‘చందమామ’ టీమ్ చివరి సభ్యుడు శంకర్ మృతి, ఒక శకం ముగిసింది

(చందమూరి నరసింహారెడ్డి)
ఒక ముప్పై నలభై యేళ్లకిందట బాల్యం అంటే చందమామ పుస్తకం. చందమా కథలు.  తెలుగు రాష్ట్రాలలో బాల్యంతో ఇంతగా ముడివడిపోయిన పుస్తకం మరొకటి లేదు.
చదువొచ్చిన  ప్రతిఇంటిలో ప్రత్యక్షమయిన పుస్తకం చందమామ.  పుస్తకం కొనని వాళ్లు,కొన లేని వాళ్లు అద్దెకు తీసుకువెళ్లి చదువుకునే వారు. ఆరోజ్లు అద్దె గ్రంధాలయాలుండేవి. అవ్వాతాతల కథావినోద సంప్రదాయాన్ని ప్రింటింగ్ యుగానికి మలచిన పుస్తకం చందమామ. చందమామకు పిల్లలతో ( ఆ మాటకొస్తే, పెద్దలతో కూడా ) ఇంత అనుబంధం ఏర్పడేందుకు ఆ కథలొక కారణమయితే, కథలకు వేసిన బొమ్మలు మరొక కారణం. కథలకు ఉన్న ప్రత్యేకమయిన చిత్రాలు కథ విజువల్ మీడియాంలోకి మార్చి వ్యక్తి స్థాయిలో   నాటి తరం మెదళ్లలో, సామాజికంగా సామూహిక (collective memory) జ్ఞాపకాలలో సేవ్ చేసేవి.
ఇంతటి శక్తి వంతమయిన బొమ్మలవెనక వున్న వ్యక్తలు ఇద్దరు. ఒకరు చిత్ర కాగా మరొకరు శంకర్.చిత్ర చనిపోయాక భారం శంకర్ మీద పడింది. ‘చందమామ’ చివరి దాకా ఆయన సంస్థను వదల్లేదు.
శంకర్ బొమ్మలు లేకపోతే, చందమామ లేదు,చందమామ కథలు గుర్తుండేవి కాదు. శంకర్ వేసిన ‘శిధిలాలయపూజారి’ చిత్రాలు, తోకచుక్క, వెర్రివెంగలప్ప… వీటన్నింటికంటే ముఖ్యంగా బేతాలకథలు…అన్ని ఒక విశేష సృష్టి. చందమామ  పత్రిక మాటవినపడగానే, ఒక  చేత్తో  భుజానేసుకున్న శవాన్ని పట్టుకుని మరొక చేత్తో ఖడ్డం పట్టుకుని  విక్రమార్కుడు భయం గొలిపే భూత ప్రేత పిశాచాలుండే శ్మశానంలో వెళ్తున్నట్లు ఉండే చిత్రాలు తటెక్కిన ప్రత్యక్షమవుతాయి.
source: Social Media
దీనికి కారణం శంకర్.  ఆయన  తనదైన  శైలిలో చందమామ కు ప్రాణం పోసి నిలబెట్టాడు.  ఇలాంటి శంకర్ 97 యేళ్ల వయసులో నిన్న చనిపోయాడు. చందమామ టీమ్ లో ఇంకా మిగిలిఉన్న సభ్యుడాయనే. ఆయన  మృతితో ‘చందమామ’ శకం ముగిసింది.
శంకర్ పూర్తి పేరు కరత్తొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. 1924 జులై 19 న తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించారు.
ఇది కూడా చదవండి

*అప్పట్లొ ఫౌంటెన్ పెన్ను అంటే ఒక ఆభరణం, ఆత్మ విశ్వాసం

తండ్రి స్కూల్ టీచర్. అనుకోకుండా మద్రాసు వచ్చిన శంకర్  అప్పటి మద్రాసు బ్రాడ్వే కార్పొరేషన్ స్కూల్లో ప్రాథమిక విద్య కోసం చేరాల్సి వచ్చింది. అపుడు స్కూల్లో ప్రవేశానికి ఆయనకు ఒక పరీక్ష పెట్టారు.అదేంటంటే Geoge V is our King అనే మాట ఇంగ్లీష్ లో రాయాలి. శంకర్ వెంటనే రాయడమే కాదు,  ముత్యాల్లాంటి అక్షరాల్లో రాశాడు. కుర్రవాడి రాత టాలెంట్ చూసి  అయిదో తరగతిలో చేర్చుకున్నారు. అలా శంకర్ ఈరోడ్ నుంచి మద్రాసుకు 1934లో వచ్చాడు.
శంకర్ అక్షరాలు బాగుండటంతో  రోజూ బ్లాక్ బోర్డు మీద ఒక సామెత రాసే బాధ్యతను  స్కూల్ టీచర్ ఆయనకు అప్పగించాడు.
తర్వాత ముత్యాల్ పేట్ హైస్కూల్ కు మారాడు. అక్కడా అదే తంతు. చందమామ పత్రిక సంస్థాపకుడు నాగిరెడ్డి కూడా ఇదే స్కూలులో చదవుకున్నాడు.
 శంకర్ లో ఒక గొప్ప చిత్రకారుడున్నాడని మొదట గుర్తించింది  ఈ స్కూల్ డ్రాయింగ్ టీచరే. శంకర్ మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఆదివారం నాడు కూడా స్కూలుకు రప్పించి డ్రాయింగ్ మెళకువలు నేర్పాడు. అంతే కాదు, ఇతర పిల్లలు వేసిన చిత్రాలను కరెక్టు చేసే పని కూడా పెట్టాడు. మరీ ముఖ్యంగా ‘ఏ ఉన్నత విద్య అవసరం లేదు, డ్రాయింగ్ కళ నేర్చుకో, చాలు,’ అని శంకర్ ని చిత్రలేఖనం వైపు మళ్లించాడు.
ఈ  టీచర్ వల్లే ఆయన  బిఎ, ఎమ్మే చదవడానికి కాకుండా చిత్రలేఖనం మీద దృష్టిపెట్టేందుకు కారణం. ఫలితంగా ఆయన అయిదు సంవత్సరాల కోర్సుకోసం మద్రాసులోని గవర్నమెంట్ స్కూల్ అఫ్ ఆర్ట్స్ చేరాడు. కాలేజీలో పెయింట్ బ్రష్ తో శంకర్ సృష్టించిన అద్భుతాలు ప్రిన్సిపాల్ డిపి రాయ్ ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి.
1946 లో ఆయన డ్రాయింగ్ కోర్సు పూర్తి చేసి కళైమాగల్ తమిళ పత్రికలో చేరాడు. నెల జీతం రు. 84. 1952లో ఆయన జీతం రు. 150. ఈ జీతం చాలకపోవడంతో  మరొక నాలుగు రూకలు అర్జించేందుకు ఇతర అర్ట్ వర్క్ కూడా చేశాడు.
ఆదశలో ఆయనకు చందమామ సంస్థాపకుడు నాగిరెడ్డి నెలకు రు.350 జీతంతో చందమామ పత్రికలోకి తీసుకున్నాడు. అయితే, పేపర్ మీద దీనిని రు.300 గానే చూపించేవారు. ఎందుకంటే, అప్పుడు చందమాద చీఫ్ ఆర్టిస్టు చిత్ర జీతం రు. 350. దానికి కంటే ఈయనకు ఎక్కువ రాకూడదుగా.

మీ ఊరికి ఇలా అద్భతమయిన కథ ఉందా? మాకు పంపండి<trendingtelugunews@gmail.com>

“మా ఊరు కవిటం”

చిత్ర, శంకర్ పోటీ పడి చందమామ కధలకు రూపమిచ్చారు. అయితే,చిత్ర 1979లో చనిపోయాడు. చందమామ ఇంతవరకు రెండెడ్ల బండి. చిత్ర చనిపోవడంతో తన మీదే పూర్తి భారం పడి ఒంటెద్దుబండిగా మారిందని శంకర్ ఒకసారి ‘చిత్ర’ లేని ఆవేదనతో వ్యాఖ్యానించారు.
 శంకర్ 1946 నుంచి ఆఖరి శ్వాసవరకు బొమ్మలే జీవితంగా గడిపారు.  తెలుగు పిల్లల బాల్యాన్ని సుసంపన్నం చేసిన శంకర్ చివరిదాకా చాలా సాదాసీదా జీవితమే గడిపారు.

Like this story? Share it with a friend!

చందమామ కథల పత్రిక ద్వారా నాలుగు తరాల భారతీయులను తన బొమ్మలతో మురిపించిన శంకర్ తాతయ్య ఇక లేరనేది బాధాకరమయిన వార్త. 97 ఏళ్ల ‘చందమామ’ శంకర్ ఈ రోజు వృద్ధాప్య సమస్యల కారణంగా చెన్నైలో 29వతేది మంగళవారం తుది శ్వాస విడిచారు.
చందమామ పత్రిక అన్ని ప్రముఖ  భారతీయ భాషల్లో వెలువడ్డంతో ఆయన దేశమంతా తెలిసిన కళాకారుడయ్యారు.  భేతాళ కథల బొమ్మలు సహా ఎన్నో సీరియళ్లు, వేల కథలకు ఆయన బొమ్మలు సింగారించారు. పిల్లలను, పెద్దలు ఆకట్టుకునే ఆయన బొమ్మలు తీరుతెన్నులు అచ్చం భారతీయమైనవే.
 నాగిరెడ్డి, చక్రపాణి ప్రారంభించిన చందమామ ఆయన కెరీర్‌కు బాట వేస్తే, శంకర్  నాటి ప్రతిపిల్లవాడి మనసుల్లో చెరగని చందమామ ముద్ర వేశాడు. ఆ పిల్లవాళ్లలో నేనూ ఒకణ్ణి.
Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు గ్రామీణ జర్నలిజం అవార్డు గ్రహీత)

TREKKING ON SESHACHALM HILLS, TIRUPATI, ANDHRA PRADESH, INDIA