పోలవరం సాధించాలంటే సమైక్య పోరాట వేదిక అవసరం

(వి శంకరయ్య)

పోలవరం ప్రాజెక్టుకు చెంది 2013-14 అంచనాల మేరకే కేంద్ర ప్రభుత్వం బిల్లులు రీయింబర్స్ మెంట్ చేస్తుందని అంతకు మించిన బిల్లులు చెల్లించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను తిరస్కరించినట్లు వెలువడిన వార్తలు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా వుండటం దీనికి తోడు ఆర్థిక పరిస్థితి గడ్డుగా వుండటం అన్నీ కలగలసి ఈ దుస్థితి ఏర్పడింది.. ఇంత కాలం ముసుగులో గుద్దులాటగా వున్న వ్యవహారం ఈ పరిణామంతో బజారుకెక్కింది.

ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వంపై నెపం నెట్టి సరిపడితే అంతకన్నా ద్రోహం మరొకటి వుండదు. అదే విధంగా ప్రధాన ప్రతి పక్షం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత కింద ఎండ గట్టేందుకే పరిమితమైతే అంత కన్నా విద్రోహం కూడా మరొకటి వుండదు.

పక్కనే వున్న తమిళ నాడు రాష్ట్రంలో ఏం జరుగుతోందో రాష్ట్రంలోని అధికార ప్రతి పక్షాలు ఆలోచించాలి. జల్లి కట్టు అంశంలో రాజకీయాలు పక్కన బెట్టి పోరాడారు. పోలవరం కూడా ఆంధ్ర ప్రదేశ్ అంతటికి చెంది రాజకీయాలకు అతీత మైన అంశం. రాష్ట్ర విభజన చట్టం మేరకు హక్కుగా లభించింది కూడా. కాబట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అందరూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గానికి వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడితేనే ఫలితం వుంటుంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రికి లేఖలు రాయడం వలన ప్రయోజనం లేదు. తను నేరులో వెళ్లి తాడో పేడో తేల్చుకోవాలి. అదే ఇప్పుడు ప్రశ్నార్థకమైనది. అదే సమయంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రధాని వద్దకు రాష్ట్రం నుండి అఖిల పక్షాన్ని తీసుకు పోవాలి. రాష్ట్రంలో సమైక్య పోరాటం లేకుంటే కేంద్రం మెడలు వంచడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరం కాదు. రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతి పక్షాల మధ్య వున్న అగాధం ఆధారం చేసుకొని ప్రత్యేక హోదా ఎగ్గొట్టినట్లే ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం పంగనామాలు పెడుతోంది.

వాస్తవంలో ప్రత్యేక హోదా లాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం హామీ కాదు. చట్ట బద్దంగా లభించిన హక్కు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తే రాష్ట్ర విభజన చట్టం నిస్సిగ్గుగా ఉల్లంఘించినట్లే.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 90 (1) మేరకు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది.

సెక్షన్ 90 (4)మేరకు ప్రాజెక్టును కేంద్రం తన నిధులతో నిర్మించాలి. అవసరమైన అనుమతులు కేంద్రమే తీసుకు రావాలి. పర్యావరణం ఫారెస్టు రీ హాబిటేశన్ రీ సెటల్మెంట్ అన్నీ కేంద్రం నిర్వర్తించాలి. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు గురించి ఏలాంటి అస్పష్టత లేదు. కాని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2017 లో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించినట్లు చెబుతున్న తీర్మానం చూపెట్టి 2013-14 నాటి షెడ్యూల్ రేట్ల ప్రకారమే బిల్లులు చెల్లించుతామని చెప్పడమంటే పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది. ఒక వేళ ఈ అంశం కోర్టు మెట్లెక్కినా న్యాయం ఆంధ్ర ప్రదేశ్ వేపు వుంటుంది.

ఈ అంశంలో కేంద్రం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 2019 లో టిడిపి హయాంలోనే కేంద్ర జల శక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2017-18 అంచనాల మేరకు 55 548.87 కోట్ల రూపాయలుగా ఆమోదించింది. తదుపరి ఎన్నికలు రావడం- రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు నిర్మాణం కొన్నాళ్లు ఆగడం వలన ఈ ఫైల్ కాగితాలకే పరిమితం అయింది. తిరిగి 2020 లో కేంద్ర జల శక్తి శాఖకు చెందిన రివైజ్డ్ కాస్ట్ అంచనాల కమిటీ 2017-18 షెడ్యూల్ రేట్ల ప్రకారం 47 725. 24 కోట్ల రూపాయలుగా అంచనాలు సవరించి ఆమోదించి మరో వేపు అంత వరకు గోప్యంగా పెట్టిన కేంద్ర మంత్రి వర్గ తీర్మానాన్ని బయట పెట్టింది. . 2013-14 షెడ్యూల్ రేట్ల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 29 027. 95 గా నిర్థారించింది. పైగా ఇందులో తాగునీటి వ్యయం 4068.43 కోట్లు విద్యుత్ బ్లాక్ నిర్మాణ వ్యయం 4560. 91 కోట్లు పోగా ప్రాజెక్టు నిఖర వ్యయం 20 398.81 కోట్లకు మిగిల్చింది.

ఇందులోనూ మరో కిరికిరి లేక పోలేదు. 2017-18 షెడ్యూల్ రేట్ల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం వ్యయం 47 725. 24 కోట్లు ఆమోదించిన రివైజ్డ్ కాస్ట్ అంచనాల కమిటీ ఇందులో సాగునీటి వ్యయం 35 950.16 కోట్లుగా మాత్రమే నిర్థారించింది. తాగునీటి వ్యయం 7214.16 కోట్లు విద్యుత్ బ్లాక్ నిర్మాణం వ్యయం 4569.91 కోట్లు వెరసి 11 784.07 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం మంజూరు చేయదని చెప్పింది. ఒక వేళ 2013-14 షెడ్యూల్ రేట్ల ప్రకారమే చెల్లింపులు చేయునట్లయితే అంచనాలు కమిటీ 2017-18 షెడ్యూల్ రేట్లు ఎందుకు ఖరారు చేసింది?అంచనాల కమిటీ ఆమోదించిన రెండు షెడ్యూల్ రేట్ల మధ్య సాగునీటి వ్యయంలో 15 551.35 కోట్లు తేడా వుంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర భరించాలని కేంద్రం చెబుతోంది. పైగా రోజు రోజుకు నిర్వాసితులకు చెంది నష్టం పరిహారం పునరావాసం ఆంజనేయుని వాలంగా పెరుగుతోంది. ఒక అంచనా మేరకు లక్ష మందిని తరలించ వలసి వుంది.

రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వున్నా మధ్యలో ఇన్ని పేచీలకు దిగుతోందంటే ఎపిలో బిజెపి కి రాజకీయ ప్రయోజనం లేక పోవడమే. ఇది పచ్చిగా విభజన చట్టాన్ని అతిక్రమించడమే. విభజన చట్టం మేరకు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాలి. ఒక వేళ కేంద్ర మంత్రి వర్గం తీర్మానం అంటూ ఒకటి 2017 లో ఆమోదించి వుంటే 2019 లో సాంకేతిక సలహా మండలి సమావేశమైనపుడు ఎందుకు వెలుగు చూడ లేదు?.

అంతేకాదు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం 2013-14 నాటి షెడ్యూల్ రేట్లకే కట్టుబడితే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రులు మరచి పలసినదే. కొస మెరుపు ఏమంటే సరిగ్గా వారం క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష చేశారు. 1600 వందల కోట్ల రూపాయల పెండింగ్ లో బిల్లులు వున్నాయని వాటి కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.పైగా పోలవరం నుండి 900 కోట్ల రూపాయలతో మరొక ఎత్తిపోతల పథకానికి జీవో జారీ చేశారు.

ఇంత మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం భరించ గలుగుతుందా? 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాగునీటి రంగానికి 11 805 కోట్లు కేటాయించి సంవత్సరాతంలో కేవలం దాదాపు నాలుగు వేల కోట్లు వ్యయం చేయ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఆర్థిక భారం భరించ గలుగుతుందా? కేంద్ర ప్రభుత్వాన్ని ఏమేరకు నిలదీస్తుంది? ఇవన్నీ శేష ప్రశ్నలే. ముఖ్యమంత్రి సమీక్ష జరిగిన వెంటనే పిడుగులాంటి ఈ వార్త వెలువడింది. రాష్ట్ర జల వనరుల శాఖకు కేంద్రంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నట్లు భావించాలి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హస్తిన పర్యటన పెట్టుకోవడం తుదకు రద్దు కావడం జరిగినా మున్ముందు ముఖ్యమంత్రి కేంద్రం మెడలు ఏ మేరకు వంచుతారో దాన్ని బట్టి పోలవరం భవిష్యత్తు యే కాదు వైకాపా పరపతి కూడా ఆధార పడి వుండబోతోంది.

వాస్తవంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ యెడల ఎప్పుడూ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా చట్టం లేదని ఎగ్గొట్టింది. వాస్తవంలో ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి చట్టం ద్వారా అమలు జరగ లేదు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ మూడు సంవత్సరాలు నామ మాత్రంగా అమలు చేసి ఎగ్గొట్టింది. ప్రత్యేక హోదా బదులు అమలు జరిపిన ప్రత్యేక ప్యాకేజీకి గ్రహణం పట్టించింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు తీరని అపకారానికీ తలపడుతోంది. రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతి పక్షాలు రెండూ ఒకరినొకరు బదనాం చేసుకోవడంలో వుండి పోవడం సమైక్యంగా ఎదిరించే వేదిక లేక పోవడం కూడా కేంద్ర ఈ దుశ్చర్యకు తలపడేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.

(ప్రజాశక్తి  సౌజన్యంతో)

(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *