ఈ రోజు ట్రెకింగ్: చంద్రగిరి కోటలో ‘ఉరికంబం’

చంద్రగరి కోటలోని ఈ ‘ఉరికంబం’ చాలా ఆసక్తికరమైంది. నిజానికి ఇక్కడ ఉరికంబమయితేలేదు. అట్లాంటి అకారంలో ఉన్నదాన్ని  అదేనని భ్రమతో కొందరు ప్రచారంలో ఉంచినారు.  ఉరికంబమయితే కనీసం మనిషిని నిలబెట్టేంత ఎత్తు అయినా ఈ కంబం ఉండాలా? అంత ఎత్తు లేదు.
అయితే, దీని వెనక ఆసక్తికరమయిన కథ ఉంది. అది శబ్దతరంగాల కథ.   ఈ కథ ఎపుడు మొదలయిందో తెలియద గాని శబ్దం తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని మన వాళ్లకి చాలా కాలం కిందటే తెలుసనుకోవాలి.
శబ్దం తరంగాలరూపంలో ప్రస్తరిస్తుందని మొదటి ఇటాలియన్ శాస్త్రవేత్త లియోనార్డో డా విన్సి చెప్పాడని మనం చదువుకున్నాం. డా విన్సి 15 శ శతాబ్దంలో ఉన్నాడు. శబ్దతరంగాలకు ఉరికంబానికి సంబంధం ఉందని ఈ కథ చెబుతుంది.
ఇదీ ప్రచారంలో ఉన్న కథ
నిజానికిది ఉరికంబం కాదు.
‘తిరుపతి కొండపై ఎగువ తిప్పలోనే విలసిల్లు వేంకటేశ్వరుడి గుడిగంట
చంద్రగిరిపై హవణిల్లెడు రామదేవుడి బంగరు జయఘంట!
ఒక్కపరి ఖంగున మోగుచుండునంటయా
సిరి రఘనాథ యాచమ వశిష్ట బహూకృతరంట ఱేనికిన్!! (అమ్మిశెట్టి లక్ష్మయ్య)
 అమ్మిశెట్టి లక్ష్మయ్య పద్య కర్త, చరిత్ర కోవిదుడు చెప్పిన పద్యమిది.
రామదేవరాయల కాలంలో ఇక్కడ గంట గుండు ఉండేది. తిరుమలలో నైవేద్యపు గంట మోగగానే, ఆతరంగాలు తిరుమల అవ్వాచారి కోన కొసన ఉండే మంటపపు గంట మోగిస్తాయి,  ఆ తరంగాలు అక్కడి నుంచి ప్రయాణించి చంద్రగిరి కోటన ఉండే ఈ గంట గుండును తాకేవి.గంట మోగేది. ఆశబ్దతరంగాల సోయగాల్లో రాజుగారు భోజనానికి ఉపక్రమించే వారు. అది దీని వెనక కథ.
ఉరికంబానికి ఎలా చేరుకోవాలి?
ఉరికంబం  స్థలానికి చంద్రగిరి కోట ముఖద్వారం నుంచి కుడివైపు  పోయి జారుడుబండ ఎక్కి గాని, కోట మీద మెట్లు ఎక్కి గాని చేరుకోవచ్చు.
ఈ జారుడు బండ ఎక్కడం బహు కుశాలుగా ఉంటుంది. ఏ  మాత్రం ఏమరుపాటు వహించినా సర్రున కిందికి జారిపడిపోవడమే.
అందుకే మేము ఎక్కేటపుడు జారుడు బండనే ఎంచుకున్నాం.  దిగేటపుడు మాత్రం పక్కనే ఉన్న పురాతన మెట్లనుంచి వచ్చాము.
ఆ జారుడు బండ ఎక్కగానే  అద్భుతమయిన ఒక ప్రాచీన కట్టడం అబ్బుర పరుస్తుంది. అక్కడ దేవళం,  ఆ పక్కన మసీదు ఉన్నట్లుగా ఉంది. దాన్ని తనివి తీరా చూసి,కొంచెం కుడి పక్కకు పోయి పైకి ఎగబాకితే, ‘ఉరికంబం’  కింది వైపు కట్టడం ఇంజనీరింగ్ నైపుణ్యంతో చూపరులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.
తిరిగి తిన్నగా నడుచుకుంటూ పోతే చంద్రగిరి  కోట వైభవం సాక్షాత్కరిస్తుంది. దాన్ని అట్లాచూస్తూ ముందుకు కదిలిపోతే, చంద్రగిరి కోట గోడల వెంట నడుస్తూంటే ఆనాటి వైభవం కళ్లముందు ప్రత్యక్షమయి మంత్రు ముగ్ధుల్ని చేస్తుంది.
మధ్య మధ్యలో  సైనికుల స్థావరాలు, గుళ్లు పాడుబడిన పోయి ఉన్నాయి. చివరన మెట్లు ఎక్కి పైకి చేరుకుంటే ఈ ‘ఉరికంబం’ కనిపిస్తుంది.

ఫోటోలు: భూమన్

MORE TREKKING IN SESHACHALM HILLS, TIRUPATI ANDHRA PRADESH