కాఫీ: నీళ్ల తర్వాత ఎక్కువ మంది తాగే పానీయం

(Ahmed Sheriff)
“అంతేనా?”  అంటుంది ఆమె
“ఇంకేం కావాలి?” అంటాడతను
“వీలైతే నాలుగు మాటలు, కుదిర్తే కప్పు కాఫీ”   అంటుందామె
‘బొమ్మరిల్లు’ సినిమాలో జెనీలియా, సిద్ధార్థ్ ల మధ్య్ ఈ సంభాషణ చాలా ప్రాచుర్యం పొందింది.
“కుదిర్తే కప్పు కాఫీ “ సినిమా కూడా వచ్చేసింది.
కాఫీ ఆహ్లాదానికి మరో పేరు.
సినిమాలు వినోదానికి ఆహ్లాదానికి ప్రతీకలు “ఓ మంచి కాఫీ లాంటి సినిమా ” అనే వాడుక తో ఆ సినిమా ఎంతటి ఆహ్లాదాన్ని ఇస్తుందో వుహించుకో మంటున్నారు నిర్మాతలు.
“ఉదయపు మొదటి గంట ఆ రోజు కి చుక్కాని వంటిది” అన్నాడో మహను భావుడు. ఆ మొదటి గంటలో మొదటి పానీయం కాఫీ అయితే వాహ్ వా. ఆ రోజంతా ఆహ్లాదపు హవా యే
తెల తెల వారుతూ వుంటుంది. ఇళ్లలో (ముఖ్యంగా దక్షిణ భారత దేశపు ) కాఫీ ఫిల్టర్లు కదులుతూ వుంటాయి, ఆ ఇళ్లలో నుంచి వీధుల్లోకి వచ్చే  చల్లని గాలి మోసుకొచ్చే కాఫీ పరిమళం ఆ హాయీ, ఆ ఆహ్లాదం అనుభవిస్తే కానీ తెలియదు. ఘుమఘుమ లాడే తాజా డికాషన్ తో  కప్పు కాఫీ పడనిదే కాలకృత్యాలే తీరవు చాలామందికి.  ఇది దురలవాటు కాదు. పైపెచ్చు కాఫీ ఒంటికి మంచిదని కూడా సైన్సు చెబుతోంది. కాఫీ ఆహ్లాదకరమైన శక్తిని ఇవ్వటమే కాకుండా, మధుమేహం,  కాలేయానికి సంబంధించిన కొన్ని రకాల వ్యాధుల కీ గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం.
మన్మధుడు సినిమాలో హీరోయిన్ మహేశ్వరి (అన్ షు)  ‘కాఫీ తాగుతారా’ అని  హీరో అభిరాం (నాగార్జున)  ను అడుగుతుంది. దానికతను “వద్దు నాకు నచ్చదు” అంటాడు.
“తాగితే కదా నచ్చేది లేనిది తెలిసేది” అంటుందామె. సరే ఆ తరువాత అతడు ఆమె ప్రెమలో  కాఫీ ప్రియుడయి పోతాడు అది వేరే విషయం.
అందుకెే కాఫీ తాగేవారికైనా, తాగని వారికైనా కాఫీ పేరు వినగానే ఓ రకమైన వుత్సాహం కనబడుతుంది.
కప్పు కాఫీ ఇచ్చినపుడు “ఇది కాఫీ అయితే దయ చేసి నాకు కొంచెం టీ తీసుకు రండి. ఒక వేళ ఇది టీ అయితే నాకు కొంచెం కాఫీ తీసుకు రండి” అన్నాడు అబ్రహాం లింకన్ ఆట పట్టించడానికి.

ఇండియా కాఫీ హౌస్ 

‘కాఫీ హౌస్’ అనే మాట ఇపుడు వినబడటం తగ్గి పోతున్నది. ‘ఇండియా కాఫీ హౌస్’ అనేది కాఫీ బోర్డు ఏర్పాటుచేసిన కాఫీ షాప్. న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్ లొ ఉన్న కాఫీహౌస్  చాలా పాపులర్. అయితే, 1890 ప్రాంతంలో మద్రాసులో తెల్లవాళ్లు వాళ్ల కోసం మొట్టమొదట కాఫీ హోటళ్లను ప్రారంభించారు. వాటిని ‘కాఫీ హౌస్’ అనే వాళ్లు. ఇండియాలో ఇలాంటి కాఫీహౌస్ లు ఎక్కడ బడితే అక్కడ ఉన్నాయ ని రష్యన్ రచయిత లియో టాల్ స్టోయ్ అనుకున్నట్లున్నారు. ఆయన కాఫీ హౌస్ ఆఫ్ సూరత్ (Coffee House of Surat) అని కథ రాశారు. అద్భుతమయిన ఈ కథ మత ఘర్షణలు ఎంత మిధ్య నో చూపెడుతుంది. ఈ కథ మతాల గురించి కొంతమంది అంతర్జాతీయ ట్రావెలర్స్ మధ్ జరిగిన గొప్పఫిలసాఫికల్ గొడవ. దీనికి టాల్ స్టోయ్ సూరత్ లోని కాపీ హోటల్ ను ఎంచుకున్నాడు. ప్రతిఒక్కరు తప్పక చదవాల్సినకథ ఇది.


కాఫీ గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు:
* మీకీ విషయం తెలుసా? కాఫీ ని మనుషులకంటే ముందు చూసింది  మేకలూ, గొర్రెలే.  తొమ్మిదో శతాబ్దంలో కొంతమంది గొర్రెల కాపరులు గొర్రెల మందలు కాఫీ పొదల్లోని పండ్లను తిని మామూలు కంటే ఎక్కువ చురుగ్గా వుండటం, రాత్రాంతా మేలుకుని వుండటం గమనించారట. అప్పట్లో ఒక స్థానిక భిక్షువు ఈ పండ్లతో  ఒక పానీయాన్ని తయారు చేసి తాగి, రాత్రంతా మేలుకునే వున్నాడట. అలా పుట్తింది మన మొదటి కప్పు  కాఫీ.
* మనం కాఫీ గింజలు అని వ్యవహరించేవి నిజానికి కాఫీ పండ్ల నుంచి వచ్చే విత్తనాలు. చెర్రీల లా వుండే ఈ కాఫీ పండ్లని ఆహారంగా కూడా తీసుకోవచ్చు.

మీకు తప్పక నచ్చే మరిన్ని ‘కాఫీ’ కథలు

*నెస్ట్లే ఇన్ స్టంట్ కాఫీ సువాసనకు జపాన్ ఎలా లొంగిపోయిందంటే…

*ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ జ్ఞాపక శక్తిని పెంచుతుంది: జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ

* ప్రపంచం లో కాఫీ ని అత్యధికంగా పండించే దేశం బ్రెజిల్. తరువాతి స్థానం లో వియత్నాం వస్తుంది.
* కాఫీని పలు మార్లు నిషేధించే  ప్రయత్నం జరిగింది.1511 లో మక్కా లొ మత వ్యతిరేక మైన  ఆలోచనలను ప్రేరేపిస్తుంది అనే వుద్దేశ్యం తో కాఫీని నిషేధించారు. 16 వ శతాబ్దంలో ఇటలీ లోని కొంతమంది మతగురువులు దీని నిషేధానికి ప్రయత్నించారు.
* ఈ నిషేధాల విషయంలో 1746 లో కాఫీ, కాఫీ తో పాటు వాటికి సంబంధించిన కప్పులూ సాసర్లనూ నిషేదిస్తూ స్వీడన్ తీసుకున్న నిర్ణయమే తారస్థాయి నిర్ణయం.
* ఇది ఇలా వుండగా  ప్రష్యా ప్రజలు కాఫీ సేవించడం వల్ల బీరు తాగే అలవాటు కు దూరమవుతున్నారని ఆందోళన మొదలయింది.  ప్రష్షియన్  ఫ్రెడెరిక్ ది గ్రేట్ ద్వారా “బ్రేక్ ఫాస్టు లో కాఫీ కి బదులుగా బీరు తాగండి” అని ప్రోత్సహిస్తూ ఒక ప్రకటనను జారీ చేశారట.

 అన్నట్లు ‘ఫ్రెంచ్ కాఫీ’ అంటే ఏమిటో తెలుసా? తెలిస్తే అర్థం కామెంట్స్ లో ల్ పెట్టండి

* కాఫీ వునికి కేవలం ఒక పానీయంగా కాకుండా ఒక సాంప్రదాయంగా వుంది.  కలిసి కాఫీ  తాగడమనేది ఒక సంస్కృతి చిహ్నంగా మారింది.
* అరబ్బీ పదం కాహ్ వాహ్ (Qahwah) టర్కీ లో కాహ్ వే (kahveh) గా మారి, డచ్ లో  కోఫీ (koffie) అయి ఇంగ్లీషులో కాఫీ (coffee) గా మారింది.
* కాఫీ ప్రియుల్లో స్టార్ బక్స్ పేరు చాలామందికి తెలిసే వుంటుంది. స్టార్ బక్స్ సగటున రోజు కి రెండు స్టోర్స్ తెరుస్తుందిట.
* రేయింబవళ్లు కష్టపడి కాఫీ పండించే రైతుల సంస్మరణ, వారికి కాఫీ పంట లోని మెళకువలు తెలియ జేయడం కోసం అక్టోబర్ 1 ని అంతర్జాతీయ కాఫీ దినోత్సవంగా నిర్ణయించారు.  ఈ నిర్ణయాన్ని 2015 లో మొట్టమొదటి సారి ఇటలీ లో అమలు పరిచారు
* ఇంగ్లాండు లో  ప్రపంచపు మొట్టమొదటి కాఫీ హౌసు 1652 లో స్థాపించారు. పురుషులకు కాఫీ సర్వ్ చేయడానికి ఈ కాఫీ హౌస్ కు మహిళలను అనుమతిస్తారు.కానీ వారికి కాఫీ తాగడం నిషేధం
* కాఫీ లో కెఫీన్ (caffine) అనే పదార్థ ముంటుంది. ఇది విష పూరిత మంటారు. తక్కువ మోతాదుల్లో ఈ విష పదార్థం ఆరోగ్యానికి మంచిది. ఏకబిగిన 30 కప్పుల కాఫీ (ఇది 70 కప్పులంటారు కాఫీ ప్రియులు) తాగితే అది ప్రాణాంతకమవుతుంది అంటారు.

 


అమెరికా FDA (Food and Drug  Administration)సూచలన ప్రకారం ప్రతిమనిషి రోజూ 400 మి.గ్రా కెఫీన్ ను అంటే నాలుగయిదు కప్పుల కాఫీని సురక్షితంగా తీసుకోవచ్చు. 600 మి.గ్రా దాటి తాగితె దుష్ప్రభావాలుంటాయి మనిషి శరీర తత్వాన్ని బట్టి ఇది మారుతుంది.అంటే తీసుకున్న కెఫీన్ ఎంత తొందుగా విఛ్చిన్నమయి విసర్జించబడుతుందనే దాన్ని బట్టి కెఫీన్ సహనావధి (tolerance limit) ఉంటుంది.కెఫీన్ విచ్ఛిన్నం చేసేది కాలేయం. కెఫీన్ ను లివర్ paraxanthine, theobormine, theophylline గా విడగొట్టి బయటకు పంపించేస్తుంది.


* 1906 లో జార్జి వాషింగ్టన్ అనే వ్యక్తి ఇన్స్టాంట్ కాఫీ ని కనిపెట్టాడు.
* స్టార్ బక్స్ సంస్థ సంవత్సరానికి 93 మిలియన్ గాలన్ల పాలు వాడుతుందిట. ఈ పాలతో ఒలింపిక్స్  లో వుండే స్విమ్మింగ్ పూల్స్ లాంటి 155 స్విమ్మింగ్ పూల్స్ను నింప వచ్చట.
* వేడి వేడి కాఫీ అంటూనే మనకు నోట్లో నీళ్లూరుతాయి. కాఫీ ని వేడి వేడి గా తాగడం మనకు అలవాటు. చల్లారిపోతుంది త్వరగా తాగండి అంటు వుంటాం. కానీ చల్లటి కాఫీ ని ఇష్టపడే ప్రపంచం ఒకటుంది. కాఫీ చల్లారితే మన దృష్టి లో దాని విలువ పడిపోతుంది. కానీ వేడి కాఫీ కంటే చల్లని కాఫీ అధిక ధర కల్గి వుంటుంది.
Coffee beans(credits Rudyasho via wikimedia commons
* ఓ సినిమాలో దీని మీద ఓ కామెడీ సీను కూడా వుంది. సునీల్ బృందం అనుకుంటాను, ఓ కాఫీ హొటలు కెళ్లి కాఫీ ఆర్డరు చేస్తారు. వెయిటరు హాట్ కాఫీ యా కోల్డు కాఫీ యా అని అడుగుతాడు. ఒక మిత్రుడు హాటెంత, కోల్డెంత అని ఆడుగుతాడు. దానికి వెయిటరు చెప్పిన జవాబు కు దిమ్మ తిరిగి పోయి కోల్డు వద్దులే బాబూ హాట్ కాఫీ యే తీసుకురా అంటాడు. కాఫీ వచ్చిన తరువాత మిత్రులు మాట్లాడుతూ వుంటే, ఒరే త్వరగా తాగండిరా, కాఫీ చల్ల బడిపొతే కోల్డుకాఫీ కి బిల్లేస్తాడు అని చమత్కరిస్తాడు. ఆ రకంగా హాట్ కాఫీ కన్నా కోల్దు కాఫీ చాలా ప్రియము అని తెలుసుకో గలరు.
* కాఫీ మూల పదార్థం ఒకటే అయినా, దానిలో కలిపే ఇతర పదార్థాలను బట్టీ, పరిస్థితులను బట్టీ, పరిసరాలను బట్టీ కాఫీ అనేక రూపాల్లోకి మారుతుంది. అనేక రకాల ధరలు పలుకుతుంది.
* ఇంతకు ముందు (ఇప్పుడూ వుండొచ్చు) ఉడిపి కాఫీ హోటళ్లు ఉండేవి. ఈ కాఫీ హోటలు ముందునించి వెళుతుంటే అక్కడినించి వచ్చే కాఫీ సువాసనే మనుషుల్ని హోటలు లోకి లాగేది. ఇక్కడ కాఫీ ఇప్పుడు కూడా పది రూపాయలలోపే వుంటుంది. ఇప్పుడు బారిస్టాలలో, ఫుడ్ కోర్టుల్లో, ఐ మాక్సు థియేటర్లలో కాఫీ రకరకాల రుచుల్లో , విపరీతమైన రేట్ల లో దొరుకుతుంది. ఈ కాఫీ స్టార్టింగ్ ధర 80 రూపాయలుండవచ్చు.పైకి పోతే  అది అయిదు వందలు అవొచ్చు.
* బలుపు సినిమాలో రవితేజ, ఓ రెస్టారెంటులో కాఫీ ఆర్డరిచ్చి, రేటు కార్డు చూసి, అబ్బో కాఫీ ఇంత రేటా అని ఆశ్చర్య పోయే సీను గుర్తుందా ?
నా మటుకు నాకు ఒక కాపుచినో అనే పేరు తప్ప్పిస్తే కార్పోరేటు కాఫీ హోటళ్ల మెనూ కార్డుల్లోనుంచి మరే పేరూ గుర్తు లేదు. కాపుచినో అనే పేరు మాంక్స్ మరియు నన్స్ తొడిగే దుస్తుల రంగు ఆధారంగా వచ్చిందిట.  ఎయిర్ పోర్టుల్లో నయితే  బరిస్టాల్లాంటి ప్రజలకి అక్కడ కాఫీ ధర తెలుసుకుని జ్ఞానం పెంచుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి, కానీ అక్కడి కాఫీ తాగడానికి పనికి రాదు.
* ఈ ప్రపంచం లో అత్యధికంగా అమ్ముడు పోయే పదార్థాలలో ముడి చమురు మొదటి స్థానం లో వుంటే, కాఫీ రెండొ స్థానం లో వుంది. అలాగే అత్యధికంగా సేవించ బడే ద్రవ పదార్థాలలో నీరు మొదటి స్థానం లో వుంటే, కాఫీ రెండో స్థానం లో వుంది.

ఓ ఐ ఏ ఎస్ ఇంటర్వూ లో అడిగారట కాఫీని హిందీలో ఏమని పిలుస్తారు అని. మీకు జవాబు తెలుసా? తెలిస్తే కామెంటు సెక్షను లో పెట్టండి.

ఆ రోజులు గుర్తున్నాయా పొరుగింటి బామ్మ గారు కప్పుడు కాఫీ పొడి అప్పు తీసుకోవడానికి వచ్చినపుడు మీ అమ్మగారు చూపించిన ఆప్యాయత. పక్కింటి రెండు జడల సీత   అమ్మగారితో  కాఫీ షేర్ చేసుకోడమనే సాకు తో మీరేం చేస్తున్నారో చూడడానికి  మీ ఇంటికి వచ్చినప్పుడు మీ తడబాటు గుర్తుందా?
ఇవన్నీ కేవలం కాఫీ తో నే పెనవేసుకున్న  రాగ బంధాలు.  ఆహ్లాదకర జీవిత జ్ఞాపకాలు.

 

Ahmed Sheriff
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management & Quality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *