సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ చిచ్చు

ఇటీవల విజయవాడ లో జరిగిన ప్రజాగ్రహ సభలో భారతీయ జనతా పార్టీ తీరు , వక్తలు మాట్లాడిన మాటలు దేశ వ్యాప్త విమర్శ లకు దారితీశాయి. ముఖ్యంగా ఏ.పి.బి జే. పీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు రఘుపతి వెంకటరత్నం నాయుడు(1862-1939) గారు జరిపిన సామాజిక ఉద్యమాన్ని అవమానించేవిగా ఉన్నాయి.
ఆయన ఆశయాలు”మత్తు పానీయాల నుండి పూర్తిగా దూరంగా ఉండటం, వ్యక్తిగత జీవితం పవిత్రంగా ఉండటం, వ్యభిచార నిర్మూలన.కానీ, మొన్న జరిగిన మీటింగులో సోము వీర్రాజు గారి మాటలు ఎలా ఉన్నాయంటే,” నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు” అన్నట్లుగా ఉంది. చివరికి ఆంధ్రుల ను దేశంలో పెద్ద తాగు బోతులు గా చిత్రించే ప్రయత్నం చేసారు.
“మనం మన లక్ష్యాన్ని అహింసా మార్గంలో సాధించ గలిగినట్లైతే, తాగుడు, మత్తు మందు ల శాపంలో పడి కుములుతున్న లక్షలాది మంది భవిష్యత్తు ను ప్రభుత్వానికి వొదలాల్సిన అవసరం ఉండదు,” అని గాంధీ  చెప్పారు.

అభిప్రాయం


ఒక పక్క దేశంలో అనేక ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తింటున్న పార్టీని అధికారంలోకి ఎలా తెచ్చుకోవాలి అని వారి జాతీయ నాయకులు కుస్తీ పడుతుంటే, ఇక్కడ వారు 2024 లో అధికారం లోకి వచ్చి50 రూపాయలకు కోటి మందికి చీఫ్ లిక్కర్ సరఫరా స్కీమ్ తెస్తా రంట. అంటే ఏమిటి? కోటి కుంటుంబాలు బిజెపి అధికారం లోకి వస్తే వీధిన పడతాయి అన్న మాట. ఇందు కోసమేనా నెల్లూరు దూబగుంట్ల నర్సమ్మ నాయకత్వంలో మద్య పాన నిషేధం కోసం అలుపెరుగని పోరాటం చేసింది.
ఎంతో మంది మహిళలు సంపూర్ణ మద్య నిషేధం కోసం ఉద్యమం చేసి జైళ్ల పాలయింది. ఆ పోరాటాల్లో పాల్గొన్న మహిళల మాటల్లో, వారి వారి అనుభవాలు,” కట్టు కోను గుడ్డ లేదు. మేము ఉద్యోగస్తులము కాదు. ఒక ఎకరా భూమి లేదు. కూలికి పోయి పది రూపాయలు తెస్తే ఆ పది రూపాయలు సారా అంగడిలో ఇచ్చీ, తాగి వస్తె, ఏందంటే పట్టుకుని ఎగిరెగిరి తన్నటం, పిల్లలకి జబ్బు చేస్తే ఒక మాత్రకు గతి లేదు. మాకు సారా భాద వద్దు. మా ముసలోళ్లు కానీ, మా బిడ్డలు కానీ, తాగి తాగి ఎలా ఉంటున్నారో చూడండి.”….. సారమ్మ, గూడూరు.
వీర్రాజు మాటలు తప్పు కాక పోవచ్చు. ఎందుకంటే, సోమలత ద్వారా తీసే “సోమరసం” లేదా” సోమ పానం” హిందూత్వ వాదులకు అత్యంత ప్రియం , అది వారి ఆచారం లో భాగం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు “సోమ రసం” అందుబాటు లోకి తేలేరు కాబట్టీ, చీఫ్ లిక్కర్ సరఫరా చేసే పనిలో పడ్డారు.
అయినా, మన వెర్రి కాక పోతేను, సోము వీర్రాజు గారి పేరులోనే” ‘సోమ’ అనే పదం ఉంది కదా. ఆయన సార్థక నామధేయుడు అని రుజువు చేసుకోవడానికి కూడా ఆరాట పడుతుండవచ్చు.
0.84 ఓటు బ్యాంకు ద్వారా వచ్చే ఎన్నకలలో అధికారం లోకి ఎలా వస్తారో ముందే చెప్పారు. ఓటర్ల కు ఫుల్ గా మందు పోపించి లేదా ఆశపెట్టీ ఓట్లు సీట్లు పొందాలని చూస్తున్నారు.
ఒక పక్క దేశంలో అనేక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తినడం చూస్తూ నే ఉన్నారు. అయినా, బీ. జే పీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు విన్న వారికి ఆయన మాటల గురించి సోషల్ మీడియాలో”ట్రోల్”చేయడం తప్ప మరో మార్గం లేదు. 2021 సంవత్సరం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేక తలలు పట్టుకుంటున్నారు.
అదేంటో ఒకసారి పరిశీలిద్దాం. కరోనా దెబ్బ కి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యి లక్ష ల కోట్లు అప్పుల పాలయింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల ను అత్యంత పేదలు గా మార్చింది. ఇది 37.79 శాతం గా ఉందని నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం. 28 రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ ప్రకారం దేశంలో 55 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అర్హులైన నిరుద్యోగ యువత 33 శాతం ఉన్నారు.
యు. ఎన్. డి. పి. రూపొందించిన అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచిక ప్రకారం109 దేశాల లో భారత్ 66వ స్థానం లో ఉంది. పెట్రోల్ ధరలు కూడా 40 శాతం పెరిగాయి. దీనివల్ల సామాన్య ప్రజల పై భారం పడుతుంది. ఉల్లి, టమోట, వంట నూనెలు ధరలూ పెరిగాయి. ఇక పోతే రాజకీయంగా పచ్చిమ బెంగాల్ ఎన్నికల లో ఓడిపోయింది. ఖాళీ అయిన పార్లమెంటు ఎన్నికలలో కూడా, వారు అధికారం లో ఉన్న కర్ణాటక,లాంటి రాష్ట్రం లో ఓడిపోయింది.
నిన్న గాక మొన్న జరిగిన పంజాబ్ మున్సిపల్ ఎన్నికలు లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఘోరంగా దెబ్బతింది. అన్నిటికంటే ముఖ్యంగా అమిత్ షా, మోడీ జంట ప్రతిష్టంగా తీసుకున్న రైతు వ్యతిరేక మూడు చట్టాలు రద్దు చేశారు.
ఉత్తర ప్రదేశ్ లో, హత్రాస్ లో దళిత బాలిక రేప్ కేసు, లఖిం పూర్ ఖేరీలో జరిగిన రైతు హత్య కేసులో సుప్రీం కోర్టులో చీవాట్లు దేశ ప్రజలకి తెలియనిది కాదు.
ఇన్ని రకాల పరాభవాలను 2021 సంవత్సరం భారతీయ జనతా పార్టీకి మిగిల్చింది. సందట్లో సడేమియా అన్నట్లు పరిపూర్ణానంద స్వామి జ్యోస్యం చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆయన చేసిన మార్గ నిర్దేశం ప్రకారం తెలంగాణాలో బండి లాగారంటా!
ఇప్పుడు ఆంధ్రాలో కూడా బండి లాగాలంట. బండికి ఇరుసుతో పాటు పలు రెక్కలు కావాలని స్వామి వారికి తెలియదు. ఆ రెక్కలు విరిగి పడిపోతూ, బండి కదలలేని స్థితిలో (భారతీయ జనతా పార్టీ) పడింది. అందుకే బండి లాగించటం కోసం సోము వీర్రాజు గారు మద్యం పోస్తాము కొంచెం మా బండి లాగండని ఆంధ్రుల ను వేడుకుంటున్నారు. వారి మిత్ర పక్ష మైన జన సేన పార్టీ ఏమంటుందో చూడాలి.
 ( బాబ్జీ, అడ్వకేట్, జంగారెడ్డి గూడెం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *