ఊరు ఉండమంటున్నది…. గోదారి పొమ్మంటున్నది!

(జువ్వాల బాబ్జీ)

రేపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి  పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలను లెక్క చేయకుండా, బందో బస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

నిర్వాసితులు తమ గోడు వెళ్ళబోసు  కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ ఆవకాశం, ఆశించిన  సమాధానం దొరుకుతుందో లేదో వేచి చూడాలి. అయినా, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనుల గురించి గానీ, నిర్వాసితులు పడుతున్న బాధలు గానీ మీడియా ద్వారా, అధికార యంత్రాంగం ద్వారా ఎప్పటి కప్పుడు ముఖ్య మంత్రిగారికి తెలుస్తూనే ఉండాలి.

ప్రాజెక్ట్ నిర్మాణం వలన అత్యధికంగా నష్టపోతున్న వారు ఆదివాసీలే. ఇక్కడ ఏ నిర్మాణం చెపట్టాలన్న ముందుగా గిరిజనుల గ్రామ సభల తీర్మానం తప్పనిసరి. ఈ విషయం  భూసేకరణ చట్టం లోని సెక్షన్ 41(3) లో  స్పష్టంగా ఉంది. కానీ  అధికారులు ఈ విషయం గాలికొదిలేశారు.  కొద్ది మంది సంతకాలతోనే, మెజార్టీ సభ్యుల ఆమోదం ఉండాలన్న నియమం లేక్క చేయకకుండా  “పెసా గ్రామసభ” సమావేశాలు జరిపినట్లు, తీర్మానాలు చేశారు. అంతా మ.మ అనిపించారు.

గిరిజనులు మొదటి నుండి వారి   రక్షణ కోసం చట్టాల గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరుతున్నారు. కానీ, ఫలితం శూన్యం. అసలు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక రక్షణలు లేదా చట్టాలు గురించి ఒకసారి చర్చిద్దాము.

1, భూ బదలాయింపు నిబంధనలు 1/70.
2, పెసా చట్టం 1996, మరియు రూల్స్_2011.
3, అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006, రూల్స్ 2021.
4, సుప్రీం కోర్టు తీర్పు లు: సమత వర్సెస్ స్టేట్ ఆఫ్ ది ఆంధ్ర ప్రదేశ్ , మరియు వేదాంత వర్సెస్ స్టేట్ ఆఫ్ ది ఒడిస్సా.
5,భూసేకరణ చట్టం 2013, దీనిని ఫారెస్ట్ ( కన్వర్షన్) చట్టం-1980, మరియు ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్ & క్లైమేట్ చేంజ్ ఎఫ్. నెమ్.11_9/1998_ఎఫ్ సి (పిటి) తేది:3/8/2009.
6, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం_2016.

కొన్ని ప్రొవిజన్స్ పరిశీలించినట్లయితే, ఎవరికైనా అర్థమవుతుంది, భూసేకరణాధిఖారులకు   అన్నీ తెలిసినా చట్టాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ ఉన్నారని.

అధికారులు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

*మీరు పోలవరం ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిపే ముందుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు హక్కు పత్రాలు ఎంత మందికి ఇచ్చారు?

 

పోలవరం మండలం గిరిజన గిరిజన నిర్వాసితులు కొండలపై గుడిసెలు వేసుకుంటున్నారు.

సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న పునరావాసం
పొంగుతున్న గోదావరి తరిమేస్తున్నది
గోదావరి పొమ్మంటున్నది…
వూరిని కభళిస్తున్న గోదావరి వరద

*కలెక్టర్ గారు ఎన్ని గ్రామాల లో గ్రామ సభలు ఏర్పాటు చేశారు,50./. కోరంతో ఆమోదం పొందిన అటవీ క్లెయిమ్ లను సంతృప్తి చెంది పట్టా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారా? మీ వద్ద ఎన్ని పరిశీలన కోసం పెండింగ్లో ఉన్నాయి?

*కలెక్టర్ గారు ఎన్ని గ్రామాల లో సభలు సమావేశాలు పెట్టీ గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములను సర్వే చేసి హక్కులు కల్పించిన తర్వాతనే, భూసేకరణ జరపమని ఆదేశాలు ఇచ్చారు?

*భూసేకరణ వలన గిరిజనులకు జరిగే మంచి చెడులు లేదా పునరావాస కాలనీలలో వారికి కలిపించే సౌకర్యాల గురించి చెప్పారా?

*ఎన్ని గ్రామాలలో అటవీ భూములు సేకరించారు? వాటిని ప్రాజెక్ట్ కోసం సేకరించడం జరుగుతుంది ఎన్ని గ్రామాలలో ప్రజల ముందు ప్రకటించారు?

*ముంపుకు గురి అవుతున్న అటవీ ప్రాంతంలో ఎంత మంది గిరిజనులు ఉమ్మడి వనరులు అనుభవిస్తూ ఉన్నారో తెలియజేస్తూ వారికి ఉమ్మడి హక్కు పత్రాలు ఇచ్చారు?

*అటువంటి భూములు కోల్పోయిన వారికి  ఎన్ని చోట్ల పునరావాస కాలనీలలో ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం వనరులు సమకూర్చారు?

*ఆ వివరాలు ప్రజల కోసం గ్రామంలో ఉంచారా? వాటిని ఆమోదిస్తూ గ్రామప్రజలు సంతకాలు చేశారా?

*రీ సెటిల్మెంట్ & రీ హేబిలిటేషన్ (R&R) స్కీమ్ గురించి ఎన్ని గ్రామాల లో ప్రజల ముందు పరిశీలన కోసం ఉంచారు?

*భూసేకరణ చట్టంలో సెక్షన్ 29 ప్రకారం  పునరావాస కాలనీలలో ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం అటవీ ప్రాంతం ఎక్కడెక్కడ అందుబాటులో ఉంచారా?

*గిరిజన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, అవార్డు కాపీలు గ్రామాలలో ఉంచారా?

*6 నెలల ముందుగా గిరిజనుల ను పునరావాస కాలనీలకు తరలించడానికి ముందే చట్ట ప్రకారం అన్ని రకాల సౌకర్యాలు పూర్తి చేశారా?

*పై చర్యలు తీసుకోవాలని, అవి అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను పునరావాస కాలనీలలో ఉంచారా?

నేను మీ ముందు ఉంచిన ప్రశ్నలు గిరిజనులకు రాజ్యాంగ బద్ధంగా ఉన్నవి. వాటిని అమలు చేయడం మీ బాధ్యత. ముఖ్యమంత్రులు మారుతున్నారు. అధికారులు మారుతున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన వారి బతుకులు మారటం లేదు. మీరిచ్చిన ఉత్తర్వులు మీరే అమలు చేయక పోతే ఎలా? ఒకసారి దీనిని పరిశీలించంచండి .

 

మెమోనెంబర్:SOW03-11024/56/2020తేది:26/08/2020 లో గిరిజనులకు పోలవరం ప్రాజెక్టు లో ఆర్.ఓ.ఎఫ్. ఆర్ ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ అదీ విస్మరించారు. అయినా సరే నిర్వాసితుల సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయే కానీ, తరగటం లేదు.

Memo Page 1

 

Memo Page 2

అవునులే, పేద గిరిజనుల పునరావాసం చూడవలసిన ముఖ్యమంత్రి గారికి తీరికే లేదు. బాధ్యతగా వ్యవహరించ వలసిన అధికారులు మామూళ్లు వసూలు చేసే పనిలో పడి నిర్వాసితులకు అన్యాయం చేశారు. ఎవరితో చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి. ఎన్నిసార్లని చెప్పు కోవాలి. చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు.

ఆ మధ్య అక్టోబర్ 2తారీకున గాంధీ జయంతి నాడు ఏపి  రాష్ట్ర ప్రభుత్వం, రెండు లక్షల ఎకరాలు అటవీ భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనుల కు అటవీ హక్కుల చట్టం ప్రకారం, హక్కు పత్రాలు ఇచ్చారు.

కానీ, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు ఎందుకు ఇవ్వరు? దానికి గతంలో ఇక్కడ పనిచేసి ఇటీవల జైలుకు వెళ్లిన అధికారి చెప్పిన సమాధానం ఏమంటే, ఆ భూములన్నీ ప్రాజెక్ట్ లో మునుగుతున్నాయి, అందుకే ఇవ్వలేదు అని. ఎంత దారుణం?

ఏ మార్గమూ లేక, ఏ దిక్కూ లేక  ఈ పేద గిరిజనులంతా  కోర్టు తీర్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. న్యాయ దేవత అయినా కరుణించక పోతుందా అని ఆశగా అమాయకంగా చూస్తున్నారు.

(జువ్వాల బాబ్జీ అడ్వకేట్,పోలవరం ప్రాజెక్టు దళిత నిర్వాసితుల జాయింట్ యాక్షన్ కమిటీ)

 

 

2 thoughts on “ఊరు ఉండమంటున్నది…. గోదారి పొమ్మంటున్నది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *