చారిత్రక విశేషాల ఖజానా ‘తాటికోన’ కు ఈ ఉదయం ట్రెకింగ్

(భూమన్,తిరుపతి)
ఈ ఉదయాస్తమయాన మరోమారు తాటికోన  ట్రెకింగ్ వెళ్లాం. ఎన్నో చారిత్రక శిధిలాలకు తాటికోన వేదిక.
చంద్రగిరి కోట  ఈ స్థాయిలో ప్రాచుర్యం పొందక ముందు తాటికోన ప్రధాన స్థావరంగా విరాజిల్లింది.మొగిలేరు,దోసిళ్ల వంకల వడ్డున తాటికోన ఉంది.
తిరుపతి నుంచి బైపాస్ రోడ్డు మీదుగా చంద్రగిరి  వెళ్తుంటే మొండి కాల్వ వస్తుంది.  అక్కడి నుంచి తాటికోన దారి పట్టాలి.  2 కి.మీ దూరంలో కొండల నడుమ ఆహ్లాదకరమయిన వాతావరణంలో తాటికోన ఉంటుంది.
తాటికోన గుట్టమీద క్రీ.పూ నాటి మెగాలిత్ (రాక్షసగూడు) ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ గూడు కప్పు బండకింద శిలాచిత్రాలు(Rock art) అబ్బురపరుస్తుంది. దీనిని పట్టించుకునే నాథుడు లేక అనామకంగా అలనాటి వైభవం  మొండిగా నిలబడి ఉంది.
ఈ తాటికోనలో చంద్రగిరి కోటకన్నా ముందు మట్టితో నిర్మించిన కోట ఉంది. పూర్తిగా శిధిలమయిపోయిఉంది. ఆ ఆనవాలు చిత్రంలో చూడవచ్చు.
మఠాలు అనిపిలిచే స్థలంలో అద్భుతమయిన గుడి ఉంది. ఒక పెద్ద రాతి గుండు పైన కట్టిన గోపురం చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. కింద శివాలయం ఉన్నట్లుంది. గర్భ గుడిని ధ్వంసం చేసినారు. దేవాలయం మొండిగోడలు అపూరూప శిల్ప సౌందర్యంతో బిక్కు బిక్కుముంటున్నాయి.
విజయనగర రాజులు కాలంలో ఈ ప్రాంతం వైభవోపేతంగా వెలిగినట్లుంది. దేవాలయానికి ముందు మెట్ల మార్గంలో గణపతి బొమ్మ చెక్కుచెదరకుండా ఉంది.
దేవాలయ ప్రహరీ ముందు భాగాన ఆ రోజుల్లో అంగళ్లున్నట్లు వాటిలో వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మినట్లు భ్రాంతి కలుగుతుంది. అంత విశాలంగా ఉంది ఆ ప్రాంగణం.
పక్కనే చక్కటి కోనేరు అద్బుతమయిన కట్టడం. ప్రస్తుతం తామరపూవులతో విరాజిల్లుతూ ఉంది.
తిరుపతి పరిసరాల్లో చంద్రగిరికి కూతవేటు దూరంలో ఉన్న ఈ వైభవోపేతమయిన ప్రదేశం ఇలా శిధిలావస్థలో మూలుగుతూ వుండటం చరిత్రకారులకు, రసజ్ఞులకు, ప్రాచీన కట్టడాలను అభిమానించే వాళ్లకు చాలా దిగులు కలిగిస్తుంది. చారిత్రక సందపను కాపాడుకోవడంలో మనం ఎంత వెనకబడి ఉన్నామో కూడాతెలియ చేస్తుంది.
ప్రభుత్వం చొరవ చూపి ఈ ప్రాంతాన్ని  Heritage ప్రాంతంగా గుర్తించి పునరుద్ధరిస్తే ప్రజలు తండోపతండాలుగా వచ్చి చూసి అనుభవించి పరివశిస్తారు.

(Pictures: Bhooman)

MORE TREKKING IN SESHACHALM HILLS, TIRUPATI ANDHRA PRADESH