ముంచు కొస్తున్న పోలవరం ముంపు! ఎవరిది బాధ్యత?

(వి. శంకరయ్య)

అసంబద్ధ విధానాల వలన ముంచుకొస్తున్న పోలవరం ముంపుకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రధాన బాధ్యత వహించ వలసిన ప్రాజెక్టు అథారిటీని రాష్ట్ర హైకోర్టు ఈ నెల 24 వ తేదీన బోనులో నిలబెట్టి ఏమి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

పునరావాసం కల్పించకుండా నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించ వద్దని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని హైకోర్టు గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించడం లేదని హైకోర్టుకు నివేదించినా అది క్షేత్రస్థాయిలో నిష్ఫలమౌతోంది.

రోజు రోజుకూ వరద ముంచు కొస్తుంటే ప్రభుత్వం బలవంతం చేయక పోయినా పదుల సంఖ్యలో గిరిజన గ్రామాల ప్రజలు ఇల్లు వాకిలి వదలి పెట్టి తట్ట బుట్టలతో కొండల మీద బిక్కు బిక్కు మంటూ వున్నట్లు హృదయ విదారక వార్తలు కథనాలు వస్తున్నాయి.

జూలై మాసంలోనే ఇలా వుంటే ఆగష్టు నాటికి అనూహ్యంగా వరద ముంచుకొస్తే పలు గ్రామాలు ముంపు బారిన పడతాయని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం పునరావాసం పూర్తి చేయకుండా కాఫర్ డ్యాం గ్యాప్ లు పూడ్చడానికి తోడు ఎత్తు పెంచడంగా కారణంగా చూపు తున్నారు. ఎందు కిలా జరిగింది? ఇందులో ఎవరి బాధ్యత ఎంత? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు. అరచేతికి అద్దం అక్కర లేదు.

పోలవరం నిర్వాసితుల గురించి గత పక్షం రోజులుగా రాష్ట్రంలో సమావేశాలు నిరసన సభలు జరుగుతున్నాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ప్రకటనలు చేస్తున్నారు. వెంటనే నిర్వాసితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంలో పుణ్య కాలం గడచి పోయింది. ప్రభుత్వం కూడా తాత్కాలికంగా ఏవైనా చర్యలు చేపట్టడం తప్ప మరో మార్గం లేదు.

ప్రధాన హెడ్ వర్క్స్ పూర్తి చేయడం గురించే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచించారే గాని నిర్వాసితుల గోడు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాని పోలవరం ప్రాజెక్టు అథారిటీ బాధ్యత గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండా జరిగిందా?

ఈ ఘోర కలిలో ప్రథమ ముద్దాయిని ఒక్క హైకోర్టు తప్ప మిగిలిన వారు బోనులో నిలబెట్టడం లేదు.

పోలవరం ముంపు బాధితుల గురించి ఒక స్వచ్ఛంద సంస్థ వేసిన పిల్ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎన్ని వివాదాలు వున్నా పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించు తున్నారు. ప్రాజెక్టులో చీపురు పుల్లంత పని జరగాలన్నా డిజైన్లతో సహా కేంద్ర ప్రభుత్వం తరపున ప్రాజెక్టు అథారిటీ ఆమోదం పొంద వలసినదే. నిర్వాసితుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పైన పలువురు విమర్శలు చేస్తున్నారే గాని అధికార యుతంగా గాని లేక అనధికారికంగా తలూపిన ప్రాజెక్టు అథారిటీ గురించి ప్రస్తావించడం లేదు.

కాని శనివారం హైకోర్టు ధర్మాసనం అసలు ముద్దాయిని బోనులో నిల బెట్టింది.పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కాఫర్ డ్యాం గ్యాప్ లు పూడ్చుతూ ఎత్తు 38 మీటర్లకు నిర్మించ గలుగుతుందా? 41.15 మీటర్ల కాంటూరు వరకు నష్టం పరిహారం పునరావాసం పూర్తి చేయనిదే కాఫర్ డ్యాం గ్యాప్ పూడ్చేందుకు అనుమతి ఇచ్చేది లేదని గత నవంబర్ డిసెంబరు మాసాల్లో ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన ప్రాజెక్టు అథారిటీతో పాటు నిపుణులు కమిటీ పైగా ప్రాజెక్టు డిజైన్ రివ్యూ పానల్ కమిటీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు అధికారులకు ఖరాఖండిగా చెప్పారు. ఆ రోజు వరకు నిర్మాణంలో వున్న పునరావాస కాలనీలను పరిశీలించారు. దాదాపు నాలుగు వేల గృహాలు నిర్మాణం మొదలు పెట్ట లేదని ఎక్కువ భాగం నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని గోదావరి వరద వచ్చే లోపు ఈ కార్యక్రమం పూర్తి కాదని కూడా ప్రాజెక్టు అధికారుల ముఖానే చెప్పారు.

కాని అటు తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ గానీ అధికారుల జాడ కనిపించ లేదు. ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నాడని కాఫర్ డ్యాం గ్యాప్ లు పూడ్చడంతో పాటు ఎత్తు 38 మీటర్లకు పెంచారు. 41.15 ఎత్తుకు ఆగస్టు నాటి కల్లా పెంచుతామని అధికారులు ముఖ్యమంత్రి సమక్ష సమావేశాల్లో చెప్పారు.క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా జరిగింది. ప్రాజెక్టు అథారిటీ ఆదేశించినట్లు 41.15 కాంటూరు వరకు నిర్వాసిత గ్రామాలకు నష్టం పరిహారం పునరావాసం పూర్తి చేయకనే కాఫర్ డ్యాం గ్యాప్ లు పూడ్చారు. యుద్ధ ప్రాతిపదికన ఎత్తు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రధానంగా తేల వలసిన అంశమేమంటే ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పగ్గాలు వదిలి పెట్టిందా? ఇందులో ఎవరి పాపం ఎంత? వచ్చే నెలలో వేలాది మంది వరద బారిన పడ వలసి వుంటుంది. ఇందులో తన బాధ్యత ఎంతో ప్రాజెక్టు అథారిటీ నోరు విప్పవలసి వుంది.

ప్రాజెక్టు అథారిటీని అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించిన హైకోర్టు ఈ కేసును ఆగస్టు 23 వతేదీకి వాయిదా వేసింది. ఈ అంశంపై పిల్ వేసిన స్వచ్ఛంద సంస్థ రేపు వాయిదా సందర్భంగా ముంపుకు కారణమౌతున్న కాఫర్ డ్యాం ఎత్తు పెంచడంలో ఎవరి బాధ్యత ఎంతో నిలదీయ వలసి వుంది.

ఇందులో రెండు కీలకాంశాలున్నాయి. ప్రాజెక్టు అథారిటీ గాని డ్యాం డిజైన్ రివ్యూ పానల్ కమిటీ గాని ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ప్రతి దఫా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు పూర్తి చేసే గడువు నిర్దేశించే వారు. కాని నిధులు గురించి ఒక్క ముక్క చెప్పే వారు కాదు. ప్రాజెక్టు అథారిటీకి పూర్తి బాధ్యత వున్నా పట్టించుకున్న దాఖలా లేదు. కనీసం ప్రాజెక్టు నిర్ణీత కాలంలో పూర్తి కావాలంటే ఏ మేరకు నిధులు అవసరమో కేంద్ర జలవనరుల శాఖకు నివేదించుతామని మాట వరసకైనా చెప్పిన సందర్భాలు లేవు.

రెండవ అంశం- చాలా ప్రమాద కరమైనది. కాఫర్ డ్యాం గ్యాప్ లు పూడ్చకుండా ఎత్తు పెంచకుండా వుండిన గత ఏడాది ఆగస్టు 23 వతేదీ పెద్ద ఎత్తున వరద వచ్చిన సమయంలో కాఫర్ డ్యాం వద్ద 28.4 మీటర్ల వరకు నీళ్లు నిలిచాయి. అప్పుడు 23 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించింది. ప్రస్తుతం అతి స్వల్పంగా తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా కాఫర్ డ్యాం వద్ద 34.50 మీటర్ల మేర ( ఆదివారం రాత్రి) నీరు నిలిచి వుంది. ఈ సమయంలోనే గత ఏడాది ఆగస్టు 23 నాటి వరదను
తలచుకొని పలు గ్రామాల ప్రజలు భయకంపితులౌతున్నారు
ఇదే జరిగితే భారీగా నష్టం వాటిల్లిడమే కాకుండా పలు గ్రామాలు రోజుల తరబడి వరదలో వుండ వలసి వుంటుంది. దీని కంతటికీ కారణం పునరావాసం పూర్తి చేయకుండా కాఫర్ డ్యాం గ్యాప్ లు పూడ్చడం ఎత్తు పెంచడంగా భావిస్తున్నారు.

(వి. శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు, సెల్ నెం. 9848394013)

 

ఇది కూడా చదవండి

ఊరు ఉండమంటున్నది…. గోదారి పొమ్మంటున్నది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *