శ్రీశ్రీ విప్లవ గేయాలను ‘కోట్’ చేస్తున్నది ఎవరంటే…

-టి లక్ష్మీనారాయణ

చారిత్రాత్మకమైన శ్రీకాకుళం జిల్లా గిరిజన రైతాంగ సాయుధ పోరాటం దోపిడీకి సమాధి కట్టడానికి సాగించిన విప్లవోద్యమం. “భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం”, సాగించిన వీరోచిత ఉద్యమానికి పురిటిగడ్డ. మహాకవి శ్రీశ్రీ పుట్టిన గడ్డ కూడా. కానీ, నేడు ఆ ఉద్యమ పోరాట స్ఫూర్తిని, శ్రీశ్రీ విప్లవ గేయాలను “కోట్” చేస్తున్నది ఎవరంటే దోపిడీదారులే.

నేటి సమాజంలో దోపిడీదారులే ఘరానా పెద్దమనుషలుగా చలామణీ అవుతున్నారు. దశాబ్దాలుగా వాళ్ళే అధికారాన్ని అనుభవించారు. అధికార దుర్వినియోగానికి బరితెగించి పాల్పడ్డారు. సహజ వనరులను కొల్లగొట్టారు. భూకాబ్జాలకు పాల్పడ్డారు. అవినీతి – అక్రమాలతో సంపదను పోగేసుకొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను నిలువు దోపిడీ చేశారు, చేస్తున్నారు. నేడు అధికార దాహంతో, కుటిల రాజనీతిని ప్రదర్శిస్తూ, ప్రాంతీయ విద్వేషాలకు విషభీజాలు నాటి, తమ దోపిడీని యధేచ్చగా కొనసాగించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇప్పటికే రెండు ముక్కలై రోదిస్తున్న తెలుగు జాతిని కుల – ప్రాంతీయతత్వాలను రెచ్చగొట్టి కుక్కలు చింపిన విస్తరిలా చేయడానికి బరితెగించారు.

నిరక్షరాస్యత – నిరుద్యోగం – ఆకలి మంటలు ఉత్తరాంధ్రలో ఎందుకున్నాయని, వెనుకబాటుతనానికి పాలకుల వివక్షతే కారణమంటూ గొంతులు చించుకొంటున్న ఈ ఘరానా పెద్దమనుషుల మాటలు, “దయ్యాలు వేదాలు వల్లించినట్లు” అన్న నానుడిని గుర్తు చేస్తున్నాయి.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉద్యోగాలు రాకుండా, ఉపాధి లేకుండా, పరిశ్రమలు రాకుండా చేయడం వల్ల ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి గురయ్యిందట. నిజమే! ఆ మాటల్లో పాక్షిక సత్యం ఉన్నది. ఉత్తరాంధ్రను ఒక ప్రాంతంగా పరిగణలోకి తీసుకున్నప్పుడు వెనుకబడిన ప్రాంతమే. ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో రాయలసీమ – ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. దాన్ని హక్కుగా సాధించుకొని, అమలు చేయించుకోవాలి.

అదే సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలలో విశాఖ జిల్లా చిన్నది. మహానగరం. పారిశ్రామిక నగరం. ఆర్థిక నగరం. ఉపాధికల్పనా నగరం. దాదాపు రు.2,10,000 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్న విశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి గర్వకారణమైన మహానగరం. ఈ వాస్తవాన్ని కూడా విస్మరించకూడదు.

యావత్తు తెలుగు జాతికి విశాఖపట్టణం గర్వకారణమైనది. అందుకే, “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అంటూ నినదిస్తూ, తెలుగు నాట మహోద్యమాన్ని నిర్వహించి, 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో పొందుపరచిన “రైల్వే జోన్” ను విశాఖలో నెలకొల్పడానికి ప్రతిపాదిస్తే ముక్తకంఠంతో అందరూ ఆమోదించారు. చరిత్ర పుటలను తిరగేస్తే 1926లో ఆంధ్రా విశ్వవిద్యాలయం కేంద్ర స్థానాన్ని మొదట విజయవాడలో నెలకొల్పారు. అటుపై, ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని విశాఖకు తరలిస్తే ఎవ్వరూ వ్యతిరేకించలేదు. విశాఖ మహానగరం అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ సమాజం మొత్తం కలలుకంటున్నది.

చరిత్రను, భౌగోళిక – సామాజిక – ఆర్థిక పరిస్థితులను వాస్తవిక దృష్టితో పరిగణలోకి తీసుకోవడానికి ఇష్టపడని దుష్టశక్తులు, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఏ మాత్రం గౌరవంలేని వారు, “కేసీఆర్” వారసులకు మన ఆంధ్రప్రదేశ్ సమాజంలో కొదలేవలేనట్లున్నది! తస్మాత్ జాగ్రత్త!

T Lakshminarayana
T Lakshminarayana

(టి. లక్ష్మీనారాయణ, కమ్యూనిస్టు – సామాజిక ఉ్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *