నూతన శకం లోకి సిపిసి ప్రయాణం

 

డాక్టర్. యస్. జతిన్ కుమార్

చైనా అభివృద్ధిని తదుపరి దశకు తీసుకు వెళ్ళే విధానాలు రూపొందించుకోవటానికి  చైనా  కమ్యూనిస్ట్  పార్టీ (సిపిసి) 20 జాతీయ కాంగ్రెస్  అక్టోబర్ 16 నుండి  సమావేశ మవుతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయ కాంగ్రెస్ ప్రపంచ స్థాయిలో  అత్యంత ముఖ్యమైన రాజకీయ సంఘటన గా భావించ బడుతున్నది . మహాసభ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైన క్షణంలో వస్తున్నది. అమెరికా నుండి పెరుగుతున్న దురాక్రమణ, రష్యాతో సంబంధాలు, తైవాన్ పునఃసమ్మేళనం నేపథ్యంలో చైనా స్థానాన్ని సభ నిర్వచిస్తుంది. ఇప్పటి వరకు కొరోనా మహ మ్మారి నియంత్రణపై అంచనా వేయడంతో పాటు జీరోకోవిడ్ పాలసీకి సంబంధించి కొత్త ఆదేశాలు కూడా వస్తాయని భావిస్తున్నారు. సాధారణంగా కాంగ్రెస్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈసారి  సిపిసి జాతీయ కాంగ్రెస్ కు 2,296మంది ప్రతినిధులు హాజరవు తున్నారు,వారి సగటు వయస్సు 52.2సంవత్సరాలు.ప్రతినిధులలో 33.6% మంది వివిధ పరిశ్ర మలకు,ఉత్పత్తి రంగాలకు చెందిన కార్మికులు,11.5% మంది 40 అల్పసంఖ్యాక జనజాతి సమూహాలకు చెందినవారు,27% మంది మహిళలు ఉన్నారు.  వీరందరూ పాల్గొనే సభ పార్టీ కేంద్ర కమిటీని ఎన్నుకుంటుంది, వారు 25 మంది సభ్యుల పొలిట్ బ్యూరోను, చివరకు అత్యున్నత సంస్థఅయిన స్థాయీ సంఘాన్నిఎన్నుకుంటారు. ఇది జిన్ పింగ్ నాయకత్వాన్ని పునరుద్ఘా టిస్తుందని భావిస్తున్నారు. మావో జెడాంగ్ తర్వాత అప్పటిలా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మూడో సారి ఎన్నికవుతారని భావిస్తున్నారు. “కొత్త శకానికి చైనా లక్షణాలతో సోషలిజంఅనే జిన్ పింగ్ ఆలోచన మార్గదర్శకత్వంలో కాంగ్రెస్  ప్రతినిధులు ఎన్నుకోబడ్డారు .ఒక వంక అమెరికా నాయ కత్వంలోని సామ్రాజ్యవాద కూటమి ప్రపంచంలోని  ప్రతి చిన్న వివాదాన్ని రెచ్చగొట్టి యుద్దం వైపు లాగుతూ వుంటే, చైనా అండరి భాగస్వామ్యం గల సుందర భవిష్యత్తు నిర్మాణానికి ఉమ్మడి అంత ర్జాతీయ సమాజాన్ని ప్రతిపాదిస్తున్నది. 150 కోట్ల చైనా ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే జాతీయ కాంగ్రెస్ చైనానాయకత్వానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ విధానాలను ఈసందర్భం లో మననం చేసుకోవటం, అభివృద్ధి పధానికి చైనా చేసిన  ప్రత్యేక, ప్రత్యామ్నాయ కూర్పులను పరిశీలించటం ఉపయోగకరంగా  వుంటుంది .   

 2021నాటికి అన్నివిధాలా ఒక మోస్తరుగా సంపన్నమైన సమాజాన్ని [జియావోకాంగ్] నిర్మించా లనే తన మొదటి శతాబ్ది లక్ష్యాన్నిసాధించిన తరువాత మహాసభ జరుగుతోంది. 2049 నాటికి సంపన్నమైన, బలమైన, ప్రజాస్వామిక, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన, సామరస్య పూర్వకమైన ఆధునిక సోషలిస్టు దేశాన్నినిర్మించాలనే రెండవ శతాబ్ది లక్ష్యాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. 1921 లో సిపిసి స్థాపన నుండి, అర్ధ వల ,అర్ధ భూస్వామ్య సమాజంగా  వున్న అణచివేతను త్రోసివేసి జనతా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి  చైనా ప్రజలకు  రెండు దశాబ్దా లకు పైగాపట్టింది.1949 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించారు .1978లో సంస్కరణలను ప్రారంభించి, చైనాప్రజల నిరంతర ప్రయత్నాల ద్వారా, తూర్పున గల  ఒక పెద్ద, పేద వెనుకబడిన దేశం అన్న ముద్రను చెరుపుకొని అభివృద్ధి చెందుతున్న సోషలిస్ట్ చైనా గా పరివర్తన చెందడానికి  చైనా కృషిచేసింది. గత 100 సంవత్సరాలలో చైనా సాధించిన గొప్ప విజయాలను ప్రశంసించిన తరువాత, అంతర్జాతీయ సమాజం మరింత సంక్లిష్టమైన అంతర్జాతీయ వాతావరణంలో కొత్త అద్భుతాన్ని ఎలా సృష్టిస్తున్నదో నిశితంగా గమనిస్తోంది. చరిత్ర ఎల్లప్పుడూ భవిష్యత్తు విజయ రహస్యాలను గర్భంలో దాల్చి వుంటుంది కనుక , మొదటి లక్ష్యాన్ని సాధించడానికి చైనా ప్రజలను సిపిసి ఎలా నడిపించిందో సమీక్షించడం కూడా అవసరం.

తూర్పుచైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ లోని జియాక్సింగ్ అనేనగరం, “తప్పక సందర్శించ వలసిన” ప్రదేశంగా మారింది. జియాక్సింగ్ లోని నాన్హు సరస్సు ఒడ్డున లంగరు వేసి  ఒక  ఎరుపు పడవలో, చైనా అంతటా గల 50 మందికి పైగా  సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న13 మంది- వందేళ్ల క్రితం చైనా కమ్యూనిస్టు పార్టీని[CPC] ని స్థాపించామని ప్రకటించిన చరిత్ర స్పురణకు వస్తోం ది. చైనీయులను అవమానాల  నుండి బయటకు తీసుకువెళ్లీ, పేదరికం, యుద్ధం యొక్క పీడల నుండి విముక్తి చేయడానికి వందేళ్ల క్రితం సిపిసిని స్థాపించడం చైనా చరిత్రలో ఒక కీలకమైన సంఘట న. సిపిసి పార్టీ సభ్యులు మొదటినుండి, చైనాప్రజల శ్రేయస్సును సాధించి ,చైనా దేశాన్ని పునరు జ్జీవింపజేయడాన్ని తమ  స్థిరమైన లక్ష్యాలుగా చేసుకున్నారు. అక్టోబర్ 2017 లో, 19 వ సిపిసి జాతీయ కాంగ్రెస్ ముగిసినప్పుడు, సిపిసి యొక్క కొత్తగా ఎన్నికైన అగ్ర నాయకత్వం, ప్రధాన కార్యదర్శి జి జిన్పింగ్ నేతృత్వంలో, నాన్హు సరస్సును సందర్శించింది, అక్కడ వారు పార్టీ యొక్క అసలు ఆకాంక్ష, వ్యవస్థాపక లక్ష్యానికి  కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు.19 వ సిపిసి జాతీయ కాంగ్రెస్ చైనా జియావోకాంగ్ [ ఒక మోస్తరు సంపన్న సమాజం] నిర్మాణం పూర్తి చేయడానికి స్పష్టమైన కాలపట్టిక మరియు రోడ్ మ్యాప్ ఏర్పాటుచేసింది  2021  జూలై 1 న, సిపిసి స్థాపన శతాబ్దిని పురస్కరించుకుని జరిగిన వేడుకలో, సిపిసి సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి మరియు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, చైనా అన్ని విధాలుగా ఒక మోస్తరు సంపన్న సమాజాన్ని నిర్మించా లనే తన మొదటి శతాబ్ది లక్ష్యాన్ని సాకారం చేసుకుందని, అంటే చైనా కటిక  పేదరికాన్ని అంతం చేసిందని, ఇప్పుడు ఒక గొప్ప ఆధునిక సామ్యవాద దేశాన్ని నిర్మించాలనే రెండవ శతాబ్ది లక్ష్యం దిశగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోందని ప్రకటించారు.

1949 నుండి 2021 వరకు, ఎర్ర పడవ సిపిసి యొక్క భౌతిక జన్మస్థలంగా మిగిలి ఉన్న జియాక్సింగ్ నగరం, చైనా అంతటా వేలాది ఇతర నగరాలతో పాటు, చైనా ప్రజల తరతరాల పట్టుదలను చూసింది. ఈ ప్రస్థానం కూటికి లేని స్థాయి నుండి కనీస అవసరాలు తీరే శ్రేయస్సుకు, ఆపై దేశవ్యాప్తంగా ఒక మోస్తరు శ్రేయస్సుకు అంచెలంచెలుగా పురోగమించింది. సిపిసి చైనా ప్రజలను ఎటువంటి విజయాలు సాధించడానికి ఎలా నడిపించిందనే కథనాలను అభివృద్ధి చెందుతున్నప్రతినగరచరిత్రబహిర్గతంచేస్తోంది.   
స్థిరమైనకలతోప్రారంభించి
మెరుగైన జీవితం కోసం ఆశపడటం పురాతన కాలం నుండి చైనా దేశం యొక్క స్థిరమైన ఆకాంక్షగా ఉంది. అయితే, సహస్రాబ్దాలుగా ఈ సౌభాగ్యం ఒక కలగా మిగిలిపోయింది. చైనా ఆధునిక వ్యవస్థ  అర్ధ వలస, అర్ధ  భూస్వామ్య సమాజానికి కుదించబడి, భయంకరమైన బాహ్య అణచివేతకు లోనయిన  చేదుతనంతో నిండి పోయింది. కమ్యూనిస్ట్ పార్టీ  1921 లో స్థాపించబడినప్పటి నుండి, ఒకదాని తరువాత మరొకటిగా విజయం సాధించడంలో చైనా ప్రజలను ఏకం చేసింది. నూతన జనతా ప్రజాతంత్ర విప్లవం లో విజయం సాధించింది.1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పి.ఆర్.సి)ను స్థాపించి సోషలిస్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. వివిధ నగరాలలో వివిధ రంగాలలో చిన్న చిన్న విజయాలను పేర్చుకుంటూ పోవడం ద్వారా, చైనా చివరికి యుద్ధంతో దెబ్బతిన్న దేశం నుండి తులనాత్మకంగా బలమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించింది, ఇది భవిష్యత్తు ఆర్థిక పురోగతికి పునాది వేసింది. వ్యూహాత్మక ప్రణాళిక,  విధాన రూపకల్పనను బలోపేతం చేయడం, దశలవారీ లక్ష్యాలను రూపొందించడం, అనుభవాన్ని సమీక్షించడం, ఆచరణలో కనుగొన్న అంశాలను మిళితం చేయటం వంటివి పి.ఆర్.సి యొక్క ప్రారంభ సంవత్సరాల నుండి సిపిసి అనుసరిస్తున్న మార్గాలు. చైనా ప్రజలు పొందిన విలువైన పాఠాలు. ఉదాహరణకు, 1953 నుండి 1957 వరకు ఆధునిక పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా. రక్షణ రంగాలను అభివృద్ధి చేయడానికి, చైనా తన మొదటి పంచవర్ష ప్రణాళికను (1953-57) అమలు చేసింది. 1960వ దశకంలో, సిపిసి 20 వ శతాబ్దం చివరి నాటికి పరిశ్రమ, వ్యవసాయం, జాతీయ రక్షణ,  శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆధునికీకరణ – నాలుగు ఆధునీకరణలను సాధించే లక్ష్యాన్న నిర్దేశించుకుని, ఈ దిశగా రెండు-దశల అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది.

. 1952 లో చైనా జిడిపి [తలసరి జిడిపి 119 యువాన్లతో] 67.9 బిలియన్ యువాన్లుగా ఉండగా, 1978 లో జిడిపి 367.9 బిలియన్ యువాన్లకు పెరిగింది. 1949 లో చైనా తలసరి జి.డి.పి కేవలం 23 డాలర్లు మాత్రమే, 1949 లో అమెరికా జి.డి.పి 272.5 బిలియన్ డాలర్లు కాగా,ప్రతిమూలధనజి.డి.పి1,798.33డాలర్లుగాఉంది.
ఆ స్థితిలో చైనా సంస్కరణ, ఓపెనింగ్-అప్ ప్రవేశపెట్టినది. మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి చైనా ప్రజల పోరాట చరిత్రలో  1978  ఒక ప్రకాశవంతమైన సంవత్సరం. అలాగే, సంస్కరణ, ఓపెన్ అప్ ప్రారంభ సంవత్సరాల్లో, డెంగ్ జియావోపింగ్  మొదటిసారిగా చైనా యొక్క ఆధునికీకరణ గురించి తన దార్శనికతను ప్రదర్శించడానికి  “జియావోకాంగ్” అనే పదాన్ని ఉపయోగించాడు. అగ్రశ్రేణి చైనా నాయకుడు 20 వ శతాబ్దం చివరి నాటికి చైనా ప్రజలకు  జియావోకాంగ్  సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని కూడా నిర్దేశించాడు. దేశంలోని మరిన్ని నగరాలు 1978 నుండి చైనా అద్భుతాన్ని ప్రారంభించాయి.ఈ మార్గం ఆనాటి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక యంత్రాంగానికి చాలా భిన్నంగా ఉంది. తమ అభివృద్ధి సౌధానికి 1, సోషలిస్టు నిర్మాణము, 2 జనతాప్రజాతంత్ర నీయంతృత్వము 3,చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వము, 4, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం అనే సిద్ధాంతము . నాలుగు స్తంభాలుగా వుంటాయని ప్రకటించారు.

సముద్రాన్నినింపి, చదునైన భూమిని చేసి చైనా తన  మొదటి ప్రత్యేక ఆర్థిక పారిశ్రామిక పార్కు కోసం షేకూ లో  మౌలిక సదుపాయాలను ఏర్పరచింది . ఆ పునాది నేడు యుఎస్ నే  వణికించేటంత  బలంగా ఉన్న ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా ఎదుగుదలకు దారి తీసింది. ఆ రోజుల్లో  బీజింగ్, షా౦ఘైల్లోని ప్రజలు మాత్రమే అ౦తర్జాతీయ ఫోన్  కాల్స్ చేయగలిగే వారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం షెకూ కోసం 800 ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ లను “ప్రత్యేకంగా ఆమోదించింది”, మొదటి ప్రత్యేక ఆర్థిక మండలికి విదేశాలలో ప్రత్యక్ష కాల్స్ చేసే సామర్థ్యాన్ని ఇచ్చింది. మొదటి జాయింట్ స్టాక్ ఎంటర్ప్రైజ్, మొదటి జాయింట్ స్టాక్ బ్యాంక్, మొదటి జాయింట్ స్టాక్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అన్నీ షెకౌ నుండి పుట్టినవి,

షెకౌ యొక్క అనుభవం  దేశంలోని మిగిలిన ప్రాంతాలకు స్ఫూర్తినిచ్చింది. 1980 ఆగస్టులో దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని షెన్ జెన్, జుహై, షాంటౌ, తూర్పు చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ లోని జియామెన్ లలో ప్రత్యేక ఆర్థిక మండలాల ఏర్పాటుకు చైనా ఆమోదం తెలిపింది. మే 1984లో, చైనా టియాంజిన్, లియోనింగ్ లోని డాలియన్ మరియు షాన్ డాంగ్ లోని యాన్టై మరియు క్వింగ్ డావోలతో సహా 14 తీరప్రాంత ఓడరేవు నగరాలను ప్రారంభించింది. సిపిసి మరి చైనా ప్రజలు చారిత్రాత్మక అవకాశాలను అందిపుచ్చుకొని అపారమైన మార్పులను సక్రమంగా నిర్వహించారు. లోతైన సంస్కరణకు కట్టుబడి ఉండటం ద్వారా, ప్రపంచంతో  విస్తృతంగా  సంబంధాలను పెంచుకోవడం ద్వారా , చైనా సమకాలీన చరిత్రలో గొప్ప ఆర్థిక, సామాజిక పరివర్తనను పొందింది.1987 లో షెన్జెన్  జి.డి.పి 1979 తో పోలిస్తే 30 రెట్లు పెరిగింది.

40 స౦వత్సరాల్లో, షెన్జెన్ కేవల౦ 30,000 మ౦ది జనాభా ఉన్న ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ ను౦డి 10 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఒక అంతర్జాతీయ మహానగరంగా ఎదిగింది. దీని పట్టణ వైశాల్యం 3 చదరపు కిలోమీటర్ల నుండి 2,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది, జి.డి.పి పరిమాణం 10,000 రెట్లు పెరగడంతో, షెన్జెన్ కథ చైనా యొక్క ఆర్థిక అద్భుతానికి అద్దంలా కనిపిస్తుంది. 2021 నాటికి, షెన్జెన్ జిడిపి 3 ట్రిలియన్ యువాన్లు (475 బిలియన్ డాలర్లు) దాటింది, ఇది, సింగపూర్ జిడిపి [396.99 బిలియన్ డాలర్ల] కంటే చాలా ఎక్కువ.
వివేక౦తో చైనాలోని అన్ని వర్గాలకు చె౦దిన ప్రజలు దేశాభివృద్ధికి కృషి చేశారు.

1993 నవంబరులో సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థను స్థాపించాలనే నిర్ణయానికి ఆమోదం లభించింది. దానితో ఒక శక్తివంతమైన ప్రైవేట్ రంగం ఎదిగింది. ఉదాహరణకు  జెజియాంగ్ ప్రావిన్స్ లో ఒకప్పుడు కౌంటీగా ఉన్న “యివు” లోని చిన్న కమోడిటీ మార్కెట్ నేదు దేశం యొక్క చిన్న మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అత్యధిక సంఖ్యలో నిలయంగా ఉంది. ఇరవై లక్షల చిన్న, మధ్య తరహా సంస్థలతో “ప్రపంచ సూపర్ మార్కెట్” గా ప్రసిద్ధి చెందింది. బొమ్మలు, సాక్స్, హెయిర్ యాక్ససరీలు, పండుగ అలంకరణల వంటి  సరుకులు ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాలు, ప్రాంతాలకు పంపబడతాయి. స్థానికుల అభిప్రాయం ప్రకారం, యివు వ్యాపారులు వారి “కష్టపడి పనిచేయడం, అనుకున్న సమయానికి సరకులు అందించడం, తక్కువ లాభాలతో వ్యాపారాలు చేయడానికి సుముఖత” కారణంగా ప్రపంచ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించ గలుగుతున్నారు.

1978 నుండి 2017 వరకు దేశం యొక్క దిగుమతి, ఎగుమతుల  మొత్తం విలువ 27.8 ట్రిలియన్ యువాన్లకు చేరుకుంది, ఇది ప్రపంచ మొత్తంలో 11.5 శాతం. వాటిలో చైనా ఎగుమతులు 16.8 బిలియన్ యువాన్ల నుండి 15.3 ట్రిలియన్ యువాన్లకు పెరిగాయి.

షెన్జెన్, యివు లో జరిగిన అద్భుతాలు చైనా అనుసరిస్తున్నశీఘ్ర అభివృద్ధి విధానాల సారాంశా లు. చైనా జి.డి.పి 1978 లో 367.9 బిలియన్ యువాన్ల నుండి 1990 లో 1,887.3; 2000 లో 10,028; 2010 లో 41,211.9 బిలియన్ యువాన్లకు పెరిగింది. 1978లో చైనా తలసరి జీడీపీ 156 డాలర్లు మాత్రమే కాగా అమెరికాలో 10,000 డాలర్లు వుండేది. చైనా తన 11 వ పంచవర్ష ప్రణాళిక (2006-10) ను పూర్తి చేసే సరికి చైనా తలసరి జి.డి.పి భారతదేశం యొక్క 1,358 డాలర్ల కన్నా మూడు రెట్లు పెరిగింది. జపాన్ ను కూడా  అధిగమించి, యుఎస్ తరువాత ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

1949 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించబడినప్పుడు, చైనా ప్రజలు ఒక గడ్డు పరిస్థితులలో వున్నదేశాన్ని వారసత్వంగా పొందారు.ఇది దశాబ్దాల యుద్ధం, ఆర్ధిక దోపిడి గందరగోళం తరువాత మొదటి నుండి పునర్నిర్మిం చాల్సిన అవసరం గల సమాజం అది. వారు ఎన్నుకున్న సోషలిస్టు విధానంలో చైనా పత్యేక లక్షణాలతో కూడిన నిర్మాణంలో,   అవసరాలకను  గుణ్యమైన మార్పులు చేసుకుంటూ, సాగించిన దశాబ్దాల అలుపెరగని కృషి, చైనా ప్రజల అంకిత భావం ఫలితంగా, చైనా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది,1952లో  చైనా జి.డి.పి 30 బిలియన్ యు.ఎస్ డాలర్లు కాగా, 2018 లో దాని జి.డి.పి 452.6 రెట్లు పెరిగి 13.61 ట్రిలియన్ల యు.ఎస్.డాలర్లకు చేరుకుంది.

తరతరాలుగాపట్టుదల,కమ్యూనిస్టుపార్టీనాయకత్వం
2012 లో తన 18 వ జాతీయ కాంగ్రెస్ లో, సిపిసి 2021 నాటికి అన్ని విధాలుగా ఒక మోస్తరుగా సంపన్నమైన సమాజాన్ని నిర్మించాలనే మొదటి శతాబ్ది లక్ష్యాన్ని చైనా సాకారం చేస్తుందని ప్రకటించింది. 2021 లో స్టేట్ కౌన్సిల్ విడుదల చేసిన ఒక శ్వేత పత్రం  ప్రకారం, 2020 చివరి నాటికి, చైనా యొక్క ప్రస్తుత దారిద్య్ర రేఖ కింద పేదలుగా వర్గీకరించబడ్డ 99 మిలియన్ల గ్రామీణ పేదలు, 832 కౌంటీలు 128,000 గ్రామాలు పేదరికం నుండి బయట పడ్డాయి. ఇంతకు ముందు వున్న నిరుపేద గృహాలు ఇప్పుడు అన్ని వాతావరణ పరిస్థితులకు  తట్టుకునేలా తగినంత ఆహారం, దుస్తులు, పరుపులు కలిగి ఉన్నాయి.

2020లో చైనా జీడీపీ 102.6 ట్రిలియన్ యువాన్లుగా, తలసరి జీడీపీ 72,000 యువాన్లుగా ఉంది. 2021 ఫిబ్రవరిలో చైనాలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడంలో ‘సంపూర్ణ విజయం’ సాధించామని జిన్పింగ్ ప్రకటించారు. కొన్ని నెలల తరువాత, 2021 జూలై 1 న సిపిసి యొక్క స్థాపన శతాబ్దిని సూచిస్తూ జరిగిన వేడుకలో, చైనా నాయకుడు మొత్తం పార్టీ, మొత్తం దేశం యొక్క నిరంతర ప్రయత్నాల ద్వారా అన్ని విధాలుగా ఒక మోస్తరైన  సంపన్న సమాజాన్ని నిర్మించే మొదటి శతాబ్ది లక్ష్యంలో చైనా విజయం సాధించిందని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు ఈ విజయాలను ప్రశంసించారు.  ఇది చైనా అభివృద్ధి ఒక కొత్త దశలోకి ప్రవేశి స్తున్నట్లు కూడా చూపించిందని, పేదరిక నిర్మూలన యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని సమీక్షిస్తూ CPC నాయకత్వంలో రాబోయే రోజుల్లో మరింత ప్రతిష్టాత్మక లక్ష్యం ఆశించబడుతుందని, తీవ్రమైన పేదరిక నిర్మూలన సాధించడానికి ఉపయోగిం చిన సూత్రాలపై ఆ విజయం ఆధారపడి ఉందనివిశ్లేషకులుఅభిప్రాయపడ్డారు
జియావోకాంగ్ ను చైనా సాకారం చేసుకోవడమనేది  ఆధునికీకరణకు, జాతీయ పునరుజ్జీవనానికి దారితీసే మార్గంలో ఒక మధ్యంతర లక్ష్య సాధనకు ప్రాతినిధ్యం వహిస్తుందని, సిపిసి. చైనా ప్రజలు ఇప్పటికే రెండవ శతాబ్ది లక్ష్యాన్ని”సుసంపన్నమైన ఆధునిక సోషలిస్టు దేశాన్ని” నిర్మించాలనే లక్ష్యాన్ని సాధించటానికి నడుం కట్టారని,  ఆ యాత్రలో  మరింత చరిత్రాత్మకమైన  అద్భుతాలతో ముందుకు సాగాలని ఎదురు చూస్తున్నారని వారు పేర్కొన్నారు “ బలమైన, ప్రజాస్వామిక, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన  సామరస్యపూర్వక” సమాజాన్ని నిర్మించటం  చైనా  కొన సాగించాలని ఈ ప్రపంచం కోరుకుంటోంది.” ఫైవ్-స్పియర్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్” ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక మరియు పర్యావరణ అభివృద్ధిని కలిగి ఉంటుంది. “నాలుగు అంశాల సమగ్ర వ్యూహం” ఒక మోస్తరు సంపన్న సమాజం యొక్క సమగ్ర అభివృద్ధి, సంస్కరణలను లోతుగా మార్చడం, చట్టానికి అనుగుణంగా దేశ పాలన, కఠినమైన పార్టీ పాలనను కలిగి ఉంది.

బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ యొక్క అభివృద్ధి చైనాను అంతర్జాతీయ వేదికపై ఒక ప్రధాన పాత్రధారిగా చేస్తున్నది. ఆ కార్యక్రమం  రాబోయే సంవత్సరాల్లో ప్రముఖ ఆర్థిక, అభివృద్ధి చోదక శక్తిగా ఉండబోతున్నదని అనేకులు భావిస్తున్నారు. ఒక ఆర్థికరంగంలోనే కాక చైనా అంతర్జా తీయంగా ప్రముఖపాత్రను పోషిస్తున్నది. అనేక దేశాలకు వాటిపై రుద్దబడిన సామ్రాజ్యవాద పెత్తనం, ఆధిపత్యం, వనరుల దోపిడిని ఎదిరించటానికి మద్దతు నిస్తున్నది. అందువల్ల చైనాను చుట్టుముట్టి, దాన్నియుద్ధాలలోకి దించి, దాని అభివృద్ధిని అడ్డగించాలనే సామ్రాజ్య వాద  దేశాల వ్యూహాలు  వికృత రూపం దాలుస్తున్నాయి. వీటిని అధిగమిస్తూ, సామరస్య పూర్వకమైన శాంతిపూరిత అభివృద్ధి మార్గాన్ని చైనా తన గమ్యంగా ప్రయాణిస్తున్నది. అందుకే ఈ కాంగ్రెస్ లో  తీసుకునే నిర్ణయాలు చైనానే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభా వితం చేస్తాయి, కనుకనే చైనా ప్రజలను వారి విజయాల పట్ల అభినందిస్తూ, వారి భవిష్యత్ నిర్ణయాల కోసం  ఆసక్తిగా ఎదురు చూస్తోంది పురోగామి ప్రపంచం .

[20 వ జాతీయ కాంగ్రెస్ సందర్భంలో గ్లోబల్  టైమ్స్ పత్రికలో వచ్చిన రిపోర్టులు  ఆధారంగా ]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *