‘వనపర్తి కోట్నీస్’ డాక్టర్ బాలకృష్ణయ్య

వనపర్తి ఒడిలో-18

-రాఘవ శర్మ

నేను ఇంటర్మీడియట్లో చేరాను.
ఇటు చేరానో లేదో వెంటనే జబ్బుపడ్డాను.
ఏ జబ్బు చేసినా ముందు గుర్తొచ్చేది డాక్టర్ బాలకృష్ణయ్యే.
బాపన గేరి (బ్రాహ్మణ వీ)లో డాక్టర్ బాలకృష్ణయ్య ఆస్పత్రి.
ఆ రోజుల్లో అది ఆస్పత్రిలా లేదు.
పాడు పడిన పాతకాలపు రాతి భవనంలా ఉండేది.
గుండ్రటి ముఖం, కళ్ళ జోడు, ఎత్తైన నల్లని దేహం, ఒత్తైన నల్లని జుట్టు.
రంగు ఫ్యాంటు పైన తెల్లని చొక్కా టక్ చేసుకుని మెడలో స్టెతస్కోపుతో కూర్చున్నాడు.
ఎలాంటి టెస్ట్ లు లేకుండా టైఫాయిడ్ అని తేల్చేశాడు.
‘చదువుకోవద్దు, పడుకో” అన్నాడు.
ఫీజు తీసుకోలేదు. మందులు రాసిచ్చాడు.
ఆరోజుల్లో టైఫాయిడ్ తగ్గడానికి నెలరోజులు పట్టేది.
ఈ రోజుల్లో వారం రోజుల్లో తగ్గించే మందులొచ్చాయి.
ఆ నెల రోజులు నా చదువు చట్టుబండలైంది.
తగ్గాక డాక్టర్ బాలకృష్ణయ్య దగ్గరకు మళ్ళీ వెళ్లాను.
“చాలా బలహీనంగా ఉన్నావు బాబూ.. రేప్పొద్దున మా ఇంటికిరా టానిక్ ఇస్తాను” అని కాయితం రాసిచ్చాడు.
మర్నాడు వాళ్ళింటికి వెళ్ళాను.
నా లాంటి వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు.
తలారా స్నానం చేసి, కారుతున్న నీళ్ళతోనే, తుచుడుకోకుండా, లుంగీ కట్టుకుని వరండాలోకి వచ్చేశాడు.
సీరియస్ గా ఉన్న రోగులను ముందు చూసి మందులు రాసిచ్చాడు.
ఈ లోగా స్నానం చేసిన తడి శరీరం కాస్తా ఆరిపోయింది.
ఒక్కొక్కరికి టానిక్ బాటిళ్ళు స్వయంగా ఇచ్చాడు.
అయిపోయిన అట్టపెట్టెలు బైటపడేస్తే ఒక చిన్న గుట్టై కూర్చుంది.
హైస్కూలు చదివేటప్పుడు నా తలకు బలమైన దెబ్బతగిలి మతిస్థిమితం తప్పింది.
మానాన్న నన్ను డాక్టర్ బాలకృష్ణయ్య దగ్గరకు తీసుకెళ్ళాడు.
ఇంజక్షన్లిచ్చాడు. మత్తుగా ఒక రోజంతా నిద్రపోయాను.
మర్నాటి నుంచి మామూలు స్థితికి వచ్చేశాను.
ఆయన చేతిలో ఏ మంత్ర దండం ఉందో తెలియదు.
స్టెతస్కోపే ఆయనకు మంత్ర దండం.
అదే ఆయన మెడలో వెలకట్టలేని హారం.
నాడి పట్టుకుని ఏం మాయ చేస్తాడో తెలియదు.
ఆయన చేయిపడితే జబ్బులు మాయమౌతాయి.
నిత్యం ఆయన చిందించే చిరునవ్వే రోగులపై చల్లే మంత్ర జలం.
డాక్టర్ బాలకృష్ణయ్య గురించి ఇది నా స్వీయానుభవం.

వనపర్తికి రెండు శాశ్వత చిహ్నాలు.
ఒకటి ప్యాలెస్, మరొకటి డాక్టర్ బాలకృష్ణయ్య.
ప్యాలెస్ రాచరిక వ్యవస్థకు చిహ్నం.
డాక్టర్ బాలకృష్ణయ్య ప్రజా పక్షానికి చిహ్నం.
ఉస్మానియాలో మెడిసిన్ రెండవ సంవత్సరం చదువుకుంటున్నప్పటి నుంచే వనపర్తిలో పేదలకు వైద్యం చేయడం ఆరంభించాడు.
1955లో మెడిసిన్ పూర్తి కాగానే వనపర్తిలో వైద్యవృత్తిని మొదలు పెట్టాడు.
రోగులు ఆస్పత్రికే కాదు, ఏ సమయంలో ఇంటికి వచ్చినా వైద్యం చేసేవాడు.
వనపర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాల ఆయన స్వగ్రామం.
చిట్యాలకు వెళుతున్నప్పుడు రైతులు చేయెత్తితే చాలు, కారు ఆపి వైద్యం చూసేవాడు.
‘మందులకి మా దగ్గర పైసలెక్కడున్నాయ్ సార్’ అంటే చాలు కార్లో మందులుంటే ఇచ్చేసేవాడు.
మందులు లేకపోతే జేబులోంచి డబ్బులు తీసిచ్చేవాడు.
అర్థరాత్రి వెళ్ళిఎవరు తలుపు తట్టినా లేచి వైద్యం చేసేవాడు.

అర్ధరాత్రి లేపితే నిద్రా భంగమని ఒక సారి భార్య అంజనీదేవి ఆయన్ని నిద్ర లేపలేదు.
రోగులు తెల్లారేవరకు ఆయన ఇంటి బయటే ఉన్నారు.
అది చూసి చలించిపోయి, వెంటనే వైద్యం చేశాడు.
నిజానికి కోపం అంటే ఏమిటో తెలియని వాడు.
“వాళ్ళ ప్రాణం కంటే నా నిద్ర నీకు ఎక్కువా?” అంటూ భర్యను వాళ్ళ ముందే మందలించాడు.
పేదలకు వైద్యం చేయడంలో ఆయనకు రాత్రి పగలు తేడాలేదు.
డాక్టర్ నార్మన్ బెతూన్, డాక్టర్ కోట్నీస్ ఆయనకు ఆదర్శం.
వారి అడుగుజాడల్లోనే నడిచాడు.
ప్రజల వద్దకే వెళ్ళి వైద్యం చేశాడు.
డబ్బున్న వారు పీజు ఇస్తే తీసుకునే వాడు తప్ప, అడిగే వాడు కాదు.
ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ బాలకృష్ణయ్య వనపర్తి కోట్నీస్.
జాతీయోద్యమ సమయంలో ఆయన గాంధేయ వాది.
తొలి నుంచి బాలకృష్ణయ్య పేదల పక్షపాతి.
బాలకృష్ణయ్య వచ్చేవరకు రాజకీయాల్లో రాజా రామేశ్వరరావు రాచరిక దర్పమే కొనసాగింది.

 

వనపర్తి రాజా రామేశ్వర రావు

చదువుకునే రోజుల్లోనే నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు.
స్వాతంత్రోద్యమ కాలంలో గాంధేయవాది.
కమ్యూనిస్టు పార్టీకి దగ్గరయ్యాడు.
బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి కమ్యూనిస్టు అగ్రనాయకులకు ఆయనిల్లే విడిది.
రాణి కుమిదిని దేవి భర్త రామ్ దేవ్ రావు దగ్గర డాక్టర్ బాలకృష్ణయ్య తండ్రి మహదేవ్ సింగ్ ఉద్యోగి.
కుమిదిని దేవికి వ్యతిరేకంగా డాక్టర్ బాలకృష్ణయ్య 1962లో శివారెడ్డికి మద్దతు తెలిపాడు.
మహదేవ్ సింగ్ ను పిలిచి నీ కొడుకును శివారెడ్డికి మద్దతు తెలపవద్దని చెప్పమని రామ్ దేవ్ రావు హెచ్చరించాడు.
తండ్రి చెప్పినా బాలకృష్ణయ్య వినలేదు.
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగానే ప్రచారం చేశాడు.
ఆ దెబ్బతో బాలకృష్ణయ్య తండ్రిమహదేవ్ సింగ్ ను రామ దేవ్ రావు ఉద్యోగం నుంచి తీసేశాడు.
డాక్టర్ బాలకృష్ణయ్య స్వతంత్ర అభ్యర్థిగా 1972లో అసెంబ్లీకి పోటీ చేసి 1600 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
ఈ ఎన్నికలకు ముందు రాజా రామేశ్వరరావు స్వయంగా డాక్టర్ బాలకృష్ణయ్యను పిలిపించి రాజకీయాల్లోకి రావద్దని, వైద్యం చేసుకోమని రాజీ యత్నం చేయబోయాడు.
బాలకృష్ణయ్య ససేమిరా అన్నాడు.
రాజకీయాల్లో తొలి నుంచి సంస్థానాదీశులకు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాడే తప్ప ఎక్కడా రాజీ పడలేదు.
1969లో వచ్చిన జై తెలంగాణా ఉద్యమాన్ని డాక్టర్ బాలకృష్ణయ్య సమర్థించలేదు.
సమైక్యవాదిగానే ఉండిపోయాడు.
చాలా మంది తెలంగాణా ఉద్యమకారులు కేసుల్లో ఇరుక్కోకుండా రక్షించాడు.
విమల, శాంతి అనే ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీచర్లను ఉద్యమకారులు వెళ్ళిపొమ్మని వారి పై దాడి చేయడానికి సిద్ధమైతే వారికి తన మిద్దె పైన గదిలోనే ఉండమని, వారికి రక్షణ కల్పించాడు.
ఎమర్జెన్సీలో చాలా మందికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు.
కోళోజి నారాయణ రావు, స్వామి అగ్నివేష్ వంటి వారితో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి.
జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, వరవరరావు, గద్దర్ వంటి విప్లవ రచయితలు, కళాకారులతో ఆయనకున్న సాన్నిహిత్యం వేరే చెప్పనవసరం లేదు.
కమ్యూనిస్టు పార్టీ చీలినప్పుడు ఆయన సీపిఎం వేపు వచ్చారు.
సిపిఎంలో చీలిక వచ్చినప్పుడు ఆయన విప్లవ కారులవైపే ఉన్నాడు.
అయినా సిపిఐ, సిపిఎం నాయకులతో సఖ్యత అలాగే కొనసాగింది.
దివి సీమ ఉప్పెన సమయంలో బియ్యం, డబ్బులు, బట్టలు సేకరించి పంపించాడు.
గద్దరు ను పిలిపించాడు.
చెరబండరాజు, జ్వాలాము ఖి, నిఖిలేశ్వర్, వరవరరావు, శివారెడ్డి వంటి వారిని పిలిపించి కవిసమ్మేళనం నిర్వహించాడు.
భారత-చైనా మిత్రమండలి కార్యదర్శిగాచేశాడు.

చైనాలో పర్యటించి ‘నా చైనా యానం’ రాశాడు.
వేమన పద్యాలంటే ఆయనకు ప్రాణం.
విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం బాగా చదివేవాడు.
మద్రాసులో శ్రీశ్రీ ఇల్లు తాకట్టు పెట్టి చాలా అప్పు చేశాడు.
అప్పు తీర్చలేక ఇల్లు వేలానికి వచ్చింది.
దాంతో శ్రీశ్రీ కుటుంబమంతా కుమిలిపోతోంది.
ఎవరికీ చెప్పుకోలేడు, ఎవరినీ డబ్బులడగలేడు.
ఈ విషయం ‘ఎన్ కౌంటర్’ పత్రికలో వచ్చింది.
బాగా చవువరి అయిన బాలకృష్ణయ్య మొదటి భార్య అంజనీ దేవి బాధపడుతూ ఈవిషయాన్ని భర్తకు చెప్పింది.
బాలకృష్ణయ్య వెంటనే శ్రీశ్రీకి సన్మానం చేసి సాయం చేద్దాం అన్నాడు.
శ్రీశ్రీ ని, ఆయన సతీమణి సరోజని వనపర్తికి పిలిపించి పెద్ద ఎత్తున సన్మానం చేశారు.
శ్రీశ్రీ కోసం వసూలు చేసిన పాతికవేల రూపాలిచ్చారు.
1982లో అది చాలా పెద్ద మొత్తం.
“ఈ సన్మానాన్ని నేను జ్ఞానపీఠంకంటే, నోబెల్ బహుమతికంటే మిన్నగా భావిస్తాను” అని శ్రీశ్రీ అన్నాడు.
శ్రీశ్రీకి, ఆయన సతీమణి సరోజకు, జ్వాలాముఖికి చిట్యాలలోనే వసతి కల్పించాడు.
అంటరానితనానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడాడు.
పేద విద్యార్థులెందరికో ఫీజులు కట్టి చదివించాడు.
హెూటల్నుంచి టీ ఇవ్వడానికి వచ్చిన పిల్లవాడిని గమనించి వివరాలడిగి, డబ్బులిచ్చి చదువుకోమని తిరిగి బెంగుళూరుకు పంపించాడు.
ఆ పిల్లవాడు చదువుకుని ఆ తరువాత పెద్ద ఆఫీసరయ్యాడు.
డాక్టర్ బాలకృష్ణయ్యకు ఇద్దరు భార్యలు.

చిన్న భార్య శంకరమ్మతో డాక్టర్ బాలకృష్ణ య్య

అంజనీదేవిని 1950లో, శంకరమ్మను 1957లో వివాహంచేసుకున్నాడు.
నేను చూసినప్పుడు పెద్ద భార్య కింది అంతస్తులో, పెద్ద భార్య పై అంతస్తులో ఉండేవారు.
వారిద్దరి మధ్య ఎప్పుడూ వివాదాలు తలెత్తలేదు.
అక్కాచెల్లెళ్ళలాగా ఉండేవారు.
డాక్టర్ బాలకృష్ణయ్యకు మొత్తం 16 మంది పిల్లలు
పెద్ద భార్యకు పది మంది పిల్లలు.
రెండవ భార్యకు ఆరుగురు పిల్లలు.
ఎమర్జెన్సీ అనంతరం జనతా పార్టీలో చేరాడు.
చివరికి ఎన్టీరామారావు పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి 1983లో శాసనసభకు ఎన్నికయ్యాడు.
చంద్రుడికీ కూడా ఒక మచ్చ అన్నట్టు, నిష్కలంకంగా బతికిన ఆయన రాజకీయ జీవితంలో తెలుగుదేశంలో చేరడం మచ్చగానే మిగిలిపోయింది.
1924లో పుట్టిన డాక్టర్ బాలకృష్ణయ్య 1997లో కన్ను మూశాడు.
ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు.


ప్రజాస్వామిక చైతన్యానికి ప్రతినిధి గా నిల బడ్డాడు.
ఆయనొక నడయాడే వైద్య శాలగానే బతికాడు.
తొలి నాళ్ళలో ఫ్యూడల్ సంస్థానం పెత్తనాన్ని బద్దలు కొట్టిన ఒక నిశ్శబ్ద విప్లవం డాక్టర్ బాలకృష్ణయ్య.

7 thoughts on “‘వనపర్తి కోట్నీస్’ డాక్టర్ బాలకృష్ణయ్య

  1. డా. బాలకృష్ణయ్య గారి స్మార్త సంచికను 2004లో నా సంపాదక త్వం లో వెలువరించడం జీవితంలో చేసిన మంచి రిటర్నరీ వర్క్స్ లో ఒకటి. ఈ సంచిక కోసం పనిచేసే సమయంలోనే సమాజం పట్ల వ్యక్తుల పట్ల కొత్తకోణంలో పరిశీలించి రాయడం నేను నేర్చుకున్నాను .అంత గొప్ప వాడి వారసత్వం నేడు కర్మలు కావడం బాధాకరం. మహామహుల ఆస్తులకు వారసులు పుట్టారు కానీ వారి ఆశయాలకు ఆలంబనగా నిలిచి ముందు తరాలకు వాటిని నడిపించే వారు పుట్టకపోవడం బాధాకరం.

    1. Hello Ramesh garu I am his son Dr.Sureshkuar, I myself question this almost daily for our inability to become like my dad but I agree with you 100%

  2. పౌర హక్కుల ఉద్యమం లో ఆయన పరిచయం కలిగింది.అలాగే భారత చైనా మిత్ర మండలి లోనూ.

  3. Now a days no doctor will do like this. Really down to earth personality. My Heartfull Namaskar to him Sir

  4. కర్నూల్ లో ఇలాంటి డాక్టరొకాయన ఉండేవారు. ఆయన పేరు వివి సుబ్రమణ్యం. ఎంతిస్తే అంతే ఫీజు లేదంటే రెండు రుపాయలు. సోషలిస్టు స్టడీ సెంటర్ పేరుతో కొంతమంది మిత్రులతోకలసి ఒక చిన్న లైబ్రరీ పెట్టినందుకు ఆయన్ని ఎమర్జన్సీ లో అరెస్టు చేసి జైలుకు పంపారు.జైలు నుంచి వచ్చాక ఎంబిబిఎస్ పూర్తి చేశారు. సైకిలే ఆయన వాహనం. తన దగ్గిర ఉన్నమందులను చుట్టూర పల్లెల్లో, పాఠశాలల్లో వైద్యశిబిరం పెట్టి ఉచితంగా పంచేవారు. ఒక సారి వచ్చిన రోగులను, డబ్బులేదని రావడం మానేయవద్దు అని సలహా ఇచ్చేవాడు. విరేచనాలకు టీ తాగండని సలహా ఇచ్చే వారు. ఖర్చు తక్కువ వైద్యం చేసే వారు. మధ్య మధ్య లో ఆయన ఆక్యుపంక్చర్ కూడా చేశేవారు.గ్రీటింంగ్ కార్డులు తయారు చేసి, వాటిన రోడ్డు మీద అమ్మి వచ్చినడబ్బుతోవైద్య శిబిరాలు నడిపే వాడు. పిల్లల్లో మూఢ నమ్మకాలు పోగొట్టేందుకు పాఠశాలల్లో హిప్నాటిజం, మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చే వాడు. ఇపుడాయన కొయంబత్తూరువెళ్లి అక్కడ స్థిరపడ్డారు. తమిళనాడు లో ఇపుడు ఆయన ఒక పేరున్న అంబేద్కర్ వాది.శర్మగారు మంచి డాక్టర్ గురించి రాశారు. ధన్యవాదాలు

  5. Yes its true we can never see him such person in life నన్ను ఈశ్వరలోంబ అని పిలిచేవారు డాక్టర్ గారు , మేము Pedda నాన్న అని పిలిచే వాళ్ళం మా కుటుంబం మొత్తానికి ఫ్రీ ట్రీట్మెంట్ చేసే వారు , మెడిసిన్స్ ఫ్రీ ఇంజక్షన్ కాంపౌండర్ రాములు గారు ఇచ్చే వారు . He is a great person. దేవుడు లాంటి వాడు . మా పెద్ద నాన్న A. లోకప్ప గారు watch repairer అరేయ్ ఒరేయ్ అని పిలుచు కొనే వారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *