నవోదయ- ఒక పుస్తక చైతన్యం

(భూమన్)

హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఆర్య సమాజం ఎదురుగా ఉన్న నవోదయ పుస్తక షాపుకు పోయి రావడం నాకు ఒక వ్యసనం. 1971లో కోటి చౌరస్తాలో నవయుగ బుక్ షాపు ఉండేది . నవయుగ సాంబశివరావు ఆ దశకంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వామపక్ష సభలు , సమావేశాలు జరిగిన పుస్తకాల అంగడి పరిచేవాడు. అప్పటినుండే నాకు పరిచయం .

 

ఆ షాప్ లో దాదాపు అన్ని పొలిటికల్ మ్యాగజైన్స్ దొరికేటివి. నేను జ్వాల, నిఖిల్ తరచూ వెళ్లి రావడం గుర్తుంది . తిరుపతిలో మాకు అట్లాంటి సదుపాయం ఉండేది కాదు. ఆ రోజుల్లో పుస్తకాల కోసం మద్రాసు టి . నగర్ లో ఉన్న రాణి బుక్ స్టాల్ కు , విజయవాడలో నవోదయకు , త్రిపురనేని మధుసూదనరావు పిల్చుకు పోయేవారు. మా ఊళ్లో బాలాజీ బుక్ షాప్ మా అడ్డ . పుస్తకాల షాపు యజమాని తిరుమల రావు గారు పచ్చి సాంప్రదాయవాది. ఆయన్ని ఒప్పించి కొన్ని పుస్తకాలు తెప్పించి అమ్మ బెట్టేవాళ్ళం . కొన్నాళ్ల మా పరిచయంతో ఆయన పబ్లిషర్ గా ‘లే ‘ ‘విప్లవం వర్ధిల్లాలి’ కవితా సంకలనాలు, కె.వి.ఆర్ ఎర్రపిడికిలి, త్రిపురనేని మధుసూదనరావు కవిత్వం , చైతన్యం ముద్రింపజేసినాము. ఆ రోజులు అలాంటివి. ఆ మనుషులు చైతన్యవంతులు.

ఆ దశాబ్దం ఎంతో కల్లోల మైన మానవత్వపు పరిమళాలతో విరజెల్లేది. అదిగో ఆ రోజుల్లో నవయుగ లో పని చేసే కుర్రాడు సాంబశివరావు జార్జిరెడ్డి సంస్మరణి సభలో పుస్తకాలు అమ్ముతూ చైతన్యం పొందినవాడు. 1990లో నవయుగ నుండి బయటకొచ్చి కాచిగూడ, ఆర్య సమాజం వీధిలో నవోదయ బుక్ షాప్ తెరిచి నిరాఘటంగా పుస్తక పరిమళాన్ని వెదజల్లుతున్నాడు. అక్షర జ్ఞానాన్ని పదిమందికి చేరవేస్తున్నాడు.

ఈ డిజిటల్ యుగంలో పుస్తకానికి ఎంత మాత్రము ప్రాధాన్యత తగ్గటంలేదని ధీమాగా నమ్మబలుకుతున్నాడు . పుస్తకం సజీవంగా చిరకాలం ఉంటుందని భరోసా ఇస్తున్నాడు. నవయుగ సాంబశివరావు అన్నయ్య గారి కూతుర్లు ని పెళ్లిళ్లు చేసుకున్న కోటీశ్వరరావు, సాంబశివరావు సౌమ్యులు . ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ , ఎప్పుడు పోయినా నా అభిరుచికి తగ్గ పుస్తకాలనందిస్తూ ముచ్చట పడిపోతుంటారు .

2000 సంవత్సరం మొదటి వరకు రకరకాల MAGAZINES వచ్చేటివి. వాటికోసం అంత దూరం వచ్చి కొనుక్కునేవాడ్ని. అన్ని రకాల వామపక్షాల పుస్తకాలు అందుబాటులో ఉండేటివి. ఉద్యమ వెనుకబాటు, చీలిక పేలికలు పుస్తకాల షాపులో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాది. ఆ రకపు పుస్తకాలేవీ లేవు ప్రస్తుతం. ఉద్యమం వెనకబడ్డం, పుస్తకాల కొనుగోలు, అలనాటి అభిరుచులు గురించి సాంబశివరావు చెబుతుంటే ఆశ్చర్యమనిపించింది. అతడొక ప్రత్యక్ష సాక్షి అక్షర ప్రయాణంలో , అయినా దిగుల్లేదంటారు. పాత వారి పుస్తకాలు బాగా కొంటున్నారని ప్రస్తుతం సినిమా కథల కోసం కొనే వారి సంఖ్య రెట్టింపయిందని అంటున్నాడు . కాకపోతే విప్లవ చైతన్యపు అగ్నిశిఖల అక్షరాలనీ కోల్పోతున్నామని వాపోతున్నాడు.

నవోదయ అంటేనే మంచి అభిరుచి. ఘన చరిత్ర కలిగిన ఈ షాపు ఇప్పుడు రెండు షాపులయ్యి మొదటి షాపు పెంచునికుని గురజాడ, శ్రీశ్రీ, చలం కొడవటి గంటి, రావి శాస్త్రులను స్మరించుకుంటూ,రంగనాయకమ్మ నామిని ,ఖాదీర్ ,స్వామి, సన్నపురెడ్డి , పేట శ్రీ తిరుపతి కతలు లాంటి వాళ్ల ప్రస్తావన తీసుకొస్తూ “మీ రాయలసీమకు సంబంధించిన” పుస్తకాలు అదిగో వాళ్ళ సంఖ్య పెరుగుతుందని చెప్పినప్పుడు కాసింత గర్వంగా అనిపించింది.

కమ్యూనిస్టు సాహిత్యమంతా మొదలై ఇప్పుడు కొత్త అంగడిలో సాంప్రదాయ పుస్తకాలు అమ్ముతున్న నవోదయలో ఆ చైతన్యం మసకబారలేదు. నవయుగకు సుందరయ్య , సి .కె లాంటి వాళ్లు వస్తే మా ఈ షాపుకు బాపు, రమణ ,చంద్ర రాజేశ్వరరావు లాంటి ప్రముఖుల ఎందరో వచ్చి ఉన్నారని గర్వపడతాడు . ఇప్పుడైతే రచయితలు, కవులు షాపుకు రావడం తగ్గింది కానీ, ఒకప్పుడు అనేక మంది కి ఇది అడ్డ .

వ్యాపారం కన్నా మంచి పాపులారిటీతో వెలుగొందిన నవోదయ అంటే ఇష్టపడని పాఠకుడు లేడు.
అప్పుడప్పుడు పుస్తకాలు ప్రచురిస్తు అమ్మడం, చదువరులకు అక్షర చైతన్యం పెంచడంలో విశేషమైన కృషి చేస్తున్న సాంబశివరావు ఈ పుస్తక ప్రపంచంలోకి అడుగుపెట్టి 50 ఏళ్లకు పైబడింది. ‘పుస్తకాల అమ్మకం ఎట్లుందంటే’ అప్పట్ల అంటూనే ఈ రచయితలు, కవులు మిగిలిన వాళ్ళ పుస్తకాలు కూడా కొని చదవగలిగితే 5000 అమ్మకానికి లోటేమి లేదంటాడు. అసలు రచయిత తన పుస్తకం తానే చదవటం తగ్గిపోయి చాన్నాళ్లయింది కదానంటే నవ్వుతాడు.
పుస్తకాలు ఉచితంగా ఇవ్వటం, అమ్మకాల్లో రచయిత శ్రద్ధ వహిస్తూ పుస్తకాలు విరివిగా నలుగురికి చేర్చుతామంటున్నాడు. 7 కోట్ల మంది తెలుగు చదువరుల్లో పుస్తకాలు కొనేవాళ్ళు 1000 మందికి పైగా లేరనంటే తెలుగు జాతికి సిగ్గుగా లేదా?

(భూమన్ రచయిత, రాయలసీమ ఉద్యమకారుడు)

One thought on “నవోదయ- ఒక పుస్తక చైతన్యం

  1. సార్…
    మీరు కనపరచిన పుస్తక ప్రేమకు శత కోటి వందనాలు…నేటి తరం వారికి పుస్తకాల విలువను గూర్చి ,వాటితో అనుబంధం వున్న వాళ్ళ గూర్చి చక్కగా చెప్పారు…పుస్తకాల పల్లకీ మోస్తున్న మీరు మాకు గురువులు కావడం మా అదృష్టం…అద్భుతంగా రాశారు సార్…😃

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *