అప్పట్లొ ఫౌంటెన్ పెన్ను అంటే ఒక ఆభరణం, ఆత్మ విశ్వాసం

మీకీ విషయా తెలుసా? ‘ప్రేమ లేఖలు’  అనే సినిమా, రాశాను ప్రేమలేఖలెన్నో, ఏమని రాయనుకుశలామా … నీకు కుశలమా వంటి రొమాంటిక్ పాటలు అన్నీ పౌంటెన్ పెన్ కాలనుంచి జాలువారిన సాహిత్యం. అది లేఖా సాహిత్యం స్వర్ణయుగం. సినిమాల్లోనుంచే కాదు, జీవితం నుంచి కూడా రొమాన్స్ పోవడానికి ఫౌంటెన్ పెన్ గా పేరున్న ఇంక్ పెన్ను వాడక తగ్గిపోవడానికి సంబంధం ఉంది.  ఆదేదో చూడండి. 
( Ahmed Sheriff)
మీ అటక మీద వున్న పాత వస్తువుల మూటను విప్పితే, మీరో లేక మీ పిల్లలో దాచుకున్న చిన్న నాటి  వస్తువులు కనబడ తాయి. అవి మిమ్మల్ని మీ గతం లోకి, బాల్యం లోకి తీసుకు వెళతాయి. ఒక్కో వస్తువు ఒక్కో జ్ఞాపకాల చరిత్రను తెరుస్తుంది. వాటిలో అగ్గిపెట్టెల కవర్లుండవచ్చు, సిగరెట్ పెట్టెల అట్టముక్కలుండవచ్చు, గుర్తు రాని రాళ్ల ముక్కలుండవచ్చు.  లేదా వాడకుండా జ్ఞాపకం కోసం దాచి పెట్టిన ఒక ఇంక్ ( ఫౌంటెన్) పెన్ను వుండవచ్చు.  
ఇంక్  పెన్ ( fountain pen) కాలం నాటి జ్ఞాపకాలు… 
 ప్రతి అదివారం పొద్దుటే పెన్ను లోని ఇంకు బయట పడేసి, నీళ్ల తో దాన్ని కడిగి,  గాలి వూదుతూ దాన్ని శుభ్రం చేయడం గుర్తండినిదెవరికి?
 ఇంకు ఫిల్లరతో ఈ పెన్నును జాగ్రత్తగా ఇంకుతో నింపి , దాని చుట్టూ శుభ్రంగా తుడిచి, క్యాపు పెట్టి,  జేబులో పెట్టుకుని ధీమాగా బయటికియుద్ధానికెళ్లినట్టు నడవడం తప్పకు గుర్తుంటుంది మీకు.
పెన్ను కారి జేబుకంతా ఇంకు అంటినప్పుడు అమ్మా నాన్నలతో తిట్లు తినడం, స్కూళ్లో అయ్యవారు గేలిచేయడం ఎలా మర్చిపోతాం.
ఒక్కొక్కసారి, పెన్ను సంగతే మర్చిపోయి క్లాసులోకి రావడం,తీరా చూస్తే ఇంకయిపోయి చిక్కుల్లో పడటం ఎన్ని సార్లు జరగలేదూ. అపుడు  స్నేహితుడి పెన్నులో ఇంకు మూడు నాలుగు చుక్కలు అప్పు తీసుకున్న కష్ట కాలం గుర్తుంది కదా?
మీ పెన్నులోంచి కాస్త రెండంటే రెండు చుక్కల ఇంకు మీ స్నేహితుడి పెన్నులో వొంపినపుడు అప్పు తీర్చాలని మీరు చేయించిన వాగ్దానం  కూడా గుర్తుంటుంది. 
 ఒక్కోసారి ఇంకు సహాయం చేసే వాళ్లే లేనప్పుడు ఓ రెండు చుక్కలు నీళ్లు పెన్నులో పోసి అటూ ఇటూ వూపి  దాన్ని రాయగల్గినట్లు చేసి  ఐన్ స్టీను లా ఫీలయి పోవడం, ఎంత సరదాగా ఉండేదో.
రాసే ప్రతిఅక్షరం ముత్యంలా ప్రకాశించాలని ఎన్ని పెన్నులు మార్చే వాళ్లమో. పెన్ను మార్చడం ఖరీదయిన వ్యవహారమయినపుడు నిబ్బు (ముక్క) మార్చేసేవాళ్లు. మావూరు కిరాణా షాపులో  చిన్న పెట్టెనిండా ఎన్నిరకాల నిబ్బులుండేవో.
ఆరోజుల్లో కొందరే ఇంట్లో సిరాబుడ్లు పెట్టుకునే వాళ్లు. మిగతా వాళ్లంతా కిరాణా షాపులోనో బుక్ షాపులోనో రెండు పైసలిచ్చి ఇంక్ నింపుకునే వాళ్లం.
ఒక్కొక్క సారి పెన్ను  ఇంక్  ను కక్కి సతాయించేది. జేబంతా ఇంకుతో ఖరాబయ్యేది.  ఒక్కొక్క సారి రాస్తూన్నపుడు నిబ్బు నుంచి ఇంక్ చుక్కలు చుక్కులుగా దుమికి నోటుపుస్తకాన్ని పాడుచేసి ఇంత ఇబ్బంది పెట్టేదో. పరీక్ష అన్సర్ షీట్ నిండా ఇలాంటి ఇంక ముద్దలున్నపుడు అయ్యవారు పెట్టిన చివాట్లు అపుడపుడు గుర్తుకొస్తుంటాయి.
బోల్డ్ గా కాకుండా థిన్ గా రాయడానికి పెన్నును బోర్లించి రాయడం ఒక పద్ధతి.
ఆరోజుల్లో షర్టుకు  కనిపించేలాగా  పెన్ను తగిలించుకోవడం నాగరికత కు సింబల్. అందుకని మా మిత్రులు కొందరు టౌన్లోకి పోయినపుడు పెన్ను క్యాప్ ను తగిలించుకుని పెన్నుందన్నంత దర్జాగా తిరిగే వాళ్లు. ఎవరైనా పెన్ అడిగితే, ఇంక్ లేదన్నా అనే వాళ్లు…
పాత పోస్టు కార్డు మీద ప్రియమైన అమ్మకు అని రాసివుంటే, అది ఖచ్చితంగా ఫౌంటెన్ పెన్ను తోనే రాసి వుండాలి అని చెప్ప వచ్చు.
ఫౌంటెన్ పెన్నుల కాలం పోస్టు కార్డు కాల స్వర్ణ యుగమనోచ్చు అప్పట్లో యోగ క్షేమాలు తెలిపే  ఉత్తరాలు రాతపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఉండేవి. అలాగే గుట్టుగా రాసే ప్రేమ లేఖలు కూడా.

ప్రేమలేఖల గురించి ఇక చెప్పలేం.ప్రేమలేఖలు అందంగా కుదరాలని ప్రేమికులు పడిన పడరాని పాట్లకు ఫౌంటెన్ పెన్ సాక్ష్యం.
ఇంక్ పెన్ తో ఏ పనిచేసినా మనసా వాచా కర్మణా చేయాలి. ఎందుకుంటే, ఉత్తరంరాయాలంటే కుదరుగా కూర్చునే మనసుండాలి. మనసులోని భావాలను అందంగా చెప్పే మూడ్ ఉండాలి.. ఇదంతా పెద్ద పని.  ఈ  ప్రేమ లేఖల మీద వచ్చిన సినిమాలు, పాటలు అన్నీ ‘పౌంటెన్ పెన్ కాలం’ నాటివే… ఫౌంటెన్ పెన్ లు అంతరించాక ఇలాంటి సినిమాలు,పాటలు రానేలేదు. కావాలంటే వెదుక్కోండి.
ఫౌంటన్ పెన్ పుట్టుక
ఈ పౌంటెన్ పెన్ పుట్టుకే పెద్ద ఎపిక్.   మొదట్లో రాయడానికి సిరా లాంటి ద్రవ పదార్థం లో ముంచిన ఈకల్ని వుపయోగించే వారు. కలవారు హంసల ఈకల్ని వుపయోగిస్తే లేనివారు, బాతుల ఈకల్ని, దొరికిన ఏదో ఒక పక్షి ఈకని వుపయోగించేవారట. వీటిని క్విల్ పెన్నులనే వారు.
Quill Pen (source:historyofpencils.com)
ఇవి కొంచం నాగరికతను అలవాటు చేసుకున్న తరువాతడిప్ పెన్నులొచ్చాయి. ఒక పొడవాటి చక్క ముక్క చివర్లో ఓ పాళీ వుంటుంది. దీన్ని సిరాలో పలు మార్లు   ముంచి తీస్తూ రాసేవారు. 19వ శతాబ్దంలో మెటల్ నిబ్ లు రావడంతో ఈక పెన్నులు యుగం అంతరించింది. మాగ్నా కార్టా, అమెరికా డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్  అను రాసింది ఈ ఈక పెన్నులతోనే. అమెరికా సుప్రీంకోర్టులో ఇంకా వాటిని వాడుతున్నారట. రోజు ప్రతిజడ్డి టేబులు మీ 20 బాతు ఈకల పెన్ లను ఉంచుతారట. ఈక పెన్ను క్రీపూ 2 వశతాాబ్దం నుంచి వాడుకలో ఉన్నాయని చెబుతారు.దీనికి సాక్ష్యం ఇజ్రేల్  లో  ఖుమ్రాన్ గుహల్లో దొరికిన పురాత పాపిరస్ పత్రాలు, వీటినే డెడ్ సీ స్క్రోల్స్ (Dead Sea Scrolls) అంటారు.
దాదాపు 1700 సంవత్సరం నుండి డిప్  పెన్ను వాడకం లో వున్నా, 1888 వరకూ దానిని ఎవరూ పేటెంట్ చేయ లేదు . పెన్ను ను మొదట పేటెంట్ చేసిన వ్యక్తి గా జాన్ లౌడ్  పేరు చెబుతారు. 
ఈ ఫౌంటెన్ పెన్ను ఎలా పుట్టింది ?
ఒక కథనం ప్రకారం పదవ శతకం లో అల్ ముయిజ్లిదిన్ అనే ఈజిప్షియన్ ఖలీఫా  తన రాజ్యం లోని కళాకారుల్ని పిలిచి తన మీద సిరా కార కుండా , వుండె ఒక కలాన్ని తయారు చేయమని  పురమాయించాడట. అప్పుడు ఆయనకి ఒక సిరా బుడ్డి తలపైన రాయడానికి వీలుగా వుండే ఒక పాళీ లాంటి ముక్కను అతికి ఈనాటి ఫౌంటెన్ పెన్ను తొలి రూపాన్ని ఇచ్చారట. ఈ సిరా కారడం అన్న సమస్య తొలి రోజుల్లో ప్రతి కలానికీ వుండేది. ఆ తరువాత సేఫ్టీ పెన్నులొచ్చాయి. ఈ పెన్నుల్లో పాళీ కొస తప్పిస్తే మిగతా భాగమంతా పెన్నులోనే నిక్షిప్తమై వుండేది, పాళీ చివరినుండి సిరా కారడాన్ని దాదాపు గా అరికడుతూ

 

హీరో పెన్నులోచ్చాయి. వాటిలోపల ఇంకు ఫిల్లరు ను పోలిన ఒక సాధనం వుండేది.పెన్ను పాళీని సిరా లో ముంచి ఆ సాధానాన్ని వత్తి పట్టుకునివదిలేస్తే సిరా పెన్ను లోపలికి ఎక్కేది. పెన్నులకి హోదాలుండేవి. అలాగె సిరా రంగు కి కూడా హోదా వుండేది. సాధారణంగా ఎర్ర సిరా టీచర్లు, డాక్టర్లూ వాడే వారు. విద్యార్థులు నల్ల సిరా కానీ నీలి రంగు సిరా కానీ వాడే వారు. ఇక ఆకుపచ్చ రంగు సిరా ని గజిటెడ్ ఆఫీసర్లు వాడే వారు. చిన్న వుద్యోగులకి ఆకుపచ్చ సిరా పెన్ను వాడే స్థితి రావడమన్నది అప్పట్లో ఒక జీవిత గమ్యం
  ఎవరికైనా మీరు పెన్ను ఇచ్చినపుడు వారు మొట్టమొదట రాసి చూసుకునేది వారి పేరే. ఇది కనీసం 95% శాతం మనుషుల విషయం లో నిజం  
మాంట్ బ్లాంక్ అనే ప్రతిష్టాకరమైన పెన్నుల తయారీ సంస్థ దేశ రాష్ట్రపతులకీ, ప్రధాన మంత్రులకీ ఫౌంటెన్ పెన్నులు తయారు చేస్తుంది.  అందరూ అనుకునే టట్లు ఈ సంస్థ ఫ్రెంచి సంస్థ కాదు. ఇదొక జర్మన్ సంస్థ. ఈ సంస్థ పేరు యూరప్ లో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మాంట్ బ్లాంక్ ప్రేరణతో పెట్టబడింది. అయితే ఈ పర్వత శిఖరం ఫ్రాన్సులో వుంది.  
ఈ సంస్థ తయారు చేసే పెన్నుల పాళీ మీద 4810 అనే అంకెలు చెక్కి వుంటాయి. ఇది ఆ పెన్ను పాళీ వుత్పాదక సంఖ్య అనుకుంటారు చాలా మంది. నిజానికి ఇది మీటర్లలో ఆ పర్వత శిఖరపు ఎత్తు .
ఇలాంటి పనే ప్లాటినం అనే జపాను కి చెందిన పెన్నుల తయారీ సంస్థ  చేస్తుంది. అది తన ఫౌంటెన్ పెన్నుల పాళీల మీద 3776 అనే అంకెల్ని ముద్రిస్తుంది. ఇది మీటర్లలో మౌంట్ ఫుజి ఎత్తు.  
అపొలో 1968 మిషన్ కోసం పాల్ ఫిషర్ అనే అతను ప్రత్యేకంగా ఓ స్పేస్ పెన్ను తయారు చేశాడు. ఇది సిరా కల్గిన ఓ కార్ట్ రిడ్జు ను కలిగి వుంటుంది.  ఇది శూన్య గురుత్వాకర్షణలో, నీళ్ల లోపలా, నూనే తలాల మీదా, తలక్రిందులుగా, అత్యధిక, అత్యల్ప వుష్ణోగ్రతల వద్దా రాయగలదు.పెన్నును  స్పేస్ ఏజ్ లోకి తీసుకెళ్లిందీయనే.అయితే ఇవన్నీ బాల్ పాయింట్ పెన్స్. అమెరికా  అపోలో స్పేష్ మిషన్స్ కోసం 400 యాంటిగ్రావీటి బాల్ పాయింట్ పెన్స్ ను కొనుగోలు చేసింది. తర్వాత సోవియట్ రష్యా కూడా ఇదే ఫిషర్ నుంచి 100 పెన్నులను వేయి కాట్రిడ్జ్ లను కొనుగోలు చేసింది.

Like this story? Share it with a friend!

పైలట్, సెయిలర్, అనే పేర్లు సాధారణంగా పశ్చిమ దేశాలలో వాడతారు. అయితే పైలట్, సెయిలర్ బ్రాండ్ల పేర్ల తో తయారయ్యే పెన్నులు జపాను కంపెనీలు తయారు చేస్తాయి. యూరోప్, అమెరికా మార్కెట్లలో అమ్ముడు పోవడానికి అనువుగా ఆ కంపెనీలు తమ బ్రాండ్లను పశ్చిమ దేశాలలో వాడే పేర్లు గా ఎంపిక చేసుకున్నాయి.
హైదరాబాదులో ని గ్రీన్ లాండ్ ప్రాంతం లో ఓ పెన్నుల దుకాణం వుంది. నా బాల్ పాయింటు పెన్ను క్యాపు కి చిన్న రిపేరు వస్తే అక్కడికి తీసుకెళ్లాను. షాపతను రెండు రోజుల తరువాత రమ్మన్నాడు. యథాలాపంగా చార్జి ఎంత అవుతుందని అడిగాను. అతను ఆ రెపేరికి 1500 రూపాయలు అవుతుందని చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అదే విషయం చెప్పాను అతడికి. అతడు చిరునవ్వు నవుతూ మీరు 5000 రూపాయలు ఖరీదుచేసే ‘వాటర్ మన్’ పెన్ను వాడుతున్నారు దాని రెపేరుకి ఈ మాత్రం ఖర్చు చేయలేరా అన్నాడు. ఈ సారి మరింత ఆశ్చర్య పోయాను. ఆ పెన్ను నాకు ఎవరో గిఫు ఇచ్చారు చాలా కాలం క్రిందట. ఇటీవలే దుమ్ముదులిపాను. పాత పెన్నులలో కొంత కొత్తగా కనిపడితే, బయటకు  తీసి కడిగి  వాడటం మొదలు పెట్టాను.  నాకు తెలిసినంత మటుకు  అందులో ప్రత్యేకత ఏమీ లేదనుకున్నాను.  మాటా మాటా కలిసిన తరువాత అతను చాలా ఆసక్తి కరమైన వాటర్ మన్ పెన్ను గురించి, ఫౌంటెన్ పెన్నుల గురించి చాలా  విషయాలు చెప్పాడు .
Tibaldy Bentley Pen( credits:Vadim Zhuravlev / Public domain)
పెన్నుల్లో రెండు రకాలుంటాయిట. ఒకటి రాసే (writing) పెన్ను, మరోటి డ్రెస్ (Dress) పెన్ను. డ్రెస్ పెన్ను హోదా కి చిహ్న మట. దీన్ని మహా అయితే సంతకం పెట్టడానికి వుపయోగిస్తారట. కొంత మంది లక్షలు ఖర్చు పెట్టి పెన్నులని సేకరిస్తారట. అదో సరదా. కొత్తగా మార్కెట్టు లో కి విడుదలయిన ప్రతి విలువైన పెన్నుని వీళ్లు సొంతం చేసుకుంటారట. అతడి క్లయింటు ఒకతను ఇంగ్లండు లో విడుదలయిన ఓ పెన్ను ఇక్కడ దొరకక పోతే, ఫ్లైటులో లండన్ వెళ్లి ఆ పెన్ను కొని తిరుగు ఫ్లైటులో హైదరాబాదు వచ్చేశాట్ట.  షాపు మధ్యలో వున్న ఓ పెన్ను  బొమ్మను చూపించి ఈ పెన్ను ఖరీదు దాదాపు 87 లక్షల రూపాయలు. ఆర్డరిచ్చిన ఆరు నెలలకు ఇస్తారు. డబ్బు మొత్తం ముందే కట్టేయాలి అని చెప్పాడు. పెన్నులకో  ప్రపంచముందన్న మాట  
Mont Blonc/ Meisterstück
ఫల్గార్ నాక్టర్నస్ (Fulgor Nocturnus) అనేది ప్రస్తుతానికి ప్రపచం లోనే  అత్యధిక ధర కల్గిన ఫౌంటెన్ పెన్ను గా చెబుతారు. ఈ మాటకు అర్థం ‘స్ల్పెండర్ అఫ్ ది నైట్ై  అని. దీన్ని ఇటలీ కి చెందిన టిబాల్డి సంస్థ తయారు చేసింది.  బంగారు పాళీ కలిగి, 945 వజ్రాలు, 123 కెంపులూ పొదిగి వున్న ఈ పెన్ను ఖరీదు దాదాపు 90 లక్షల డాలర్లకు షాంగై వేలం పాటలో అమ్ముడవోయింది.Phi value (1:1.618033988749895) ప్రకారం దీని క్యాప్ బ్యారెల్ తయారుచేశారు.దీనిని దివైన్ ప్రపోర్షన్ అంటారు.
సాధారణంగా భారత దేశం  లో న్యాయాధిపతులు తీర్పు ని ఇచ్చిన తరువాత తమ జడ్జిమెంటు (ముఖ్యంగా  మరణ శిక్ష) రాసిన పెన్ను పాళీని విరిచేస్తారట. దీనికి అనేక కథనాలున్నాయి. ఒక కథనం ప్రకారం ఆ పెన్ను తో మరో తీర్పు రాయరాదని. ఇంకో కథనం ప్రకారం  ఒక మనిషి ప్రాణాలు హరించమని ఇచ్చిన తీర్పు  నుంచి తమని తాము దూరం చేసుకోవడానికి న్యాయాధిపతులు ఇలా చేస్తారట
Ahmed Sheriff
Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM
Consultant, PMP Certification, Project Management & Quality