‘మేడే’ చరిత్రలో మరపురాని యోధురాలు

 

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

పురుషుల వలె స్త్రీలకి కూడా సమాన భౌతిక పరిస్థితులు అనుకూలిస్తే, పురుషులకు ఏ మాత్రం తీసిపోని పోరాట చరిత్రని స్త్రీలు సృష్టిస్తారు. స్త్రీలే ఒకడుగు ముందుంటారని లెనిన్ పేర్కొన్న సందర్భం కూడా వుంది. (కాడెట్ల పార్టీ స్త్రీల పాత్ర ప్రస్తావన సందర్భంలో) ప్రపంచ పోరాటాల చరిత్రలో స్త్రీలకు అలాంటి పాత్ర ఉంది. మేడే చరిత్రలో అది ఆవిష్కృతమైనది. ఇది పురుషాధిక్య సమాజం కావడం వల్ల స్త్రీల పోరాట చరిత్ర నమోదు కావడంలో ఎంతో కొంత విస్మరణకి గురవుతోంది. ఇదేదో ఉద్దేశ్యపూర్వకంగానే జరిగి ఉండక పోవచ్చు. ఉద్దేశ్యపూర్వకంగా స్త్రీల చరిత్రని నమోదు చేసి తీరాల్సిన కర్తవ్యాన్ని మాత్రం గుర్తు చేస్తుంది. అది అశ్రద్ధకు గురైనది. అందుకొక ఉదాహరణ మేడే చరిత్రలో ‘లూసీ పార్సన్స్’ అద్భుత పాత్ర!

ఇది నేటికి 136 ఏళ్ళ క్రితం చరిత్ర. నాటి మేడే చరిత్రలో చెరిగిపోని వీరగాధ ని స్మరించుకుని స్ఫూర్తి పొందుదాం.

అమెరికాలోని టెక్సాస్ లో బానిస కుటుంబంలో 1853లో లూసీ పుట్టింది (పూర్తి పేరు లూసీ ఎలైన్ గొంజాలేజ్.Lucy Eldine Gonzalez Parsons ) అమెరికాలో ఆనాటికి బానిసత్వం అధికారికంగా అమలులో ఉంది. (1860లో రద్దు చేశారు) నాటి బానిసల స్థితివల్ల లూసీ అనాధగా ఎదిగింది. తల్లిదండ్రుల్లో ఒకరు ఆఫ్రికన్, మరొకరు రెడ్ ఇండియన్.

అణచబడ్డ సామాజిక వర్గంలో పుట్టడంతో లూసీ అవమానాలు భరించింది. 1871లో ఆల్బర్ట్ పార్సన్, లూసీ ప్రేమించి పెళ్లి చేసు కున్నారు. పార్సన్ తెల్ల జాతీయుడు. నాడు నల్ల, తెల్ల జాతుల మధ్య పెళ్లిళ్లను నేరంగా భావించే స్థితి వుంది. టెక్సాస్ లో జాత్యహంకార ఉగ్రవాద శక్తుల నుండి ముప్పు ఏర్పడింది. చికాగో కి నివాసం మార్చారు. సోషలిస్ట్ ఉద్యమంతో సంబందం ఏర్పడింది. తొలుత *వర్కింగ్ మన్ అసోసియేషన్ ఆఫ్ USA* లో చేరారు. 1880 లో ఒక సోషలిస్ట్ సంస్థలో చేరారు. *ది అలారం* (The Alarm) పత్రికని స్థాపించారు. కార్మికవర్గ పత్రికగా నడిపారు. పార్సన్ తో పాటు లూసీ పత్రిక నిర్వాహణ, వ్యాస రచన పనుల్లో కీలక పాత్ర పోషించింది. వారు పత్రిక పనికే పరిమితం కాలేదు. కార్మికోద్యమ నిర్మాణ కర్తవ్యం చేపట్టారు. చికాగో సహా పలు పట్టణాల్లో కార్మిక సంఘాల నిర్మాణం చేశారు.

లూసీ వక్తగా ప్రసంగాలతో కార్మికవర్గాన్ని ఉర్రూత లూగించేది. ఆమె గళంతో పాటు కలం పదునైనది. వ్యాస రచయిత్రి. అసలు “మేడే కథ” లోకి వద్దాం.

మేడే నాయకుల్లో పార్సన్ కూడా ఒకరు. 4-5-1886న హే మార్కెట్ స్క్వేర్ బాంబుపేలుడు ఓ రాజకీయ కుట్ర. ఆనాటి కార్మికోద్యమాన్ని అణిచే కుట్రబుద్ధితో రాజ్యమే బాంబు పేల్చి ఎనిమిది మంది కార్మిక నేతలపై కుట్రకేసు పెట్టింది. వారిలో పార్సన్ ఒకరు. తానే లూసీ జీవిత భాగస్వామి.

పై ఎనిమిది మంది చికాగో పట్టణ ప్రజల్లో గౌరవ ప్రతిష్టలు గల వాళ్లే! పార్సన్ ఒక సోషలిస్టు పత్రిక ఎడిటర్. మరో సోషలిస్ట్ పత్రిక ఎడిటర్ ఆగస్టు స్పైస్. ఆ పత్రికలో సహాయ సంపాదకుడు మిఖాయిల్. టైప్ రైటర్ అడల్ఫ్ ఫిషర్. అందరూ నాటి పౌరసమాజంలో పేరొందిన ప్రముఖులే! నాటి బూటకపు విచారణ పై నిరసన సభలు అమెరికా, యూరోప్ లలో జరిగాయి. ఆ ఎనిమిది మందిని దృష్టిలో ఉంచుకుని *హే మార్కెట్ ఎయిట్* నినాదంగా నిరసన వెల్లువెత్తింది. ఆ నిరసన పోరులో లూసీ కాలికి బలపం కట్టుకుంది. దేశ వ్యాపిత పర్యటనలు చేసింది. కార్మిక వర్గానికి ఉత్తేజాన్నిచ్చింది.

బూటకపు విచారణ సందర్భంలో కోర్టు హాల్ లో లూసీ ఆదర్శ పాత్రని పోషించింది. ఎనిమిది మందిలో ఏడుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. లూసీ భర్త ఒకరు. బెదరకపోగా లూసీ గర్వించింది. అదే ఆమె రాజకీయ విశిష్టత!

*ఉరిశిక్షపై క్షమాభిక్ష కోరుకుంటారా?* అని పార్సన్ ని న్యాయమూర్తి అడిగాడు. *మేము కోట్లాది కార్మికుల శ్రేయస్సు కోసం, సోషలిస్టు సమాజ స్థాపన కోసం పోరాడే వాళ్ళం! మా స్వంత ప్రాణాల పరిరక్షణ కోసం క్షమాభిక్షని కోరుకునే వాళ్ళం కాదు* అని గంభీర స్వరంతో వారు కోర్టు హాలులో గర్జించారు. వారిలో లూసీ భర్త పార్సన్ ఒకరు. ఆ కోర్టు హాలులో ఉన్న లూసీ గర్వించింది. కార్మికులని నట్లేట్లో ముంచేసి, తమ ప్రాణరక్షణ కోసం వారు క్షమాభిక్షని కోరుకుంటే భవిష్యత్ లో కార్మిక వర్గం నాయకత్వాలని నమ్మదు. తీవ్ర దుష్ఫలితాలకి దారి తీస్తుంది. ఈ వాస్తవం లూసీకి తెలుసు. తన భర్త ప్రాణం కోసం కార్మికుల్ని నట్లేట్లో ముంచకూడదని లూసీ భావన! కార్మికవర్గం నిరాయుదం కారాదని ఆమె భావన! విచారణ సమయాలలో ఇద్దరు చిన్న పిల్లలతో లూసీ హాజరయ్యేది. తన భర్త బూర్జువా కోర్టుల వర్గ స్యభావాన్ని బట్టబయలు చేస్తూ చేసే ప్రసంగాలకు మురిసిపోయేది. హీనమైన క్షమాభిక్షకి బదులు ఉన్నతమైన ఉరిశిక్షని స్వాగతిస్తూ పార్సన్ చేసిన ప్రకటనపై లూసీ ఉప్పొంగింది. కోర్టు లో ఆమె ప్రదర్శించిన ధీరోదాత్తతపై కార్మికవర్గం గర్వించి జేజేలు పలికింది.

11-11-1887న పార్సన్, స్పైస్, ఫిషర్, ఏంజెల్ ల్ని ఉరితీశారు. (ఏడుగురిలో ఇద్దరికి యావజ్జీవ శిక్షగా మారింది. ఉరిశిక్ష ముందు రోజు (10-11-1887) లూయిస్ లింగ్ జైల్ లో మృతి చెందాడు. అది ఆత్మహత్యగా ప్రభుత్వం ప్రకటించింది. ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదనీ, ఆ యోధుణ్ణి కక్షతో హత్య చేశారనేది కార్మికవర్గ ఆరోపణ!

ఉరితీసే రోజు పొద్దున్నే ఇద్దరు చిన్న పిల్లలతో లూసీ భర్త చివరి చూపుకై జైలుకి వెళ్ళింది. పోలీస్ ఆమెని అరెస్టు చేసింది. కన్నబిడ్డలని కడచూపు చూసి వీడ్కోలు చెప్పే వీలు కల్పించమని కోరినా ఇవ్వలేదు. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ తన బూటకత్వాన్ని బట్టబయలు చేసుకుంది.

మూడో రోజు అంతిమ యాత్ర జరిగింది. ఆరోజు లూసీ పాత్ర కార్మికుల్ని ముగ్దుల్ని చేసింది. ఆమె ప్రదర్శించిన నిబ్బరం అలాంటిది. ప్రపంచ కార్మికవర్గం కోసం భర్త ప్రాణత్యాగంపై గర్వించిన తీరు కార్మికవర్గాన్ని నివ్వెరపరిచింది. అదే లూసీ రాజకీయ విశిష్టత! రేపటి తరాలకి విప్లవ సందేశమది. (లూసీ నాటి నుండి *లూసీ పార్సన్* గా పేరొందింది)

1888లో ఇంగ్లీష్ కార్మిక సంఘాల ఆహ్వానంతో ఆమె గ్రేట్ బ్రిటన్ లో పర్యటించి పెద్ద కార్మిక సభల్లో ప్రసంగించింది. గొప్ప ప్రేరణ ఇచ్చింది. 11-11-1891కి మేడే అమరత్వానికి ఐదేళ్ల సందర్భంగా లూసీ రాసిన వ్యాసం గొప్ప రాజకీయ ప్రభావం కలిగించింది.

1892లో ‘ఫ్రీడమ్’ పత్రిక స్థాపించి కార్మికవర్గ పత్రిక గా నడిపించింది. మేడేకి 11-11-1896కి పదేళ్లు, 11-11-1911కి పాతికేళ్లు నిండిన సందర్భాలలో లూసీ రాసిన మేడే స్మారక వ్యాసాలలో ఆమె పోరాట పటిమ చెక్కు చెదరలేదు. ఆమె పెట్టుబడిదారీ వ్యవస్థపై రాజకీయంగా నిప్పులు చెరిగింది. అదే లూసీ రాజకీయ జీవిత విశిష్టత!

చికాగో నిఘా పోలీస్ (ఇంటిలిజెన్స్) శాఖ లూసీ గూర్చి “Lucy is most dangerous than a thousand rioters” (ఓ వెయ్యు అల్లరిమూకల కంటే లూసీ అతిపెద్ద ప్రమాదకారి) అనే వ్యాఖ్య చేసింది. నాటికి లూసీ వయస్సు 67 ఏళ్ళు! భర్తను కోల్పోయి 34 ఏళ్ళు! ఐనా అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ ఆమెని ఎంత రాజకీయ బద్ధశత్రువుగా చూస్తుందో కదా! అది లూసీ విప్లవ జీవిత చరిత్రకు కితాబు! (ఇటీవల 2016 లో లూసీ జీవితం పై The nation magazine విడుదల చేసిన short film కి ‘more dangerous than a thousand rioters: The Revolutionary life of Lucy Parsons’ అనే పేరు పెట్టడం గమనార్హం)

11-11-1936కి మేడే పొరుకి యాబై ఏళ్ళు! అప్పటికి లూసీ వయస్సు 83 ఏళ్ళు! ఆ సందర్భంగా ఆమె మేడే జ్ఞాపకాలతో రాసిన వ్యాసంలో కూడా కార్మికవర్గం పట్ల నిబద్దత సడలలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థపై రాజకీయ ద్వేషం తగ్గలేదు. ఆమె యావజ్జీవితం కార్మిక వర్గం కోసం, బాధిత రంగు జాతుల ప్రజల హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం పాటుపడింది. చరిత్రలో లూసీ స్థానం చిరస్మరణీయమైనది.

లూసీ మొదటి నుండి సోషలిజంకై పోరాడింది. అది మార్క్సిస్టేతర సోషలిజం! (Anarchic socialism) కానీ అనేక స్వానుభవాలతో లూసీలో రాజకీయ పరివర్తన కలిగింది. రెండో ప్రపంచ యుద్ధం తలుపుతట్టే వేళ, ఫాసిజం బుస కొట్టే వేళ, దానిపై సోవియట్ రష్యా మాత్రమే ప్రతిఘటించే సామర్ధ్యం కలిగి ఉందని నమ్మకం ఏర్పడి, 1939 లో లూసీ మార్క్సిజాన్ని స్వీకరించింది. కమ్మునిస్ట్ పార్టీసభ్యత్వం పొందింది. నాటికి ఆమె వయస్సు 86ఏళ్ళు! ఆమె రాజకీయ జీవితంలో ఓ మలుపు!

లూసీ తొంబై ఏళ్ల వయస్సులో 7-3-1942 న ఒక అగ్ని ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మరణం పెట్టుబడిదారీ వర్గానికి పెద్ద ఆనందం కలిగించింది. వెంటనే ఆమె ఇంటిని నిఘా పోలీస్ అధికారులు సోదాచేసి, గ్రంధాలయం సహా కాగితాలు, లేఖలు స్వాధీనం చేసుకొని సూక్ష్మ విశ్లేషణ చేశారు. ఆమె మరణించాక కూడా వారికి ఎంత భయమో!

లూసీ భౌతికకాయానికి చికాగో నగర కార్మికవర్గం అత్యంత గౌరవ స్థానం కల్పించింది. విప్లవనివాళి అర్పించింది. నలుగురు మేడే యోధుల స్థూపాల చెంతనే లూసీ స్మారక స్తూపాన్ని కార్మికవర్గం నిర్మించింది. తాను ఏ వీర యోధులతో భుజం కలిపి పనిగంటల తగ్గింపు కోసం పోరాడిందో, ఏ వీరుల రాజకీయ సహాచర్యాన్ని విప్లవపోరాట గమనంలో భౌతికంగా 56 ఏళ్ల క్రితం కోల్పోయిందో, ఆ వీర యోధుల చెంతకి చికాగో కార్మికవర్గం లూసీని చేర్చింది. ఏ భౌతిక జీవిత బంధం పార్సన్ తో ముడి వేసుకుందో, కార్మికవర్గ విప్లవాశయ బాటలో అది భౌతికంగా తెగిపోయింది. తమ పని గంటల తగ్గింపు కై పోరువల్ల లూసీకి పార్సన్ భౌతిక ఎడబాటు అయ్యాడని కార్మికవర్గం భావించిందేమో! అట్టి జీవిత భాగస్వామితో 56 ఎళ్ళ ఎడబాటు తర్వాత సంలీనం చెందే ప్రయత్నం కాబోలు! దీర్ఘకాల భౌతిక ఎడబాటు తర్వాత పార్సన్ అమర ప్రేమబాహు బంధాల కౌగిలిలో లూసీ కలిసి పోయింది. మేడే పోరాట చరిత్రలో లూసీకి సమ, సహ భాగస్వామ్యతల్ని చికాగో కార్మికవర్గం సమున్నత రీతిలో కల్పించింది. మేడే సంస్మరణ కార్యక్రమాల్లో లూసీ పాత్రని మరిచి పోకుండా స్మరిద్దాం.

లూసీ అంటరాని నల్లజాతిలో పుట్టింది. అమ్మ, నాన్నని చిన్నప్పుడే కోల్పోయింది. అనాధగా పెరిగింది. భర్తని ఉరితీసిన వెంటనే ఒక పిల్లని కోల్పోయింది. ఇల్లూ, వాకిలీ లేదు. శ్రామికవర్గం కోసం సర్వం ధార పోసింది. అట్టి ఎన్నో అవమానాలు భరించింది. ప్రపంచ చరిత్రగతిని ఒక కాలంలో మేడే పోరాటం మలుపు తిప్పింది. అట్టి మేడే కార్మికవర్గ చరిత్రలో ఆమె సమున్నత స్థానం పొందింది. లూసీ చరిత్రని స్మరిద్దాం. విప్లవ స్ఫూర్తి పొందుదాం. భవిష్యత్తు లో విప్లవ, ప్రజాతంత్ర పోరాటాల్లో లూసీని రాజకీయంగా స్మరిస్తూ నిత్యస్ఫూర్తి పొందుదాం. లూసీ అమర్ హై!

(ఇఫ్టూ ప్రసాద్ (పిపి), IFTUజాతీయ కార్యదర్శి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *