విక్రమయంచాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు.

కంపెనీ భూముల విలువ దాదాపు లక్షకోట్ల రుపాయల దాకా ఉంటుందని అంతా చెబుతున్నారు.

విశాఖ ఉక్కు పేరుకే నష్టాల్లో ఉంది కాని, దాని చూట్టూర సంపదే ఉంది. ఈ లక్షకోట్ల విలువ చేసే భూములున్నాయి. అమూల్య అనుభవం ఉన్న ఉద్యోగులున్నారు. అత్యాధునిక యంత్రాలున్నాయి. ఇలాంటి కంపెనీ దేశంలో ఇదొక్కటే. అందుకే ఏదో విధంగా ఈ కంపెనీని  కొనేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నందున ఈ ప్రయత్నాలు ఆగిపోతున్నాయి. కంపెనీని అమ్మకపోతే, కొన్ని భూములైనా అమ్మండనే ప్రతిపాదన ఈ ఉబలాటం నుంచి వచ్చిందే.

ఇపుడు, పార్లమెంటులో సంపూర్ణాధిక్యత ఉండటం, రాష్ట్ర ప్రభుత్వాలేవీ మోదీ ప్రభుత్వంతో తగవు పెట్టుకునే  స్థితిలో లేకపోవడంతో విశాఖ స్టీల్ ను అమ్మేస్తే ఎవరడ్డుకుంటారనే దోరణి కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తుంది. చాలా పబ్లిక్ సెక్టర్ కంపెనీలో చౌకగా కొన్ని భూముల కోసం ఫ్యాక్టరీ ని మూసేసిన ఉదాహరణలున్నాయి. ఇవి కూడా వైజాగ్ లోనే ఉన్నాయి. ఇలాంటి అనుభవం దండిగా మిగులు భూములన్న వైజాగ్ స్టీల్ కు రాదనే గ్యారంటీ ఏమిటి అని స్థానిక  మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రుల ఆత్మాభిమానం మీద రెండో దెబ్బ

కేంద్రం ఆంధ్రల ఆత్మగౌరవం మీద దెబ్బవేయడం ఇది రెండోసారి. మొదటి సారి ఆంధ్రబ్యాంక్ ను యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం. ఆంధ్రబ్యాంక్ అనేది రెండు రకాల ఆంధ్రుల ఆత్మాభిమానానికి సంకేతం. ఒకటి దేశంలోని జాతీయ సంస్థల్లో ఆంధ్ర అనే పేరున్న ఏకైక సంస్థ ఇదొక్కటే. రెండు: ఆంధ్రా బ్యాంక్ వ్యాపార దృష్టితో కాకుండా జాతీయోధ్యమ స్ఫూర్తితో మొదలయిన బ్యాంక్. ఈ బ్యాంక్ ను స్థాపించింది డాక్టర్  పట్టాభిసీతారామయ్య. ఆయన స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. అంతేకాదు, జాతీయ కాంగ్రెస్ చరిత్ర అధికారిక రచయిత కూడా. ఆయన చాలా గొప్ప ఉన్నతాశయంతో ఆంధ్రబ్యాంక్ ను  స్థాపించారు. ఒక గొప్ప చరిత్ర ఉన్న బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ అయితే, అంత కంటే, మహోన్నత చరిత్ర  ఆంధ్రులది. అలాంటి ‘ఆంధ్రై అనే మాట లేకుండా, ఈ బ్యాంక్ను యూనియన్ బ్యాంక్ లో విలీనం చేశారు. దీనికి వెనక ఉన్నది కూడా ఆంధ్రుల కోడలని పేరున్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్.

డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య నెహ్రూతో పాటు అహ్మద్ నగర్ జైలులో జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఆగస్టు 9, 1942 నుంచి మార్చి 28,1945 దాకా ఉన్నారు. ఈ జైలులో నుండే నెహ్రూ  డిస్కవరీ ఆఫ్ ఇండియా (Discovery of India) రాశారు.

అదే సీతారామన్ ఇపుడు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకయిన విశాఖ స్టీల్ భూముల మీద కన్నేసిన వారికి ప్లాంటును కట్టబెట్టాలని చూస్తున్నారు.

విశాఖ  స్టీల్ ప్రయివేటీకరణవలో కారుచౌకగా మిగులు భూములను కొట్టేసే ప్రమాదముందని డాక్టర్ ఇఎఎస్ శర్మ ఎపుడో కేంద్రానికి లేఖ రాశారు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరొక లేఖ రాశారు. మరి ఇలాంటపుడు ముఖ్యమంత్రి జగన్ కొంతభూమి అమ్మాలంటున్నారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి దాదాపు 20వేల ఎకరాల భూములున్నాయి. వీటిని విక్రయించడమంటే  వాటిని కారుచౌకగా కొట్టేసేందుకు  బాటవేయడమే నని, ఈ ప్రమాదం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డాక్టర్ ఇఎస్ ఎస్ శర్మ తన లేఖలో రాశారు.

 


విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆంధ్రుల ఆత్మాభిమానం మీద కేంద్ర ప్రభుత్వం తీసిన రెండో దెబ్బ. మొదటి దెబ్బ ఆంధ్రా బ్యాంక్ విలీనం.


 

అయితే, జగన్ నిన్న ప్రధానికి రాసిన లేఖలో ఈ మిగులు భూమి ప్రస్తావన తీసుకువచ్చారు. నిరుపయోగంగా పడి ఉన్న ఈ భూమిని విశాఖ స్టీల్ ని నష్టాలనుంచి బయటవేసేందుకు వాడుకోవచ్చని ఆయన సూచించారు.

“ఆర్‌ఐఎన్‌ఎల్‌ విశాఖ వద్ద నిరుపయోగంగా దాదాపు 7 వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని విక్రయించడం ద్వారా తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చు. ఆ ప్రక్రియ సజావుగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుంది,” అని ముఖ్యమంత్రి జగన్ లేఖలో పేర్కొన్నారు.

(RINL has nearly 7,000 acres of un-utilised lands. Another measure that the Centre can take up is to monetise these lands by way of plotting and sale by RINL itself and the amounts realised will make the company cash rich thereby increasing the valuation of the company. The state government would give all necessary permissions for land use conversion to facilitate this intervention.)

ఈ సందర్బంగా డాక్టర ఇఎఎస్ శర్మ ప్రధానికి, జగన్ రాసిన లేఖల్లోని విషయాలు గుర్తు కు వస్తాయి.

ఇఎఎస్ శర్మ ఏమన్నారంటే…

కొన్ని సంవత్సరాలుగా ఈ కర్మాగారం భూముల మీద, విలువైన మెషినరీ మీద, ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యం మీద, ఎన్నో ప్రైవేట్ యాజమాన్యాలు కన్ను వేయడం అందరికీ తెలిసిన విషయమే.
కొన్ని సంవత్సరాల క్రింద, గంగవరం పోర్టుకు అతి చవకగా  ప్రభుత్వం విశాఖ ఉక్కు భూములను 2,000 ఎకరాలకు పైగా ఇవ్వయడం వలన అధికంగా ప్రజా నష్టం కలిగింది.
గత కొన్ని సంవత్సరాలుగా, ఒడిశా రాష్ట్రం లో మొండి చేయి చూసిన విదేశీ కంపెనీ పాస్కో, విశాఖ  ఉక్కు మీద కూడా  కన్ను వేసింది. అందుకు సానుకూలకంగా కేంద్రప్రభుత్వం ఉద్దేశాన్ని వ్యక్త పరచింది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే.
ప్రైవేట్ యాజమాన్యాల గురించి విశాఖ ప్రజలకు బాగా అవగాహన ఉంది. ముందు ప్రభుత్వ సంస్థ గా ఉన్న హిందుస్తాన్ జింక్, ప్రైవేట్ చేతులలోకి వెళ్ళగానే ఫ్యాక్టరీ మూతబడింది.

రైతుల నుంచి సేకరించిన వ్యవసాయ భూములను ప్రైవేట్ యాజమాన్యాలకు ధారాదత్తం చేయడం ప్రజల నమ్మకానికి హాని కలిగించడమే

అక్కడ రైతుల వద్దనుంచి సేకరించిన 300 ఎకరాలకు పైగా భూమిని ప్రైవేట్ యాజమాన్యం స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. వారి కార్యక్రమాలవలన ప్రజలకు కాలుష్యం మాత్రమే మిగిలినది. అలాగే. దక్షిణ కొరియా కంపెనీ LG పాలిమర్స్ వారి నిర్లక్ష్యం వలన, 2020లో భయంకరమైన ప్రమాదం సంభవించి, ప్రాణ నష్టం కలగడం, వేలాదిమంది ఆరోగ్యం నష్టపడడం, విశాఖ ప్రజలు మరిచిపో లేరు.
విశాఖలో ఉన్న మిగిలిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు అడ్డుకున్నారు.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, విశాఖ ప్రజల ఉద్దేశాలను అర్ధం చేసుకుని, రాష్ట్రప్రభుత్వం ప్రజల తరఫున విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అన్నివిధాలుగా వ్యతిరేకించాలి. గతంలో రైతుల నుంచి సేకరించిన వ్యవసాయ భూములను ప్రైవేట్ యాజమాన్యాలకు ధారా దత్తం చేయడం ప్రజల నమ్మకానికి హాని కలిగించినట్లు అవుతుంది.
రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలో తత్క్షణమే కలుగ చేసుకుని, కేంద్రానికి ప్రజల ఉద్దేశాలను తెలియచేస్తూ, ఈ నిర్ణయానికి వ్యతిరేకత తెలియ పరచాలని నా విజ్ఞప్తి.
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఈ విషయాన్ని చర్చించి వారి ఉద్దేశాన్ని కూడా కేంద్రానికి తెలియపరిస్తే ప్రజలు హర్షిస్తారు.
1971 సంవత్సరంలో 100% కేంద్ర ప్రభుత్వ సంస్థ గా  స్థాపించబడిన ఈ కర్మాగారం కోసం అప్పటి లో రైతుల వద్ద నుంచి భూసేకరణ చట్టం క్రింద, “ప్రజా ప్రయోజనం” పేరు లో 20 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను సేకరించడం జరిగింది.
ఈ భూమి విలువ ఈ రోజు మార్కెట్ ధరల తో పోలిస్తే లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అటువంటి భూమిని ఏ పరిస్థితలలోను ప్రైవేట్ కంపెనీల అధీనం లోనికి తీసుకురా కూడదు. 
 
ఈ కర్మాగారం వలన  ఈ ప్రాంతంలో సుమారు లక్ష మంది ప్రత్యక్షం గా, పరోక్షం గా ఉపాధి పొందుతున్నారు. ఈ కర్మాగారం తో, ఈ ప్రాంతాలలో ఎన్నో విధాలుగా ప్రజల జీవితాలు ముడి పడి ఉన్నాయి. 
 
విశాఖ కర్మాగారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలాదికోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టాక్సు రూపంలో ఆదాయాన్ని కలిగిస్తున్నది. విశాఖ ఉక్కు కర్మాగారం లో పనిచేస్తున్న ఉద్యోగుల పని సామర్ధ్యం, సాంకేతిక జ్ఞానం ప్రపంచస్థాయిలో గుర్తింపు తేగలిగాయి. 
బహుశా అదే ఉద్దేశం తో, కేంద్రం విశాఖ ఉక్కు ను 100% ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే తుది నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతున్నది.

 

https://trendingtelugunews.com/top-stories/features/eas-sarma-urges-chief-minister-jagan-to-oppose-vizag-steel-privatization/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *