8 సం. నిరాశ, సాగుదారులకు భూములేవి?

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక అందించే విశ్లేషణ 

 

వాస్తవ సాగుదారులకు భూములు లేవు –
ఉన్న కొద్దిపాటి భూములపై హక్కులు లేవు

– కన్నెగంటి రవి,

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా , ఆదివాసీ పోడు రైతుల కుటుంబాలకు అడవిపై హక్కు పట్టాలు ఇవ్వకుండా ఆపేశారు. 2021 లో పోడు రైతులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేసిన ఫలితంగా ప్రభుత్వం 2021 నవంబర్ 8 నుంచీ పోడు రైతుల నుండి అటవీ హక్కుల చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 2450 గిరిజన గ్రామాల నుండీ ( 4300 ఆవాసాల పరిధిలో) 12 లక్షల ఎకరాల విస్తీర్ణం పై హక్కుల కోసం 3,40,000 దరఖాస్తులు వచ్చాయి. కానీ 6 నెలలు గడుస్తున్నా , వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం పూనుకోవడం లేదు .

రాష్ట్రంలో 3 లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి లేదని చెప్పి , ఆ కుటుంబాలకు కుటుంబానికి 3 ఎకరాల చొప్పున ఇవ్వడానికి 9 లక్షల ఎకరాల భూమి కావాలని చెప్పి , జీవో నెంబర్ 1 విడుదల చేసిన ముఖ్యమంత్రి , గత ఎనిమిదేళ్ళలో కేవలం 6,242 దళిత కుటుంబాలకు 15,571 ఎకరాల భూమి మాత్రమే కొనుగోలు చేసి ఇవ్వడం . తాజాగా ఆ పథకాన్ని పూర్తిగా ఆపేయడం చూస్తుంటే , ఈ ప్రభుత్వం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మేలు చేయడానికి సిద్దంగా లేదని రుజువు కావడం లేదూ ..?

భూమి పొందిన దళిత కుటుంబాల సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి . అందరికీ సాగు నీరు లేదు . వ్యవసాయం చేయడానికి పెట్టుబడి లేదు . పొలాలకు దారి వసతి లేదు . కొన్ని చోట్ల భూములు సాగు యోగ్యంగా కూడా లేవు.

తెలంగాణా రాష్ట్రంలో కనీసం 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా . కౌలు రైతుల హక్కుల రక్షణ కోసం 1950 లోనూ , 2011 లోనూ చట్ట సభలు ఆమోదించిన రెండు చట్టాలు ఉన్నప్పటికీ అవి రాష్ట్రంలో అమలు కావడం లేదు . ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు తన అజెండాలో లేరని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది . కాబట్టి కౌలు రైతులకు, వారి సమస్యలకు రాష్ట్రంలో గుర్తింపు లేకుండా పోయింది . కౌలు రైతుల వ్యవసాయానికి ఎటువంటి సహాయమూ ( రైతు బంధు, బ్యాంకు రుణాలు, పంటల బీమా, లాంటివి ) అందడం లేదు . కనీసం తాము పండించిన పంటను కూడా తమ పేరుతో అమ్ముకోలేక పోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలలో కౌలు రైతులవే 80 శాతం . కౌలు రైతులలో అత్యధికులు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే.

1973 సంస్కరణల (భూ గరిష్ట పరిమితి) చట్టం రాష్ట్రంలో అమలు కావడం లేదు . రాష్ట్రం లో సమగ్ర భూ సర్వే చేసి , రీ సెటిల్ మెంట్ చేసి, ఈ చట్టం ప్రకారం మిగులు భూములను తేల్చి , భూమి లేని గ్రామీణ పేదలకు పంచాల్సిన ప్రభుత్వం ఈ చట్టం ఊసే ఎత్తడం లేదు.

ఉమ్మడి రాష్ట్రంలో భూమి సమస్యపై అనేక సిఫారసులు చేసిన జయతీ ఘోష్ కమీషన్ , కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను కూడా అమలు చేయడం లేదు . ఆదివాసీలకు సంబంధించి అటవీ హక్కుల చట్టం (FRA), 1/70 , PESA చట్టాలను కూడా అమలు చేయడం లేదు .

అసైన్డ్ భూముల రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు . పైగా ప్రజా ప్రయోజనం పేరుతో, పారిశ్రామిక ప్రాంతాల పేరుతో, సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో గ్రామీణ ప్రజల ముఖ్యంగా దళితుల చేతుల్లోని అసైన్డ్ భూములను గుంజుకుంటున్నది.

ప్రస్తుతం మార్కెట్ సరుకుగా సాగు భూములు మారిపోయిన వేళ, ఇక ఎప్పటికీ గ్రామీణ పేదలకు సాగు భూములు హక్కుగా అందే అవకాశమే కనిపించడం లేదు .

రాజకీయ పార్టీల ఎజెండాలో కూడా తెలంగాణా లో భూమి సమస్య ఒక ఎజెండాగా లేదు. కొద్ది రోజుల్లో రాష్ట్ర సాగు భూములన్నీ, కొద్దిమంది బడా బాబుల చేతుల్లోకి వెళ్లి పోయే ప్రమాదం ఉంది . గరిష్ట పరిమితిని రద్ధు చేస్తూ, మెల్లగా 1973 భూ సంస్కరణల చట్టాన్ని కూడా రద్ధు చేసే ప్రమాదం ఉంది. అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు పేరుతో, దళితుల చేతుల్లో మిగిలిన అసైన్డ్ భూములను కూడా కొల్లగొట్టే ప్రమాదం ఉంది. ఆయిల్ పామ్ తోటలు , చేపల చెరువులు, ఇతర ప్లాంటేషన్ లు పేరుతో , ఆస్తిపర వర్గాలు తెలంగాణా గ్రామాల లోకి ప్రవేశించి , సన్నకారు, చిన్నకారు రైతుల చేతుల్లోని కొద్దిపాటి భూమి కూడా లాగేస్తారు.

తెలంగాణా గ్రామీణ పేద వర్గాలు, ఆ భూముల్లోనే కూలీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లేదా పొట్ట చేత పట్టుకుని వలస పోవాలి. నగరాలలో పేదల బస్తీలకు చేరాలి. ఏ హక్కులూ ,రక్షణా లేని జీవనోపాధుల వెంట క్యాజువల్ లేబర్ గా , అడ్డా కూలీలుగా, వాచ్ మెన్లు గా , ఇంటి పని వాళ్ళుగా కొద్దిపాటి ఆదాయాలతో పనులు వెతుక్కోవాలి. ఇది ఇప్పటికే కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యం.

గ్రామీణ ప్రాంత, అటవీ ప్రాంత సహజ వనరులపై స్థానికులకే హక్కులు కల్పించకుండా, ఈ ప్రజలను నగరాలకు తరలించాలనే ఆలోచన చేసే పాలకులు, కొందరు మేధావులు , ఈ ప్రజా శ్రేణులకు భద్రమైన , హక్కులతో కూడిన జీవనోపాధిని , నివాస వసతిని కల్పించడానికి ఏమీ మాట్లాడరు.

నిజంగా ఈ మొత్తం గ్రామీణ ప్రజా సమూహాన్ని ఇముడ్చుకుని జీవనోపాధి కల్పించే రంగాలు ఏమున్నాయి ? ఎక్కడున్నాయి ? పైగా ఈ సమూహం మిగిలిన రంగాలకు సంభంధించినంత వరకూ అనిపుణ కార్మికులే. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చే చవక కూలీలతో ఈ గ్రామీణ సమూహం పని కోసం పోటీ పడాల్సి ఉంటుంది. తక్కువ కూలీ మొత్తాలతో పని చేయడానికి ఈ వలస కూలీలు సిద్దపడి వస్తారు. తమ హక్కుల గురించి ప్రశ్నించే స్థితిలో ఉండరు . పైగా ఇక్కడి యజమానులు, కాంట్రాక్టర్లు కల్పించే పని స్థలాల లోని గుడారాల లోనే ఉండడానికి సిద్దమై ఉంటారు. మరి వీటన్నిటికీ తెలంగాణా గ్రామీణ పేదలు అంగీకరిస్తారా ?

ప్రస్తుతం భూముల రేట్లు పెరుగుతున్నాయి కనుక, ప్రస్తుతం ఏమీ ప్రమాదం లేదని గ్రామీణ రైతులకు కొంత ధైర్యం ఉండొచ్చు కానీ , ఈ భరోసా ఎల్ల కాలం నిలబడదు .

ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ పేరుతో, పట్టాదారు పాస్ పుస్తకంలో సవరణల పేరుతో , వాస్తవ సాగు దారుల పేర్లను రెవెన్యూ రికార్డుల నుండి తొలగించింది. ఒకరకంగా భూమిని మార్కెట్ సరుకుగా స్వయంగా మార్చింది. అక్రమంగా సంపాదించిన నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకుందామని చూస్తున్న వాళ్ళు , లేదా అధిక ఆదాయ మిగులును ఆదాయ పన్ను పరిధిలోకి రాకుండా చూసుకుందామని భావిస్తున్న వాళ్ళు ప్రస్తుతం భూముల కొనుగోలుపై పెట్టుబడులు పెడుతున్నారు. భూ దాహంతో పరుగు లెత్తుతున్నారు . పైగా ప్రభుత్వం రైతు బంధు పేరుతో భూ యజమానులకు చేస్తున్న సహాయం కూడా ఇందుకు ప్రోత్సాహం ఇస్తున్నది. వ్యవసాయ ఆదాయంపై పన్నులు లేకపోవడం కూడా , డబ్బున్న చాలా మందిని అటువైపు నెడుతున్నది.

ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగితే , త్వరలోనే గ్రామాలలో పాత రైతులు మాయమై, కొత్త రైతులు ప్రత్యక్షం అవుతారు. భూమి కేంద్రీకరణ కూడా పెరుగుతున్నది .

పెట్టుబడి విస్తరించే క్రమంలో ఇవన్నీ సహజమే అనే సిద్ధాంతాన్ని చెప్పే వాళ్ళు పెరుగుతున్నారు. వారికి ప్రస్తుతం గ్రామీణ కౌలు రైతుల, సన్న, చిన్నకారు రైతుల సమస్యలపై పని చేయడం అర్థం లేనిదిగా కనిపిస్తున్నది. ఈ ప్రక్రియను ఆపలేము కనుక, గ్రామీణ వ్యవసాయ రంగాన్ని పెట్టుబడి దారులకు అప్పగించేసి, భూములు కోల్పోయి కార్మికులుగా మారుతున్న సమూహాల సమస్యలపై పని చేయాలని కూడా సలహాలు ఇస్తున్నారు.

నిజమే మనం మౌనంగా ఉంటే ఈ ప్రక్రియను ఆపే అవకాశం తక్కువే ఉంది . కానీ ఈ లోపు మనం అర్థం చేసుకోవాల్సిన, అధ్యయనం చేయాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.

గత 20 ఏళ్లుగా గ్రామాలను ఒదిలి వలస పోతున్నట్లుగా ( ఒకరకంగా ఇవి బలవంతపు వలసలు) మరింతమంది గ్రామీణ వ్యవసాయ దారులు, ప్రజలు నగరాలకు ఉన్న స్థితికంటే మెరుగైన ఆదాయాలను వెతుక్కుంటూ వెళ్లవచ్చు. వారిని ఎలాగూ ఆపలేము. అయినప్పటికీ, భవిష్యత్తులోనూ వ్యవసాయాన్ని జీవనోపాధిగా ఎంచుకుందామని భావించే గ్రామీణ ప్రజల చేతుల్లో భూమి హక్కుగా ఉండాలంటే ఏమి చేయాలనేది ఆలోచించాలి కదా. వ్యవసాయంలో కొనసాగుతున్న కుటుంబాల ఆదాయాలను పెంచాలంటే , ఇతర రంగాల వారితో సమానంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను ఎలా మెరుగు పర్చాలంటే ఏమి చేయాలి అనేది కూడా ఆలోచించాలి కదా. అందుకోసం ప్రభుత్వాలు చేపట్టాల్సిన విధానాలపై మాట్లాడాలి కదా.

అమెరికా అయినా, యూరప్ అయినా, ఎప్పుడైనా వ్యవసాయ రంగం ప్రభుత్వాల మద్ధతు, బడ్జెట్ సహకారం లేకుండా కొనసాగలేదు. ఇప్పటికీ అదే పరిస్తితి. మరి మన గ్రామీణ రైతుల , ప్రజల రక్షణ కోసం ఏ విధానాల మార్పు అడుగుతామ్ అనేది స్పష్టత ఉండాలి కదా ?

గ్రామీణ ప్రాంతం ఎక్కువగా, నూటికి 60 మంది ఇప్పటికీ గ్రామీణ జీవనోపాధులపై ఆధారపడి ఉన్నారు. ఈ గ్రామీణ ప్రజలను నగరాలకు తరలించాలంటే , ఇతర రంగాలలో జీవనోపాధులు , ఆదాయాలపై ఒక అంచనాకు రావాలి. నగరాలకు, నగరాల చుట్టూ ఏర్పడే జీవనోపాధులకూ ఉన్న పరిమితుల గురించి స్పష్టత పెంచుకోవాలి.

గ్రామీణ ప్రాంతం ఉంటుంది అనే అంచనాతో , అక్కడి జీవనోపాధుల సుస్థిరత గురించి లోతుగా అధ్యయనం చేయాలి. కృషి కొనసాగించాలి.

(కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక, హైదరాబాద్.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *