LB నగర్ దక్కన్ క్రానికల్ భూమి మాయం!

హైదరాబాద్ లో  పెద్ద పెద్ద వాళ్ల భూముల వ్యవహారాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. వాళ్లు తలచుకుంటే వందలకోట్ల విలువయిన భూములు సునాయాసంగా చేతులు మారతాయి. ఆ భూములను ఎన్ ఫోర్స్ మెంటు డైెరెక్టొరేట్ ఎటాచ్ చేసినా సరే చేతులు మారతాయి. నిర్మాణాలు సాగుతాయి. అవి అక్రమమో సక్రమమో తెలుసుకుందామనుకుంటే జిహెచ్ ఎంసి సాధారణ పౌరులను ఖాతరు చేయదు.ఇది పెద్ద వాళ్ల వ్యవహారం కాబట్టి వాటి మీద వచ్చే ఫిర్యాదులను పట్టించుకోరు. మరీ ఎక్కువ వత్తిడి తెస్తే,  రాష్ట్ర విభజన సమయంలో ఫైల్ మిస్సయిందంటారు. దీనికి తిరుగుండదు. అపుడేం చేయాలి? అదొక పెద్ద కన్ ఫ్యూజన్.

ఈ కన్ ఫ్యూజన్ ఎవరో అనామకుడయిన యాదగిరికో, ఎల్లయ్య పుల్లయ్యలకో ఎదురు కాలేదు.  భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడికి ఎదురైంది. హైదరాబాద్  ఎల్ బి నగర్ ప్రాంతంలో రు. 500 కోట్ల విలువ చేసే ప్లాట్  ఒకటి  ఒక కంపెనీకి కేటాయించారు. అది దివాళా తీసింది. తర్వాత కంపెనీ ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టొరేట్ (ED)ఎటాచ్ చేసింది. ఇక ఈ భూమి కేసు తేలేదాాకా కదలదు, మరొకరి చేతికి వెళ్లదు. అయితే, ఇలా ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టొరేట్ చేతిలో ఉన్న భూమిలో ఒక ప్రయివేటు కన్ స్ట్రక్షన్ సంస్థ ఇపుడు  భారీ నిర్మాణాలు చేపట్టింది. ఇదెలా సాధ్యం?  ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు ప్రయత్నించి విఫలమయిన బిజెపి జాతీయ నాయకులొకరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విషయం వెల్లడించారు.

స్పందించని GHMC మీద శేఖర్ రావు ఆగ్రహం

 

 

ఆయన పేరు పేరాల శేఖర్ రావు. ఆ భూమి దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ సంస్థది. ఈ భూమిలో ఇపుడు శేఖర్ రావు చెబుతున్న  ’అక్రమ నిర్మాణాలు’ సాగిస్తున్నది  ఎల్ బి నగర్ , దిల్ షుక్ నగర్ ఏరియాలా బాగా వేళ్లూని కుని ఉన్నటిఎన్ ఆర్ గ్రూప్  కన్ స్ట్రక్షన్ కంపెనీ.

శేఖర్ రావు   చాలా కాలం భారతీయ జనతా పార్టీకీ ఈ శాన్య రాష్ట్రాల వర్కింగ్  కార్యదర్శిగా ఉన్నారు.  నలభై ఏళ్ల ఆర్ ఎస్ ఎస్ అనుబంధం ఆయనది.  తర్వాత బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడయ్యారు. ఆపైన ఆయన కేంద్రంలో నెహ్రూ యువక కేంద్ర వైఎస్ ఛైర్మన్ గా ఉన్నారు. ఇపుడాయన ఖాదీ ఇండస్ట్రీస్ కమిషన్ దక్షిణ భారత అధ్యక్షుడు. ఇంత హోదాలో ఉంటూ  ఈ భూమి ఎలా ఇడి గుప్పిటినుంచి బయటకొచ్చింది, ఎలా  టిఎన్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ కు వెళ్లింది, ఇది అన్యాయం కాదా, అయితే గియితే ఈ భూమి మళ్లీ ప్రభుత్వానికి దక్కాలి  అని  కనక్కునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.

ఫైల్ మాయమయిందట

మొదట ఆర్ టి ఐ  ( RTI) కింద  ఒక దరఖాస్తు చేశారు. ఏమని? ఈ భూమిని జివొ ఎం ఎస్ నెం. 206, తేదీ 27.02.2009  ద్వారా దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కు అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కారుచౌకగా  కేటాయించింది. అప్పటికే ఇది చాలా విలువయిన భూమి. ఈ జివొకు సంబంధించిన ఫైలు ప్రతిని ఇవ్వాలని ఆయన RTI కింద దరఖాస్తు చేశారు.  ప్రభుత్వం నుంచి ఆయనకు ఏం సమాధానం వచ్చిందో తెలుసా?  2014 లో రాష్ట్ర విభజన సమయంలో ఈ జీవొ కు సంబంధించిన ఫైల్ మాయమయింది (missing)అని. అదెట్లా? ఇంత విలువలయిన భూమికి చెందిన ఫైలు మిస్సయితే ఎలా? ఎవరు బాధ్యులు, మిస్సయిందని భూమిని ప్రభుత్వం వదలుకుంటుందా?  దానికి సమాధానం లేదు.

EC ఎటాచ్   మెంట్…

దక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ సంస్థకి ఈ భూమిని కేటాయించారు. అయితే, వాళ్లు ఇందులో  ఒక షెడ్ వేసి వదిలేశారు. తర్వాత ఏమయిందో ఏమో  ఈ దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ అనే సంస్థ దివాళా తీసింది.  సిబిఐ, ఇడి ఎంక్వయిరీ మొదలయింది. సంస్థ ఆస్తులను ఇడి ఎటాచ్ చేసింది. ఇందులో భాగంగా  జివొ ఎం ఎస్ నెం. 206, తేదీ 27.02.2009 ప్రకారం ఈ కంపెనీకి  సరూర్ నగర్ పరిధి లోని,రంగారెడ్డి కోర్టు భవనాల సముదాయం పక్కన, సర్వే నెంబర్  13, 14 , 15లో  6357 గజాల భూమి ని కూడా ఇడి ఎటాచ్ చేసింది. ఈ భూమి ఇడి కస్టడీ లో భద్రంగా ఉండాలి. ఉండలే. చేతులు మారింది. అదే మాయా జాలం అంటున్నారు శేఖర్ రావు. దీనికి కారణమెవరు?

TNR  Group రంగ ప్రవేశం.

ఇపుడు TNR Group  Constructions ఈ భూమిలో భారీగా నిర్మాణాలు చేపడుతూ ఉంది. అక్కడ ఈ సంస్థ వాణిజ్య సముదాయం, ఫ్లాట్స్ నిర్మాాణం కొనసాగిస్తుంది. ప్రభుత్వం ఒక వార్తా పత్రికకు కేటాయించిన భూమిలో, అందునా ఇడి ఎటాచ్ చేసిన భూమిలో ప్రయివేటు నిర్మాణ సంస్థ ఇలా నిర్మాణాలు కొనసాగించడం ఏమిటి? దీని మీద శేఖర్ రావు జిహెచ్ ఎంసి , ఎల్ బి నగర్ జోనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చి ఉంటే దాని ప్రతులను ఇవ్వండని కోరారు.  ఇలా చేసి నలభై రోజులయింది. దీనికి స్పందన  లేదు. ఇవి  అక్రమ నిర్మాణాలు కాదు, అనుమతులున్నాయని చెప్పడం లేదు.  నిర్మాణాలను నిలిపి వేయలేదు. అసలు బిజెపి జాతీయ నాయకుడిని లేఖని జిహెచ్ ఎంసి ఖాతరు చేసినట్లు లేదు. నలభై  రోజులయినా   స్పందన లేకపోడవంతో  ఆయన ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భూమికి సంబంధించిన వివరాలు మీడియాకు అందించారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఇక్కడ అక్రమ నిర్మాణాలను నిలిపివేసి ప్రజలకు పని కొచ్చేలా ఒక విద్యాసంస్థనో, ఆసుపత్రినో కనీసం  లాల్ బహదూర్ శాస్త్రిపేరు ఉన్న ఈ ప్రాంతంలో ఒక కళా కేంద్రమో కట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా? వేచి చూద్దాం.

నేటి విలేకరుల సమావేశంలో శేఖర్ రావు విడుదల చేసిన ప్రకటన ఇదే:

 

సరూర్ నగర్ పరిధి లోని, రంగారెడ్డి కోర్టు భవనాల సముదాయం పక్కన, సర్వే నెంబర్  13, 14 , 15లో  6357 గజాల భూమిని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు 2009 సంవత్సరంలో  గజానికి రు. 7000 చొప్పున  కేటాయించింది. దీనికి సంబంధించి జివొ ఎం ఎస్ నెం. 206, తేదీ 27.02.2009  విడుదలయింది.  ఆ భూమి అప్పటి రిజిస్ట్రేషన్ విలువ  గజానికి రు. 18000. మరియు మార్కెట్ విలువ  రు.100000. పైమాటే. పత్రిక అవసరాలకు తక్కువ ధరకు భూమిని పొందిన దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ఆ తదుపరి దివాళా తీయడం జరిగింది. దానితో తమకు కేటాయించిన స్థలంలో   చిన్క రేకుల షెడ్ మాత్రమే నిర్మించి మిగతా భూమిని ఖాళీగా వదిలేయడం జరిగింది.

 

దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కు చెందిన వివిధ ఆస్తులను ఎటాచ్ మెంట్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్  (ఇ డి) తేదీ 15.10.2020న ఈ స్థలాన్ని కూడా ఎటాచ్ చేయడం జరిగింది. కాని ప్రస్తుతం  TNR Connstructions అనే సంస్థ ఈ స్థలంలో పెద్ద ఎత్తున కమర్షియల్ ఎపార్ట్ మెంట్లను నిర్మాణాన్ని చేపట్టింది. దీనిపై మేమే  గతంలో సిబిఐ,  ఇడి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దక్కన్ క్రానికిల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు స్థలాన్ని కేటాయించిన జివొ. ఎం. ఎస్ నెంబర్ 206,తేదీ, 27.02.2009 సంబంధించిన ఫైల్ పూర్తి ప్రతులును ఇవ్వవలసిందిగా RTI ద్వారా ప్రభుత్వానికి  దరఖాస్తు చేయగా, విభజన సమయంలో ఆఫైల్ పోయిందని (missing) సమాధానం వచ్చింది. ప్రస్తుతం అక్కడ అక్రమ నిర్మాణం జరుగుచున్నదంటూ GHMC, LB నగర్  జోనల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరగింది. ఈ స్థలంలో నిర్మాణానికి అనుమతులు ఉన్నట్లయితే, పత్రాల ప్రతులు ఇవ్వమని GHMC ఎల్ బినగర్ కార్యాలయంలో  దరఖాస్తు చేసి 40రోజులుగ గడిచినా సమాధానం రావడం లేదు. ఫిర్యాదు చేసి నెలలు గడిచినా అక్రమనిర్మాణాన్ని నిలిపివేయడం లేదు.

ప్రస్తుతం సుమారు 500 కోట్ల  విలువ చేసే ఈ భూమిని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకుని అక్కడ విద్యాసంస్థ లేదా ఆసుపత్రి లేదా లాల్ బహదూర్ కళా కేంద్రం నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *