ఈ రోజు ‘బ్రహ్మగుండం‘కు ట్రెకింగ్…

(భూమన్)
బ్రహ్మగుండం తిరుపతి నుండి 20 కి.మీ దూరం. మామండూరు చేరుకొనక మునుపే రోడ్డుకు ఎడమవైపున ‘ప్రకృతి బాట’ అనే బోర్డు ఉంటుంది.
ఇక్కడికి అటవీ శాఖ వారి అనుమతితోనే వెళ్లడానికి సాధ్యం. ఇక్కడి రైల్వే  అండర్ గ్రౌండ్ బ్రి డ్జికి ఆనుకుని ఒక ఇనుప స్తంభం తాళంతో ఉంటుంది. అటవీ శాఖ వారు తాళం తీస్తే గాని పోలేం.
దానిగుండా ప్రయాణిస్తే అయిదు కి.మీ దూరంలో అద్భతమయిన, అత్యంత మనోహరమయిన ఈ జలపాతాన్ని చేరుకోవచ్చు. ఇరవై అయిదేళ్ల క్రితం రాకపోకలు ఏ అభ్యంతరాలు లేకుండా కొనసాగేవి.  ఆ రోజుల్లో నెలకొకసారైనా ఈ ప్రాంతం సందర్శించేవాళ్లం.
స్మగ్గింగ్ కార్యకలాపాలు పెరిగిన తర్వాత అడవి ట్రెక్కర్లకు బందీఖానా గా మారింది. అడవి జంతువులతో ఎటయినా వేగవచ్చగాని  ఈ స్మగ్గర్ల భయం అంతా ఇంతా కాదని, అటవీ శాఖ వారు ఎవర్నీ అనుమతించడం లేదు.
ఈ దారినే ‘పుల్లుట్ల’ మట్టి దారి ఉంది. దానిగుండా తిరుమలకు పోవచ్చు. పూర్వం ఈ దారిన బాగా పోయే వారు. ఈ దారిలోనే నాలుగేళ్ల క్రితం స్మగ్లర్లు ఇద్దరు అటవీ శాఖ అధికారులను రాళ్లతో కొట్టి చంపినారు.
అద్భుతమయిన ఈ ప్రదేశం చూపరులకు కనువిందు చేస్తుంది. గుండం బాగా లోతు. ఈతకు బాగా అనువైన గుండం. ఆ జలపాతపు హొయలు, శబ్ద తరంగాలు, పర్యాటకును కట్టిపడేస్తాయి.
అటవీ శాఖ వారు తిరుపతికి దగ్గర్లోనే ఉన్న ఈ బ్రహ్మగుండాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దితే  ప్రభుత్వానికి అదాయాన్ని పర్యాటకులకు అహ్లదాన్ని అందించవచ్చు.
తగు జాగ్రత్తలు తీసుకుంటే, ఇదే మంత కానిపని కాదు, ప్రభుత్వానికి అలివికాని పనీ కాదు. తొందర్లోనే జంగిల్ సఫారి ప్రారంభిస్తామంటున్నారు. ఎదురుచూద్దాం.

 

మరిన్ని ట్రెకింగ్ విశేషాలు: