శక్తినంతా కూడగడితేనే ‘శక్తి కటారి’కి ట్రెక్

 

– రాఘవశర్మ

శక్తికటారి తీర్థం

చుట్టూ ఎత్తైన పచ్చని కొండలు.
మధ్యలో విశాలమైన లోయ.
లోయలో నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపిస్తున్న జలహోరు.
ఎత్తైన రాతి కొండ పైనుంచి నిరంతరాయంగా దుముకుతున్న జలధార.
శేషాచలం కొండల్లో నక్కిన అరుదైన శక్తి కటారి తీర్థం.
ఎత్తైన ఆ కొండ పైనుంచి దుముకుతున్న ధార ఎంత రొద చేస్తోందో!
ఒక వింతైన జలసంగీతాన్ని వినిపిస్తోంది.
చుట్టూ పచ్చని కొండలు, కిందంతా రాతి నేల, తలెత్తితే ఆకాశమే తప్ప ఇక ఏమీ కనిపించని తాంత్రిక లోయ.
శక్తికటారి నుంచి వస్తున్న జలధార అంచెలంచెలుగా రాళ్ళ పైనుంచి దుముకుతూ, చిన్న చిన్న నీటి గుండాలను నింపుకుంటూ, ఒక్కో చోట ఒక్కో సంగీతాన్ని వినిపిస్తూ ముందుకు సాగుతోంది.
ఒక్కో దగ్గర సన్నని ఏరుగా ప్రవహిస్తూ, ఎత్తైన కొండ నుంచి జలపాతంలా దూకుతూ శక్తికటారి తాంత్రికలోయలోకి సాగుతోంది.
తాంత్రికలోయలోకి వెళ్ళాలన్నా, శక్తికటారిని చూడాలన్నా నిజంగా సాహసం చేయాల్సిందే.
దాదాపు నిటారుగా ఉన్న రెండు ఎత్తైన కొండలు ఎక్కి, రెండు లోతైన లోయల్లోకి దిగాలి.
అడవిలో ఏడు గంటలు నడవాలి.
పన్నెండు మంది కలిసి ఆదివారం ఈ సాహసం చేశాం.
మాతో ఒక యువ జంట కూడా వచ్చింది.
అసలు బయలు దేరే వరకు వెళ్ధామా, వద్దా అన్న సందిగ్ధమే!
ముందు రోజు రాత్రంతా కుంభవృష్టిగా వర్షం కురుస్తూనే ఉంది.
తెల్లవారు జామున నాలుగు గంట లకు కూడా వర్షం పడుతూనే ఉంది.
అయిదు గంటలకు మధు అందరికీ ఫోన్ చేసి ‘ఫాలోమీ’ అన్నాడు.
గంటలో తయారై అరుగంటలకల్లా అలిపిరికి వచ్చేశాం.
మాట్రెక్కర్లంతా కాలార్చకులు.
కాలానికి కళ్ళెం వేసేవాళ్ళు.
టైం అంటే టైమే.
అలిపిరి టోల్ గేట్ వద్ద అనుమతిం చేది ఆరుగంటల తరువాత.
మా వాహనాలు వాయువేగంతో ముందుకు దూసుకుపోతున్నాయి.
రాత్రి వర్షానికి ఘాట్ రోడ్డంతా తడిసి ముద్దైంది.
మలుపుల్లో మా బళ్ళు ఎక్కడ జారిపడతాయోనన్న భయం.
సన్నగా వర్షం పడుతూనే ఉంది.
ఏడుగంటలకల్లా తిరుమల చేరాం.
జైబాలాజీ కోసం, మరొకరి కోసం గోగర్భం డ్యాం వద్ద కాసేపు ఆగాం.
పాపనాశనం డ్యాం వద్ద మా వాహనాలు నిలిపేశాం.
ఏడున్నరకు డ్యాం దాటి మా నడక మొదలైంది.

సనకనందన తీర్థం

ఆకాశమంతా మేఘాలు అలుముకున్నాయి.
రాత్రంతా కురిసిన వర్షానికి అడివంతా తడిసి ముద్దయింది.
వర్షం తెరిపిచ్చినా, సన్నని చినుకు పడుతూనే ఉంది.
డ్యాం దాటి ఎత్తు ఎక్కాం.
కాస్త దూరం వెళ్ళగానే సనకసనందన తీర్థం.
సనకసనందన తీర్థంలో ఎప్పుడూ నిండుగా ఉండే రెండు నీటి చెలమల్లో సగం వరకే నీళ్ళున్నాయి.
రాత్రి పడిన వర్షం మినహా, ఆగస్టు అయిపోవస్తున్నా ఈ ఏడాది ఇంకా వర్షాలు మొదలవలేదు.
రుతుపవనాలక్కూడా సవతి బిడ్డలయ్యాం.
ఆకాశం మేఘావృతమైంది.
వాతావరణం చల్లబడిపోయింది.
సనకసనందన దాటి అడవిలో సాగుతున్నాం.
చుట్టూ దట్టంగా అడవి.
చలువ బండలదాకా వచ్చేశాం.
అక్కడనుంచి కాస్త ఏటవాలుగా ఉంది.
నేలంతా రాతి బండలే.
చుట్టూ చెట్లే.
ఎనిమిది గంటలకల్లా ఎత్తైన కొండ సానువులకు వచ్చేశాం.
కుడివైపున లోతైన పాపనాశనం లోయ వెంబడి వెళితే తుంబురు తీర్థం.
ఎదురుగా కొండ ఎక్కుతున్నాం.
ఆ కొండ ఎక్కి, లోయలోకి దిగితే రామకృష్ణ తీర్థంలోకి వెళతాం.
కాస్త కొండ ఎక్కగానే ఎడమవైపున సన్నని నడకదారి కనిపించింది.
అదే తాంత్రికలోయకు వెళ్ళే దారి.
ఆ కొండ నిటారుగా ఉంది.
ఈ మధ్య కాలంలో తాంత్రికలోయవైపు ఎవరూ నడిచిన ఆనవాళ్ళు లేవు.
గడ్డి, మొక్కలతో దారంతా పూడిపోయింది.
మెలికలు తిరిగిన దారి లో నిటారుగా కొండ ఎక్కడం నిజంగా సాహసమే.
రాత్రి పడిన వర్షానాకి జారుతోంది.
పక్కనున్న చెట్లను పట్టుకుని ఎక్కుతున్నాం.
ఎక్కడానికి శక్తి చాలడం లేదు.
అలసిపోతున్నాం.
అయినా వెళ్ళక తప్పదు.
కొండ నిటారుగా ఉంది.
ఎక్కే కొద్దీ ఇంకా ఉంది.
ఎక్కడా చెట్ల చివర్లలో ఆకాశం కనిపించడం లేదు.
రాత్రిపడిన వర్షానికి మంచి మాగుడు వాసన వేస్తోంది.
కబుర్లు చెపుతున్నారు.
కథలు చెపుతున్నారు.
చతురోక్తులు విసురుతున్నారు.
ఆ మాటల్లో అలుపును మర్చిపోతున్నాం.

ఫైర్ సేఫ్టీ వాల్ పై ప్రకృతి ప్రియులు

ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూస్తే దూరంగా పాపనాశనం డ్యాం కనిపిస్తోంది.
ఆ కొండ కొసకు చేరే సరికి గంటన్నర పట్టింది.
అప్పటికి రెండు గంటల నడక.
శక్తినంతా కూడగట్టుకుని కొండ ఎక్కాం.
శరీరానికి ఇందనం పడితే కానీ కాళ్ళు కదలనంటున్నాయి.
చెట్లమధ్యనే కూర్చుని తెచ్చుకున్న టిఫిన్లు చేశాం.
మళ్ళీ నడక.
అదిగో.. అదే ఫైర్సేఫ్టీ వాల్.
ఎక్కడైనా అడవికి నిప్పంటుకుంటే, మిగతా అడవికి పాకకుండా నాలుగడుగుల ఎత్తున పేర్చిన రాళ్ళ వరుస.
దాని అంచునే నడిచి, దాన్ని దాటి, మరికొంత దూరం దాని వెంటే నడిచాం.
అక్కడి నుంచి దిగువకు మా నడక.

కొండ ఎక్కు తున్న ప్రకృతి ప్రియులు

కాస్త ముందుకు వెళ్ళే సరికి లోయ
మొదలైంది.
లోయలోకి దిగుతున్నాం.
లోయంతా దట్టమైన అడవి.
ఆకాశం కనిపించడం లేదు.
అక్కడక్కడా ఎలుగు బంట్ల విసర్జితాలు.
దాని పచ్చిదనాన్ని బట్టి అవిక్కడ సంచిరిస్తున్నాయనిపించింది.
అక్కడక్కడా వాటి పాదముద్రలు.
మట్టి ఉన్నదగ్గర జారుతోంది.
రాళ్ళున్నదగ్గర పట్టు దొరుకు తోంది.
చెట్లు పట్టుకుని లోయలోకి దిగుతున్నాం.
అక్కడక్కడా చెట్లకున్న ముళ్ళు గుచ్చుకుంటున్నాయి.
దారి సరిగా లేదు.
‘కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి’ అన్న పాత కాలపు మాట గుర్తుకొచ్చింది.
కానీ చెట్టుపట్టుకున్నప్పుడు ఒక్కొక్క దగ్గర ఎర్రచీమలు కుట్టిపెట్టాయి.
అతి కష్టంపైన లోయలోకి దిగుతూ, జారుతూ, చెట్ల కొమ్మలు పట్టుకుని నిలదొక్కుకుంటూ సాగుతున్నాం.
దూరంగా సెల ఏటి శబ్దం మా చెవులకు సోకింది.
‘హమ్మయ్యా.. లోయలోకి వచ్చేశాం’ అనుకున్నాం.
అలా అనుకున్నాక కూడా చాలా సేపటికి కానీ లోయలోకి దిగలేకపోయాం.
లోయలో ఎడమవైపున కొండ అంచునే దిగుతున్నాం.
అదిగో.. దూరంగా శక్తికటారి తీర్థం.
లోయంతా ప్రతిధ్వనించేలా రొద చేస్తోంది!
శరీరమంతా చెమటతో తడిసిపోయింది.
వేసుకున్న బట్టలన్నీ నీళ్ళు కారుతున్నాయి.
శక్తికటారి కనిపించేసరికి బ్యాగులంతా నేలపైన పడేసి, ఆ జలధారకిందకు అంతా చేరారు.
ఆ లోయలో మా వాళ్ళ అరుపులు, కేరింతలు.
వీస్తున్న గాలి శబ్దం తప్ప, శక్తి కటారి నుంచి జాలువారుతున్న జలపాతపు హెూరు తప్ప ఏ శబ్దమూ ఆ లోయ లో వినిపించ డం లేదు.
మా అరుపులకు ఆ లోయకూడా విస్తుపోయినట్టుంది.

శక్తి కటారి ముందు ప్రకృతి ప్రియులు

ఎత్తైన రాతి కొండ.
దాదాపు వంద అడుగుల ఎత్తైన ఆ కొండపై నుంచి పడుతున్న జలధార.
జలధార దుముకుతున్న కొండ అంచు అంతా నల్లగా ఉంది.
ఆ నల్లని రాతి కొండ అంచుల మధ్యలో గోధుమ, గులాబీ రంగులు కలగలిసి వెలుగొందుతున్న కాశ్మీరు చిత్రపటం లా ఉంది.
ఆ నల్లని రాతి చుట్టూ గోధుమ వర్ణపు కొండ.
ఒక అందమై నైరూప్య చిత్రంలా అనిపిస్తోంది.
అర్ధచంద్రాకారంలో ఉన్న ఆ రాతి కొండ మధ్యలో దుముకుతున్న జలధార ముందున్న చిన్న రాతి గుండంలోకి పడుతోంది.
ఆ గుండం నాలుగైదడుగుల వెడల్పుంటుంది.
ఎంత లోతుందో తెలియదు.
మా వాళ్ళు ఒకరొకరు ఆ గుండంలోకి దూకారు.
దాదాపు ఏడడుగుల లోతుంది. అడుగున రాళ్ళున్నాయి.
అంతా ఒకరి తరువాత ఒకరుగా ఆ గుండంలోకి దూకారు.
కొందరు మునిగి కొన్ని రాళ్ళుపైకి తీశారు.
జలధారతో పాటు కొండ పైనుంచి రాళ్ళు పడుతున్నాయి.
అలా పైనుంచి పడ్డ రాళ్ళు ఈ గుండంలోకొచ్చి చేరుతున్నాయి.
ఆ రాళ్ళు పడకపోతే ఈ రాతి గుండం ఇంకా ఎంత లోతుండేదో!
దూరంగా కోతులు మా బ్యాగుల వైపు వచ్చేస్తున్నాయి.
ఆ బ్యాగులన్నిటినీ వెంటనే దగ్గరకు చేర్చాం.

శక్తి కటారి నుంచి తాంత్రిక లోయ లోకి సాగుతున్న నీటి ప్రవాహం

గంటన్నర పాటు జలధార కింద స్నానాలు చేశాం.
మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది.
దిగువనున్న తాంత్రిక లోయలోకి బయలుదేరాం.
శక్తి కటారి నుంచి అంతా రాతి నేల మెట్లు మెట్లుగా ఉంది.
ఆ మెట్లపైనుంచి ఆ జలధార దుముకుతూ ముందుకు సాగుతోంది.
రాళ్ళ పైనుంచి, వాటి సందులనుంచి, చిన్న చిన్న నీటి గుండాల లోకి దుముకుతోంది.
శక్తికటారికి దూరమవుతున్నాం.
తాంత్రికలోయలోకి ప్రవేశిస్తున్నాం.
లోయలో ఎటు చూసినా దట్టమైన అడవి.
మధ్యలో సెల ఏర్లు.
ఆ సెల ఏటిలో రాతి పక్కన ఒక పెద్ద కొండ చిలువ నక్కి ఉంది. పెద్దగా కదలడం లేదు.
కర్రతో కదిలించాం.
పాపం గాయపడినట్టుంది.
నీళ్ళలో మెల్లగా సాగిపోతోంది.

తాంత్రిక లోయ లో జలపా తానికి ఎదురుగా తాడు పట్టుకుని ఎక్కు తున్న ప్రకృతి ప్రియుడు

తాంత్రిక లోయలో రెండు ఎత్తైన కొండల నడుమ నుంచి శక్తికటారి తీర్థం ప్రవహిస్తోంది.
మా వాళ్ళంతా ఆ దారిన వెళ్ళారు.
గుండాలలో ఈదుతూ, జలపాతాలను చూస్తూ
ముందుకు సాగుతున్నారు.
తాళ్ళుకట్టుకుని జలపాతం దుముకుతున్న లోతైన గుండాలలోకి దిగారు.
దాదాపు యాభై అడుగుల లోతైన గుండంలోకి దిగి, అదేతాడుతో జలపాతం నుంచి పైకి ఎక్కగలిగారు.
నిజంగా ఇది సాహసమే.
నేనైతే జలపాతం నుంచి తాడుతో దిగగలనేమో కానీ, అలా తిరిగి ఎక్కలేను.
మిగతా అంతా పాతికేళ్ళనుంచి నలభై ఏళ్ళ మధ్యవయస్కులు.
కుమారధార నుంచి వచ్చిన ఏరు శక్తికటారి మీదుగా తాంత్రికలోయలోకి వచ్చి, రామకృష్ణ తీర్థంలో కలిసి, తుంబురు తీర్థంలోకి దుమికి అన్నమయ్య జిల్లా వైపు సాగుతుంది.
మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది.
అంతా తిరిగి వచ్చేశారు.
మధ్యాహ్న భోజనాలు ముగించుకుని పావుగంటలో మళ్ళీ మా నడక సాగించాం.
ఆరుగంటలలోపు ఘాట్ రోడ్డు టోల్ గేట్ కు చేరుకోవాలి.
చిరుతపులి భయంతో ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరుగంటల తరువాత ద్విచక్రవాహనాలను అనుమతించడం లేదు.
గబగబా నడిస్తే తప్ప చేరుకోలేం.
లోయలోకి దిగడం ఎంత కష్టమో, ఎక్కడం మరింత కష్టం.
ఈ తడవ జారడం లేదు కానీ వచ్చేటప్పటిలా వేగంగా ఎక్కడానికి శక్తి చాలడం లేదు.

కొండ దిగుతున్న ప్రకృతి ప్రియులు

లోయలోంచి మళ్ళీకొమ్మలు పట్టుకుని కొండ ఎక్కుతున్నాం.
కొండ ఎక్కేసరికి మధ్యాహ్నం మూడయింది.
ఫైర్ సేఫ్టీ వాల్ నుంచి మళ్ళీలోయలోకి దిగుతున్నాం.
మధ్యాహ్నం నుంచి ఎండ పడుతోంది.
నేలంతా తడి అరిపోయింది.
పొద్దున లాగా జారడం లేదు.
తెచ్చుకున్న నీళ్ళు అయిపోతున్నాయి.
కాస్త కాస్త తాగి గొంతు తడుపుకుంటున్నాం.

శేషాచలం కొండల్లో మాత్రమే పెరిగే సైకస్ బెడ్ డో మీ అనే ఫేర్న్

శేషాచలం కొండల్లో అరుదైన ఫెర్న్ ఉంది.
దీని శాస్త్రీయ నామం సైకస్ బెడ్డోమి.
ఇది శేషాచలం కొండలలో మాత్రమే ఉంది.
కొండ దిగే సరికి నాలుగైపోయింది.
చలువ బండల మీదుగా మళ్ళీ సనక సనందన వైపు మా నడక.
పాపనాశనం డ్యాం దాటేసరికి పావు తక్కువ అయిదైంది.
అనుకున్న సమయం కంటే గంట ముందే వచ్చేశాం.
మా వాహనాల్లో తిరుగుప్రయాణమయ్యాం.
అయిదు గంటలకల్లా తిరుమల టోల్ గేట్ దగ్గరకు వచ్చేశాం.
తిరుపతి చేరేసరికి సాయంత్రం ఆరుగంటలైంది.

తిరుపతి నుంచి తిరుమలకు పజ్జెనిమది కిలోమీటర్లుఘాట్ ప్రయాణం.
అక్కడి నుంచి పాపనాశనం డ్యాం వరకు మరో ఏడు కిలోమీటర్లు.
అంటే, వాహనాల్లో పోను 26 కిలో మీటర్లు, రాను 26 కిలోమీటర్లు.
పాపనాశనం నుంచి శక్తికటారికి కొండ ఎక్కడం, దిగడం అంతా మూడున్నర గంటల నడక.
తిరిగి రావడానికి కూడా దాదాపు అదే సమయం పుడుతుంది.
శక్తికటారి, తాంత్రికలోయ చూడాలంటే
ఏడుగంటల నడవాలి

శక్తికటారి, తాంత్రిక లోయను దశాబ్దం క్రితం చూసి వచ్చాను.
అప్పుడు తేలికగా వెళ్లగలిగాను.
పదేళ్ళ వయసు పెరిగింది.
అప్పుడున్న శక్తి ఇప్పుడెలా వస్తుంది!?
అప్పుడు ఘాట్ రోడ్డులో సమయ పరిమితులు లేవు.
తీరిగ్గా వెళ్ళి, తీరిగ్గా వచ్చాం.
ఇప్పుడలా ఉదయం ఆరుగంటలలోపు ద్విచక్రవాహనాలను ఘాట్ రోడ్డులోకి అనుమతివ్వరు.
మళ్ళీ సాయంత్రం ఆరుగంటలు దాటితే ఘాట్ రోడ్డులోకి ప్రవేశించ నీయరు.
వేగమైన నడకతో శరీరం కూడా బాగా అలిసిపోయింది.
ద్విచక్రవాహనం నడుపుతున్నా కాళ్ళు పట్టుకుపోయాయి.
ఇంత కష్టమైన శక్తికటారి, తాంత్రికలోయను మళ్ళీ మళ్ళీ వెళ్ళ లేనేమో అనిపించింది.
ఏమైనా మళ్ళీ ఒక గొప్ప అనుభూతిని మాత్రం మిగిల్చింది.

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, ట్రెకర్, రచయిత. తిరుపతి. మొబైల్ నం.9493226180

2 thoughts on “శక్తినంతా కూడగడితేనే ‘శక్తి కటారి’కి ట్రెక్

  1. సూపర్ రాఘవ శర్మ గారు…
    ఈ వయసులోనే ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నారంటే వయసులో ఉన్నప్పుడు మీరు ఎంత తులవో అర్థమైంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *