రాజకీయాలపై మీకున్న అవగాహన ఎంత?

-కమ్యూనిస్టులు ఎందుకు కన్పించడం లేదు
-ఇచ్చాపురం పేరు ఎందుకు మారిందీ?
-మిడ్తూరు ఎందుకు కనుమరుగైందీ?
-ఈ ప్రశ్నలకు జవాబే ‘1959 నుంచి 2019 వరకు

-అమరయ్య ఆకుల

ఇచ్చాపురం నియోజకవర్గం పేరు ఎన్నిసార్లు మారిందీ? పొందూరు అసెంబ్లీ ఏమైందీ? హరిశ్చంద్రపురం ఎందుకు రద్దయిందీ? సిర్వేరు, ఆత్మకూరు, మిడ్తూరు పేర్లు ఎప్పుడు మారాయి? ఇలా ఎన్నో నియోజకవర్గాలు కనుమరుగై మరెన్నో కొత్తవి వచ్చాయి. మనలో ఏ ఇద్దరం కలిసినా అలవోకగా మాట్లాడేవి రాజకీయాలే. కానీ ఏ నియోజకవర్గ చరిత్ర ఏమిటో, ఏయే వర్గాలకు ఎంతెంత పట్టుందో, ఎవరెవరు గెలిచారో చెప్పాలంటే మనకు సాధ్యపడే పనేనా? మామూలు జనం సంగతి పక్కన బెట్టినా రాజకీయ నాయకులకైనా తెలుసా? అంటే సమాధానం కష్టమే. సరిగ్గా ఈ దశలో ఆ కొరతను తీర్చాడో యువ జర్నలిస్టు మారిశెట్టి మురళీ కుమార్. ‘1952 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు?’ పేరిట ఓ పుస్తకమే తెచ్చారు.
….
గతం తెలియకుండా వర్తమానం అర్థం కాదు. వర్తమానం అర్థం కానిదే భవిష్యత్ ఆలోచన అందదు. ఒకప్పుడున్న నియోజకవర్గాలు ఇప్పుడు లేవు. ఇప్పుడున్నవి గతంలో లేవు. భవిష్యత్ లో ఉంటాయన్న నమ్మకమూ లేదు. ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత 2026లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. అప్పుడు ఇప్పుడున్న వాటిలో ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో చెప్పలేం.

నేటి తక్షణావసరం డేటా…….
ప్రస్తుతం నడుస్తున్నది సమాచార యుగం. ఇప్పుడు కావాల్సింది డేటా. ఈ డేటా ఉన్నవాళ్లు ఏ కొప్పు అయినా పెట్టగలుగుతారు. చేతిలో సమాచారం లేకుండా ఊకను ఊదినట్టు ఊదరగొడతామంటే ఈవేళ్టి జనరేషన్ ఒప్పదు. మెచ్చదు. అందుకే నేటి తక్షణావసరం సమాచారం. ఈ అవసరాన్ని రాజకీయ పార్టీలు బాగా గుర్తించాయి. మొన్నీమధ్య ముంబైలో జరిగిన విపక్షాల ఇండియా కూటమి సైతం సోషల్ మీడియా గ్రూపుతో పాటు రీసెర్చ్ విభాగాన్నీ ఏర్పాటు చేయాలని తీర్మానించడమే ఇందుకు నిదర్శనం.

ఆమధ్య ప్రముఖ సైఫాలజిస్ట్ ప్రదీప్ గుప్తా “ ఎవరు ఎన్నికయ్యారు: హౌ అండ్ వై “ అనే పుస్తకాన్నిరాశారు. భారతీయ ఎన్నికల ప్రక్రియ ఎంత సంక్లిష్టమైందో, అటువంటి వ్యవస్థను సైతం నిర్వీర్యం చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, తాయిలాలకు ఓటర్లు ఎలా ప్రభావితం అవుతారో, వారి అవసరాలు, కోర్కెల ఆధారంగా ఎలా నిర్ణయం తీసుకుంటారో ఈ పుస్తకం సమగ్రంగా వివరిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రదీప్ గుప్తా పుస్తకం ఎన్నికల్లో ఓటరు మనస్తత్వానికి అద్దం పట్టింది. రాజకీయ పార్టీల ఎత్తులు, పైఎత్తులు, ప్రచార వ్యూహాలు, ఓటర్ల ప్రవర్తన, ఎన్నికల్లో మీడియా, సాంకేతికత పాత్ర సహా గెలుపునకు సంబంధించిన అనేక అంశాలను ఈ పుస్తకం కవర్ చేస్తుంది.
ఏపీలోని 175 నియోజకవర్గాలకే పరిమితం….
అయితే మురళీ కుమార్ కొన్ని పరిమితులు విధించుకుని పుస్తకాన్ని రాశారనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత 175 నియోజక వర్గాలు, అవి మారుతూ వచ్చిన తీరును వివరిస్తుంది. ఏయే నియోజకవర్గాలలో ఏయే కులాల వాళ్లు ఎంతమంది ఉన్నారో, ఎప్పుడెప్పుడు ఎవరెవరు గెలిచారో చెబుతుంది. గతాన్ని అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది.
రాజకీయ విశ్లేషకులు, పాత్రికేయులు, పరిశోధకులు, రాజకీయ శాస్త్ర విద్యార్థులు, ప్రొఫెసర్లతో సహా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారందరికీ ఈ పుస్తకం ఓ రెడీరెకనార్ గా పనికి వస్తుంది. రాజకీయాలు, ఎన్నికలపై ఆసక్తి ఉన్న సాధారణ పాఠకులను కూడా ఈ పుస్తకం ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికల సంఘం సహా వివిధ సంస్థలు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారం ఈ పుస్తకం తయారైంది.
ఇలాంటి పుస్తకాలు ఇంతకు ముందు రాలేదా అంటే ఒకటీ అరా వచ్చి ఉండవచ్చు. మన జీవితంలో సగ భాగాన్ని ఆక్రమించిన రాజకీయాలు, ఎన్నికలపై ఇలాంటి ఎన్ని పుస్తకాలు వచ్చినా మంచిదే. దేని విలువ దానికి ఉంటుంది. ఈ పుస్తకాన్ని చూసినప్పుడు నాకు అనిపించిందేమిటంటే ఏపీ ఎన్నికల చరిత్రలోని కొన్ని చారిత్రక ఘట్టాలను ప్రస్తావించి ఉంటే బాగుండేది. ఉదాహరణకు 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులు ప్రతిపక్షం, ఆ తర్వాత రాష్ట్ర చట్టసభల్లో ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీలో కలికానికి కూడా కనిపించకుండా పోయారు. ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నామరూపాల్లేకుండా పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది. 42 లోక్ సభ సీట్లలో నంద్యాల తప్ప 41 చోట్ల గెలిచింది. తెలుగువాడి ఆత్మగౌరవం పేరిట ఎన్.టి. రామారావు పార్టీ పెట్టి మూడు నెలల్లో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ను మట్టికరిపించారు. మండల వ్యవస్థను తీసుకువచ్చారు. టీడీపీ నుంచి కేసీఆర్ బయటకు వచ్చి టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సాధించారు, ఇలాంటి అనేక ఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్నైనా మధ్య మధ్యలో ప్రస్తావించి ఉంటే- రిఫరెన్స్ పుస్తకంగా కాకుండా చదివించేలా ఉండేది. కనీసం ఎన్నికలకు సంబంధించిన మేలి మలుపులు, మూల మలుపుల్ని ప్రస్తావించి ఉండాల్సింది.

2031లోనే కొత్త నియోజకవర్గాల ఏర్పాటు…….
రాష్ట్రం విడిపోయింది. కొత్త నియోజక వర్గాలు కావాలన్న డిమాండ్ రెండు రాష్ట్రాల నుంచి వినపడుతోంది. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంపై వత్తిళ్లూ వచ్చాయి. అయితే ఇది అంత తొందరగా తెమిలే వ్యవహారం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం డీలిమిటేషన్ కు ఓ చట్టం ఉంది. 2002 తర్వాత 2026లో జరుగుతుంది. 2031 తర్వాతే కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఈలోపు రాజకీయ నాయకులు రాష్ట్రంలోని నియోజకవర్గాలపై అవగాహన పెంచుకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకునే బాధ తప్పుతుంది. అందుకు ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయి.

మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ తరఫున ప్రచురించిన ఈ పుస్తకం కావాల్సిన వారు నేరుగా మురళీ కుమార్ ను సంప్రదించవచ్చు. వెల రూ.750. ఫోన్ నెంబరు 9848353503

(అమరయ్య ఆకుల,జర్నలిస్టు, మొబైల్: 9347921291)

Regards
Amaraiah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *