‘తెలంగాణ దీక్షపై  విమర్శలు ఆపండి’

(జోగు అంజయ్య)
ఇటీవలి కాలంలో కేసీఆర్ గారు తీసుకుంటున్న ప్రభుత్వ మరియు రాజకీయ నిర్ణయాలను సాకుగా తీసుకొని విపక్షాలు చేస్తున్న విమర్శల దాడులు తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంటున్నవి. అధికారం కోసం పోరాడండి కానీ అవమానకరంగా మాట్లాడకండి.
తెలంగాణ దీక్ష మన కోసమే జరిగింది. విజయవంతమైనది. అప్పటి కాలంలో కేసీఆరే మన బలం. మనమే కేసీఆర్ కు   బలం.
దీక్ష ఏవిధంగా చేసినా ఇప్పుడు మనం పోస్టుమార్టం చేయడం అవసరం లేదు.
ఇలాంటి విమర్శలు ఆంధ్ర వాళ్ళు కూడా చేయడానికి ముందుకు రాలేదు. తెలంగాణ వాళ్ళు చేయడం సిగ్గు చేటు. ఉద్యమ ఎత్తుగడలలో  మనం చేసిన అనేక పోరాటాలకు ముగింపు గౌరవప్రదంగా జరగడంలో కేసీఆర్ చేసిన దీక్ష, శ్రీకాంతచారి త్యాగం ,సకలజనుల సమ్మె ,మిలియన్ మార్చ్ లాంటి ఎన్నో సంఘటనలు మన గుండెలలో నిలిచిపోయినవి. ఆ జ్ఞాపకాలను ఎల్లప్పుడూ విలువైనవిగా చూడండి. దొంగ దీక్ష అనకండి. వ్యక్తిగత లోపాలను మీ అవసరాలకు వాడుకోకండి.
తెలంగాణ అభివృద్ధి రాజకీయ పార్టీల ఐక్యతా సహకారం పైనే ఆధారపడి ఉంది. ఈ విషయం కేసీఆర్ మరిచిపోయిన మాట వాస్తవమే. అందరిని దూరం చేసుకున్న ఫలితమే నేడు ఎదుర్కొంటున్న ప్రజాగ్రహం . ఇది ఎన్నికలలో కనపడుతుంది. దీనిని విపక్షాలు సరిగా ఉపయోగించుకోకపోతే మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతది.
విధానాలు చెప్పకుండా విమర్శలే బలం అనుకుంటే అది లక్ష్య సిద్ధికి సరిపోదు. ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టి జాతీయ పార్టీలను ప్రజలు ఇష్ట పడాలంటే అవి చేస్తున్న పనులలో ప్రజలకు జరిగే మేలు ఎంత కార్పొరేట్లకు పంచే సంపద ఎంత అన్నది ఇప్పటికే తెలిసిపోయింది. ప్రజలు మేలుకతోనే ఉన్నారు. ఎవరూ కండ్లు మూసుకోలేదు.
తెలంగాణ తెచ్చిన వారి  స్వీయ తప్పిదాలతో అధికారం కోల్పోతే మరొక ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఇచ్చిన వారు  ఉండాలే తప్ప మిగతా వారు కాదు. ప్రతిపక్షంలో ఉండి మద్దతు ఇచ్చినంత సులభంగా అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఒప్పుకునే వారు కాదని ప్రజలు గమనించాలి.
నేటి యువతరం రాజకీయాలను నిశితంగా గమనించాలి. పై పై మెరుగులకు మోసపోవద్దు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అనురిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక వైఖరి క్షమించరానిది.
వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నపప్పుడు ప్రతి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం గోరమైన తప్పిదంగా ప్రతి ఇంటి వంట గదిలో చర్చ జరుగుతుందంటే ఆ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లే. దీనిని రాజకీయ పార్టీలు తెలివిగా వాడుకోవాలి. తిట్టుడు కాదు రాజకీయ చతురతను పరిణతను చూపాలి.

(జోగు అంజయ్య, జనగామ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *