కపిల తీర్థం సిగపై ఎన్ని జలపాతాలు!

 

– రాఘవశర్మ

జలపాతం హోరెత్తుతోంది .
తిరుమల కొండ పైనుంచి జాలువారుతోంది .
చెట్ల మాటునుంచి కిందకు దుముకుతోంది.
దరిచేరితే తప్ప అది దర్శనమివ్వడం లేదు.
పై నుంచి రాళ్ళ మధ్య ఎన్ని మెలికలు తిరిగిందో !
ఎన్ని ఒంపులు పోయిందో !
ఒక్కొక్క మలుపు దగ్గర ఎన్ని రాగాలు పలికిందో!
ఈ జలపాతం ఎన్ని జల స్వరాలను వినిపించిందో !
చివరికి ఊరు పేరులేని అనేక నీటి గుండాల నుంచి సాగింది.
అలా ఒక్కో నీటి గుండంలోంచి మరో నీటి గుండంలోకి ఉదృతంగా ఉరుకుతోంది.

కపిల తీర్థం నుంచి, తిరుమల కొండ అంచునే తూర్పునకు సాగిపోతోంది.
రాత్రి కురిసిన వర్షానికి మరింత ఉదృతంగా ఉంది నీటి ప్రవాహం.
ఈ జలపాతాల హొయలు చూడాలని, వీటి సొగసును ఆస్వాదించాలని ఆదివారం తెల్లవారు జామునే అనుకున్నాం.
మధు ఉదయం ఆరున్నరకు ట్రెక్కింగ్ సైరన్ ఊదాడు.
ఎలా తయారయ్యామో తెలియదు.
‘సిరికిన్ జెప్పడు’ అన్నట్టు, ఏడుగంటలకల్లా కపిలతీర్థం వద్దకు వచ్చేశాం.

నిండుగా కపిల తీర్థం

‘ఇదిగో వచ్చేస్తున్నా’ అన్నారు యూరాలజిస్ట్ డాక్టర్ విజయభాస్కర్
వారి కోసం అయిదు నిమిషాలాగాం.
అటవీ శాఖ కార్యాలయంలోంచి తిరుమల కొండ సానువులకు చేరాం.
ద్విచక్ర వాహనాలు అక్కడే నిలిపేసి వెదురు పొదల్లోంచి నడుచుకుంటూ కొండ అంచుకు చేరాం.
నిటారుగా ఉన్న రాతి కొండ ఎక్కడం మొదలు పెట్టాం.
రాత్రి పడిన వర్షానికి జారుతోంది.
చతుష్పాదుల్లా పైకి పాకేస్తున్నాం.
అరగంటలో రాతి కొండ ఎక్కడం అయిపోయింది.

 

భరద్వాజ తీర్థం సమీపంలో కొండపైన ప్రకృతి ప్రియులు

వెనక్కి తిరిగి చూస్తే కొండ అంచునే ఎత్తైన పచ్చని చెట్లు.
దూరంగా అర్ధ చంద్రాకారంలో కొండల వరుస.
ఈ రెంటి మధ్య నేలపైన తెలతెల్లని ఇళ్ళతో తిరుపతి నగరం.
పక్కనున్న చెట్లు పట్టుకుని మరింత ఎత్తుకు ఎక్కుతున్నాం.
కనురెప్ప పాటు కాలంలో కళ్ళ ముందే ఒక పెద్ద అలికిడి.
మా అలికిడికి ప్రాణ భయంతో బాగా బలిసిన ఒక అడవి పంది కొండ పైకి ఎంత వేగంగా పరుగెత్తిందో!
దాని వేగానికి అంతా ఆశ్చర్య పోయాం.
కొండ అంచునే ఎడమ వైపు ఒక మలుపు తిరిగాం.
ఆ అంచునే జాగ్రత్తగా ముళ్ళ చెట్లను దాటుకుంటూ సాగుతున్నాం.
పై నుంచి జాలువారుతున్న జలపాతంతో చిన్న నీటిగండం.
అదే భరద్వాజ తీర్థం.

భరద్వాజ తీర్థం

కపిల తీర్థానికి పైనున్న తొలి నీటి గుండం అదే.
మళ్ళీ వెనక్కి వచ్చి, చెట్లు పట్టుకుని నిటారుగా ఉన్న కొండ ఎక్కుతున్నాం.
దూరంగా జలపాతపు హోరు వినిపిస్తోంది.
జలపాతం ఎక్కడా కనిపించడం లేదు.
దాని దరి చేరుతున్న కొద్దీ ఆ హోరు ఎక్కువవుతోంది.
మెలికలు తిరిగిన కొండ అంచునే జాగ్రత్తగా అడుగులు వేస్తూ సాగుతున్నాం.
ఎత్తైన చెట్ల మాటున మూడు పాయలుగా హలాయుధ తీర్థం దుముకుతోంది.

హలాయుధ తీర్థం ముందు ప్రకృతి ప్రియులు

దాని కింద ఉన్న పెద్ద నీటిగుండంలోపడి కిందకు జారిపోతోంది.
ఉదయం తొమ్మిదైంది.
ఒకరొకరు నీటి గుండంలోకి దూకేస్తున్నారు.
కేరింతలు కొడుతున్నారు.
జలపాతం కిందకు వెళ్ళిపోతున్నారు.
ఈదుకుంటూ, ఈదుకుంటూ జలపాతం కిందకు వెళితే, పై నుంచి పడుతున్న నీటి బిందువులు సన్నని వడగళ్ళు పడినట్టనిపించింది.
నీటి గుండం మధ్యలో నేను మునిగి మరెక్కడో తేలాను.
నేను మునిగిన దగ్గరే నీళ్ళలోంచి నాగిరెడ్డి బైటికొచ్చాడు.
‘హలో ఫ్రండ్స్.. హలాయుధ తీర్థం ఎంత మహిమ గలదో తెలుసా!
అరవై ఎనిమిదేళ్ళ మనిషి మునిగితే, ముప్పై ఏళ్ళ యువకుడిలా ఎలా బైటికొచ్చాడో చూడండి’ అంటూ మా ఇద్దరి వీడియో తీసి మధు ఒక చిన్న సరదా చేశాడు.
ఆ నీటి గుండంలో అంతా నవ్వుల పువ్వులు.
దీన్ని పోలిన ముళ్ళపూడి వెంకట్రమణ హస్యాం ఒకటి గుర్తుకొచ్చి చెప్పాను.
మెడిసిన్ చదువుతున్న ఒక విద్యార్థి పల్లెటూరి నుంచి వచ్చిన తన తండ్రిని కాలేజీని చూపడానికి తీసుకొచ్చాడు.
పాపం ఆ తండ్రి నగరానికి రావడం అదే తొలిసారి.
తండ్రి, కొడుకులు కాలేజీ పై అంతస్తుకు వెళ్ళాలి.
లిఫ్ట్ దగ్గరొచ్చేసరికి ఒక స్నేహితుడి కనిపిస్తే, కాసేపు అతనితో మాటల్లో పడ్డాడు.
ఆ తండ్రి చుట్టుపక్కల అంతా తేరిపార చూస్తున్నాడు.
లిఫ్ట్ లోంచి పైకి ఒక పెద్దావిడ వెళ్ళింది.
లిఫ్ట్ కిందకు దిగేటప్పుడు ఒక నాజూకైన విద్యార్థిని బైటికొచ్చింది.
లిఫ్ట్ చాలా వింతైన యంత్రం అనుకున్నాడు ఆ పెద్దాయనకు.
‘ఒరే అబ్బయా..అరెరెరే..మీ అమ్మను తీసుకురావడం మర్చిపోయాంరా’ అన్నాడు.
మళ్ళీ నవ్వులు పువ్వులు విరిసాయి.

యూరాలజిస్ట్ డాక్టర్ విజయ భాస్కర్

‘పాపం ఆ తండ్రి ఎంత మంచి వాడు! తన భార్యనే నాజూకు రూపంలో కోరుకున్నాడు కానీ, ఆ రూపంలో ఉన్న మరొకరిని కోరుకోలేదు కదా!’ అన్నారు డాక్టర్ ఉదయ భాస్కర్.

హాస్యం వెనుక కూడా ఎంత సంస్కారపు ఆలోచన!
డాక్టర్ విజయ్ భాస్కర్ ఆలోచించినట్టు నేనే కాదు, ఈహాస్య సృష్టికర్త
ముళ్ళపూడి వెంకట్రమణ కూడా ఆలోచించి ఉండకపోవచ్చు.
మా అమ్మ చివరి రోజుల్లో డాక్టర్ విజయ్ భాస్కర్ ఆస్పత్రికి వచ్చి వైద్యం చేశారు.
నేనొక్కడినే ఇంటి నుంచి టిఫిన్ తెచ్చుకున్నాను.
జలకాలాడుతుండగానే కార్తీక్ తో పాటు మరొకరు మళ్ళీ కొండ దిగి అందిరికీ టిఫిన్లు తీసుకొచ్చారు.
అంతా టిఫిన్లు ముగించుకుని మళ్ళీ కొండెక్కడం మొదలు పెట్టాం.
ఉదయం పదిగంటలవుతోంది.
తడిసిన గుడ్డలతో బ్యాగ్ మరింత బరువెక్కింది.
అతి కష్టం పైన కొంత దూరం మళ్ళీ కొండెక్కాం.
పై నుంచి జాలువారుతున్న నీళ్ళను దాటుకుని ఆవలకు చేరాం.
నీటి ప్రవాహం ఒకే విధంగా లేదు.
ఉన్నట్టుండి ప్రవాహం పెరుగుతోంది. మళ్ళీ తగ్గుతోంది.
తిరుమల కొండ పైన పడే వర్షాన్ని బట్టి ప్రవాహంలో ఈ హెచ్చుతగ్గులు.

తాడు పట్టుకుని కొండ దిగుతున్న సాహసం

మళ్ళీ కొండ అంచునే దిగుతున్నాం.
చాలా ప్రమాదకరంగా ఉంది.
కొండ అంచునే ఈ మూల నుంచి ఆ మూల వరకు తాడుకట్టారు.
ఆ తాడు పట్టుకుని ముందుకు సాగుతున్నాం.
రాతినేలంతా పాకుడు. జాగ్రత్తగా అడుగులు వేయాలి.
మరో జలపాతం వద్దకు వెళ్ళాలంటే అంచునే కొండ దిగాలి.

నిలువుగా ఉన్న రాతి కొండ దిగడం చాల కష్టం.
ఎక్కడా పట్టు దొరకడం లేదు.
పైన ఒక చెట్టుకు తాడుకట్టి కిందకు వదిలారు.
తాడు పట్టుకుని దాదాపు 20 అడుగులు లోపలకు దిగాం.

తాడు పట్టుకుని కొండ అంచున నడుస్తున్న వైనం

ఆ రాతి కొండలో ఒక మహాద్భుతమైన దశ్యం.
రాతి కొండ పై నుంచి కింద నున్న నీటి గుండంలోకి దుముకుతూ హోరెత్తుతున్న జలపాతం.
గుండం నుంచి, పెద్ద పెద్ద బండ రాళ్ళ మధ్య నుంచి కిందికి దుముకుతోంది.
మెలికలు తిరిగిన రాతి సందులోంచి రొద చేస్తూ సాగిపోతోంది.
మేం తాడుపట్టుకుని కిందకు దిగామా, కార్తీక్ మాత్రం పై నుంచే నీటి గుండంలోకి దూకాడు.

తాడు పట్టుకుని నీటి గుండంలోకి దిగుతున్న సాహసికుడు.

జలపాతంతో పాటు వచ్చి నీటి గుండంలో పడ్డాడు.
ఎంత సాహసం!
ఆ గుండంలో చాలా సేపు జలకాలాడాం.
అయినా ఎంత సేపుంటాం!
మళ్ళీ తాడుపట్టుకుని పైకి ఎక్కాం.
కాస్త కొండ ఎక్కితే చాలు, ఘాట్ రోడ్డు వచ్చేస్తుంది.
అప్పటికే మధ్యాహ్నం ఒంటి గంట దాటింది.
వచ్చిన దారినే ఒకరొకరం కొండ దిగడం మొదలు పెట్టాం.
పై నుంచే తిరుపతి నగరాన్ని చూశాం.
చుట్టూ ఉన్న కొండలు తిరుపతి నగరాన్ని తమ బాహువుల్లో భద్రంగా పొదుగుకున్నట్టున్నాయి.
కిందకు దిగేసరికి మధ్యాహ్నం రెండైంది.
అయిదు గంటలలో ఎంత కొండ ఎక్కాం!
ఎన్ని గుండాలను చూశాం!
కొండ అంచుల నుంచి ఎన్ని అందాలను వీక్షించాం!
మళ్ళీ ఎన్ని అనుభూతులను మిగుల్చుకున్నాం!

 

తిరుమల రెడ్డి

అందమైన రూపం..గుణాలు అపురూపం

అందమైన దస్తూరి గుణాల కస్తూరి కానవసరం లేదు.
గొప్ప రాత గాళ్ళు గొప్ప కూత గా ళ్ళు కాక పోవచ్చు.
అలాగే రూపంలో అందగాళ్ళు గుణాలలో అపురూపం అనుకోవడం పొరపాటే.
కానీ..
దస్తూరి గుణాల కస్తూరి అయితే!
రాత గాళ్ళు మంచి కూత గాళ్ళు అయితే!
అందగాళ్ళు కూడా గుణాలలో అపురూపం అయితే ఎంత బాగుంటుంది!
అలా రెండు లక్షణాలు కల గలిసిన అరుదైన వ్యక్తి తిరుమల రెడ్డి.
తిరుమల రెడ్డి ఎంత అందగా డో, అంత అమాయకంగా మాట్లాడుతాడు.
మనసులో ఏమీ దాచుకోడు.
“నాకు తెలుగు తప్ప యా బాషా రాదప్ప” అని అందరి ముందు కుండ బద్దలు కొడతాడు అచ్చమైన అనంతపురం జిల్లా పల్లె భాషలో.
కడుపులో దాపరికం పెట్టుకోకుండా గలగలా నవ్వే స్తాడు.
ట్రక్కింగ్ లో నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి నప్పుడు ‘థాంక్స్ ‘ అంటే ‘మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకు వెళ్లడం మా బాధ్యత సార్ ‘ అని కావిలించు కున్నాడు ఒక సారి.
ఆశ్చర్య పోయాను అతని మంచి తనానికి.
చివరికి ఫి దా అయిపోయాను.
కృత్రిమ దంతాలు కట్టి అమర్చడం అతని వృత్తి.
సాటి మనుషులను, అడివిని ప్రేమించడం అతని ప్రవృత్తి.

నిజానికి సినిమా లో హీరో లా ఉండే తిరుమలరెడ్డి ట్రకింగ్ లో , నిజ జీవితంలో మాత్రం నా నిజమైన హీరో.

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ట్రెకర్, రచయిత. తిరుపతి. మొబైల్ నం.9493226180

 

One thought on “కపిల తీర్థం సిగపై ఎన్ని జలపాతాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *