‘మే డే’ సందేశమిదే…

*చరిత్రగతిలో కార్మిక పోరాటాల్ని మలుపు తిప్పేదే 136వ మేడే!

*హక్కుల నుండి పని దినం వైపు దారిలో ఒక మలుపు 136వ మేడే!

*కార్మికోద్యమ విస్తరణ కై పెట్టుబడిదారీ వర్గం ఇచ్చే కొత్త అవకాశాల్ని వినియోగించుకుందాం

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

చేసిన పనికి కూలి పెంపుదల కోసం కంటే, చేయాల్సిన పని గంటల *తగ్గింపు* కోసం సాగిన కార్మికవర్గ పోరాటాలకు రాజకీయ ప్రాధాన్యత వుంది. వీటిలో ఒకటి *తగ్గింపు* కై సాగే ప్రక్రియ కాగా; మరొకటి *పెంపు* కై సాగిన ప్రక్రియ! వీటిలో *కూలి సైజు* పెంపుదల కోసం కంటే *పని గంటల * తగ్గింపుకై సాగిన పోరాటాలకే అత్యధిక రాజకీయ ప్రాధాన్యత ఉండటం విశేషం! దానికి ఓ సజీవ ఉదాహరణయే మేడే కార్మిక పోరాటం!

మేడే కాలం నాటికి గల కార్మికవర్గ భౌతిక పరిస్థితి ఓ రకమైనది. తదనంతర కాలంలో ఏర్పడ్డ భౌతిక పరిస్థితి తద్భిన్నమైనది. తొలికాలంలో భౌతికస్థితి *శ్రమ కాలం* తగ్గింపు కోర్కెకోసం పోరాడేందుకు అనువైనది. ఆ తర్వాత కాలంలో *శ్రమ ఫలం* కోర్కెకోసం పోరాడాల్సిన కొత్త భౌతిక పరిస్థితి ఏర్పడింది. *శ్రమకాలం* డిమాండ్ పై పోరాడే దశ కొలిక్కి వచ్చిన తర్వాతే *శ్రమ ఫలం* డిమాండ్ కోసం పోరాడాల్సిన కొత్త భౌతికస్థితి ఏర్పడటం గమనార్హం! పాత భౌతిక పరిస్థితిని మార్చి, కొత్త భౌతికస్థితి ఏర్పరచడంలో *మేడే పోరాటం* ఒక ముఖ్య పరివర్తనా పాత్రని పోషించడం గమనార్హం!

మానవజాతి చరిత్రలో ఆధునిక కార్మికవర్గ చరిత్ర సముద్రంలో ఓ కాకిరెట్ట వంటిది. ఈ కార్మికోద్యమ పోరాట చరిత్రతో పోల్చితే *శ్రమ కాలం* తగ్గింపు కోసం సాగిన కార్మికవర్గ పోరాటాల చరిత్రకి అతి తక్కువస్థానం వుంటుంది. దానికంటే *శ్రమ ఫలం* కోసం చేసిన పోరాటాలకే అధిక స్థానం లభిస్తుంది.

ఇల్లు కట్టుకునే వరకు ఇంటి నిర్మాణం పై దృష్టిని కేంద్రీకరిస్తారు. ఒకసారి ఇంటి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇంట్లో సామగ్రి, సామాన్లు, పందిరి, పెరడు వంటి వాటిపై కేంద్రీకరించడం సహజమే! పనిగంటల పై పరిమితి లేని స్థితిని ఇల్లు నిర్మాణం చేయని దశతో పోల్చవచ్చును. చరిత్రలో దాన్ని సుసాధ్యం చేసిందే *మేడే పోరాటం!*

*మేడే పోరాటం* జరిగి నేటికి 136 ఏళ్లు! నాటికి కార్మికవర్గం జీతభత్యాల మెరుగుదల కై పోరాడే భౌతిక స్థితి ఏర్పడలేదు. PF, ESI, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి ఈనాటి చట్టబద్ద హక్కుల మాట ఆనాటికి ఉనికిలో లేదు. ఇలా *పని గంటల* డిమాండ్ నుండి *పనికి ఫలం* డిమాండ్ కి కార్మికవర్గాన్ని నడిపించడంలో *మేడే పోరాటం* కీలక పాత్రని పోషించింది.

(నిజానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో *పనికి తగ్గ ప్రతిఫలం* పొందే వీలు లేదు. శ్రమ దోపిడీ వ్యవస్థ రద్దు కాకుండా సాధ్యం కాదు. జీతభత్యాల పెంపుదల కై సాగే సమ్మె పోరాటాలు శ్రమఫలంలో ఎక్కువ వాటాకై జరిగేవి మాత్రమే! ఐతే సాధారణ భాషలో *పనికి ఫలం* కై పోరాటాలని చెప్తారు. ఇది వాడుకలో చెప్పేది తప్ప శాస్త్రీయ అర్థంలో కాదు.)

చరిత్ర గమనం నిత్యం సరళ రేఖలోనే సాగదు. అది సదా పురోగమం వైపే సాగదు. అది కొన్నిసార్లు వెనక్కి గెంతు వేస్తుంది. దానిపై కార్మికవర్గ చరిత్ర గమనం ఆధారపడి వుంటుంది. ఈ నేపధ్య దృష్ఠితో నేటి కార్మికవర్గ చరిత్రగతిలో వస్తోన్న మార్పుల్ని చూడాలి.

ఇది ప్రపంచ వ్యాపిత పరిణామమే! భారత దేశానికి మినహాయింపు కాదు. కార్మికవర్గ భౌతిక స్థితిగతుల్లో మౌలిక మార్పుని తెస్తోంది. అది తిరోగమన దారిలో కొత్త భౌతికస్థితి ఏర్పరుస్తోంది. దానికి గుర్తు *పనిగంటల పెంపుదల* కై కార్పొరేట్ వర్గాల తాజా వ్యూహం!

1990 వ దశాబ్దంలో ప్రపంచీకరణ విధానాలతో ఈ తిరోగమన ప్రక్రియ ఆరంభమైనది. ఇప్పటి వరకు చాలా తిరోగమన మార్పులు వచ్చాయి. ఐతే అవి కార్మికవర్గాన్ని 1886 వద్దకు తీసుకెళ్ళేవి కాదు. భారత కార్మికవర్గం విషయానికి వస్తే, అవి 1947 కి ముందు దశకు తీసుకెళ్ళేవి మాత్రమే! ఇంకా చెప్పాలంటే, ట్రేడ్ యూనియన్ చట్టాన్ని బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చే కాలం వరకీ తీసుకెళ్ళేవి. (పై చట్టం చేసింది 1926 లో) తాజా పరిస్థితి 136 ఏళ్ల క్రితానికి తీసుకెళ్లేది.

గత మూడు దశాబ్దాల తిరోగమన చర్యలకి ఒక పరిమితి ఉంది. వాడుక భాషలో చెప్పాలంటే *పనికి ప్రతిఫలం* లో ఒక్కొక్క రాయితీలను వెనక్కి తీసుకోవడం జరిగింది. పోరాటాలతో గతంలో సాధించుకొని అనుభవించే మెరుగైన జీవన సౌకర్యాల్ని వెనక్కి తీసుకున్న కాలమిది. కానీ తద్భిన్నంగా కుటుంబ జీవితాల్ని స్వాధీనం చేసుకునేందుకు నేడు దాడి జరుగుతోంది. అదే *శ్రమ కాలం* పెంపుకై జరిగే తిరోగమన దాడి!

ఇది మన కార్మికులకు అర్ధమయ్యే సరళ భాషలో చెప్పాలంటే, గత ముప్పై ఏళ్లలో పెరడు కబ్జాతో ప్రారంభమై, క్రమంగా పందిరి పీకడం, ఇంటి సామగ్రి, సామాన్లు కబళించే చర్యల్ని చేపట్టి, ఇంటిని నివాస యోగ్యం కాకుండా చేసారు. నేడు ఇళ్లు కూల్చేపనికి దిగారు.

నేటి వరకు ఒక ఎత్తు! ఇకనుంచి మరో ఎత్తు! మేడే కార్మిక త్యాగాలతో చరిత్రలో ఒకనిర్దిష్ట దశలో 8 గంటల పనిదినం అమలులోకి వచ్చింది. ఆ తర్వాత పని గంటల పోరాటానికి ప్రాసంగీకత లేకుండా పోయింది. ఐతే పని గంటల తగ్గింపు కై మేడే పోరాట ప్రాసంగీకత కొనసాగుతూ వచ్చింది. అదో పోరాటస్ఫూర్తి ఇచ్చేది. హక్కుల కోసం పోరాటాలకు కూడా అది ఉపకరిస్తుంది.

ఎనిమిది గంటల పని దినం అమలు జరిగిన సంఘటిత రంగ కార్మిక వర్గానికి పనిదినం సమస్య పై పోరాడే అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు చట్టబద్ధంగానే పని గంటల పెంపుదల కోసం కార్పొరేట్ వర్గాల నుండి ప్రయత్నాలున్నాయి. అందుకే ఏదో ఒక మేరకు 1886 నాటి పాత భౌతిక స్థితిగతులు ఏర్పడే కొత్త స్థితి ఏర్పడుతోంది.

భారత కార్మికవర్గంలో నేడు 90 శాతానికి పైగా అసంఘటిత రంగంలోనే ఉంది. కరోనా కాలంలో బయటపడి వెలుగులోకి వచ్చిన వలస కార్మికులు కూడా వీరిలోనే వున్నారు. వీరికి కార్మిక సంఘాలు లేవు. ముఖ్యంగా వలస కార్మికవర్గానికి లేవు. ఇక సంఘటిత కార్మికులు దేశ కార్మికవర్గంలో ఏడెనిమిది శాతం మంది మాత్రమే వున్నారు. నిజానికి కార్మిక సంఘాలు లేని చోట్ల మేడే కార్యక్రమాలు దాదాపు కొనసాగడం లేదనే చెప్పాలి. నూటికి తొంబై మంది కార్మికులకు మేడే సంస్మరణ సాంప్రదాయం పాటించే రాజకీయ స్థితి లేదు. దానిని ఇష్టంగానో, కష్టంగానో పాటిస్తోన్న సంఘటిత కార్మికవర్గంలో నేటివరకు 8 గంటల పని దినం అమలు జరిగింది. అదిప్పుడు కోల్పోతోంది.

ఎప్పటి నుంచో తొంబై శాతం కార్మికవర్గానికి భరించలేని *శ్రమకాలం* ఓ గడ్డు భౌతిక స్థితి ఉంది. నిజానికి వారికి *మేడే పోరాట స్ఫూర్తి* పొందే రాజకీయ స్థితి లేదు. నిజానికి అటు *భౌతిక స్థితి* ఇటు *రాజకీయ స్థితి* అసంఘటిత కార్మికులకి ప్రతికూలంగా ఉండేది. ఆ స్థితి కొత్తగా మారి, ఇటు సంఘటిత, అటు అసంఘటిత రంగాల కార్మికవర్గాల మధ్య తేడాల్ని క్రమంగా తగ్గిస్తోంది.

హక్కులు లేని వారికి కొత్తగా పోయేది లేదు. హక్కులు అనుభవించే వారే వాటిని గత ముప్పై ఏళ్లు గా కోల్పోయారు. ముప్ఫై ఏళ్ల కార్మిక పోరాటాలు, సమ్మెలు, ఆందోళనలు ప్రధానంగా సంఘటిత కార్మికవర్గ కోర్కెలపై కొనసాగాయి. అవి ప్రధానంగా ఇళ్ళు ఉన్నోళ్ల బాధలే! ఇళ్లు లేకుండా ఉన్నోళ్లవి కాదు. నిజానికి ప్రాధమిక నివాస వసతి కూడా లేని వారి కోసమే *మేడే పోరాటం* ప్రాసంగీకత కలిగివుంది.

తేనెతుట్టె కదిలింది. ఇళ్ళు ఉన్నోళ్ల ఇళ్లను పీకివేసే పనికి మోడీ సర్కార్ ద్వారా బడా కార్పొరేట్ వర్గాలు నేడు పూనుకుంటున్నాయి. అంటే సంఘటిత రంగ కార్మికవర్గం అనుభవించే 8 గంటల పనిదినం కూడా ప్రమాదంలో పడుతోంది. ఇప్పటికే ఇళ్లు లేని 90 శాతం మందితో ఇళ్లున్న 10 శాతం మందిని మోడీ ప్రభుత్వం కలిపివేస్తోంది. ఇక అందరికీ 8గంటల పనిదినం ఆవశ్యకత పెరుగుతోంది.

కారణాల సమీక్షలోకి వెళ్లడం లేదు. కానీ భారత కార్మికోద్యమం మాత్రం సాపేక్షికంగా బలహీనంగా ఉంది. ముఖ్యంగా వలస శ్రామికవర్గంతో సహా అసంఘటిత రంగ కార్మికవర్గంలో సంఘ నిర్మాణ ప్రక్రియ దాదాపు లేదనే చెప్పాలి. (అసలే లేదని కాదు) ఈ వాస్తవిక భౌతిక స్థితిగతుల్ని సమగ్ర సమీక్ష చేసుకొని శ్రామికవర్గ విప్లవ శక్తులు భవిష్యత్ కర్తవ్యాల్ని రూపొందించుకోవాల్సి వుంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా నేడు పెట్టుబడిదారీవర్గం కార్మిక వర్గం మీద దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. అదే సమయంలో తనకు తెలియకుండానే నేడు శ్రామికవర్గానికీ అది కొత్త అవకాశాల్ని ఇస్తుంది. నేటివరకు చట్టబద్ద హక్కుల్ని, సౌకర్యాల్ని, సదుపాయాల్ని అది మింగింది. నేడు పనిదినం పైకి దాడికి దిగుతోంది. అంటే నేటివరకు పెరడు, పందిరి, సామగ్రిల్ని అది కబ్జా చేసింది. నేడు ఇళ్లు కూల్చే పనికి దిగుతోంది. ఇప్పటి వరకు ఇళ్లు లేని 90 శాతం మంది వద్దకు 10 శాతం మందిని కూడా చేర్చే పనికి కార్పొరేట్ వ్యవస్థ దిగుతోంది. అంటే నేడు 10 శాతం లోపు కార్మికులు జరుపుకునే *మేడే* ని ఇకనుండి నూటికి నూరు శాతం మంది జరుపుకోవాల్సిన కొత్త భౌతికపరిస్థితిని ఏర్పరుస్తుండటం విశేషం! కార్పొరేట్ వ్యవస్థ తనకు తెలియకుండానే భారత కార్మికవర్గాన్ని సమైక్యం చేసి సంఘటిత పరిచే పాత్రను పోషిస్తోంది.

కార్మిక చట్టాల్ని రద్దు చేసి, లేబర్ కోడ్లు తెచ్చి, రేపో మాపో అమలుకు వెళ్లే కాలంలో వున్నాం. (మొన్న ఏప్రిల్ 1 నుండి అమలు చేయాల్సి ఉంది. మోడీ ప్రభుత్వం కొంత కాలం పొడిగించింది) వాటి అమలుతో పాత భౌతిక స్థితి మారి, కొత్త భౌతికస్థితి ఏర్పడటానికి దారితీసే అవకాశం ఉంది.

రేపటి కొత్త భౌతిక స్థితి పాతహక్కులు, సౌకర్యాల కోసం కంటే, పనిగంటల వంటి మౌలిక కోర్కెలకై పోరాడే అవకాశాల్ని కల్పించి తీరుతుంది. ఇది ఊహాజనిత అంచనాతో చెబుతున్నది కాదు. ఇది సమాజ చలన సూత్రాల ఆధారంగా చరిత్రగతిని విశ్లేషించి చెబుతున్నది మాత్రమే!

రోజుకు 24 గంటలుంటే, అందులో మూడు ముఖ్య విభాగాలు గా చేసి మేడే కార్మిక పోరాటం క్రింది పోరాట సందేశమిచ్చింది.

*పరిశ్రమకై 8 గంటలు
*విశ్రాంతికై 8 గంటలు
*వినోదంకై 8 గంటలు

పై మూడింటి కోసం జరిగే పోరాటం విధి, *విశ్రాంతి* *వినోదం* (వి.వి.వి) కోసం జరిగే పోరాటంగా చెప్పొచ్చు. అది ఉద్యోగ భద్రత, ప్రభుత్వరంగ పరిరక్షణ, గ్రాట్యుటీ, పెన్షన్, PF, ESI వంటి హక్కులకై జరిగే పోరాటాలతో పోల్చితే భిన్నమైనవి. అట్టి కొత్త కార్మికవర్గ పోరాటాలకు సానుకూల భౌతిక స్థితి ఏర్పడుతోంది. ఈస్థితిలో 136వ మేడే వస్తోంది. ఈ సందర్భంగా కార్మికవర్గ సమీకరణ చేసి కొత్తరకం పనివిధానంతో నూతన పోరాటాలకు సరైన సమయంగా వుంటుంది. అందుకై 136వ మేడే సందర్భంగా దీక్షవహిద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *