తెలంగాణ ప్రజాస్వామ్యం ఎలా ఉంది?

డాక్టర్. యస్. జతిన్ కుమార్

“భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటాము. అంటే ఇక్కడ ప్రజలే స్వాములు. ప్రజలే ప్రభువులు కావాలి. ప్రజల పక్షాన అధికార బాధ్యతలు వహిస్తున్న వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని మన్నించాలి. కానీ దురదృష్టవశాత్తు అటు అధికార సిబ్బంది కానీ, పాలక వర్గం కానీ ప్రజల ఇబ్బందులను తెలుసు కోవటానికి కూడా సిద్ధంగా లేరు. ప్రశాంతంగా సమావేశమయ్యే ప్రజల హక్కును నిరాకరిస్తున్నారు. వారి గోడు వినిపించే అవకాశాలను ఆటంక పరుస్తున్నారు  ప్రజల వాక్స్వాతంత్ర్యాన్ని హరించి వేస్తున్నారు. కనీసం ప్రజా సంస్థల ప్రతినిధులను కలవటానికి కూడ  అధికారులు ఇష్ట పడటం లేదు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఈ పాలనా వ్యవస్థను ప్రజాస్వామ్యం అనగలమా?” శ్రీ సోలిపేట రామచంద్రా రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు,87 సంవత్సరాల వయోవృద్ధ నేత 28-04-2022 న గ్రామీణ పేదల సంఘం నిర్వహించిన శిబిరంలో పలికిన మాటలివి.

“నావంటి వృద్ధులు కన్నకలలకు, ప్రస్తుతం దేశంలో నడుస్తున్న పాలక వ్యవస్థకు సారూప్యత లేదు. ప్రజాసమస్యలు పరిష్కరించటం పక్కన  పెట్టండి , ఆందోళన చెందుతున్న ప్రజా సమూహాల ఆవేదనను కూడా వినని దుస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారిపోయింది” అని ఆయన తన బాధను వ్యక్తపరిచారు.

 దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల పై తమకు హక్కులు కల్పించాలని, గిరిజన, గిరిజనేతర  పేద సాగుదారులను  రెవెన్యూ, ఫారెస్టు, పోలీసు శాఖలు చట్టం పేరు చెప్పి భూములనుండి వెళ్ళ గొడుతున్న తీరును నిరసిస్తూ, ఆ భూములలో వ్యవసాయం చేసుకోవటానికి పెద్దఎత్తున లంచాలు వసూలు చేస్తున్న అధికారుల అవినీతిని, ఇవ్వని వాళ్ళపై  అమలు చేస్తున్న దౌర్జన్యాలనీ, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తేవటంకోసం, నిర్దిష్టమైన తమ డిమాండ్లు వినిపించటం కోసం గ్రామీణ పేదల సంఘం తెలంగాణ ఏజన్సీ ప్రాంతాలలోని పేద ప్రజల మహాప్రదర్శన నిర్వహించటానికి సమకట్టింది.

రెండు వారాల ముందుగానే ప్రభుత్వ దృష్టికి తెచ్చి తగిన అనుమతులకోసం దరఖాస్తు చేసుకుంది. స్థానిక తహశీల్దారులు, కలెక్టర్లు, ఐటిడిఎ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, నిరసన ప్రదర్శ నలు, ధర్నాలు నిర్వహించినా సమస్య తీరక పోగా, రోజురోజుకూ తమపై దౌర్జన్యాలు పెరిగి పోతుండటంతో విసిగి వేసారి  పోయిన పేదలు పెద్దఎత్తున, వేలాదిగా హైదరాబాదు తరలి వచ్చారు.అనుమతి గురించి తేల్చకుండా, ఏవేవో కుంటి సాకులు చెబుతూ సంఘం బాధ్యులను ఆఫీసుల చుట్టూ తిప్పుకున్న అధికారులు ఆఖరి నిమిషంలో అనుమతి నిరాకరించారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంఘం మీద పొంతన లేని ఆరోపణలు చేస్తూ అడ్డుపడ్డారు. ఒకానొక విప్లవ పార్టీ అనుబంధ సంస్థ కనుక అనుమతి ఇవ్వకూడదని, నెల రోజులుగా తెలంగాణ మొత్తం పెద్దఎత్తున ప్రచారం చేశారని, అధిక సంఖ్యలో గిరిజనులు హైదరాబాదులో ప్రవేశిస్తే, శాంతి భద్రతల సమస్య తలఎత్తుతుందని వాదించారు. 500 పేజీల నిఘా శాఖ రిపోర్టులు, అనేక అప్రస్తుతమైన ఫైళ్ళు  సమర్పించి  అనుమతి రాకుండా శత విధాల ప్రయత్నించింది అధికారవర్గం. “ఇవి నిషేధిత సంస్థలు కావు” అన్న ఒకే అంశంతో  కోర్టు అనుమతి మంజూరు చేసింది కానీ  ప్రధాన ఉద్దేశమే వమ్ము అయ్యేలా కేవలం 200 మంది ప్రదర్శకులనే అనుమతించింది. కోర్టు కూడ వేలమంది ప్రజలు నగర శివారులలో ఆగిపోయే పరిస్థితి కల్పించింది. ప్రజలకు అవకాశం ఇచ్చినట్లు కనిపించినప్పటికీ, నామమాత్రపు ధర్నాను అనుమతించి ప్రభుత్వ ప్రయోజనాలకు అనుకూలంగానే  కోర్టు తీర్పుఇచ్చినట్లు భావించాలి.

ఈ విషయం 27 వ తేదీ సాయంత్రం 5 గంటలకు కానీ తేల్చలేదు. ఆ పైన పోలీసు డిప్యూటీ కమీషనరు విధించిన దాదాపు ఇరవై షరతులు, నిబంధనలు చూస్తే ఈ ప్రభుత్వ స్వభావం మరింత నగ్నంగా బయట పడుతుంది. ఏ ఒక్క చిన్న నిబంధనను పాటించకపోయినా నిర్వాహకులను విచారించి శిక్షిస్తామని  [ప్రాసిక్యూట్ చేస్తామని] అందుకు ఒప్పుకుంటున్నట్లుగా  బాధ్యుల నుంచి సంతకాలు తీసుకున్నారు. పదే పదే వారిని వేధిస్తూ, భయపెడుతూ ప్రదర్శన ముగిసే వరకూ పోలీసులు వారి వెన్నంటే వున్నారు.

ఎలాంటి ఆంక్షలు విధించారంటే…

పరిమిత సంఖ్యలో పాల్గొనాలని, ధర్నా స్థలం వద్ద ఎలాటి  రాలీలు తీయ కూడదని, రోడ్డు షో కానీ, ప్రదర్శన గాని చేయకూడదని, ప్రచార బెలూన్లు, డ్రోన్ కెమెరాలు వాడకూడదని, ఒక్క బాక్స్ మైకు మాత్రమే వాడాలని, పెద్ద ధ్వని చేయకూడదని, బ్యానర్లు, నినాదాలు, ఉపన్యాసాలలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని, మొత్తం కార్యక్రమం, ఉపన్యాసాలు పూర్తిగా వీడియో చిత్రీకరించి పోలీసులకు ఇవ్వాలని, నాయకుల, ఉపన్యాసకుల పూర్తి వివరాలు ముందుగానే సమర్పించాలని, అప్పటికప్పుడు పోలీసులు ఇచ్చే ఆర్డర్లు పాటించాలని, పరిసర ప్రాంతాలలో నివసించే వారి నుంచి ఏ విధమైన అభ్యంతరాలు రాకూడదని, అలా జరిగితే ధర్నా రద్దు చేయవలసి వుంటుందని, సభ ముగిశాక ఊరేగింపుగా వెళ్లకూడదని, విడివిడి వ్యక్తులుగానే అక్కడినుంచి వెళ్లిపోవాలని, రక రకాల అప్రజాస్వామిక  నిబంధనలతో అడుగడుగునా అడ్డుతగులుతూ, చికాకు పరిచారు. అధిక సంఖ్యలో పోలీసులు ధర్నాశిబిరం చుట్టూ చేరి భయబ్రాంతులు సృష్టించారు.

ప్రజల ఆందోళన అంటే అంత భయమెందుకు?

ప్రజలన్నా, వారి ఆందోళనలు, ఉద్యమాలు అన్నా ప్రభుత్వం ఎంతగా భయపడుతున్నదో  అర్థమవుతుంది. తమ భయాన్ని దాచుకోవడానికే అది నిరంతరం ప్రజలపై నిరంకుశంగా విరుచుకు పడుతున్నది. ఈ నియమ నిబంధనలు కేవలం ఈ ఒక్క సందర్భానికి ప్రత్యేకంగా తయారు చేసినవి కావు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అందరిమీద విధిస్తున్నవే. తమ రాజకీయ ప్రత్యర్థుల సభలపైన కూడా ఇలా నిబంధనల కొరడా విసరడం పాలక పార్టీల నైజంగా మారిపోయింది. ప్రజల పై ఎంత  కఠినమైన నిఘా, నిగరానీలు అమలు చేస్తున్నారో! ఇందిరపార్క్, ధర్నాచౌక్ అనేది  ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయటానికి  ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రదేశం.[దాన్ని తెరిపించటానికి కూడా ఉద్యమాలు జరిగాయి] అక్కడ కూడా ఇన్నిషరతులు విధిస్తుంటే, ధర్నాకు అనుమతిని నిర్ణయించేది పోలీసులంటే, ఈ విధానం ప్రజాస్వామికమని భావించగలమా? సంఘ నాయకులు  కేంద్రప్రభుత్వ ప్రతినిధిగావున్న  గవర్నరును, ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ ప్రతినిధి సి,యస్. ను కలిసి తమ డిమాండ్లను వినిపించేందుకు కూడా అవకాశం నిరాకరించారు. సెక్యూరిటీ సిబ్బందికి మెమోరాండం ఇచ్చి వెళ్లిపొమ్మన్నారు. దీన్నిఎలా అర్ధం చేసుకోవాలి? ఇందులో శాంతి భద్రతల సమస్య ఏమిటి? రాష్ట్రాన్ని, లక్షలాది పేదలను  అట్టుడికింప చేస్తున్న పోడు  సమస్యను గురించి వినటానికి రెండు నిమిషాల టైమ్ లేదా  బాధ్యతాయుత పదవులలో వున్నవారికి?  

  గస్తీ నిషాన్ తిర్పన్  గుర్తుందా? 

ఈ విధంగా, ప్రజల హక్కులను నియంత్రిస్తున్నది పోలీసుయంత్రాంగమే. ఈ స్థితి గతం నుండీ వస్తున్నదే. ఎమర్జెన్సీ పాలన (1975-77) కాలంలో  దీనిని పోలీసు రాజ్యం అనే పిలిచేవారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, కాంగ్రెసేతర పార్టీలు  అన్నీ కూడా  దీనినే  అనుసరించాయి. మునుపటి నిజాం ప్రభుత్వం యొక్క అపఖ్యాతి పాలైన “గస్తీ నిషాన్ తిర్పన్ (సర్క్యులర్ నంబర్ 53)” వారసత్వమే ఇది.  శాంతి భద్రతలను నియంత్రించే పేరుతో, అన్నీ రకాల ప్రజా నిరసనలను దాదాపుగా నిషేధించటమే ఇది. ప్రత్యేక  తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రోజుల్లో ఈ చట్టాలను, పోలీసుల అధికారాన్ని ఎన్నోమార్లు నేటి పాలకులు తీవ్రంగా విమర్శించే వారు. తెలంగాణ రాష్ట్రంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్ అధికారులు విధించిన ఇలాంటి కఠినమైన ఆంక్షలకు స్థానం ఉండదని, టీ ఆర్ ఎస్ హామీ ఇచ్చింది. తన 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నఆ పార్టీయే ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తోంది. తమది అత్యంత ప్రజా-అనుకూల, రైతు అనుకూల, ప్రజా స్వామిక  ప్రభుత్వం అని చెప్పుకుంటున్నది. ఎన్నోసంస్కరణలు చేపడతామని వాగ్దానాలు చేస్తున్నది. అయితే ఆచరణలో ఆ వాగ్దానాలన్నీ గాలికి పోయాయి. టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ స్వభావం- ప్రజలపై, ముఖ్యంగా గ్రామీణ పేదలపై దాని నిర్దాక్షిణ్యమైన అణచివేత చర్యల ద్వారా బయట పడుతు న్నది.

 గ్రామీణ పేదలు, ముఖ్యంగా ఆదివాసీలు తలపెట్టిన శాంతియుత ధర్నాకు అనుమతి నిరాకరించడం పూర్తిగా అప్రజాస్వామికం. ఇంతకు ముందు వేలాది మంది పాల్గొనే ఇలాంటి ధర్నాలు, సమావేశాలు, ఇతర రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వడం జరిగేది. కొద్ది రోజుల క్రితం శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజున కర్రలు, కత్తులతో భారీ ఊరేగింపులు నిర్వహించేందుకు హిందుత్వ బ్రిగేడ్ కు ఈ  ప్రభుత్వమే  అనుమతి ఇచ్చింది. పేద ప్రజల  రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాపాడటానికి బదులుగా న్యాయస్థానాలు కూడా  ప్రభుత్వ వాదనలను పరోక్షంగా సమర్థిస్తూ, ప్రజలను తొక్కి పెడుతున్నాయి.  ఇక్కడ పాలక పక్షాలు, బ్యూరోక్రసీ, పోలీసులు, న్యాయస్థానాలు- ప్రజల ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడానికి, ము

ముఖ్యంగా భూమి, జీవనోపాధి కోసం పోరాడుతు న్న  గిరిజన, గిరిజనేతర పేదల ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడానికి కలిసి పనిచేస్తున్నఒక ఆధునిక వికృత వ్యవస్థ పురుడు పోసుకుంది.

గ్రామీణ పేదల భూమి మరి ఇతర హక్కుల కోసం జిపిఎస్ తన పోరాటంలో భాగంగా, పోడు-సాగుదారులకు సంఘీభావంగా గిరిజన, గిరిజనేతర పేదలను సమీకరించడానికి ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసింది. వారి సమస్యలు తీర్చవలసిన ప్రభుత్వం పేద రైతుల  స్వేచ్ఛను, జీవనోపాధిని తొలగించి వేసేందుకు ప్రయత్నిస్తోంది. వారి హక్కులను పరిరక్షించాల్సిన రాజ్యాంగ యంత్రాంగాన్ని ఉపయోగించి వారి  ఉత్సాహాన్ని, ఉద్యమాలను ఆర్పడానికి ప్రయత్నిస్తోంది. దీన్ని ప్రజాస్వామ్యం అని ఏవిధంగా అనుకోగలం?

 

Dr Jatin Kumar
Dr Jatin Kumar

(డాక్టర్. యస్. జతిన్ కుమార్, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు )      

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *