తిరుమల కొండ ప్రకృతి సోయగాలు… గంట మంటపానికి ట్రెక్

కొండలు అంటేనే  భూమ్మీద ప్రకృతి చెక్కిన నగిషీలు.  అందుకే కొండలెలా వున్న రమణీయంగా కనబడతాయి. అక్కడ అడవులున్నా లేకున్నా కొండలు అందగా ఉంటాయి. మీరెపుడయినా కడప జిల్లా జమ్మలమడుగు సమీపాన ఉన్న గండికొట కొండలు చూశారా. అక్కడ  మానూ మాకూ కనిపించదు. ఉండేవన్నీ కలేపళ్ల చెట్లు, బొమ్మజెముళ్లే. అయితే, అక్కడి ఎత్తయిన కొండలు, కొండల నడుమ లోతైన గండిలో పాములా మెలికలు తిరుగుతూ పారే  పెన్నా నది … ఎంత అందంగా కనిపిస్తాయో చూసిన వాళ్లకే తెలుస్తుంది.
ఇలాంటి కొండల్లో పచ్చటి  వనసంపద కూడా ఉంటే… తిరుపతి కొండలవుతాయి.
తిరుపతి కొండలు మాటల్లో వర్ణించనలేంత అందంగా ఉంటాయి. రాయలసీమ కొండల గొప్పదనం ఏంటేంటే ఈ కొండల్లో లేక్కలేనన్ని కోనలుంటాయి. కోన అంటే… కొండశి ఖరంమీద ఒక చదునైన ప్రాంతంలో ఒక నీటి బుగ్గ (spring)లు వెలిసి ఉంటాయి.బుగ్గనుంచి పెల్లుబికే నీళ్లు సెలయేరయి, జలపాతమయి సమీపంలోని ఏట్లోకి పారుతుంటాయ. ప్రతి బుగ్గ దగ్గిర ఒక గుడి ఉంటుంది. ఇదే కోన. ప్రతి కోన వెనక కథ ఉంటుంది. ఆగస్తీశ్వరకోన, రంగానాయలకు కోన, గురిగింజ కోన,చెండ్రాయుని కోన.. ఇలా ఎన్నికోనలో. కోన రాయలసీమ సిగ్నేచర్.
ఇలాంటి కొండల్లో ఒక అంచుకు ఎక్కుతూ, వగరుస్తూ, దోగాడుతూపోతే (అంతా కలిపి ట్రెక్ [Trek] అవుతుంది) అదొక గొప్ప అనుభవం.

ఇది మానసికోల్లాసం కల్పిస్తుంది. శారీరక ఆరోగ్యం కల్గిస్తుంది. ఇపుడు రచయిత భూమన్ (తిరుపతి) తిరుపతి సమీపంలోని తిరుమల కొండల్లో ఒక చివరన ఉన్న పురాతన కట్టడమైన ఒక ’మండపం’ దాకా ట్రెక్ చేశారు.

ఆ ఫోటోలను, ఆ అనుభవాన్ని ఆయన ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ తో పంచుకున్నారు.  ఈ పురాతన కట్టడం పేరు గంట మంటపం.
ఇది చాలా చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న కట్టడం. ఇలా కొండ అంచున ఈ మంటపాన్ని ఎందుకు కట్టారనేందుకు ఒక  గాథ ప్రచారంలో ఉంది.

ఈ మంటపం తిరుపతికి 23 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. అలిపిరి కాలిబాట  నుంచి యోగ నరసింహాలయం దాకా వెళ్లాలి. అక్కడి నుంచి ఎడమ వైపునకు  ట్రెక్ చేసుకుంటూ వెళ్తే తిరుమల కొండల అంచున నిలబడి మంటపం కనిపిస్తుంది. ఇక్కడి చేరుకోవడం చాలా కష్టం. అదొక  చిన్నసాహస యాత్ర. ఒక గొప్ప అనుభవం.
చారిత్రక ప్రాధాన్యం
 పూర్వం  ఈ మంటపలో ఒక పెద్ద గంట వేళాడుతూ ఉండిందట.  బహుశా ఈ గంట కోసం ఈ మండపం కట్టారేమో. తిరుపతి సమీపంలో చంద్రగిరి కోట ఉంది.  విజయనగర రాజు రామదేవరాయ ఈ ప్రాంతాన్ని చంద్రగిరి రాజధానిగా  పరిపాలించేవాడు.

 

తిరుమలేశుడికి ప్రసాదం సమర్పించిన తర్వాత భోజనానికి ఉపక్రకమించడం ఆయనకు అలవాటు. తిరుమల వెంకటేశ్వరుడికి ప్రసాదం సమర్పించగానే ఆ కబురు రామదేవరాయుడికి చేరవేయాలి. అపుడే భోజనానికి కూర్చుంటారు. ఈ కబురు ఏక్కడో దూరాన ఉన్నరాజుకుఎలా చేరవేయాలి.  ఒక సైనికుడు గుర్రం మీద వెళ్లి మెసేజ్ అందించడం సాధ్యంకాదు. అందువల్ల గంటనాదం సిగ్నల్ ఎంచుకున్నారు.
 గంట మోగించడం ఒక అనుకూలమయిన పద్ధతి. ప్రసాదం శ్రీవారికి సమర్పించగానే ఈ గంట మోగేది. అపుడు రాజుగారు గంటానాదం విని భోజనానికి ఉపక్రమించే వారు. అయితే, ఈ గంట ఎలా మోగేది?  శ్రీవారికి నైవేద్యం పెట్టగానే, అక్కడి నుంచి ఒక మనిషి వచ్చి ఈ గంట మోగించాలి.అంతేనా?
ఆలయం దగ్గిర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి గంట మోగించాలి. ఇది కూడా ఆచరణ సాధ్యం కాదు.  మరి ఈ కొండ చివరన  ఉన్న ఈ గంటను మోగించడమెలా?
దీని కొక గాధ ప్రచారంలో ఉంది.  శ్రీవారికి నైవేద్యం పెట్టగానే తిరుమల ఆలయం గంటని పెద్దగా మోగిస్తారు. అపుడు ఆ గంట నుంచి వెలువడే శబ్ద తరంగాలు ఇక్కడికి చేరుకునేవి. ఆ  ప్రకపంనలతో ఈ గంట మోగేదని చెబుతారు. ఇది సైంటిఫిక్ గా నిరూపించడం కష్టం. అయితే, ఇదొక గాధ మాత్రమే.
మొత్తానికి  కొండ చివరన,  చంద్రగిరి ముఖంగా ఈ  మంటపం ఉండటం వల్ల ఈ గాథ ప్రచారమయ్యేందుకు కారణం కావచ్చు. ఈ మండపం దగ్గిర నుంచి చూస్తే చంద్రగిరి కోట, స్వర్ణముఖి నది కనబడతాయి.

 ఈ గంటని 1614-1630లో రఘనాధ యాచమనాయకుడనే  వ్యక్తి చంద్రగిరి రాజుకు బహూకరించారని చెబుతారు. అదీ సంగతి.

MORE TREKKING IN SESHACHALM HILLS, TIRUPATI ANDHRA PRADESH

 

ఫోటోలు: భూమన్ (రచయిత, రాజకీయ విశ్లేషకుడు)