బిజెపిలోకి దూకిన రాహుల్ మిత్రుడు జితిన్ ప్రసాద

రాహుల్ గాంధీకి సన్నిహితుడయిన ఉత్తర ప్రదేశ్  కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద  ఈ రోజు బిజెపిలో చేరారు. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఈ రోజు ఆయన ఢిల్లీలో బిజెపి సభ్యత్వం స్వీకరించారు.

ప్రధాని డా.మన్మోహన్ సింగ్  యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జితిన్ ఈ మధ్య పశ్చిమబెంగాల్ ఇన్ చార్జిగా కూడా పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వాదుల్లో కూడా ఆయన ఒకరు.  ఈ ముఠాకి G23 అని పేరు ఉన్న సంగతి తెలిసిందే.  2019 ఎన్నికల తర్వాత   కాంగ్రెస్ పార్టీ ని కిందినుంచి పై దాకా ప్రక్షాళన చేయాలని జి23 కోరుతూ వస్తున్నది. కాబట్లి ఆయన పార్టీని వీడటం కాంగ్రెస్ నాయకత్వానికి అంత షాకింగ్ న్యూస్ కాకపోవచ్చు.

కాకపోతే, ఆయన వెళ్లిన సమయం కాంగ్రెస్ కు కొద్దిగా చీకాకు కలిగిస్తుంది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఎడాది ఎన్నికలు జరుగుతున్నాయి.  అక్కడ బిజెపి  ఈ మధ్య బాగా ఎదురు దెబ్బలు తింటున్నది.  ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలలో బిజెపి బాగా వెనకబడింది. మిగతా అన్ని పార్టీలు బాగా పుంజుకున్నాయి. అఖిలేస్ నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీ నెంబర్ వన్ గా మిగిలింది. ఇలా బిజెపి బలహీన పడుతున్నసమయంలో జతిన్ ప్రసాద ఆ పార్టీలో చేరడం  కాషాయ పార్టీకి కొంత వూపు నీయవచ్చు.

ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కు చెందిన జితిన్ ప్రసాద బ్రాహ్మణ నాయకుడు. ఈ మధ్య ఆయన బ్రాహ్మణ చేతన్ పరిషత్ అనే పేరుతో బ్రాహ్మణులకు న్యాయం జరగాలని క్యాంపెయిన మొదలుపెట్టారు.

యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2004 లోషాజహాన్ పూర్ నుంచి, 2009లో దవరాహా నుంచి  లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఆయన ఒక్క ఎన్నికల్లో గెలవలేదు.2014 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత2017లో యుపి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆపైన 2019 ఎన్నికల్లో కూడా గెలవలేకపోయారు. అంంటే  2014 నుంచి ఆయన రాజకీయంగా బాగా బలహీనపడిపోయారు. అందుకే ఆయన  ఆ మధ్య యుపిలో బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతూ ఉందని, వారికి న్యాయం జరగాలని ఒక క్యాంపెయిన మొదలుపెట్టారు.

జితిన్ రాజీవ్ గాంధీకి, పివి నరసింహారావుకు  రాజకీయ సలహాదారుగా పనిచేసిన జితేంద్ర ప్రసాద కుమారుడు.1999లో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీ  మీద పోటీ చేశారు. 2000  లో ఆయన మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *