ANR ఒకప్పుడు పాపులర్ తమిళ్ స్టార్, ఆయన తొలి తమిళ చిత్రమేమిటో తెలుసా?

(Ahmed Sheriff)
దక్షిణ భారత సినిమాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం చిత్రాలని  చెప్పుకున్నా భారత సినిమా రంగం వుధ్బవిస్తున్న తొలి రోజుల్లో  తెలుగు తమిళ సినిమాలు మాత్రం ఒక తల్లి బిడ్డల్లగా ఆవిర్భవించాయి. దీనికి ఒక కారణం
 ఈ చిత్రాలు మదరాసు (ఇప్పటి చెన్నై) లో చిత్రీకరించడం కావచ్చు. లేదా నటీనటుల నైపుణ్యాలు కావచ్చు .
అక్కినేని నాగేశ్వర రావు (ఆంధ్రుల ఏయన్నార్)  తమిళం లో అతి కొద్ది చిత్రాల్లో నటించినా (దాదాపు 16) తమిళ సినిమా ప్రపంచం లో ఆయన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయనకు ఆరోజుల్లో తమిళం లోని ప్రముఖ నటులకున్నంత పాపులారిటీ  ఉండడం గమనించ దగ్గ విషయం.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం. ద్వారా 1951 లో “ఒర్ ఇరవు” (ఒక రాత్రి) అనే సినిమా విడుదలయింది. ఈ సినిమా కథ కి మూలం అదే పేరుతో వున్న ఒక తమిళ నాటకం. దీన్ని రాసింది సి.ఎన్. అన్నాదురై (అవును ఆయనే, తరువాత తమిళనాడు సి. ఎం గా పదవీ బాధ్యతలు చేపట్టాడు) ఈ చిత్రం లో భారతి దాసన్ రాసిన “తుంబం నెర్గయిల్..” అనే పాటను తమిళులంతా చాలా ఇష్ట పడతారు ఒక శ్రేష్టమైన పాట గా భావిస్తారు. అయితే ఈ పాటను తెర మీద అభినయించింది అక్కినేని నాగేశ్వరా రావు.

 

పాత సినిమాలు మాసి పోయినా, పాత పాటలింకా సజీవమే, ఎందుకో తెలుసా?

ఆ చిత్రం తరువాత ఆ పాట శ్రేష్టతనూ తద్వారా తర తరాల తమిళు ల  అభిమానాన్ని ఆయన తన వైపు తిప్పుకున్నాడు.  ఈ చిత్రం లో “కన్నీ”  “కన్నీ” అనే అయన ఉచ్చారణ కు పడిపోయారంట జనం.
 ఈ చిత్రం ఏయన్నార్ కి మొదటి తమిళ డైరెక్ట్ చిత్రం అనొచ్చు. దీనికి ముందు ఆయన హీరో గా, అంజలీ దేవి తో  నటించిన “తిలోత్తమ” చిత్రాన్ని   “మాయామలై” గా తమిళం లో కుడా ఒకే సారి చిత్రీకరించడం జరిగింది. అది ద్విభాషా చిత్రం.
దీని తరువాత 1953 లో అంజలీ దేవి ఆమె భర్త ఆదినారాయణల ద్వారా అంజలీ పిక్చర్సు బ్యానర్లో “పరదేసి” చిత్రంవచ్చింది. ఇది “పూంగొథై” గా తమిళం లో కూడా  ఒకేసారి చిత్రీకరించ బడింది. ఇది ద్విభాషా చిత్రం. దీని తరువాత సినీరంగం లోనే సంచలనాన్ని సృష్టించి, అక్కినేని నాగేశ్వర రావు ని మహా నటుడిగా నిలబెట్టిన దేవదాసు విడుదలయింది. తెలుగు చిత్రం లో ని నటీనటుల్లో స్వల్ప మైన  మార్పులు చేసీ ఈ చిత్రాన్ని తెలుగు తమిళం  రెండు భాషల్లోనూ విడివిడిగా తీశారు.

తెలుగు చిత్రం 1953 జూన్ 26  న విడుదలయితే, తమిళ చిత్రం అదే సంవత్సరం సెప్టెంబరు 11 న విడుదలయింది. ఆ చిత్రం ద్వారానే అక్కినేని నాగేశ్వర రావు, ఒక రొమాంటిక్ హీరో గా, ట్రాజెడీ కింగ్ గా స్థిరత్వం పొందాడు.
తమిళ సినిమా లోని “ఉలగై మాయం “ (జగమే మాయా),  “ఓ పార్వతీ”  పాటలు ఇంకా వెంటాడుతునే వున్నాయిట తమిళ ప్రేక్షకులని. ఈ చిత్రాన్ని  అదే పేరుతో  బిమల్ రాయ్ నిర్మాతా, దర్శకుడిగా, దిలీప్ కుమార్ తో హిందీ లో తీశారు. దిలీప్ కుమారే స్వయంగా “నాకంటే అక్కినేని నటనే బాగుంది నేను ఆయన లాగా చేయలేక పోయాను”  అని అక్కినేని ని మెచ్చు కున్నాడట. ఇంతటి చరిత్ర కల్గిన అక్కినేని తమిళ ప్రేక్షకులలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడం వింతేమీ కాదు.

నాటి హిందీ మేటి నటి ‘కుంకుం’ అనే జైబున్నీసాకు ఒక నివాళి

ఇది ఇలా వుండగా, తెలుగు మూలం కలిగిన చిత్తమూర్ విజయ రాఘవులు శ్రీధర్ (శ్రీధర్) మధురాంతకం దగ్గర్లో వున్న నెల్వోయి పల్లెటురి కి చెందిన వాడు. స్కూలు లో వున్నప్పుడే నాటకాలు రాసి, దగ్గరలో వున్న చెంగల్పట్టు లో ప్రదర్శించే వాడు. ఆయన  సరళమైన భాషలో , అందరికీ అర్థ మయ్యేలా ఉండే డైలాగుల వల్ల  1950 దశకంలో చాలా ప్రాశస్త్యం  పొందాడు. వీనస్ పిక్చర్స్ వ్యవస్థాపకులు ఈ  నైపుణ్యాన్ని గుర్తించి తమ సంస్థలో ఆయనకు చోటిచ్చారు.
ఈశ్రీధర్ రాసిన “అమరదీపం”, “ఉత్తమ పుత్రియన్” సినిమాలు విజయ వంతమయ్యాయి. దీనితో  తానే దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలనుకున్నాడు. అప్పటికే అక్కినెేని నాగేశ్వర రావు నటించిన డబ్బింగు సినిమాలకు ద్విభాషా చిత్రాలకు డైలాగులు  రాసిన అనుభవం ఉంది.  దానికి తోడు ఏయన్నార్ కి తమిళ ప్రేక్షకుల్లో వున్న పాపులారిటీ కూడా ఉంది. అందువల్ల  తాను దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మొదటి సినిమా “కల్యాణ  పరిసు” అనే తమిళ చిత్రం లో  నాగేశ్వర రావు ను ఒక సహ నటుడి తీసుకున్నాడు. తరువాత అదే చిత్రాన్ని తెలుగులో అయన్నే హీరో గా పెట్టి ప్రేమకానుక గా తీసాడు.  ఈ సినిమాకి ఆచార్య ఆత్రేయను మాటలూ, పాటలూ సమకూర్చాడు. పెళ్లిసూపర్ హిట్టయింది.
తెలుగు వారికి పెళ్లి కానుక ద్వారా తెలిసిన శ్రీధర్ హిందీ వారికి కూడా “నజరానా” ( రాజ్ కపూర్, వైజయంతి మాల) సినిమా ద్వారా తెలుసు.

అలనాడు  ట్రాజెడీ హీరో గా రాజేంద్ర కుమార్ కు అమిత మైన పేరు తెచ్చిన “దిల్ ఏక్ మందిర్” సినిమా సృష్టి కర్త ఈ సివి శ్రీధరే.
1959 లో విడుదలయిన కల్యాణ పరిసు కు ముందు అక్కినేని నాగేశ్వర రావు (ఏయన్నార్) చాలా తమిళ సినిమాల్లో నటించడం, ఆయనకు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ వుండడం తో శ్రీధర్, కల్యాణ పరిసు లో  వాసంతి మానేజర్ రఘు పాత్రకు ఎయన్నార్ ను తీసుకున్నాడు. ఇదొక సపోర్టింగ్ పాత్ర.
 తెలుగు సినిమా పెళ్లి కానుక లో భాస్కర్ గా అక్కినేని నాగేశ్వర రావు, వాసంతి గా బి. సరోజా దేవి, గీత గా కృస్ణ కుమారి  నటించారు. తమిళ సినిమాలో వాసంతి మానేజర్ గా ఏయన్నార్ పొషించిన  రఘు పాత్రను తెలుగులో జగ్గయ్య పోషించాడు.
తమిళ సినిమా లో వాసంతి మానేజర్ రఘు గా సపోర్టింగ్ పాత్రలో నటించి ఏయన్నార్ తెలుగు పెళ్లి కానుక వచ్చేసరికి లీడ్ రోల్ లో హీరోగా భాస్కర్ పాత్రలో నటించాడు. రెండు సినిమాల్లోనూ వాసంతి పాత్రలో బి సరోజ దేవే నటించింది.
కథ పరంగా ఆలోచిస్తే ఒకే కథ అయినప్పటికీ తమిళ సినిమాలో ప్రేమించ కుండానే వాసంతిని (బి సరోజా దేవి) ని పెళ్లి చేసుకునే రఘు పాత్రలో నటించి, తెలుగులో వచ్చేటప్పటికి  వాసంతి ని ప్రేమించి పోగొట్టుకున్న పాత్రలో భాస్కర్ గా నటించాడు ఏయన్నార్.
ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. కథా పరంగా, నటన పరంగా ప్రత్యేకించి పాటల పరంగా ఈ చిత్రం తెలుగు ప్రెక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపదించుకుంది.

 ఏ.యం.రాజా స్వరపరిచి న పాటలు “ఆడే పాడే పసి వాడా” పాటలు “కన్నులతో పలుకరించు..” , “పులకించని మది పులకించు” ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచే వున్నాయి.

రెండు సినిమాల్లోనూ వాసంతి గా బి సరోజా దేవే నటించడం విశేషం.  పాత్ర పరంగా తమిళ సినిమాను గుర్తు కు చేసుకుంటూ తెలుగు సినిమాలో నటిస్తున్న ఏయాన్నార్ విచిత్రమైన అనుభవానికి గురి అయిండవచ్చు.
అక్కినేని నాగేశ్వర రావు 1951 మొదలు 1963 వరకు దాదాపు 16 తమిళ సినిమాల్లో నటించాడు.
 
Ahmed Sheriff
(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management, Quality
Mob: +91 9849310610)

Think your friend would be interested in this story? Share it!