చూడాల్సిన, చూడదగ్గ “మేజర్” మూవీ

(సిఎస్ సలీం బాషా)

అఖండ
ఆర్ అర్ ఆర్
కే జి ఎఫ్2
ఆచార్య
సర్కార్ వారి పాట

ఈ సినిమాలు చూసిన తర్వాత

ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వ కారణం
ప్రతి సినిమా సమస్తం రక్తసిక్తం
అని శ్రీశ్రీ భాషలో చెప్పాల్సి వస్తుంది

పై సినిమాల వల్ల వెండితెర ఎరుపురంగు పూలుముకుని ఎర్రతెరగా మారి భగభగ లాడుతున్న సమయం లో ఒక మలయమారుతం లా వచ్చిన సినిమా మేజర్. ఇది గొప్ప సినిమా అని నేను చెప్పటం లేదు. ఒక చూడదగ్గ సినిమా అని మాత్రం చెప్పగలను. మళ్ళీ పైన ఉదహరించిన సినిమాలతో పోలిస్తే ఇది ఒక గొప్ప సినిమా గా భావించ వచ్చు.

ఈ సినిమాలు అన్నీ కాని, ఒకట్రెండు కాని చూసిన వాళ్ళు, మేజర్ సినిమా కచ్చితంగా చూడాలి. పై సినిమాలు ఏవి చూడని వారు మేజర్ సినిమా హ్యాపీగా చూసేవచ్చు.. తర్వాత ఎమోషనల్ కూడా కావచ్చు.

చాలా మంది అనుకుంటున్నట్లు ఇది బొంబాయి దాడుల నేపథ్యంలో తీసిన సినిమా కాదు. ఇది ఉన్నికృష్ణన్ అనే ఒక సోల్జర్ జీవిత కథ. ముంబై దాడుల లో ఉన్నికృష్ణన్ వీరమరణం పొందాడు కాబట్టి, బొంబాయి దాడుల గురించి చివర్లో చూపిస్తారు.సినిమా సినిమాటిక్ యాంగిల్ లో చూస్తే క్లైమాక్స్ లో (అతని జీవితానికి కూడా అదే ముగింపు గనక) చిత్రీకరించిన ముంబయి దాడుల కొంచెం రిచ్ గానే తీశారు. అంతే!

బయోపిక్ లలో “మహనటి” తర్వాత నాకు నచ్చిన సినిమా ఇది. భూతద్దం పెట్టి మరీ తప్పులు, పొరపాట్లు(ఇంగ్లీష్ లో ఫ్లాస్) వెతకవలసిన అవసరం లేని సినిమా ఇది. ఇది ఒక అర్థవంతమైన సినిమా, అందరికి అవసరమైన సినిమా. కోట్లు ఖర్చు పెట్టి రక్తపాతాన్ని సృష్టించే సినిమాలకన్నా ఇది చాలా బెటర్.

సాధారణంగా బయోపిక్ లు తీసేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. ఇంతకు ముందు కార్గిల్ యుద్ధం లో పాల్గొని వీరమరణం పొంది పరం వీర్ చక్ర గౌరవం పొందిన కెప్టెన్ విక్రం బత్ర బయోపిక్ “షేర్షా”(2021 ఆగస్ట్12) కూడా ఘన విజయం సాధించింది. అది హిందీలో తీసిన సినిమా. అందులో కూడా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా తీసిన మేజర్ లో కూడా ఇంతే.
ఇంతకుముందు నేను “మహానటి” సినిమా రివ్యూ లో కూడా ఇదే విషయం ప్రస్తావించాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి బయోపిక్ ను యధాతథంగా తీస్తే డాక్యుమెంటరీ అవుతుంది. క్రియేటివ్ సినిమా కాదు. పైగా ఎక్కువమంది చూడాలన్న లక్ష్యం దెబ్బతింటుంది.

26/11/2008 భారతదేశం ఒక మర్చిపోలేని దుర్దినం, ముఖ్యంగా ముంబై వాసులకు. పదిమంది టెర్రరిస్టులు తాజ్ మహల్ హోటల్ పై చేసిన దాడిలో లో చాలా మంది గాయపడ్డారు. 160కి పైగా చనిపోయారు. అందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యాన్ని తీసుకుని చాలా సినిమాలు వచ్చాయి. అందులో ప్రముఖమైనవి రామ్ గోపాల్ వర్మ తీసిన.The Attacks 26/11 పూర్తిగా ఆ దాడుల గురించి విపులంగా చర్చించి సినిమా. మిగతా సినిమాలైన The TajMahal, Hotel Mumbai, One Less God, Bombay diaries వంటివి వేరే వేరే వ్యూపాయింట్ నుంచి తీసిన సినిమాలు. మేజర్ సినిమా ముంబై దాడుల మీద తీసిన కాదు. అది భారత ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్.

అయినప్పటికీ గతంలో వచ్చిన సినిమాల కన్నా తాజ్ మహల్ హోటల్ మీద జరిగిన దాడులను చాలా గొప్పగా చిత్రీకరించిన సినిమా ఇదే. యాక్టర్ మహేష్ బాబు సోనీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తీసిన ఈ సినిమాకు బడ్జెట్ పరిమితులు లేనందువల్ల అలా తీయగలిగారు. ముంబై దాడుల సన్నివేశాలని ఇంత బాగా చిత్రీకరించిన సినిమా ఇంకోటి లేదు.

బాలీవుడ్ సినీ పరిశ్రమ అసూయ పడేలా, హాలీవుడ్ సినీ పరిశ్రమ ఆహా అనుకునేలా ఓ రేంజ్ లో చిత్రీకరించిన ముంబై దాడి సన్నివేశాలు, యాక్షన్ కోరుకునే ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి. అది సినిమాకి ఒక బలం.

ఈ సినిమాకి ఇంకా కొన్ని, బలాలు, ప్లస్ పాయింట్లు ఉన్నాయి. మొదటి బలం అడవి శేషు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిన స్క్రీన్ ప్లే ను అతనే రాశాడు. అడవి శేషు గతంలో కిస్ సినిమాకి స్క్రీన్ ప్లే రాసి నంది అవార్డు అందుకున్నాడు. క్షణం సినిమా స్క్రీన్ ప్లే కి కూడా IIFA అవార్డు సాధించాడు. అలాగే గూడచారి సినిమా కి స్క్రీన్ ప్లే కి జీ సినీ అవార్డు రావడం విశేషం.

బాహుబలి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన అడవి శేషు నటుడిగా క్రమక్రమంగా ఎదిగాడు. క్షణం, ఎవరు, గూడచారి వంటి సినిమాల్లో నటుడిగా మెప్పించాడు. ఈ సినిమాలో పూర్తిగా పరిణతి చెందిన నటన ప్రదర్శించాడు. ఇక ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ప్రకాష్ రాజ్, రేవతి నటన. ఇద్దరూ పోటీపడి నటించారు. కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టించారు. మరో ప్లస్ పాయింట్ అబ్బూరి రవి సంభాషణలు. సంగీతం మరో ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. కొన్ని చోట్ల అదుపుతప్పి నప్పటికీ అవసరమైన చోట కావలసిన మూడ్ ని ఎలివేట్ చేయడానికి పనికి వచ్చింది. అలాగే ఫోటోగ్రఫీ యాక్షన్ సీక్వెన్స్ లు. ఇంతా చెప్పి దర్శకుడి గురించి చెప్పకపోతే చేసినట్టే. గూడచారి తర్వాత అడివి శేష్ తో కలిసి పనిచేసిన రవి కిరణ్ తిక్క దర్శకత్వం మెచ్చుకోదగ్గ స్థాయిలోనే ఉంది.

ఈ సినిమా తీయడానికి ముందు సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో చర్చించడం, వారి ద్వారా సమాచారం తెలుసుకుని కథ, స్క్రిప్టు రాసుకోవడం ఈ సినిమా విశ్వసనీయతను పెంచింది. అలాగే సినిమా చూసిన తర్వాత, సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురి కావడం జరిగింది. వాళ్లు కూడా ఈ సినిమాని చాలా బాగా తీశారు అని అభినందించారు. అది కూడా సినిమాకి ప్లస్ పాయింట్.

చివరగా చెప్పేదేమిటంటే , ఈ సినిమాను సందీప్ ఉన్నికృష్ణన్ అనే సోల్జర్ పైన ఉన్న సానుభూతి తో, దేశభక్తి ఉంది అని చూపించాలన్న ఉద్దేశంతో చూడాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాల లాగే దీన్ని కూడా చూడాలి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం అనుకున్నా కూడా, డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకులను ఈ సినిమా నిరాశ పరిచే అవకాశం లేదు.
అందుకే మళ్లీ చెప్తున్నా ఇది ఎవరైనా చూడదగ్గ, చాలామంది తప్పక చూడాల్సిన సినిమా.

(సీఎస్ సలీం బాషా, మూవీ క్రిటిక్)

One thought on “చూడాల్సిన, చూడదగ్గ “మేజర్” మూవీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *