గత వారం హరిద్వార్ లో జరిగిన “ధర్మ సంసద్” సందర్భంగా హిందుత్వ సాధువులు చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మీడియాలో వాటికి అనుకూలంగాను, విరుద్ధంగాను కూడా అనేక కథనాలు వెలువడ్డాయి.
‘హరిద్వార్ వద్ద మానవ మారణకాండకు పిలుపులు : ముస్లింల భద్రతపై ప్రశ్నలు’,
‘హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగంపై భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు:భారత్ దర్యాప్తుకు ఆదేశించింది’ ,
‘మారణహోమం కోరుతున్నవారిని అరెస్టు చేయండి : పౌర సమాజం, విద్యార్థి సంఘాలు’
‘ధరమ్ సంసద్’కు వ్యతిరేకంగా నిరసనలు’
‘అత్యవసర న్యాయ జోక్యం అవసరం’: ముస్లిం వ్యతిరేక ద్వేష పూరిత ప్రసంగాలపై సిజెఐకి ఎస్సీ న్యాయవాదులు లేఖ రాశారు’
ఇలా అనేక వార్తలు వచ్చాయి. వీటిపై శ్రీ అశుతోష్ భరద్వాజ్ కథనానికి ఇది స్వేచ్ఛానువాదం. శ్రీ భరద్వాజ ఒక స్వతంత్ర పాత్రికేయుడు. అవార్డు గెలుచుకున్న “ది డెత్ “స్క్రిప్ట్ రచయిత.
గత వారం హరిద్వార్ లో ధర్మ సంసద్ సందర్భంగా హిందుత్వ సాధువుల ఉద్రేకపూరిత ప్రసంగాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించగా, వారి కౌమార బాల, బాలికలకు ఆయుధాల శిక్షణ ఇవ్వడం, ఒక సాయుధ అప్రమత్త బ్రిగేడ్ ను అభివృద్ధి చేయడం వంటి ఇతర కార్యకలాపాలు అంతగా గుర్తించబడలేదు.
స్వామి ఆనంద్ స్వరూప్, సంసద్ లో ఇలా అన్నారు: “ప్రభుత్వాలు మా డిమాండ్ ను వినకపోతే, మేము 1857 తిరుగుబాటు కంటే చాలా భయంకర మైన యుద్ధం చేస్తాము.” అతను, 2019 లో ఏర్పడిన శంకరాచార్య పరిషత్ కు నాయకత్వం వహిస్తు న్నాడు. 11000 మంది సాయుధ అప్రమత్తుల బృందం [కాళీ సేనను] కూడా నడుపుతున్నాడు. “మేము శాస్త్ర సమ్మత శస్త్రాన్ని (లేఖనాల ద్వారా గుర్తించబడిన ఆయుధాలు), సమయం వచ్చినప్పుడు ఉపయోగించటానికి లైసెన్స్ కలిగిన ఆయుధాలను వుంచుకుంటాము” అని అతను ది ఇండియా కేబుల్ తో మాట్లాడుతూ అన్నాడు. “ఈ సైన్యాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం వుందని” నొక్కి చెప్పాడు.
ఈ సమావేశంలో పాల్గొన్న పండిట్ అధీర్ కౌశిక్ హరిద్వార్ లో “అఖండ పరశురామ్ అఖాడా”ను నడుపు తున్నాడు. పిల్లలకు ఆయుధాల శిక్షణ ఇవ్వడమే దీని ఏకైక ఉద్దేశ్యం. అతని అఖాడా యొక్క వీడియోలలో, లేతవయసు బాలురు, బాలికలు- కత్తులు, గొడ్డళ్ళు ,ఈటెలను ఉపయోగించడంలో శిక్షణ పొందుతున్న దృశ్యాలు వున్నాయి. కొన్ని వీడియోల్లో అమ్మాయిలు పోటీలలో ఒకరితో ఒకరు పోట్లాడుతుంటారు. “ఇది పిల్లల విశ్వాసాన్ని బలపరుస్తుంది,” అని కౌశిక్, ది ఇండియా కేబుల్ తో మాట్లాడుతూ అన్నాడు , “మాకు శస్త్రం (ఆయుధాలు) మరియు శాస్త్రం (లేఖనాలు) రెండూ అవసరం” అని స్పష్టం చేశాడు. .
హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ భారతి అలియాస్ పూజా శకున్ సాయుధ బృందాలను పెంచాలనే పిలుపును గట్టిగా సమర్థిస్తారు. హరిద్వార్ కార్యక్రమంలో, “మీరు వారి[ముస్లింల] పని పూర్తి చేయాలనుకుంటే, వారిని చంపండి. వారిలో 20 లక్షల మందిని చంపడానికి మనకు 100 మంది సైనికులు అవసరం.” “మేము మన మాతృదేశాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి, ఆత్మరక్షణకోసం సిద్ధమవుతున్నాము. స్వామి వివేకానంద కూడా 100 మందిని అడిగారు. ప్రజలు సైనికులుగా మారడానికి ప్రేరేపించడం నేరమా?” అని ఆమె ‘ది ఇండియా కేబుల్’ ను అడిగింది. “మీరు ఆర్మీ స్కూళ్లలో ప్రజలకు బోధిస్తారు, స్ఫూర్తిని అందిస్తారు. దాన్ని ద్వేషపూరిత ప్రసంగ మంటామా?” అని ఆవిడ అంటోంది. “ నేను నా ప్రజలతో ఒక హాలులో మాట్లాడుతున్నాను. అందులో తప్పేము౦ది?” అని ఆమె ప్రశ్నిస్తోంది. తనకు గణితంలో పిహెచ్ డి వుందని , ఒక కళాశాలలో బోధించానని, 2014-15 లో హిందూ మహాసభలో చేరి, 2017 లో “సన్యాస్” తీసుకున్నట్లు గా ఆమె పేర్కొంది.
“ఇస్లాంతో పోరాడటానికి మేము ఒక సైన్యాన్ని సృష్టించాలి” అని నిరంజని అఖాడాకు చెందిన దర్శన్ భారతి చెప్పారు, ఇది గత 1,300 సంవత్సరాలుగా అఖాడాల సంప్రదాయం అని ఆమె నొక్కి చెప్పారు. వసీం రిజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి, పూజా శకున్ పాండే అలియాస్ అన్నపూర్ణ భారతి, నిరంజని అఖాడా, ధర్మదాస్ మహారాజ్ యొక్క మహామండలేశ్వర్ – ఈ హిందుత్వ నాయకులు వారి వీడియోల విస్తృత సర్క్యులేషన్ ను ఆస్వాదిస్తున్నారు, ఈ వీడియోల ప్రచారం వారి లక్ష్యానికి సహాయపడుతుందని వారు భావిస్తున్నారు.
భవిష్యత్ చర్యలను నిర్ణయించడానికి 20 మంది నాయకులతో వారి ప్రధాన కమిటీ రేపు సమావేశమవుతుంది. “ప్రతిపక్షానికి ఇస్లామిస్టులు నిధులు సమకూర్చు తున్నారు. మా సంసద్ ను వక్రీకరించి తప్పుగా చూపిస్తు న్నారు. భారత్ ను హిందూ రాష్ట్రగా మార్చడమే మా లక్ష్యం. భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించడానికి మేము రేపు సమావేశ మవుతున్నాము” అని స్వామి ఆనంద్ స్వరూప్ ది ఇండియా కేబుల్ కు చెప్పారు.
వారిపై కేసుల దాఖలును వ్యతిరేకిస్తూ, దర్శన్ భారతి “ఈ కేసు ఖురాన్ కు వ్యతిరేకంగా ఉండాల్సింది, అది బహిరంగంగా హత్యలకు పిలుపునిస్తుంది” అని చెప్పారు. నరేంద్ర మోడీతో, రక్తపిపాసి ధరమ్ సంసద్ లోని ఈవక్తలు – చాలా మంది అనుకునే దానికంటే దగ్గరసంబంధాలు కలిగి ఉన్నారు. బిజెపితో వారి సంబంధం ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభతో నాథూరామ్ గాడ్సేకు ఉన్న సంబంధంతో సమానంగా కనిపిస్తోంది. వారు సైద్ధాంతికంగా బిజెపితో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ, “బిజెపి ప్రభుత్వాలు కావలసినంత హిందువుగా లేవనీ, ముస్లింలను అరికట్టడానికి వారు తగినంత చేయటం లేదని” భావిస్తున్నారు.
“మేము ప్రభుత్వాలకు రక్తంతో లేఖలు రాశాము,” అని కౌశిక్ చెప్పారు, ‘ముస్లింలు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండకూడదనే’ చట్టం అవసరం- అని ఆయన నొక్కి చెప్పారు. “రామ మందిర ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినవారు ఏ గౌరవానికి నోచుకోలేదు. ఎక్కడా వాళ్ళ కీర్తి గానమే లేదు” అని వారు కోపంగా అ న్నారు. “చాలా బాధ వేస్తుంది. మా కుటుంబాలు నాశనమయ్యాయి” అని కౌశిక్ చెప్పారు. “బిజెపి తన ఎజెండాను మరచిపోయింది. సాధువులు కోపగి౦చుకుంటే, వారు ఘోర౦గా బాధపడ వలసి వస్తుంది.” అని ఆయన అ౦టున్నాడు.
ఆర్ఎస్ఎస్, మహాసభలతో తన తొలి శిక్షణను పొందిన గాడ్సే చివరికి వారు అనుసరించే “రాజ్యాంగ పంధా ” (కోర్టు ముందు తన అఫిడవిట్ లో ఉపయోగించిన పదబంధం) తో తన భ్రమనుండి బయట పడ్డాడు. వేరేమార్గం అనుసరించాడు. దాని పర్యవసానాలు ఇంకా బయటపడుతూనే వున్నాయి.స్వామి ఆనంద్ స్వరూప్ మాట్లాడుతూ, “శాంతిభద్రతలను కాపాడటానికి వారు (బిజెపి) రాజ్యాంగంపై ప్రమాణం చేసినప్పటికీ, మేము మాత్రం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని గీతపై ప్రమాణం చేసాము.” అని తమ వైఖరిని స్పష్టం చేశారు. ఈ హిందుత్వ బ్రిగేడ్ ఎంచుకున్న మార్గం ఇంత స్పష్టంగా ఉంది.