నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాసింది ఎక్కడ?

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రాసిన పుస్తకాలలో అతి గొప్ప పుస్తకం, బాగా జనాదరణ పొందిన పుస్తకం డిస్కవరీ అఫ్ ఇండియా (Discovery of India). ఇది ఆయనలోని బహుముఖ ప్రజ్ఞను వెలికితీసిందని విమర్శకులు చెబుతారు. ఈ పుస్తకాన్ని ఆయన ఇంట్లో కూర్చుని రాయలేదు. అలాగని ఎక్కడో దీవుల్లో హాలిడే ఎంజాయ్ చేస్తూ రాయలేదు. ఈ పుస్తకాన్ని ఆయన జైల్లో కూర్చుని రాశారు.
ప్రపంచ జైలు సాహిత్యంలో ఇదొక గొప్ప పుస్తకం అని పేరు. ఇంత పరిశోధనాత్మక పుస్తకాన్ని ఆయన ఏ జైలులో కూర్చుని రాశారో తెలుసా?
మహారాష్ట్ర అహ్మద్ నగర్ ఫోర్ట్ జైలులో …
దేశంలో ఆగస్టు 8, 1942న క్విట్ ఇండియా ఉద్యమం మొదలు కాగానే, ఉద్యమంలోని అగ్ర నేతలను బ్రిటిష్ ప్రభుత్వ దేశ రాజధానికి దూరంగా తీసుకెళ్లాలనుకుంది. అలా 12 మందిని మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కోటలో ఏకాంతంగా బంధించారు. వారిలో నెహ్రూ ఒకరు. నెహ్రూ తో పాటు అరెస్టుయిన వారిలో తెలుగు వాడు, ఆంధ్రాబ్యాంకు సంస్థాపకుడు, కాంగ్రెస్ హిస్టరీ రచయిత డాక్టర్ పట్టాభిసీతారామయ్య కూడా ఉన్నారు. వీళ్లందరికి ఒక్కొక్క గది ఏర్పాటుచేశారు. కోటలో ‘లీడర్స్ బ్లాక్ ’ లో ఈ గదులన్నింటిని చూడవచ్చు.
 మిగతా వారిలో సర్దార్ వల్లభ్ బాయ్ పటే, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ఆచార్య నరేంద్ర దేవ్, ఆచార్య జెబి కృపలాని డాక్టర్ పిసి ఘోష్, పండిట్ హరేకృష్ణ మెహతాబ్, శంకర్ రావు దేవ్, డాక్టర్ ఆసిఫ్ మహ్మద్ ఉన్నారు. కోటలో వీళ్లని బంధించిన గదులన్నింటికి కలిపి  లీడర్స్ బ్లాక్ అని పేరు పెట్టారు.
ఈ జైలులో ఉన్నపుడే మౌలానా అబుల్ల కలామ్ ఆజాద్ Ghubar-e-Khatir (Sallies of Mind) పూర్తి చేశారు. భారతీయ ఉర్దూ సాహిత్యంలో దీనికి ఒక విశిష్ట స్థానం ఉంది.

 

 

ఢిల్లీలో జైలులో బంధిస్తే వీళ్లంతా ఏదో విధంగా క్విట్ ఇండియా ఉద్యమంతో సంబంధం పెట్టుకుంటారని భయపడి బ్రిటిష్ ప్రభుత్వవాళ్లని ఢిల్లీకి దూరానా ఉన్న ఈ కోటని జైలుగా మార్చి వాళ్లని బంధించింది. అయితే, వీళ్లంతా జైలు క్రుంగిపోలేదు. అద్భుతమయిన పుస్తకాలు రాశారు. భారతీయులనే కాదు,ప్రపంచ ప్రజలను ప్రభావితం చేసే పుస్తకాలు రాశారు.
జైలులో నెహ్రూ గది లోపల చిత్రం ( courtesy Youtube)
అపుడు నెహ్రూ ఆగస్టు 10, 1942 నుంచి మార్చి 28, 1945 దాకా అంటే మూడేళ్లు ఈ జైలులో ఉన్నారు. అయితే, ఈ కాలాన్ని నెహ్రూ అధ్యయానికి, రాయడానికి, తోటపనికి కేటాయించి చా నిరుత్సాహంలోకి జారుకోకుండా జాగ్రత్తపడ్డారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో భారతీయ చరిత్ర, సంస్కృతి, తాత్విక చింతనల మీద వచ్చిన మహత్తరమయిన పుస్తకం ‘డిస్కవరీ అప్ ఇండియా’. సుమారు 750 పేజీల పుస్తకం ఇది. నిజానికి ఈ పుస్తకాన్ని ఆయన అయిదు నెలల్లోనే పూర్తి చేశారంటే ఆశ్చర్యంమేస్తుంది. ఇంత లోతైన అధ్యయనం ఉన్న ఈ పుస్తకాన్ని చేత్తో రాసి కేవలం అయిదు నెలల్లో  పూర్తి చేయడం అంటే నమ్మలేం. ఎంతో అకుంఠిత దీక్ష ఉండటంతో పాటు విసుగు లేకుండా కలంతో రాయడానికి అద్వితీయ ప్రతిభ కూడా ఉండాలి. నెహ్రూ కవితా శైలిలో ఈ పుస్తకాన్ని రాశారు.అది ఒక్కొక్క సారి పతకా స్థాయికి చేరుకుటుంది.  వీటన్నింటితో వెలువడింది కాబట్టే ఈ పుస్తకానికి మహద్గ్రంధం (Classic)హోదా వచ్చింది. ఇందులోమొదటి మూడు అధ్యాయాలు స్వీయ చరిత్ర లాగా సాగుతాయి. నెహ్నూ డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణన్ లాగా తత్వవేత్త కాదు.అయితే, ఈపుస్తకంలో నెహ్రూ భారతీయ తత్వ శాస్త్ర లోతులను చూపించడం  పాఠకులను ఆశ్చర్యపరుస్తుంది.  ఈ పుస్తకాన్ని ఆయన  ఈ జైలులో తనతో పాటు మూడేళ్ల శిక్ష అనుభవించిన తోటి ఖైదీలకు అంకితమిచ్చారు. ఆయన జైలు నుంచి వచ్చిన మరుసటి సంవత్సరం 1946లొ ఈ పుస్తకం అచ్చయింది. అనేక సార్లు పునర్ముద్రణయింది. నెహ్రూ అంతరంగం తెలియాలంటే ఈ పుస్తకాన్ని చదివితీరాలి.

Like this story? Share it with a friend!

 

కోట జైలులో నెహ్రూ గది (courtesy Youtube)
ఈ జైలులో ఉన్నపుడు నెహ్రూ రెండు గొప్ప పనులు చేశాడు.ఈ కోటలో తనకిష్టమయిన గులాబీలతో ఒక పెద్ద తోటనే పెంచారు.
దీనికోసం ఆయన స్వయంగా వ్యవసాయం పనిముట్లతోనే భూమి చదును చేసి పాదులుపెంచి,నీరుపోసి మొక్కలను పెంచారు. దీనితో అక్కడొక అందమయిన గులాబీ తోట గుభాళించింది. రెండోది ‘డిస్కవరీ అఫ్ ఇండియా’ రాయడం.
జైలులో నెహ్రూ వాడిన గిన్నెలు
నవంబర్ 14న ఆయన జన్మదినాన్ని 1942, 1943,1944లో కాంగ్రెస్ నేతలంతా కలసి జరుపుకున్నారు. ఆయన అహ్మద్ నగర్ జైలు శిక్ష మార్చి 28న 1945న ముగిసింది.
ఈ కోర్టును 1490లో అహ్మద్ నిజాం షా నిర్మించారు. నిజాంషాహి రాజ్యం స్థాపకుడాయనే. బహ్మనీ సుల్తానులన జయించిన తర్వాత దానికి స్మారక చిహ్నంగా అహ్మద్ నగర్ పట్టాణాన్ని నిర్మించాడు. 1600లో ఈ కోట, పట్టణం అక్బర్ నాయకత్వంలోని మొగుల్ సామ్రాజ్యం వశమయ్యాయి. నిజాంషాహి రాణి చాంద్ బీబీ ఈ కోటని కాపాడుకునేందుకు వీరోచింతా పోరాడారని చెబుతారు. 1759లో ఈ కోటని మరాఠా రాజు మూడో పెష్వాకి విక్రయించారు. 1797లో ఇది సింధియాలో చేతుల్లోకి మారింది. 1803లో జనరల్ వెల్లస్లీ నాయకత్వంలో ఇది బ్రిటిష్ వారి వశమయింది. 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చే దాకి బ్రిటిష్ వాళ్ల అదీనంలో ఉంటూ జాతీయనాయకులను బందించేందుకు జైలుగా మారింది.
ఇపుడీ కోటలో Indian Armoured Corps Centre and School  ఏర్పాటు చేశారు. కోట మిలిటరీ ఆదీనంలో ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *