జర్నలిస్ట్ జగన్నాథనాయుడికి శ్రద్ధాంజలి

టి. లక్ష్మీనారాయణ

రైతాంగ సమస్యల పట్ల నిరంతరం ఆవేదన చెందుతూ, కేంద్ర – రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన సీనియర్ పాత్రికేయుడు, వృత్తి పట్ల అంకితభావం – నిజాయితీ గల చిరకాల మిత్రుడు పాశం జగన్నాథనాయుడుగారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.

నిన్న రాత్రి తిరుపతికి చేరుకొన్న కొద్దిసేపటికే సీనియర్ జర్నలిస్ట్, మిత్రులు లక్ష్మణ్ గారు వాట్సాప్ లో మెసేజ్ పంపారు. అటుపై ఫేస్ బుక్ లో పలువురు మిత్రుల పోస్టులు చూశాను. ఇటీవల కాలంలో రెండు, మూడు సార్లు జగన్నాథనాయుడుగారు ఫోన్ చేసి మాట్లాడారు. విజయవాడలో ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పి, రాలేకపోయారు. తరచూ వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపేవారు. కలుసుకొన్న సందర్భంలోను, ఫోన్ లోను, వాట్సాప్ మెసేజెస్ లోను, నన్ను “నాయకా” అని అప్యాయంగా సంబోధించే వారు. ఆయన మరణ వార్త
జీర్ణించుకోవడం కష్టమే. ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయాను.

తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు మంజునాథ్, మధుగార్లతో కలిసి ఈ రోజు ఉదయం తిరుచానూరుకు సమీపంలో ఉన్న జగన్నాథనాయుడుగారి స్వగ్రామం పచ్చికాల్వకు వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించాను. ఆయన సతీమణి, కుమారుడు రంజిత్, ఇతర బంధు, మిత్రులకు నా సానుభూతి తెలియజేశాను.

జగన్నాథనాయుడుగారి కుమారుడు రంజిత్ మాటలు నన్ను కలచి వేశాయి. “అంకుల్…నాన్నగారి మరణానికి దారితీసిన పరిస్థితి మరొకరికి రాకుండా నివారించాలి”. మీ మిత్రులందరికీ తెలియజేయాలి అన్నాడు. జగన్నాథనాయుడుగారు షుగర్ వ్యాధికి గత నవంబరు నుండి హెర్బల్ ట్రీట్మెంట్ తీసుకొంటున్నారు. అంతకు ముందే గుండె జబ్బుకు చికిత్స చేయించుకున్నారు. “స్టంట్ ” కూడా వేయించుకున్నారు. మందులు వాడుతున్నారు.

కానీ, హెర్బల్ ట్రీట్మెంట్ మొదలు పెట్టాక షుగర్ సమస్య బాగా కంట్రోల్ అయ్యిందన్న విశ్వాసం ఆయనలో బలపడింది. ఆధునిక మందులు తినడం ఆపేశారు. షుగర్ సమస్య పరిష్కారమయ్యిందనే సంతోషాన్ని మిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా వాట్సాప్ ద్వారా తెలియజేశారు. నాకు కూడా ఆ మెసేజెస్ పంపారు. వాళ్ళ కుమారుడు రంజిత్ గూగుల్ సెర్చ్ చేసి, సైడ్ ఎపెక్ట్స్ ఉంటాయని హెచ్చరించాడట. వాటికి సంబంధించిన సమాచారాన్ని తండ్రికి పంపాడు. కానీ, జగన్నాథనాయుడుగారు వాటిని “ఫేక్ న్యూస్ ” కొట్టిపారేశారు. పర్యవసానంగా ప్రాణం మీదికి తెచ్చుకొన్నారు. మూడు రోజుల క్రితం మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకొని, తిరిగి ఇంటికి వచ్చారు. నిన్న రాత్రి గుండె పోటుతో మరణించారు.

తండ్రి మరణంతో దుఃఖంలో ఉన్న రంజిత్ ఇలాంటి విషాదకరమైన అనుభవం మరొక కుటుంబానికి ఎదురుకాకూడదన్న మనోవేదనతో నాతో ఆ వివరాలు పంచుకొని, పది మందికి తెలియజేయమని కోరాడు. ఆ మాటలు నన్ను చలింప చేశాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *