కోవిడ్ జాగ్రత్తలు మరోసారి: వైద్యుడి సలహాలు

డాక్టర్ . యస్. జతిన్ కుమార్
 దేశంలో కోవిడ్ మూడవ తరంగం వువ్వెత్తున తలెత్తుతోంది. రోజువారీ కేసుల సంఖ్య శరవేగంగా లక్షలకు చేరుకుంటోంది. హాస్పిటల్ లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్త ఒమెక్రాన్ కోవిడ్  ప్రమాదకరం కాదని, మామూలు జలుబు లాగానే వచ్చి పోతుందని ఒక ప్రచారం వున్నది. అయితే ఒక వ్యక్తికి సోకింది డెల్టానా? వొమైక్రానా అన్నది తెలియదు[అన్నీ సందర్భాలలోనూ ఇది నిర్ధారించటం లేదు].
మొన్నటి గణాంకాలలో  50 వేల కేసులలో కేవలం 3 వేలు మాత్రమే ఒమైక్రాన్  కాగా మిగతవన్నీ డెల్టా లేక ఇతర వేరియంట్ల నుండి  సంక్రమించి నవే. కనుక ఒక  వ్యాధిగ్రస్థుడు తనకు వచ్చిన కోవిడ్ గురించి ఆందోళన చెందటంలోను, హాస్పిటల్ కు పరుగెట్టడం లోనూ అసహాజమేమీ లేదు. “కొద్ది పాటి లక్షణాలు వుంటే హాస్పిటల్ అవసరం లేదు” అని డాక్టర్లు చెబుతున్న మాటలు వారికేమీ ధైర్యాన్ని ఇవ్వవు.
రెండవ వేవ్ లో  సంభవించిన మరణాలు తలచుకుని అనేకమంది భయ పడుతున్నారు. మరోవంక- టీకాలు తీసుకున్నాము గదా అని కొందరూ,మాకు ఇదివరకే వచ్చిపోయింది , మళ్ళీ వచ్చినా ప్రమాదమేమీ వుండదని  కొందరు,  దీన్ని తేలికగా  తీసుకుంటున్నారు.
భయానికి దూరంగా వుండటం, వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవటం మంచిదే, కానీ నిర్లక్ష్యం, సాచివేత ఎంత మాత్రం పనికి రావు. కనుక అందరూ  వ్యాధిబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం తప్పని సరి. వాక్సినేషన్ తీసుకున్నవాళ్ళు- మూడో  డోసు కోసం పరుగులు తీయటం బదులు- కోవిడ్  జాగ్రత్తలు పాటించడం మంచిది.
 కోవిడ్ జాగ్రత్తలు, వాటి  సమాచారం  అందరికీ తెలిసినవే. బాగా ప్రసిద్ధి, ప్రచారమూ పొందినవే. కానీ, వినీ వినీ విసుగెత్తిన వాళ్ళు, వాటి అవసరాన్ని విస్మరిస్తున్నారు. మొదటి దశలో లాగా పట్టించుకోవటం లేదు. ఆచరించటం లేదు. కనుక వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని తిరిగి అమలు చేయటం అత్యవసరం. ఇప్పుడు వినిపిస్తున్న భయానక నివేదికల మధ్య ఈ జాగ్రత్తలు తెలుసుకోవడం, పునశ్చరణ చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
బహిరంగ  ప్రదేశాల వినియోగం:
 తలుపులు మూసివుంచిన, ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాలను నివారించండి. ఎల్లప్పుడూ బాగా వెలుతురు వచ్చే బహిరంగ ప్రదేశాలనే  ఉపయోగించండి. “సినిమా హాళ్లు, మాల్స్, ఎయిర్ కండిషన్డ్ రైళ్లు, డిపార్ట్ మెంట్ స్టోర్లు, టెక్స్ టైల్ స్టోర్లు మొదలైనవాటికి  వెళ్ళకండి. లేదా అతి తక్కువగా వాడుకోండి . హోటళ్లలో కూడా అతి తక్కువ సమయ మే గడపండి. హోటళ్ల యజమానులు అల్పాహారం తీసుకోవడానికి వచ్చే వ్యక్తులకు బయట సీటింగ్ ఇవ్వవచ్చు. చిన్న చిన్నటీ దుకాణాలు,స్నాక్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు కూడా లోపల సీటింగ్ ప్రాంతాలను మూసివేసి, బయటే  టీ, కాఫీ, స్నాక్స్ అందించాలి ” అని తమిళనాడు మాజీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్), కొలందై సామి అంటున్నారు.
పాఠశాల తరగతి గదులలో, గాలి వెలుతురు సక్రమంగా ప్రసారం జరగాలి. గాలి, వెలుతురు చక్కగా ప్రసారం అవుతు న్నగదులలోని విద్యార్ధులతో పోలిస్తే, అవి తక్కువున్న గదులలోని  విద్యార్ధులలో ఆరు రెట్లు ఎక్కువ కోవిడ్ కేసులు  నమోదు అయ్యాయి [ ఒక  స్విస్ అధ్యయనం ] 
ఇది పార్టీల సీజన్ కూడా, మూసిఉన్న, గాలి వెలుతురు లేని హాళ్లలో చిన్నసమావేశాలను కూడా నివారించాలి. ప్రతిదీ ఆరుబయటకు తరలించండి. మనుషులు ఒకరికొకరు కాస్త భౌతిక దూరం పాటించేలా  తిరగడానికి  అవసర మైన ఖాళీ స్థలాన్నిఏర్పాటు చేయండి. బాగా వెలుతురు వచ్చే ప్రదేశాలలో వైరస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ.
Dr Jatin Kumar
Dr Jatin Kumar
ఆసుపత్రులలో వ్యాధి సంక్రమణం నియంత్రించాలి : 
ఆసుపత్రులు, ప్రైవేట్ వైనా,పభుత్వమైనా రెండూ, కోవిడ్-19 సంక్రామ్యత నియంత్రణ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆసుపత్రులు కూడా కోవిడ్-19 వ్యాప్తికి విస్తృత వనరుగా ఉండవచ్చు. ఆ ఆసుపత్రిలో కోవిడ్  వ్యాధి గ్రస్తులకు  చికిత్స చేయకున్నా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. రొగులు కానీ సందర్శకులు కానీ కోవిడ వైరస్ ను కలిగివుండే అవకాశం వుందని  గుర్తించాలి.
“మీరు ప్రభుత్వ ఆరోగ్య శిబిరాలను చూస్తే, అది కోవిడ్-19 కోసం కావొచ్చు లేదా ఇతర వ్యాధుల కోసం కావచ్చు, అవి చాలా వరకు ఆరుబయలు, చెట్ల నీడ, మొదలైనచోట్ల నిర్వహించబడతాయి. ఇది మంచి పని.  అనుమానిత కోవిడ్-19 రోగుల స్క్రీనింగ్, టెస్టింగ్ కూడా గాలి వీచే ప్రదేశాలలోనే చేయాలి. కోవిడ్-19 క్లినిక్ ల తలుపులు, కిటికీలు తెరిచి ఉండాలి. గాలి ప్రసరణ పుష్కలంగా ఉండాలి. వైద్య కళాశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వారి కార్యకలాపా లలో కొన్నింటిని మార్చవలసిన అవసరం ఉంది – అవుట్ పేషెంట్ చికిత్సను హాస్పిటల్ ఆవరణలోని  బహిరంగ ప్రదేశాలలో నడపవచ్చును. ఇది రోగ  ప్రసారాన్ని సంక్రమణాన్ని  తగ్గించడానికి సహాయపడుతుంది” అని డాక్టర్ కొలందైసామి తెలిపారు.ఇలాంటి బహిరంగ ప్రదేశాలలో జరుగుతున్న కాంపులు, టీకా కేంద్రాలు, లేక టెస్టింగ్ సెంటర్ల ను చూసి ప్రజలు భయపడుతుంటారు. అనేక చోట్ల తమ కాలనీలలో వాటిని ఏర్పాటు చేయకుండా అడ్డు పడటం కూడా చూసాము. అక్కడ  తయారయ్యే జీవవ్యర్ధ పదార్ధాలను జాగ్రత్తగా నిర్మూలించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఇటువంటి బహిరంగ ప్రదేశాలే వ్యాధి వ్యాప్తిని నియంత్రించ గలుగుతాము .    
 ఆసుపత్రులలో వివిధ విభాగాల సంప్రదింపులు, విభిన్న సమయాలలో ఏర్పాటు చేయాలి. రోగులందరూ ఒకే సమయంలో ఆసుపత్రికి వచ్చి, సాధారణ వెయిటింగ్ రూమ్ లో ఎక్కువ సమయాన్ని గడపకుండా ప్రతి వారికి నియమిత సమయం [అపాయింట్‌మెంట్ ] ఇవ్వాలి. ఏ వ్యాధికోసం హాస్పిటల్ కు వెళుతున్నా, రోగులు కచ్చితంగా అపాయింట్‌మెంట్ తీసుకుని అదే టైముకు వెళ్ళి సాధ్యమయినంత తక్కువ సమయంలో పని పూర్తిచేసుకుని రావాలి. దీనివల్ల కరోనా వ్యాప్తి అయ్యే అవకాశాలను తగ్గించ గలుగుతాము. 
మహమ్మారి మొదటి, రెండవ తరంగాల సమయంలో చేతి పరిశుభ్రత [సానిటైజేషన్]  గురించి జాగ్రత్త తీసుకున్నారు. కడిగీ, కడిగీ చేతులు అరిగిపోయాయి అని జోకులు వేసుకునేవారు.  అయితే ఓమి క్రాన్ కేసులు పెరగడంతో, ఇంటి లోపలకానీ,  బయటకు వచ్చినప్పుడు కానీ,  చేతులను తరచుగా కడుక్కోవడం మళ్ళీ కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది .చేతులు కడుగుకునే  సౌకర్యాలు లేని లేక తీసివేసిన ప్రదేశాలు చాలా  కనిపిస్తున్నాయి.  ఇందులో కళ్యాణ  మందిరాలు, ఆసుపత్రులు, వందలాది మంది గుమి కూడే, పార్టీ హాళ్లు, సమావేశ గదులు, దేవాలయాలు, ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రదేశాలలో చేతులు కడుక్కునే సౌకర్యా లు  కల్పించాలి. కచ్చితంగా అమలు చేయాలి. ఒక భవనంలోకి అడుగు పెట్టేటప్పుడు,బయటకు వచ్చేటప్పుడు, మనం చేతులు కడుక్కోవాలి. ఇది నిజంగా ఒక మార్పును కలిగిస్తుంది.
ఇంట్లో కూడా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు మాస్క్లు ధరించాలి, వేరుగా వుండాలి.  మాస్కులు ధరించడం చాలా ముఖ్యమైనది. “ఎంత చెప్పినా దాని ప్రాధాన్యతను తగినంతగా నొక్కి చెప్పలేము,” అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రజలు జనసమూహాలలో దగ్గరగా ఉన్నప్పుడు, మూసి వుంచిన ప్రదేశాలలో వున్నపుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. 
పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పిహెచ్ ఎఫ్ ఐ) అధ్యక్షుడు డాక్టర్. కె. శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, “కోవిడ్-19 సోకిన వారు ఎవరైనా ఉన్నారు- అనే అనుమానం వుంటే  ఇంట్లో కూడా మాస్క్ ధరించడం అవసరం, వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఇది కీలకం. ఇంట్లో, ఎవరైనా అనారోగ్యంతో ఉండి, కరోనా రోగలక్షణాలు ఉన్నట్లుగా కనిపించి నట్లయితే, టెస్టింగ్ కు ముందు కూడా, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి  ఇతరులనుంచి విడిగా వుండాలి. ఐసోలేట్ చేసుకోవాలి, తమంతట తాము భౌతిక దూరాన్నిపాటించాలి “
“మీరు చిన్న సమావేశాలను నిర్వహించాలని అనుకుంటే, వాటిని బహిరంగ ప్రదేశాల్లోఏర్పాటు చెయ్యండి. ఇది వ్యాధి  ప్రసారం అయ్యే ప్రమాదాన్ని చాలా  తగ్గిస్తుంది. వస్తువుల కొనుగోలు కోసం, వెంటిలేటెడ్ [ సహజమైన గాలి, వెలుతురు పుష్కలంగా వుండే]  ప్రదేశాలలోనే  ప్రయత్నించండి. జనసమూహాలను నివారించండి” అని ఆయన అన్నారు.
మాస్కులు. భౌతిక దూరం, పరిశుభ్రత  అనే ఈ మూడు జాగ్రత్తలు అత్యంత ఎక్కువ రక్షణ కలిగించే మార్గాలని;  టీకాల కంటే మిన్నగా మీకు వ్యాధి సోకకుండా కాపాడగలవని గుర్తించండి. అతి తేలికయిన ఈ పద్దతులు  నిత్యం పాటించి, ఈ మూడవ తరంగాన్ని కూడా ఎదుర్కోవడం అందరి బాధ్యత.
(డాక్టర్ సూర్యదేవర జతిన్ కుమార్, ఆర్ధోపెడిక్ సర్జన్, హైదరాబాద్)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *