’విశాఖ ఉక్కు‘ ప్రైవేటీకరించడం నష్టం: జగన్ కు EAS శర్మ లేఖ

(ఇఎఎస్ శర్మ)
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, 100% ప్రైవేట్ కంపెనీల యాజమాన్యం చేతులకు బదలాయించేందుకు కేంద్రప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. 
 అటువంటి నిర్ణయం ప్రజాహితం కాదు. రాష్ట్రప్రభుత్వం అన్నివిధాలా ఆనిర్ణయాన్ని వ్యతిరేకించాలి. 
 
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఐదు దశాబ్దాల క్రింద, విశాఖ ప్రజలు, ఇక్కడి ప్రజాప్రతినిధులు, ఏకగ్రీవంగా ఉద్యమం చేయవలసి వచ్చినది. ఈ కర్మాగారం కోసం కొంతమంది స్థానిక ప్రజలు తమ ప్రాణాలను  కూడా కోల్పోయారు. 
 
1971 సంవత్సరంలో 100% కేంద్ర ప్రభుత్వ సంస్థ గా  స్థాపించబడిన ఈ కర్మాగారం కోసం అప్పటి లో రైతుల వద్ద నుంచి భూసేకరణ చట్టం క్రింద, “ప్రజా ప్రయోజనం” పేరు లో 20 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను సేకరించడం జరిగింది. ఈ భూమి విలువ ఈరోజు మార్కెట్ ధరల తో పోలిస్తే లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అటువంటి భూమిని ఏ పరిస్థుతలలోను ప్రైవేట్ కంపెనీల అధీనం లోనికి తీసుకురా కూడదు. 
 
ఈ కర్మాగారం వలన  ఈ ప్రాంతంలో సుమారు లక్ష మంది ప్రత్యక్షం గా, పరోక్షం గా ఉపాధులను పొందుతున్నారు. ఈ కర్మాగారం తో, ఈ ప్రాంతాలలో ఎన్నో విధాలుగా ప్రజల జీవితాలు ముడి పడి ఉన్నాయి. 
 
విశాఖ కర్మాగారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలాదికోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టాక్సు రూపంలో ఆదాయాన్ని కలిగిస్తున్నది. విశాఖ ఉక్కు కర్మాగారం లో పనిచేస్తున్న ఉద్యోగుల పని సామర్ధ్యం, సాంకేతిక జ్ఞానం ప్రపంచస్థాయిలో గుర్తింపు తేగలిగాయి. 
ఒక అత్యంత విలువైన “నవ రత్న” ప్రభుత్వ సంస్థ గా ఈ రోజు కేంద్రప్రభుత్వం ఈ కర్మాగారాన్ని గుర్తించింది. 
ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడుతున్న కర్మాగారానికి, ముడి ఇనుప గనులను ఇంతవరకు కేంద్రప్రభుత్వం కేటాయించక పోవడం కారణం గా, కర్మాగారం ముడి ఇనుమును అధిక ధరలకు కొన వలసి వస్తున్నది. ఈ కర్మాగారం లాభాలనుంచి నష్టాల పాలుఅవ్వడానికి ఇదే ముఖ్యకారణం. కేంద్రప్రభుత్వం ప్రైవేట్ సంస్థలమీద చూపుతున్న వ్యామోహం, విశాఖ ఉక్కు కర్మాగారం మీద కూడా చూపించి, ఒక ప్రత్యేకమైన ముడి ఇనుము గనిని కేటాయించి వుంటే, ఈ సంస్థ కూడా ప్రపంచ స్థాయిలో పోటీ చేసి లాభాలను గణించి ఉండేది. ఇంకా పెద్దఎత్తున ఉక్కు ను ఉత్పత్తి చేసి దేశాభివృద్ధి కి ఇంకా అధికంగా తోడ్పడేది.
కొన్ని సంవత్సరాలుగా ఈ కర్మాగారం భూముల మీద, విలువైన మెషినరీ మీద, ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యం మీద, ఎన్నో ప్రైవేట్ యాజమాన్యాలు కన్ను వేయడం అందరికీ తెలిసిన విషయమే. కొన్ని సంవత్సరాల క్రింద, గంగవరం పోర్టుకు అతి చవకగా ఫ్రభుత్వం విశాఖ ఉక్కు భూములను 2,000 ఎకరాలకు పైగా ఇవ్వయడం వలన అధికంగా ప్రజా నష్టం కలిగింది. గత కొన్ని సంవత్సరాలుగా, ఒడిశా రాష్ట్రం లో మొండి చేయి చూసిన విదేశీ కంపెనీ పాస్కో, విశాఖ  ఉక్కు మీద కన్ను వేయడం, అందుకు సానుకూలకంగా కేంద్రప్రభుత్వం ఉద్దేశాన్ని వ్యక్తపరచడం కూడా అందరికీ తెలిసిన విషయం. బహుశా అదే ఉద్దేశం తో, కేంద్రం విశాఖ ఉక్కు ను 100% ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే తుది నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతున్నది.
Dr EAS Sarma IAS (rtd)
 
ప్రైవేట్ యాజమాన్యాల గురించి విశాఖ ప్రజలకు బాగా అవగాహన ఉంది. ముందు ప్రభుత్వ సంస్థ గా ఉన్న హిందుస్తాన్ జింక్, ప్రైవేట్ చేతుల లోకి వెళ్ళ గానే ఫ్యాక్టరీ మూతబడింది. అక్కడ రైతుల వద్దనుంచి సేకరించిన 300 ఎకరాలకు పైగా భూమిని ప్రైవేట్ యాజమాన్యం స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. వారి కార్యక్రమాలవలన ప్రజలకు కాలుష్యం మాత్రమే మిగిలినది. అలాగే. దక్షిణ కొరియా కంపెనీ LG పాలిమర్స్ వారి నిర్లక్ష్యం వలన, 2020లో భయంకరమైన ప్రమాదం సంభవించి, ప్రాణ నష్టం కలగడం, వేలాదిమంది ఆరోగ్యం నష్టపడడం, విశాఖ ప్రజలు మరిచిపో లేరు. విశాఖలో ఉన్న మిగిలిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు అడ్డుకున్నారు.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, విశాఖ ప్రజల ఉద్దేశాలను అర్ధం చేసుకుని, రాష్ట్రప్రభుత్వం ప్రజల తరఫున విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అన్నివిధాలుగా వ్యతిరేకించాలి. గతంలో రైతుల వద్ద నుంచి సేకరించిన వ్యవసాయ భూములను ప్రైవేట్ యాజమాయాలకు ధారా దత్తం చేయడం ప్రజల నమ్మకానికి హానికలిగించినట్లు అవుతుంది.
రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలో తత్క్షణమే కలుగ చేసుకుని, కేంద్రానికి ప్రజల ఉద్దేశాలను తెలియచేస్తూ, ఈ నిర్ణయానికి వ్యతిరేకత తెలియ పరచాలని నా విజ్ఞప్తి. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఈ విషయాన్ని చర్చించి వారి ఉద్దేశాన్ని కూడా కేంద్రానికి తెలియపరిస్తే ప్రజలు హర్షిస్తారు.
(ఇది డాక్టర్ ఇఎఎస్ శర్మ, మాజీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఈ రోజు రాసిన లేఖ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *