డిసెంబర్ 16 రాజకీయ అర్థం ఏమిటి?

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
నేడు డిసెంబర్ 16! ఫాసిస్టు రాజకీయ చరిత్ర లో ఓ ప్రత్యేకత వుంది.
1-బంగ్లాదేశ్ స్థాపన 16-12-1971న జరిగింది. నేటికి సరిగ్గా 50 ఏళ్లు!
2-నిర్భయ దుర్ఘటన 16-12-2012న జరిగింది. నేటికి సరిగ్గా 9 ఏళ్లు!
3-షాహీన్ బాగ్ నిరసన శిబిరం 16-12-2019న ప్రారంభమైనది. నేటికి రెండేళ్లు!
బయటకు చూస్తే పై సంఘటనలు పరస్పరం భిన్నమైనవి. నాణేనికి ఒకవైపు దృశ్యమది. మరో దృశ్యం ఉంది.
సమస్త విశ్వం పరస్పర ఆధారితమని గతితర్కం చెబుతోంది. ఈ జగత్తులో విడివిడిగా కనిపించే అన్నింటి మధ్య అంతస్సంబంధం ఉందని గతితర్కం చెబుతుంది.
భారతదేశంలో ఫాసిస్టు రాజకీయ గమనం చాలా సుదీర్ఘమైనది. ఆ ఫాసిస్టు దారిలో వేర్వేరు ఘటనల మధ్య అంతస్సంబంధం ఉంది. అవి దేశ రాజకీయ రంగంలో ఫాసిజం ఎదిగే క్రమంతో ముడిపడ్డాయి.
అమెరికా, USSR లు అగ్రరాజ్యాలుగా వున్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాంగ్రెస్, RSS రాజకీయ ప్రత్యర్థి శక్తులే! భిన్న అగ్ర రాజ్యల్ని అనుసరించేవి. విస్తరణవాద రాజకీయ విధానం ఆ ఇద్దరి మధ్య ఐక్యతను సమకూర్చింది.
1948లో గాంధీ హత్య వల్ల కాంగ్రెస్, RSS మధ్య రాజకీయ వైరం పెరిగింది. 1971లో పెనుమార్పుకి దారితీసేందుకు బంగ్లాదేశ్ యుద్ధం కారణమైనది.

ఇందిరాగాంధీ ప్రధానిగా ఎన్నికైనా ఆమె రాజకీయ స్థానం 1967 ఎన్నికల్లో బలహీన పడింది. గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ, దళిత ఉద్దరణ వంటి చర్యలు ఆమెకు తగు రాజకీయ స్థిరత్వాన్ని ఇవ్వలేదు. ఆ లోటు భర్తీకై ఓ విదేశీ యుద్ధం తప్పలేదు. అదే బంగ్లాదేశ్ యుద్ధం! కొరత తీర్చడంతో పాటు అది రాజకీయ సుస్థిరతను చేకూర్చింది. బంగ్లాదేశ్ యుద్ధంలో RSS సైతం ఇందిరను “భద్రకాళి” గా పొగిడింది.
1972 ఎన్నికల్లో బంపర్ గెలుపు సాధించిన ఇందిర లో రాజకీయ అహాన్ని పెంచింది. ఎమర్జన్సీ పాలనకి దారి తీసి, RSS సహా ప్రతిపక్షాల నిషేధానికి కారణమైనది. RSS అనుబంధ జనసంఘ్ జనతా పార్టీలో చేరుటకు కారణమైనది.
గాంధీ హత్య తర్వాత సంప్రదాయ రాజకీయ స్రవంతి నుండి RSS ఏకాకిగా మారింది. దాని అనుబంధ జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో విలీనమై 23 ఏళ్ల తర్వాత పార్లమెంటరీ రాజకీయ స్రవంతిలో ఓ పాపులర్ పక్షంగా మారింది. RSS నేత వాజపేయి విదేశాంగ మంత్రి అయ్యాడు. RSS కి నచ్చి, మెచ్చినంత మితిమీరిన స్థాయిలో ఇందిరమ్మ ప్రదర్శించిన విస్తరణవాద రాజకీయమే అందుకో నేపధ్య కారణం!
జనసంఘ్ బిజెపిగా మారింది. గాంధీయన్ సోషలిజాన్ని చేపట్టింది. తర్వాత బాబరీ మసీదు ఎజెండాతో అధికారం చేపట్టింది. వీటి మధ్య అంతస్సంబంధం వుంది.
బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా పాకిస్థాన్ సైనిక చర్యతో నిలవ నీడ లేక ప్రాణ భయంతో భారత్ కి కాందిశీకులు తరలి వచ్చారు. వారిని స్వాగతించడంలో ఇందిరా గాంధీతో ఆనాడు RSS గొంతు కలిపింది. వారినే బంగ్లాదేశ్ కి చెందిన విదేశీయులుగా టార్గెట్ చెసుకొని ఈశాన్య రాష్ట్రాల్లో బలపడి, నేడు NRC, CAA చట్టాల్ని RSS తెచ్చింది. అందుకే RSS హిందుత్వ ఫాసిస్టు దారిలో 1971 డిసెంబర్ 16 ఓ మైలురాయి!
గోద్రా ఫాసిస్టు రాజకీయ ప్రయోగశాలలో ఉత్తీర్ణత సాధించిన హిందుత్వ ఫాసిస్టు శక్తుల్ని అధికారం లోకి తెచ్చుకునే లక్ష్యాన్ని బడా కార్పొరేట్ శక్తులు ఎంచుకున్నాయి. పౌర సమాజాన్ని కదిలించే వాటి వ్యూహానికి 2011 లో అన్నా హజారే సాధనంగా మారాడు. తెరవెనుక ఉండి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అవి ప్రేరేపించాయి. మీడియా ద్వారా RSS పొలిటికల్ ఎజెండాకి కార్పొరేట్ శక్తులు బలం చేకూర్చాయి. ఆ దన్నుతో 2012 నిర్భయ దుర్ఘటన పై వెల్లువెత్తిన ప్రజాతంత్ర ఉద్యమాన్ని అవకాశంగా ఫాసిస్టు శక్తులు మరింత బలపడ్డాయి. ఈ కోణంలో RSS ఫాసిస్టు రహదారిలో డిసెంబర్16 మైలురాయి!
1971లో బంగ్లాదేశ్ ఏర్పాటు ఫలితంగా కట్టుబట్టలతో వచ్చిన శరణార్ధుల కుటుంబాల్ని బూచిగా చిత్రించి, ముస్లిం మతాన్ని టార్గెట్ చేసుకొని 2019లో హిందుత్వ మోడీ సర్కార్ CAA, NRC చట్టాల్ని తెచ్చింది. దానిపై నిరసనోద్యమం షాహీన్ బాగ్ లో రెండేళ్ల క్రితం డిసెంబర్ 16న ప్రారంభమైనది. అది ఫాసిస్టు రాజకీయ ఎజెండా పట్ల నిరసన దారిలో ఓ మైలురాయి!
16-12-1971న బంగ్లాదేశ్ ఏర్పడితే; 48 ఏళ్ల తర్వాత షాహీన్ బాగ్ శిబిరం 16-12-2019న ప్రారంభమైనది. రెండింటి మధ్య విడదీయరాని అంతస్సంబంధం ఉంది. షాహీన్ బాగ్ మైలురాయి ఫాసిస్టు వ్యతిరేక దారిలో కావడం గమనార్హం!
బంగ్లాదేశ్ కాందిశీకులు, శరణార్ధుల పట్ల RSS సుస్వాగతానికి మొదటిది గుర్తు! వారిని ఫాసిస్టు పంథాలో తరిమివేతకి రెండవది గుర్తు! ఫాసిజం ఏఏ కాలాల్లో ఏఏ వేషాలు దరిస్తుందో వినడానికి విచిత్రంగా లేదూ!
గతితర్కం అంటేనే కార్యకారణ తర్కశాస్త్రం. అది ఒకటిలో రెండునూ; రెండులో ఒకటినీ చూస్తుంది. మంచిలో చెడునూ; చెడులో మంచినీ చూస్తుంది. మంచిపక్కనే చెడు ఎదుగుదలనూ; చెడుపక్కనే మంచి ఎదుగుదలనూ చూస్తుంది. మంచికి తోడుగా నిలిచే చెడునూ; చెడుకు తోడుగా నిలిచే మంచినీ పరిశీలిస్తుంది. అది చర్యలో ‘ప్రతిచర్య’ని చూస్తుంది. ‘ప్రతిచర్య’లో ప్రగతిశీలతే గాక దాంట్లో దాగిన ప్రతీఘాతుకతని కూడా పరిశీలిస్తుంది. లార్వాలో దాగిన సీతాకోక చిలుకనూ; సీతాకోక చిలుకలో ఇమిడివున్న గొంగళి పురుగును కూడా చూస్తుంది. గతితార్కిక తాత్విక సిద్ధాంతం యిదే! అది మానవజాతి చరిత్రకి అన్వయిస్తే చారిత్రక భౌతికవాద సిద్ధాంతం! దాని వెలుగులో భారత్ లో ఫాసిజం పరిణామ చరిత్రను పరిశీలిద్దాం. హిందుత్వ రూపంలో బయటకి కనిపించే నేటి కార్పొరేట్ ఫాసిజం యొక్క చరిత్ర గమన మార్గాన్ని పరిశీలిద్దాం. ఆ సుదీర్ఘ ఫాసిస్టు దారిలో పై మూడు వేర్వేరు చారిత్రిక దశల్లో వేర్వేరు కాలాల్లో పాతిన మైలురాళ్ల మధ్య పరస్పర అంతస్సంబంధం ఏమిటో గతితార్కిక దృష్టి తో పరిశీలిద్దాం.
బంగ్లాదేశ్ నుండి శరణార్ధుల రాకకు దారి తీసిన 71నాటి యుద్దాన్ని RSS కీర్తించింది. వారినే బూచిగా NRC, CAA ఫాసిస్టు చట్టాల్ని నేడు RSS తెచ్చింది. వీటి మధ్య అంతస్సంబందాన్ని అర్ధం చేసుకోవడమే మార్క్సిజం!
ఫాసిస్టు ప్రయాణ దారిని కార్యకారణ ప్రాతిపదికన అవగాహన చేసుకునే ప్రయత్నానికి డిసెంబర్ 16 ఓ మచ్చుతునక! ఈ దృష్టితో రేపటి ప్రమాదకర ఫాసిస్టు రహదారి పట్ల శాస్త్రీయ అవగాహనని ఏర్పరుచుకుందాం. ఆ వెలుగులో ఫాసిజాన్ని ఓడించే రేపటి రాజకీయ మార్గాన్ని నిర్మించే కృషిని చేపడదాం. ఈమార్క్సిస్టు దృక్కోణంతో చరిత్రగతిని పరిశీలిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *