ఈ రోజు ట్రెకింగ్ ‘వేయిలింగాల కోన’ అడవుల గుండా (గ్యాలరీ)

(భూమన్)
చిత్తూరు జిల్లా  కాళహస్తికి 8 కి.మీ దూరంలో అద్భుతమయిన,రమణీయమయిన ప్రకృ  దృశ్యం ఈ వేయి లింగాల కోన. కాళహస్తి నుంచి అక్కడికి చేరుకోవడం చాలా సుళువు.  ఆటోలో వెళ్లవచ్చు, కారులో వెళ్ల వచ్చు, ఒకరిద్దరయితే, సరదాగా  ద్విచక్రవాహనంలో కూడా వెళ్లవచ్చు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నపుడు ఈ దారిగుండే హాయిగా, సైకిల్ తొక్కుతూ కూడా చేరుకోవచ్చు. వేయిలింగాల కోన మెట్లవరకు చక్కటి దారి ఉంది.
మెట్లకు ఎడమ వైపున మార్కండేయ తీర్థం మరొక అద్భత జలపాతం ఉంది. మెట్ల దగ్గిర చాలా మంది గ్రామ గైడ్లు ఉంటారు. వారు దగ్గరల్లో ఉన్న ‘వేడం’ గ్రామానికి చెందిన వారు. ఆ గ్రామం మునుపటి పేరు ‘వేదం’ అని, అక్కడ వేద పండితులు ఉండేవారని వీరు చెబుతారు. అదే ‘వేడం’ అయిందని చెబుతారు. అమాయకులైన ఆ ‘దీపదారుల్ని’ తప్పక వెంట తీసుకువెళ్లాలి. అడవులలో వారి గైడెన్స్  తప్పనిసరి.
మెట్ల పై భాగంలో ఒక పురాతన మంటపం ఉంది. పై భాగంలో రాహువు,కేతువు, బల్లి చిత్రాలను చూపిస్తారు. ఆ చెక్కడాలు చాలా కుదురుగా ఉన్నాయి.మెట్లు దిగగానే మూడు మార్గాల ద్వారా సహస్ర లింగాల  దేవాలయానికి చేరుకోవచ్చు.
అద్భుతమయిన ఆ అటవీ ప్రాంతంలో ఆగస్త్య మహర్షి పర్యటించాని చెబుతారు అక్కడ, అనేక దేవుళ్ల విగ్రహాలున్నాయి. ముఖ్యంగా  శివపీఠం తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. అక్కడ ఎల్లపుడూ పారే నీటి ధార ఉంటుంది. అది తిరుమలలో ఆకాశగంగ మాదిరిగా ఎపుడూ ఎండిపోని జలధార. ఈ నీటితో దేవుడి అభిషేకం చేయిస్తారని మన గైడ్స్ చెబుతారు.
ఈ అడవిలో అక్కడక్కడ వేయి లింగాలు ఉన్నాయని  వీరొక  కథనం అల్లుతారు. అందుకే ఈ దేవాలయానికి  సహస్ర దేవాలయం అని పేరు వచ్చందని చెబతారు. నిజమవునా కాదా అనేది కాదిక్కడ ముఖ్యం. ఇవన్నీ స్థానిక గధాలు. తెలుసుకోవలసిన మన సంస్కృతి. అక్కడి నుండి కిందికి మెట్లదారి  ఉంది.  మెట్లదారి పట్టి  దట్టమయిన అడవిలో నడుస్తూ పోతే,  తిరిగి మంటపం పైకి చేరుకోవచ్చు.
మంటపం నుంచి చూస్తే, కనుచూపుమేరా  పచ్చటి బల్లపరుపు దృశ్యం కను విందుచేస్తుంది. పక్షుల కిలకిలా రావాలు, జలపాతాల  శబ్ద తరంగాలు, వెదురుబొంగుల కచేరి… అదొక మైమరిపించే అనుభవం.
ఏమైనా మనవాళ్ల ‘ఈస్తటిక్ సెన్స్’కి హాట్సాఫ్. ఎక్కడ సుందరమయిన ప్రకృతి దశ్యం ఉందో అక్కడ  ఏదో దేవుణ్ణి ప్రతిష్టించి జనాన్ని రాబడుతున్నారు. దగ్గర్లో ఉన్న జలపాతం ప్రత్యేకాకర్షణ. అక్కడి మంచి రోడ్డు వేసి  కాలభైరవుణ్ణి ప్రతిష్టించారు.
 ఈ  ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించడానికి ఎక్కువగా తమిళులే రావడమేఆశ్చర్యం. మన తెలుగు వాళ్లకేమయిందో మరి.
నిజంగా పూనుకుని, ప్రతిష్టగా ప్రభుత్వం వీటిని అభివృద్ధి పరిస్తే చిత్తూరు జిల్లాలో మూలకోన, ఉబ్బలమడుగు, సదాశివకోన. కైలాసకోన, భీమవరం జలపాతం, రామచంద్రా పురం జలపాతం,జీవకోన జలపాతం, మల్వాడి గుండం, తలకోన, కపిలతీర్థం, బ్రహ్మగుండం, దేవతీర్థం, కలివికోట కోనలాంటివి పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లి మంచి ఆదాయాన్ని కూడబెడతాయి. ఇలాంటి  అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకుంటాయా మన ప్రభుత్వాలు?

ఫోటోలు:భూమన్

One thought on “ఈ రోజు ట్రెకింగ్ ‘వేయిలింగాల కోన’ అడవుల గుండా (గ్యాలరీ)

Comments are closed.