G-20 మీద ఇంత ఆర్భాటం అవసరమా!!

-టి. లక్ష్మీనారాయణ

జీ -20 దేశాల గ్రూపుకు ఏడాది పాటు అధ్యక్ష స్థానంలో కూర్చొనే అరుదైన (రొటేషన్ పై లభించిన) అవకాశం లభించిందని జబ్బలు చరుచుకోడం వల్ల ఒనగూడే ప్రయోజనమేంటి!

గ్రూపులోని మిగిలిన సభ్య దేశాలన్నీ ఈ పదవిని అలంకరించాయి. దీని వల్ల వాటికి జరిగిన మేలెంటో వాస్తవిక దృష్టితో ఒక్కసారి అధ్యయనం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. జీ – 20 పై మన దేశానికి ఉన్న దృక్పథం – విజన్ పై కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనలతో ఏమైనా విధాన పత్రం రూపొందించి, దానిపై ప్రతిపక్ష పార్టీలతో చర్చించిందా అంటే అదీ లేదు.

అయినా, 2023లో జీ -20 సమావేశం నిర్వహణపై రాజకీయ పార్టీలతో దేశ ప్రధాని మోడీగారు సంప్రదింపులు చేయడం మంచిదే! మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. పార్లమెంటు సమర్థవంతంగా పనిచేస్తే, మన ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టవంతం అవుతుంది. కానీ, పార్లమెంటు పని విధానం జుగుప్సాకరంగా తయారయ్యింది.

లోక్ సభలోని మొత్తం స్థానాల్లో 10% స్థానాలు లేవని ప్రతిపక్ష పార్టీ గుర్తింపు నిరాకరించిన స్థితి. రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులను సహితం రాజ్యసభ, లోక్ సభలో అలా ప్రవేశపెట్టి, ఇలా ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదముద్రతో అమలులోకి వచ్చేస్తున్నాయి. వ్యవస్థలన్నీ బలహీనపర్చబడుతున్నాయన్న తీవ్ర ఆందోళన దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నది.

ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడిందని, వ్యవసాయ రంగం – ఉత్పత్తి రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, దేశం కోటి యాభై ఐదు లక్షల కోట్లకుపైగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ద్రవ్యోల్బణం అదుపు తప్పిందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుల వెన్ను విరుగుతున్నదని, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని, నిజ వేతనాలు పడిపోయాయని, ఉపాధికల్పన లేదని, పెద్ద నోట్ల రద్దు – కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బతో దేశ ప్రజలు కోలుకోలేని దుస్థితిలో ఉన్నారని, ఆర్థిక వేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్యలు – సవాళ్ళపై కూడా ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని, జవాబుదారీతనంతో, పారదర్శకంగా సంప్రదింపులు చేసి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో మోడీగారు పూనుకుంటే అభినందించవచ్చు.

దేశ భవిష్యత్తును నిర్ధారించే మౌలికమైన సామాజిక – ఆర్థిక – రాజకీయ విధానాల రూపకల్పనలో చట్ట సభల్లోను, బయట చర్చలు – సంప్రదింపులు చేయకుండా ప్రచార ఆర్భాటంతో “జీ -20″కి రొటేషన్ పద్ధతిలో అధ్యక్ష స్థానాన్ని పొంది, వచ్చే ఏడాది ఆతిథ్యం ఇచ్చే అంశంపై సమాలోచనల వల్ల దేశానికి వనగూడే ప్రయోజనం ఏంటో! జీ -20 దేశాలన్నింటికన్నా మానవాభివృద్ధి సూచికల్లో మన దేశం అట్టడుగున ఉన్నది. దానిపై దృష్టి కేంద్రీకరించి, నేటి పోటీ ప్రపంచంలో పైకి ఎదిగే ప్రయత్నానికి సంకల్పబలంతో పూనుకోవాలి.

T Lakshminarayana
T Lakshminarayana

(టి. లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *