బాల్యం..మరిచిపోలేని ఒక మందహాసం

వనపర్తి ఒడిలో-19

-రాఘవ శర్మ

రాధాకృష్ణులు తన్మయత్వంలో ఉన్నారు.
రాధ పైన కృష్ణుడు ఒరిగిపోయి ప్రేమగా చూస్తున్నాడు.
రాధ కూడా తదేకంగా చూస్తోంది.
వరండాలో కూర్చుని ఆ బొమ్మ వేస్తున్నాను.
ఆ సమయంలో మా నాన్న ఆంధ్రప్రభ పట్టుకొచ్చాడు.
అప్పుడేం జరిగింది!?
చిన్న బొమ్మను పెద్దదిగా వేయాలి.
ఎలా వెయ్యాలో వివిఎస్ మూర్తి నేర్పించారు గ్రాఫ్ పద్ధతిలో.
పాలిటెక్నిక్ సివిల్ విభాగంలో లెక్చరర్ ఆయన.
చిత్రకారుడేకాదు, వ్యంగ్య చిత్రకారుడు కూడా.
ఆయన వేసిన కార్టూన్లు ఆరోజుల్లో పత్రికల్లో వచ్చేవి.
అది 1970వ సంవత్సరం వేసవి కాలం.
కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు, సెలవుల్లో పొద్దస్తమానం బొమ్మలు వేయడమే.
బొమ్మ వేయడం పూర్తి కావచ్చింది.
కానీ, అది పూర్తి కాలేదు.
అదింక ఎన్నటికీ పూర్తికాదు.
“ఎప్పుడూ నీకు అమ్మాయి బొమ్మలేసుకోవడమే గతి.
చదువుకుని చావవు, నీ నెంబరు పేపర్లో లేదు. తప్పావ్” అని తిట్టి నా మొహాన పేపర్ విసిరి కొట్టి, మా న్నా విసవిస లాడుతూ లోపలికి కెళ్ళిపోయాడు.
‘ఏమైందండీ’ అంది మా అమ్మ వంటింట్లోంచి హాలులోకి వస్తూ.
‘ఇదిగో నీ సుపుత్రుడి నిర్వాకం, పదవ తరగతి తప్పాడు’ అన్నాడు మా నాన్న.
‘అమ్మాయిల బొమ్మలేస్తుంటాడు.
నీతో కలిసి పాటలు పాడుతుంటాడు.
బావుల్లో ఈతలుకొడుతుంటాడు.
నీఉన్నావుగా, వాణ్ణి వెనకేసుకు రావడానికి.
నువ్వే వాడిని చెడగొట్టావ్’ అంటూ మా అమ్మకు నాలుగు అక్షింతలు వేశాడు.
అంతే, జీవితంలో బొమ్మలేయడం ఆపేశాను, ఇంటర్ లో సైన్స్ బొమ్మలు తప్ప.
మా అమ్మ దగ్గర సంగీతమూ మానేశాను, గ్రామ్ఫోన్ రికార్డులు వినడం తప్ప.
అన్నట్టు మా అమ్మ పాటలు బాగా పాడేది.
చిన్నప్పుడు సంగీతం నేర్చుకుంది.
క్వార్టర్స్ లో ఎవరింట్లో పేరంటం జరిగినా ముందు మా అమ్మను పిలిచే వాళ్ళు.
‘విమలమ్మ గారు.. ఒక పాట పాడండి’ ఆనేవారు.
మా అమ్మ పాటతోనే పేరంటం మొదలయ్యేది.
నేను బాగా చిన్నగా ఉన్నప్పటి మా ట.
అమ్మ కొంగు పట్టుకుని నేను కూడా పేరంటానికి వెళ్లేవాణ్ణి.
స్కూలుకెళ్ళే వయసొచ్చింది.
‘ఏరా.. నీవు కూడా పేరంటానికి వచ్చావు’ అన్నారు నవ్వుతూ పద్మావతమ్మ.
అంతే నాకు చాలా సిగ్గనిపించింది.
స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టాక, మళ్ళీ మా అమ్మ వెంట పేరంటానికి వెళ్లలేదు.
సివిల్ విభాగాధిపతి కె.ఎల్. నరసింహం సతీమణి పద్మావతమ్మ.
మార్కుల జాబితా వచ్చింది.
హిందీలో మూడు మార్కుల్లో తప్పాను.
ఏ పరీక్ష తప్పితే ఆ పరీక్ష రాసుకునే కంపార్టు మెంటు విధానం ఆరోజుల్లో లేదు.
అన్ని పరీక్షలూ రాయాల్సిందే.
నాలుగు చదవకుండా, మూడు నుంచి అయిదులో వేయించాడు మా నాన్న.
టెన్త్ కు వయసు చాలకపోవడంతో ఒక ఏడాది ఎక్కువేయించాడు.
టెన్త్ తప్పడంతో చదువుకు వయసు సరిపోయింది.

టెన్త్ లో కాపీ కొట్టనీయలేదని మా సీనియర్లు ఇన్విజిలేటర్లను కొట్టారు.
దాంతో వనపర్తిలో టెన్త్ తప్పిన వారికి పరీక్షల సెంటర్ ఎత్తేశారు. సెప్టెంబర్లో గద్వాల వెళ్ళి టెన్త్ పరీక్షలు రాశాను.
ఆపక్షం రోజులూ స్నేహితులతో కలిసి ఒక రూంలో ఉన్నాను. పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం.
టెన్త్ కొచ్చినా ఈత రాదని స్నేహితులు ఎగతాళి చేసేవాళ్ళు. గద్వాలలో ఉన్నప్పుడే వాళ్ళు ఈత నేర్పించారు.
ఆరోజుల్లోనే ‘కథానాయిక మొల్ల’ సినిమా వచ్చింది.
అప్పటి వరకు పాటంటే ఘంటసాల పాటే పాట.
దానికి కాస్త భిన్నంగా తమాషా అయిన ఒక కొత్త గొంతు వినిపించింది.
ఆ గొంతు చాలా లేతగా ఉంది.
“మనిషినె బ్రహ్మయ్య.. మట్టితో చేసెనయా.. ఆడించుచున్నాడు బొమ్మలాగా.. నిజం తెలుసుకు మెలగాలి మనిషి లాగా.. ”
మా స్నేహితుల నోళ్ళలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు అలా మోగేది.
చలం ‘సంబరాల రాంబాబు’ సినిమా కూడా భలే ఉండేది.
బాలసుబ్రమణ్యం గొంతులో ఏదో ఒక కొత్త మాధుర్యాన్ని చవిచూశాం.
అక్టోబర్ నవంబర్లో టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి.
ఈ తడవ అన్నీ పాసయ్యాను కానీ, ఇంగ్లీషులో తప్పాను.
మా నాన్న దగ్గర మళ్ళీ అక్షింతలు.
అప్పుడే నాకు నిక్కర్ల నుంచి ప్యాంట్లకు ప్రమోషన్ వచ్చింది.
దాంతో నేను కూడా పెద్దవాడికింద లెక్కైపోయాను.
పరీక్ష తప్పితే తప్పాను కానీ ఈతొచ్చేసింది.
ఇంగ్లీషుకు ట్యూషన్ పెట్టించాడు మా నాన్న.
డబ్బూ డుబ్బూ లేదు.
పాలిటెక్నిక్ లో నే డీసీపీ విభాగం లెక్చరర్ చంద్రమౌళితో మానాన్నకు మంచి స్నేహం.
‘మా వాడికి ఇంగ్లీషు నేర్పించండి’ అన్నాడు మానాన్న.
సరే అన్నారు చంద్రమౌళి.
చంద్రమౌళి పొట్టిగా తెల్లగా ఉండే వారు.
ఆయన ఎంత సరదా మనిషంటే, ఎప్పుడూ నవ్వుముఖం.
సాయంత్రమైతే చాలు బ్యాట్మెంటెన్ ఆడే వారు.
నేను కూడా ఆయనతో అప్పుడప్పుడూ బ్యాట్మెంటన్ ఆడే వాణ్ణి
షాట్లు కొడితే ఆయనకు ఇష్టం ఉండేది కాదు.
అలా చాలా సేపు ఆడితే సరదాగా ఉంటుందనే వాడు.
సాయంత్రం ఆయనతో బ్యాడ్మింటన్.
భోజనం చేశాక రాత్రికి చదువుకోవడానికి వాళ్ళింటికి వెళ్లేవాణ్ణి.
వాళ్ళ పిల్లల్తో పాటు నేను కూడా వాళ్ళింట్లోనే పడుకుని పొద్దున్నే లేచి వచ్చేసేవాణ్ణి
ఇంగ్లీషు నేర్చుకోవడానికి చాలా తేలికైన విధానం చెప్పారు.
పాఠంలో అర్థం కాని ప్రతి పదానికి డిక్షనరీ చూసి తెలుగు అర్థం రాసుకోవాలి.
డిక్షనరీ చూడడం ఆయన నుంచే నేర్చుకున్నాను.
చాలా ఓపిగ్గా ఇంగ్లీషు చెప్పారు.
ఏదైనా ఇంగ్లీషు పదానికి అర్థం తెలియకపోతే, ఇప్పటికీ డిక్షనరీనో, గూగుల్నో చూడడం అలవాటు.
అలా చూసినప్పుడల్లా చంద్రమౌళి సారే గుర్తుకు వస్తారు.
ఇంగ్లీషు నేర్చుకోవడానికి మార్గాన్నిచూపిన చంద్ర మౌళి సార్ ను ఎలా మర్చిపోగలను!?
నేను చంద్రమౌళి సార్ ఇంట్లో పడుకున్నప్పుడే వారి సతీమణికి తేలు కుట్టింది.
ఆమె విలవిల్లాడిపోయింది.
చిన్న పిల్లలా ఏడ్చేసింది.
మళ్ళీ మార్చి పరీక్షలకు మహబూబ్ నగర్ సెంటర్ పెట్టుకున్నాం.
అక్కడొక రూం కిరాయికి తీసుకుని వంటవార్పు మొదలు పెట్టాం.
ఆ రూంలో నేను, లక్ష్మణాచారి ఉండే వాళ్ళం.
లక్ష్మణాచారి విష్ణుమూర్తి కొడుకు.

విష్ణుమూర్తి జెడ్పి బాలికల హైస్కూల్లో లెక్కల టీచర్.
ఆయన సతీమణి అలివేలమ్మ.
విష్ణుమూర్తి తమ్ముడు కంఠీరవాచారి జూనియర్ కాలేజీలో లెక్కల లెక్చరర్.
విష్ణుమూర్తి, అలివేలమ్మకు చాలామంది పిల్లలు.
వారిలో లక్ష్మణాచారి నా క్లాస్ మేట్.
వనపర్తి ప్యాలెస్ కట్టినప్పుడు, 1885లో సంస్థానంలో పనిచేయడానికి గుంటూరు నుంచి ఒక వైష్ణవ కుటుంబం వనపర్తి వచ్చింది.
ఆ కుటుంబం వనపర్తిలోనే స్థిరపడిపోయింది.
ఒక విచిత్రమేమిటంటే, వందేళ్ళకు పైగా వనపర్తిలో ఉంటున్నా ఆ కుటుంబంలో ఏ ఒక్కరూ స్థానికులను పెళ్ళి చేసుకోలేదు. అన్ని సంబంధాలు గుంటూరు జిల్లాతోనే.
చివరికి లక్ష్మణాచారి కూడా గుంటూరు అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు.
లక్ష్మణాచారితో రెండుమూడేళ్ళుగా ఫోన్ పలకరింపులు మొదలయ్యాయి.
దాదాపు ఏడాది క్రితం అతని ఫోన్ మూగవోయింది.
లక్ష్మణాచారి లేరని ఆయన భార్య ఫోన్ చేసేసరికి హతాశుడయ్యాను.
నేను చూడకుండానే నా బాల్య స్నేహితుడు వెళ్ళిపోయాడు.
మహబూబ్ నగర్లో నేను, లక్ష్మణాచారి నెల రోజులు వంట చేసుకుని పరీక్షలు రాసొచ్చాం.
ఈ తడవ గట్టెక్కాను.
టెన్త్ రిజల్ట్స్ రాగానే పాలిటెక్నిక్లో చేరడానికి మా నాన్న అప్లికేషన్ తీసుకొచ్చాడు.
తానే ఫిలప్ చేసి సంతకం చేయమన్నాడు.
‘నాది జనరల్ మేథమెటిక్స్ నాన్నా’ అన్నాను.
కాంపోజిట్ ఎందుకు తీసుకోలేదని మళ్ళీ..
ఆ రోజుల్లో కాంపోజిట్ లెక్కలు చెప్పడానికి మా హైస్కూలులో ఒకే ఒక్క టీచర్ రఘునాథ్ రెడ్డి.
తమ పిల్లవాడికి కాంపోజిట్ కావాలని తల్లి దండ్రుల నుంచి రాసి తెచ్చినవారినే కాంపోజిట్ సెక్షన్లో చేర్చుకునేవారు.
ఎనిమిదవ తరగతిలో చేరినప్పుడు ‘కాంపోజిట్ తీసుకోనా, జనరల్ తీసుకోనా నాన్నా’ అని అడిగాను.
కోపంలో ఉన్నాడు .
నాలుగు తిట్టి ‘ఏదో ఒకటి ఏడువ్’ అన్నాడు.
మా నాన్న లెటర్ ఇవ్వకపోవడంతో నన్ను జనరల్ లెక్కల్లో వేశారు.
టెన్త్ అయిపోయాక డీసీపీలో చేరమని చాలా మంది నా క్లాస్ మేట్ల కు చెప్పాను.
దాంతో చాలా మంది డీసీపీలో చేరారు.
నేను డీసీపీలో చేరతానంటే, ‘గుమాస్తా గిరి వెలగబెడతావా?’ అంటూ మానాన్న మళ్ళీ..
ఆయన దృష్టిలో పాలిటెక్నిక్ ఒక్కటే చదువు.
దాంట్లో కూడా మెకానికల్ ఇంజినీరింగ్ మాత్రమే గొప్పది.
సివిల్, ఎలక్ట్రికల్ కూడా ఆయనకు లెక్కలేదు.
నిజమే, పారిశ్రామికాభివృద్ధి జరిగితే మెకానికల్ ఇంజినీరింగ్ వారికి ఉద్యోగావకాశాలు ఉంటాయి.
స్వాతంత్ర్యం వచ్చిన రెండు దశాబ్దాల వరకు పబ్లిక్ రంగంలో పరిశ్రమలు వెలిశాయి.
ఆ తరువాత ఏదీ? పారిశ్రామిక రంగం గిడసమారిపోయింది.
ఉత్పత్తి రంగాన్ని ఉరితీసేశారు.

ఆరోజుల్లో ఇంటర్లో చేరాలంటే ‘డొమిసైల్’ సర్టిఫికెట్ అవసరం.
అది అంత తేలిక కాదు.
లక్ష్మణాచారి, నేను ముందు పట్వారి దగ్గరకు వెళ్ళాం.
మా నాన్న పదూళ్ళ పాపరాజు.
ఆయనకు ఊళ్ళో అందరితో పరిచయాలు.
కమాన్ అవతల ఉన్న పట్వారి ఇంటికెళ్ళి మా నాన్న పేరు చెప్పాను.
వెంటనే డొమిసైల్(శాశ్వత నివాస) సర్టిఫికెట్ కు సిఫార్సు చేస్తూ లేఖ ఇచ్చాడు.
దాన్ని తీసుకుని తైసిల్ ఆఫీసుకు వెళ్ళాం.
ఆరోజుల్లో తైసిల్ దార్ దర్శనం ఎంతో కష్టం.
తైసిల్దార్ దగ్గర ఉండే బిళ్ళ జమానును బతిమాలుకుంటే ఒక్క రోజులో తైసిల్ దార్ సర్టిఫికెట్ వచ్చింది.
తైసిల్ దార్ ఇచ్చిన సర్టిఫికెట్ ను చూసి కలెక్టర్ డొమిసైల్ సర్టిఫికెట్ ఇస్తాడు.
ఒక అయిదారుగురం కలిసి మహబూబ్ నగర్ వెళ్ళాం.
మాతో లక్ష్మణాచారి కూడా ఉన్నాడు.
కలెక్టరేట్ కు వెళ్ళి తాసిల్దార్  ఇచ్చిన సర్టిఫికెట్ సమర్పించాం.
‘దొర దౌరకోయిండు. సాయంత్రం రాపోండి’ అన్నాడు జమాను. సాయంత్రం వరకు ఏం చేయాలి? మహబూబ్ నగర్ రోడ్లన్నీ తిరిగాం.

‘పవిత్ర బంధం’ సినిమా పోస్టర్

 

‘పచ్చబొట్టు చెరిగిపోదూలే.. నా రాజా.. పడుచు జంటా విడిచిపోదూలే నా రాణీ..’ ఎక్కడికెళ్ళినా సినిమా బండిలో ఇదే పాట.
మాలో కొందరు కూనిరాగాలు.
‘పవిత్ర బందం’ సినిమా రిలీజైన రోజులవి.
నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరో హీరోయిన్లు,
ఆ పాట వింటూ దాంట్లో లీనమైపోయేవాళ్ళం.
వారి ఎడబాటు, మాకు విషాదంలా తయారైంది.
బాధతో గొంతు పూడుకుపోయేది.
‘పవిత్ర బంధం’ చూద్దామా? అప్పుడే రిలీజైన దేవానంద్ ‘జానీ మేరానామ్ చూద్దామా?’
మా లో పెద్ద పండిత చర్చ!
‘పవిత్ర బంధం’ వనపర్తిలో నైనా చూడచ్చు.
‘జానీ మేరా నామ్’ వనపర్తి కొచ్చేసరికి మనం ముసలోళ్ళమైపోతాం.
కాబట్టి జానీ మేరానామే చూద్దాం’ అన్నది ఎక్కువమంది వాదన.
మెజారిటీ ఈజ్ డెమాక్రసీ!
హెూటల్లో భోజనం చేసి అంతా మ్యాట్నీలో ‘జానీమేరానామ్’లో లీనమైపోయాం..
హేమమాలిని, దేవానంద్ జంట.
“ఓ.. ఓ.. మేరీ రాజా..
ఓ..ఓ.. మేరీ రాజా..
ఖఫాన హెూనా, దేర్ సే ఆయీ, దూరే సే ఆయీ” అని హేమమాలినీకి ఆశాభోంస్లే పాడితే,
“ఓ.. ఓ మేరి రాణి..
సమజ్ గయామై, వహీ పురానా, తేరే బహానా,’ అంటూ దేవానంద్ కు కిశో కిషోర్ కుమార్ పాడతాడు.
ఆ రోజుల్లో ఈ పాట కూడా మా వాళ్ళ నోళ్ళలో బాగా నానేది.
అప్పటి వరకు రఫీ, ముఖేష్ గొంతులకు అలవాటు పడ్డ మేం, కిషోర్ కుమార్ గొంతు కొత్తగా అనిపించింది.
అలాగే లతాజీ గొంతు బదులు ఆశాభోంస్లే గొంతు కూడా.
దేవానంద్, హేమామలిని ప్రేమ కథలో మునిగి తేలి, చెమటలు పట్టి, జిడ్డుఓడుతున్న ముఖంతో సినిమా హాలు నుంచి బైటికొచ్చాం

‘జానీ మేరా నామ్’ పోస్టర్

కలెక్టర్ ఆఫీసుకెళ్ళాం.
‘దొర దౌర కెళ్ళి ఇంకా రాలే’ అన్నాడు అటెండర్.
‘కల్ సుబే దస్ బజేకో ఆజావ్ బేటా’ అన్నాడు.
మా గుండెల్లో రాయిపడింది.
డొమిసైల్ సర్టిఫికెట్ తెచ్చుకోకుండా తిరిగెళితే ఇంట్లో ఎలా?
మళ్ళీ రేపు రావాలి. అందరి పరిస్థితి అదే.
తిరిగి వెళ్ళేచార్జీల వరకే డబ్బులు సరిపోతాయి.
ఉన్న డబ్బులు కాస్తా దేవానంద్ కాజేశాడు. ‘వీడి దుంప పిలకెయ్య’
‘జానీ మేరా నామ్’కు పెట్టాం.
రాత్రి ఎక్కడ ఉండాలి? ఏం తినాలి? అసలు ఎలా?
చార్జీలకు మిగలగా అందరి దగ్గరా ఉన్న చిల్లర పోగేశాం.
ఒక రోడ్డు పక్క హెూటల్ కు వెళ్ళాం.
తందూరి రోటీ తట్టి హెూటల్ అది.
తలా ఒక తందూరి రోటీ తిన్నాం. దాంట్లోకి నాన్ వెజిటేరియన్ సూప్ ఇచ్చాడు.
నేను, లక్ష్మణా చారి ఒట్టి రొట్టెలు తిన్నాం.
ఒక్కొక్క రొట్టెతిని కడుపు నిండా మంచి నీళ్ళు తాగాం.
చీకటి పడింది. పాలమూరు రోడ్లన్నీ తిరిగాం.
రోడ్లలో ఎన్ని కబుర్లు, ఎన్ని జోకులు.
ఆ ఆనందమే వేరు.

మహబూబ్ నగర్

రాత్రి తొమ్మిదవుతోంది.
ఎక్కడ పడుకోవాలి?
రోడ్లలో తిరుగుతుంటే పోలీసులు పట్టుకుంటారేమో!?
ఒక సత్రానికెళ్ళాం.
ఇస్త్రీ చేసుకుని వేసుకొచ్చిన ఫ్యాంటు, షర్టు విప్పి, మళ్ళీ ఇస్త్రీ మడతల్లా పెట్టి, కాగితంలో చుట్టి తలకింద దిండులా పెట్టుకున్నాం.
పొడుగు డ్రాయర్తో పడుకున్నాం.
కటిక నేల. నిద్రపడితేనా?
ఇక అర్ధరాత్రి చలి చంపేసింది. ఒణికి పోయాం.
కాళ్ళూ, చేతులు, కడపులోకి ముడుచుకుని పడుకున్నాం.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం.
ఎక్కడో కోడి కూత.
తెలతెలవారుతుంటే వేప చెట్టుపైనుంచి పక్షలు పలకరింపులు.
వేప పుల్లతో పళ్ళు తోముకుని, అక్కడ బావి దగ్గరే స్నానం చేశాం.
తుడుచుకోకుండా శరీరాన్ని ఆరపెట్టుకున్నాం.
ఆకలేస్తోంది.
ఆ స్నేహంలో ఆకలిని కూడా జయించాం.
బావి దగ్గర కడుపు నిండా మంచి నీళ్ళు తాగాం.
శరీరం ఆరాక, ఆ తడి డ్రాయర్పైనే ఫ్యాంటు షర్టు వేసుకుని కలెక్టరాఫీసుకు వెళ్ళాం.
కలెక్టర్ వచ్చేసరికి పొద్దుపోయిందట.
‘స్కూల్ పిలగాళ్ళు వచ్చిం డ్రనే కాడికి, దొర రాత్రే సంతకాలు పెట్టేశిండు’ అన్నాడు కలెక్టర్ జమాను.
డొమిసైల్ సర్టిఫికెట్లు తీసుకుని వనపర్తి బస్సెక్కాం.
ఇదొక మర్చిపోలేని బాల్య మందహాసం.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

3 thoughts on “బాల్యం..మరిచిపోలేని ఒక మందహాసం

  1. I really appreciate Raghava Sharma garu for his amazing reflections of his Wanaparthy series of memories. His narration is sweet, lucid and nostalgic…I always feel a kind of indescribable pleasure whenever reading his series of memories in such a beautiful backdrop…very few can perhaps distil in such a way from the swarming wavy emotional upsurge… Thank you Sir

  2. I am also from Wanaparthy and graduated from there and I spent my days right from birth till I completed my graduation and we had a medical shop in kaman area . Of course we don’t have any property in Wanaparthy but only memories . Raghava sharma garu when narrated his life in Wanaparthy I am reminded about my life there. We used to live in shankar gunj area . Now i have settled down in Hyderabad. I visit Wanaparthy very occasionally for functions like Marriages. It is so nostalgic all the childhood memories in Wanaparthy. Thanks sir for great narration.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *