జర్నలిస్టు రాయలసీమ శ్రీనాథ్ రెడ్డికి నివాళి…

 

వృత్తిని ఉద్యమంగా భావించి, సమాకాలీన ఉద్యమాలకు జర్నలిజాన్నిఅండగా నిలిపి రాయలసీమ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ఒక నాటి కడప ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ విలేకరి దేవిరెడ్డికి మిత్రులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నేతలు, మేధావులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.

రాయలసీమ ఉద్యమం చుట్టు అల్లుకు పోయిన నాలుగు దశాబ్దాల జర్నలిజం శ్రీనాథ్ ది. గతశుక్రవారం కడప జిల్లాపరిషత్ హాలులో  జరిగిన సంతాప సభలో వక్తలు శ్రీనాథ్ వృత్తి-ఉద్యమం గురించి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. జర్నలిస్టుగా లబ్దప్రతిష్టులైన వారెందరో ఉంటారు. అలాగే ఉద్యమకారులూ ఉంటారు. ఈ ఇద్దరు వేర్వేరు మనుషులు. కానీ శ్రీనాథ్ రెడ్డి అరుదైన కోవకు చెందిన జర్నలిస్టు-ఉద్యమకారుడని, అందుకే ఆయనఈ తరం జర్నలిస్టు ఆదర్శప్రాయుడని వక్తలు కొనియాడారు.

 

శ్రీనాథ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వాళులు అర్పించడంతో సభ ప్రారంభమయింది.

సీనియర్ జర్నలిస్టు వై. నాగిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.  తన విశ్లేషణల ద్వారా జర్నలిజాన్ని ఉద్యమానికి ఉతంగా మార్చిన వైనాన్ని నాగిరెడ్డి వివరించారు. సాటి జర్నలిస్టులకు ఆయన వృత్తిపరంగా ఎలా అండగా నిలబడింది వివరిస్తూ, జర్నలిస్టులు తమ నిష్పాక్షికంగా పనిచేసేందుకు అనువయిన వాతావరణం కల్పించేందుకు శ్రీనాథ్ కృషి చేస్తూ వచ్చారని అన్నారు.

 

దేవుల పల్లి అమర్

సభకు గౌరవ అతిధిగా హాజరైన రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు దేవుల పల్లి అమర్ మాట్లాడుతూ, శ్రీనాథ్ 25 సంవత్సరాలుగా కపడలో ఆంధ్ర ప్రభ, ఇంయన్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధిగా చిన్న మచ్చ లేకుండా పనిచేశారని అన్నారు. వృత్తిపరంగా పదోన్నతులు వచ్చినా వాటిని  తిరస్కరించి కడపను ప్రేమించిన వ్యక్తిగా జిల్లాకే పరిమితం  రాయలసీమ అభివృద్ధి,సంక్షేమంపై దృష్టి సారించి  రాయలసీమ ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచారని, రాయలసీమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని అన్నారు.  పాత్రికేయ మిత్రులు ఫ్యాక్షన్, రాజకీయ, ఇరిగేషన్  ఎన్నికల వార్తలు… ఏవార్త రాయాలన్నా అనుభవజ్ఞడైన శ్రీనాథ్ మార్గదర్శకంగా ఉండేవారని  అని అన్నారు.  శ్రీనాథ్ జర్నలిస్టుగా అందించిన సేవలు చిరకాలం గుర్తుండేలా యోగివేమన యూనివర్శిటీజర్నలిజం కోర్సులో అత్యధిక మార్కులు  సాధించిన విద్యార్థికి స్వర్ణపతకం ఏటాఅందించడం సరైన నివాళి అని,  స్వర్ణ పతకం ఏర్పాటుచేసేందుకు ఆయన మిత్రులు  శ్రేయోభిలాషులు కృషి చేయాలని చెబుతూ  దానికి తన వంతు సాయం చేస్తానని అమర్ హామీ ఇచ్చారు.

డా. ఎం వి మైసూరా రెడ్డి

 

మాజీ మంత్రి డా. ఎంవి మైసూరా రెడ్డి మాట్లాడుతూ శ్రీనాధ్ రాయలసీమ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారనిఅన్నారు. శ్రీనాథ్ తో పాటు దుర్గాప్రసాద్, వెంకటరత్నం, ఎర్రగుంట్లవంటిసీనియర్ జర్నలిస్టులు ఎటువంటి జంకుగొంకు లేకుండా రాయలసీమ సంక్షేమం, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టి విశేషంగా కథనాలు రాసేవారని అన్నారు.  నాడు చేపట్టిన ఉద్యమం వల్ల తెలుగుగంగ, బ్రహ్మం సాగర్, గండికోట, సర్వరాయ సాగర్, వామికొండ, హంద్రీనీవా ప్రాజక్టులు నిర్మాణమయ్యాయని అన్నారు. నాడు జరిగిన అభివృద్ధి పనులకు  శ్ర్రీనాథ్ చేసిన కృషి విశేషమైనదని అన్నారు.

కె రామచంద్రమూర్తి

ప్రముఖ  పాత్రికేయులు కె  రామచంద్రమూర్తి మాట్లాడుతూ శ్రీనాథ్ 1978లో బెంగుళూరు ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ గా వృత్తిప్రారంభించారని, ఆతర్వాత  కడపకు బదిలీ అయ్యి, రాయలసీమ ప్రజలసమస్యలను,  పత్రిక ద్వారా రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అవిపరిష్కారమయ్యే విధంగా ఎలా పని చేస్తూ వచ్చింది వివరించారు. మూర్తి తన అనుభవాల ద్వారా శ్రీనాధ్ ప్రాంతీయ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు.  రాయలసీమ ప్రజలకు ఆయన కొండంత అండగా నిలిచారని అంటూ జర్నలిజం ద్వారా ఆయన చేసిన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు సార్లు పెస్ అకాడమీ ఛెయిర్మన్ గా నియమించారని  మూర్తి తెలిపారు. ఈ విషయంలో అయిష్టంగా ఉన్న శ్రీనాథ్ ను తాను ఒప్పించి ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లానని మూర్తి గుర్తు చేశారు. వృత్తి పరంగా అద్భుతంగా రాణించి ఆదర్శ జర్నలిస్టుగా నిలిచారని అన్నారు.

 


శ్రీనాథ్ రెడ్డి గురించి…

కడప జిల్లా సింహాద్రి పురం మండలం కోవరంగుట్టు పల్లెలో 1957 ఆగస్టులో దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జన్మించారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఆంగ్ల సాహిత్యంలో పిజి చేశారు. 1978లో ఆంధ్రప్రభసబ్ ఎడిటర్ గా బెంగుళూరు ఎడిషన్ చేరారు. 1980లో ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టర్ గా కడపలో బాధ్యతలు స్వీకరించారు.  దాదాపు 25 సంవత్సరాలు విలేకరిగా పనిచేశారు. ఎపియూనియన్ ఆఫ్  వర్కింగ్ జర్నలిస్ట్స్ జిల్లా కడప జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగాపనిచేశారు. 1983 నుంచి 1980 దాకా సాగిన రాయలసీమ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అనారోగ్యంతో మార్చి 22న మరణించారు.


సిహెచ్ చంద్రశేఖర రెడ్డి

రాయలసీమ కార్మిక కర్షక  సమితి అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ  రాయలసీమ లో ప్రాజక్టులు నిర్మాణం కావడంలో శ్రీనాధ్ జర్నలిస్టుగా విశేష  పాత్ర పోషించారని అన్నారు. రాయలసీమకు జరిగిన అన్యాయం, ఎడారిపరిస్థితులను, ప్రాంతీయ అవసరాలను ప్రతిక ద్వారా చాటి చెప్పడంలో, ప్రజలను  చైతన్య వంతం చేయడంలో జర్నిలిస్టుగా శ్రీనాథ్ విజయవంతమయ్యారని అన్నారు.

కాంగ్రెస్ నేత డా. ఎన్ తులసిరెడ్డి

పిసిసి మీడియా ఇన్ చార్జ్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి మాట్లాడుతూ  జర్నలిజంలో నిజాయితీగా , నిరాడంబరంగా నిర్భయంగా శ్రీనాథ్ రెడ్డి పని చేశాడని కొనియాడారు. శ్రీనాథ్ మాటల మనిషికాదు, చేతల మనిషి, రాజకీయ చాణక్యుడని అన్నారు.

ఉమ్మడి కడప జిల్లా జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ అప్పట్లో  ఆంధ్రప్రభ కార్యాలయం రాయలసీమ ఉద్యమానికి చిరునామాగా ఉండిందని,తాను యువజన కాంగ్రెస్  అధ్యక్షుడిగా పనిచేస్తూ శ్రీనాథ్ సూచనలు , సలహాలు తీసుకునేవాడినని అన్నారు.

వేదిక మీద…

సిపిఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్, రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, టిడిపి నాయకుడు ఎన్ గోవర్ధన్ , నాటి కడప ఈనాడు విలేకరి ఆదినారాయణ  తదితరులు ప్రసగించారు. పలు ప్రాంతాలనుంచి జర్నలిస్టు మిత్రులెందరో కార్యక్రమానికి హాజరయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *