తెలంగాణలో బయటపడ్డ వెయ్యేళ్ళ నాటి శాసనం

1వ జగదేకమల్లుని కాలంనాటి కొత్త ఉమ్మెడ 
గణపతి గుండు శాసనం

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామం కాలభైరవస్వామి దేవాలయం సమీపంలో గణపతిగుండు మీద కళ్యాణీ చాళుక్యులనాటి శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు బలగం రామ్మోహన్ గుర్తించాడు.

రిషి ఖర్వాడ్ కర్, గుమ్మడి చంద్రశేఖర్, బుచ్చ సాయిరెడ్డి గారలు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకుని స్థానికుడైన కసిగంటి బొర్ర ముత్తన్న సహకారంతో శాసనం మీద పేరుకున్న సున్నాన్ని తొలగించి, శుభ్రపరచి, శాసనాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఈ శాసనాన్ని వెలికితీయడానికి గ్రామ సర్పంచ్ రాముడ పోశెట్టిగారు తోడ్పడ్డారు.
ఇటీవలనే ఆ ప్రాంతంలోనే త్రిభువనమల్ల 5వ విక్రమాదిత్యుని శాసనాన్ని గుర్తించి, పరిష్కరించడం జరిగింది.
3 అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పుతో 20 పంక్తులలో రాయబడి ఉన్న ఈ 2వ ఉమ్మెడ శాసనంలో 1వ జగదేకమల్లుని పాలనాకాలంలో శక సం.939, పింగళ సం. ఆశ్వయుజ శుద్ధ షష్టి ఆదివారం అనగా క్రీ.శ.1017 సెప్టెంబరు 29వ తేదీన మండలేశ్వరుడు కొంగుణవమ్మకు ధర్మువుగా మహారాజ గోపాలపురం నందగిరినాథునికి, మయూరపింఛధ్వజ లాంఛనం గల కుమారమల్లుడు, అంకకారుడు సోమరస యమ, నియమ, స్వాధ్యాయ, ధ్యాన, సమాధి సంపన్నుడైన ప్రసన్నాచార్యునికి గురుదక్షిణగా మెట్టభూమి, తరిభూమిని దానం చేసాడని వివరించబడ్డది.
అష్టాంగయోగ నిరతుడైన గురువు గురించి చెప్పే పంక్తులు బాసర కాలాహనుమాన్ శాసనంలో కూడా ఉన్నాయి. సాధారణంగా జైనగురువులను వర్ణించేక్రమంలో ఈ మాటలను పేర్కొంటుంటారు.
శాసనమున్న రాతిగుండుపైన గోడ, కప్పు కట్టడం వల్ల కొంత శాసనభాగం మరుగునపడిపోయింది.ఈ గుండు పై శాసనం కింద గణపతి, నాగ శిల్పం ఉన్నాయి.కుడి పక్కన రాష్ట్రకూట శైలి నాగ వీరుని శిల్పం ఉంది. ఇక్కడ స్థానిక ప్రజలు ప్రతిసోమవారం పూజలు చేస్తుంటారని తెలిసింది. ఈ గణపతి కుడివైపు తొండంతో రాష్ట్రకూటశైలిలో వున్నాడు. జైన గణపతి అనవచ్చు.

ఉమ్మెడ 2వ శాసన పాఠం:

1. శ్రీ…………..లస్సజ….
2. కామినిజన మో…న మణ్డల.. ……శ్రీ ..మహాద ప
3. …….క గుణత్రయాచరణ క..ల…….. స్వస్తి సమస్త భువనాశ్రయ…
4. …రాజధిరాజపరమేశ్వర పరమభట్టారక సత్యాశ్రయ కులతిలక చాళుక్యాభరణ శ్రీ
5. జ(గ)దేకమల్లదేవ చన్డ…గిరేవీఱల ద్విజయరాజ్యగేయ్యుత్తు….
6. ….న…………..సమనా (సలు)త్తమిరే స్వస్తిశక వరిస 939నేయ పింగళ
7. (సం)వత్సర ఐశ్వజ సుద్ద (6) ఆదిత్యవార స్వస్తి సమధిగత మహాశబ్ద..
8. ..మణ్డలేశ్వరం కొంగుణవమ్మ దమ్మ మహారాజం కొపాలపుర పరమి
9. ….నన్దగిరినాథం కంపి(బ)ళపఱి…….మయూరపింఛధ్వజ
10. ….చ లాంఛనం కొమ్వరమల్లం… మాణిక్యం గణ్డగుణ
11. చరణం జయదంకకాఱం శ్రీమత్సోమయ్యరస…స్వస్తి
12. యమనియమస్వాధ్యాయధ్యానసమాధి సంద
13. ….ప్ప…మత్ప్రసన్నాచార్య(గ్ల)జాద…..గేయోల్ గురుదక్షిణ
14. ట్ట భూమి పల..న్దయ్యదలకరియకేయిమే(గ్గ)…నాల్వత్ప్రపిరియ క
15. యిందంపదవలోకరియ ఈయి మత్త……క…కణకేఱై…
16. పే(పీ)ఱగేగఱ్ది మత్త…..కరచం మత్త…మంగళ మహాశ్రీ స్వదత్తం పరద
17. త్తాం వాయోహరంతు వసుంధర షష్టిర్వర్ష సహస్రాణి విష్టాయా జాయతి
18. ….మతిణిసముద్రవిషధరభువనంయేర చంద్రార్కతారాయావదం….
19. ..రతి మణికటా రిగ్యజుస్సామ…జాయ(వ)తి….. ప్రతినిధి
20. తి..రమర శ్రీగీతావతే శ్రీగంగసోమవిజయతే భువనేపూ……తేస్సమతి

క్షేత్రపరిశోధన, శాసనబింబ సాధన: బలగం రామ్మోహన్, 8074171309, కొత్త తెలంగాణ చరిత్ర బృందం
సహకారం: రాముడ పోశెట్టి(సర్పంచ్), రిషి ఖర్వాడ్ కర్, గుమ్మడి చంద్రశేఖర్, బుచ్చ సాయిరెడ్డి
శాసన పరిష్కరణ: శ్రీరామోజు హరగోపాల్, 9949498698, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *