‘శివరామకృష్ణన్ కమిషన్ నివేదికను ఏమాత్రం లెక్కచేయకుండా అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం దుర్మార్గం’
తిరుపతి రౌండ్‌టేబుల్ సమావేశంలో పౌరసమాజం
-రాఘవశర్మ
తిరుపతి: వెనుకబడిన రాయలసీమలోనే రాజధాని ఏర్పాటుచేయాలని, హైకోర్టు కాదని రాయలసీమ పౌరసమాజం స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పరువురు వక్తలు ఈ విషయాన్ని ముక్తకంఠంతో కోరారు.
ఇది కొత్తగా ముందుకు వచ్చిన వాదన కాదు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతం విడివడినప్పుడు కర్నూలులో ఏర్పాటు చేసిన రాజధానినే పునరుద్ధరించమంటున్నామని స్పష్టం చేశారు.
“వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికై మూడు రాజధానులు ఏర్పాటు చేయాలి” అన్న డిమాండుతో స్థానిక యూత్‌క్లబ్‌లో ఈ సమావేశం జరిగింది.
ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్టాడుతూ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి రాజధానుల బిల్లును పకడ్బందీగా పెడతానని అంటూ శ్రీభాగ్ ఒడంబడికను పదే పదే గుర్తు చేశారని అన్నారు.
శ్రీభాగ్ ఒడంబడిక మేరకు 1953లో రాజధాని కర్నూలులో ఎలా ఉందో అలాగే ఇప్పడు కూడా ఏర్పాటు చేయాలని కోరారు.విశాఖ రాజధాని కావాలని ఏనాడూ ఎవరూ కోరలేదని గుర్తు చేశారు.
మూడు రాజధానులు కాదు, మూడు ప్రాంతాలలో రాజధానిని ఏర్పాటు చేయాలని అన్నారు.
అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల నుంచి తిరుపతికి పాదయాత్రగా వచ్చిన రైతులు తాము కోల్పోయిన భూములకు పరిహారం కోరాలే కానీ, రాజధానిని కోరటం కాదని హితవు పలికారు.
ఇష్టమొచ్చిన చోట ఇష్టమొచ్చినట్టు రాజధానిని నిర్మించడానికి రాజధాని అనేది చంద్రబాబు ప్రైవేటు వ్యవహారం కాదని, రాజధాని నిర్మాణం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు.
సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై శివరామకృష్ణన్ కమిషన్ నివేదికను ఏమాత్రం లెక్కచేయకుండా అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.
ఇందుకోసం మూడుపంటలు పండే 33 వేల ఎకరాల సారవంతమైన భూములను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదివరకు కర్నూలులో ఉన్న రాజధానిని అక్కడే పునరుద్ధరించాలని, శ్రీభాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును గుంటూరులో పెట్టాలని, కావాలంటే శాసన సభ ను ఉత్తరాంధ్రలో పెట్టాలని అన్నారు.
ఎస్వీయూనివర్సిటీ చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ కృష్ణమోహన్ మాట్టాడుతూ, ఉమ్మడి రాష్ట్రం నుంచి 1953లో తెలుగు ప్రాంతం విడివడినప్పడు మద్రాసే రాజధాని గా కావాలని కోరిన కోస్తావారు, తరువాత హైదరాబాదు రాజధానిగా అంగీకరించిన కోస్తావారికి రాయలసీమలో రాజధాని అంటేనే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.
రాయలసీమ విమోచనా సమితికి చెందిన, అనంతరపురం నుంచి వచ్చిన రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ అంటే రౌడీలని, ఫ్యాక్షనిస్టులని మాటిమాటికీ ఆరోపించే కోస్తా జిల్లాల వారు తిరుపతికి వచ్చి చేసింది ఏమిటని ప్రశ్నించారు. మూడు రాజధానులు కావాలని ఫ్టెక్సీలు పెడితే అమరావతి నుంచి పాదయాత్రగా వచ్చిన వారు చించేసి తిరుపతి వాసులను రెచ్చగొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ, అమరావతి నుంచి పాదయాత్రగా వచ్చిన వారు చేపట్టేది నిజంగా రైతుల ఉద్యమమా? వ్యాపారుల ఉద్యమమా? పెట్టుబడిదారుల ఉద్యమమా? లేక ఒక సామాజిక వర్గం ఉద్యమమా? అని ప్రశ్నించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ జర్నలిస్టు ఆదిమూలం శేఖర్, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, మాలమహానాడుకు చెందిన కుసుమకుమారి, శంకరంబాడి సుందరాచారి పీఠం అధ్యక్షురాలు డాక్టర్ మస్తానమ్మ, విశ్రాంత ఉపాధ్యాయుడు రాజారెడ్డి తోపాటు అనేక మంది ప్రసంగించారు.
(రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)