11 నుంచి తిరుపతి గంగమ్మ జాతర

 

తిరుపతి: తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ను వైభవంగా నిర్వహిస్తున్నట్టు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు.

ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వరకు ఏడు రోజుల పాటు జాతర సంబరాలు జరుగుతాయని తెలిపారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద ఆదివారం ఉదయం జాతర కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రచార వాహనాలను ప్రారంభించారు. గంగ జాతర ఏర్పాట్ల గురించి మీడియా ప్రతినిధులకు భూమన వివరించారు.

 

తిరుపతి గంగమ్మ జాతర కు 900 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇందుకు తగ్గట్టే జాతర ఏర్పాట్లు వైభవంగా నిర్వహించ తలపెట్టినట్టు భూమన పేర్కొన్నారు. జాతర లో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా స్థానిక ఇందిరా మైదానంలో ఆరు రోజుల పాటు ఆరు పౌరాణిక నాటకాలను కూడా ప్రదర్శిస్తున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అన్ని జానపద కళారూపాల ప్రదర్శనలు చేపట్టనున్నట్లు వివరించారు. గంగ జాతర ను పురష్కరించుకుని..తిరుపతి లో ప్రతి ఒక్కరూ అమ్మవారికి సారె ఇవ్వాలని కోరారు. ఇందులో భాగంగా ఓ ప్రజా ప్రతినిధిగా తాను కూడా ఈనెల 11వ తేదీన అమ్మవారికి సారె సమర్పిస్తున్నట్టు ప్రకటించారు.

*విరాళాలు వెల్లువ

జాతర నిర్వహణకు టిటిడి 25 లక్షల రూపాయలు, తుడా తరఫున చైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి 15 లక్షల రూపాయలు, నగరపాలక సంస్థ తరఫున మేయర్ డాక్టర్ శిరీషా 15 లక్షల రూపాయలు విరాళంగా అందజేసినట్టు భూమన వెల్లడించారు. వీరితో పాటు స్వచ్ఛందంగా చాలా మంది దాతలు విరాళాలు ఇస్తున్నట్టు తెలిపారు.

*ప్రశస్తి

గంగమ్మ దేవాలయానికి
దాదాపు తొమ్మిది వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉందని భూమన అన్నారు. గంగమ్మ తల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి చెల్లెలు గా భాసిల్లుతోందని తెలిపారు. శ్రీవారితో పరాచకాలాడిన అనంతాచార్యులు ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్టు వివరించారు. అనంతాచార్యులు స్వామి వారిని శ్రీవారు తాత అని పిలిచేవారని, ఈ కారణంగా ఈ ప్రాంతానికి తాతయ్యగుంట గా ప్రాచుర్యం లభించిందన్నారు. గంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్న తరువాతే శ్రీవారి ఆలయాన్ని దర్శించు కోవాలన్న నియమ నిష్ఠలు వుండేవన్నారు. 1843లో బ్రిటిష్ వారు ప్రభుత్వం హథీరాంజీ మఠం వారికి తిరుమల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన సమయంలో… తిరుమల ఆలయం తో పాటు దాదాపు 26 స్థానిక ఆలయాలను అనుబంధం అప్పగించడం జరిగిందన్నారు. అందులో గంగమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉందన్నారు. గంగమ్మ దేవాలయం గతంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయంగా కూడా ఉండేదన్నారు. అయితే ఆ తర్వాత బ్రిటిష్ వారి పాలనలో టిటిడి … ఏర్పడిన తర్వాత కారణాలు ఏవైనా గంగమ్మ అలయం అనుబంధాల ఆలయాల జాబితాలో లేకుండా పోయిందన్నారు. అయినప్పటికీ అమ్మవారికి చెల్లెలుగా ఈ ఆలయం నుంచి సారె సమర్పించే సంప్రదాయం కొనసాగుతుందన్నారు. సారె పెట్టె సంప్రదాయం మొట్టమొదటిసారిగా వందల సంవత్సరాల కిందటి నుంచే ఈ ఆలయంలో ఉందన్నారు. తొమ్మిది వందల సంవత్సరాలుగా జాతర జరిగే ఆలయంగా ప్రాచుర్యం పొందిందన్నారు. సమ్మక్క సారక్క జాతర కు, విజయనగరం జాతరకు, వెంకటగిరి పోలేరమ్మ జాతరకు మూడు వందల ఏళ్ల లోపు చరిత్ర ఉంటే… గంగమ్మ జాతరకు 900 చరిత్ర ఉందన్నారు. ఏడు రోజుల పాటు జాతర జరిగే ఏకైక ఆలయం కూడా తిరుపతి గంగమ్మ ఆలయంగా పేర్కొన్నారు. వివిధ వేషాలతో భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. ఈ సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తిరుపతి ప్రజలపై ఉందన్నారు. ప్రతి ఒక్కరు జాతరలో భాగస్వామ్యలు కావాలని భూమన పిలుపు నిచ్చారు. తిరుపతి ప్రజలందర్నీ భాగస్వామ్యులు చేయాలన్న సంకల్పంతోనే నగరంలో రెండు మూడు లక్షల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్టు తెలిపారు. దీంతో పాటు అమ్మవారి పాదాల దగ్గర ఉంచి, పూజలు నిర్వహించిన కుంకుమ ప్యాకెట్లను భక్తులకు జాతర కంటే ముందుగా చేరుస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రుల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్.కె.రోజా సారె ఇవ్వడం జరుగుతుందన్నారు. 50 డివిజన్ల కు చెందిన
50 మంది ప్రజాప్రతినిధులు కూడా సారె ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

నగరంలోని ముఖ్యమైన సంఘాలు ఆధ్వర్యంలో కూడా సారె ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు. అందరు వేషధారణలో వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా భాగస్వామ్యులు కావాలని భూమన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్, గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *