అమరావతి పాదయాత్రలో ఇలాంటి వృద్ధులు ఎందరో!

 పాత స్లిప్పర్స్ వేసుకొని  వడివడిగా నడుస్తున్న ఈ పెద్దాయన ఆ వయసులో కూడా అమరావతి పరిరక్షణ పాదయాత్రలో ఎందుకు పాల్గొంటున్నాడో తెలుసా?

(టి.లక్ష్మీనారాయణ)

న్యాయస్థానం నుండి దేవస్థానం, తుళ్ళూరు నుండి తిరుమల మహాపాదయాత్ర నిన్న ప్రారంభమైనది. “జై అమరావతి” నినాదం ప్రతిధ్వనించింది. వేలాది మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. వారిలో మహిళలే అత్యధికులు. వృద్ధులు, పిల్లలు సహితం కదంతొక్కారు. మహాసంకల్పంతో ప్రారంభమైన పాదయాత్రలో నేను పాల్గొన్నాను. నడకసాగిస్తూ ఎవర్ని కదిపినా ప్రభుత్వం అనుసరిస్తున్న అమరావతి విధ్వంసం దుష్పరిణామాలపై ఆవేదన, ఆక్రోశం, భవిష్యత్తు పట్ల అభద్రతా భావం, అనైతిక రాజకీయ క్రీడ పట్ల ఛీత్కారం మాటల్లో, ముఖకవళికల్లో ప్రస్ఫుటంగా వెల్లడైయింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన త్యాగధనుల గుండెఘోష వర్ణనాతీతం.
ఉద్యమకారులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రోడ్డుకు మూడొంతుల భాగంలో క్రమశిక్షణతో నడుస్తున్నారు. బక్కపలచగా ఉన్న ఒక పెద్దాయన నా ప్రక్కన నడుస్తున్నారు. మోటార్ బైక్ పై ప్రక్కగా వెళుతున్న ఒక యువకుడ్ని ఒక మహిళ ఆపి తాతయ్యను ఎక్కించుకొని తీసుకెళ్ళమని విజ్ఞప్తి చేసింది. కానీ, ఆ వృద్ధుడు తిరస్కరించారు. అది గమనించిన నేను ఆయనతో మాటకలిపాను. ఆయన పేరు శ్రీ పాపినేని నాగేశ్వరరావు గారు. 85 సం.ల వయసుపైబడ్డ పెద్దాయన. ఆయనది నెక్కల్లు గ్రామం. కాళ్లకు పాత స్లిప్పర్స్ వేసుకొని మాతో పాటు వడివడిగా నడిచారు. తుళ్ళూరు నుండి పెదపెరిమి వరకు 7 కి.మీ. దూరం, ఉదయం 9 గం.ల నుండి మధ్యాహ్నం 1 గం. వరకు ఎలాంటి అలసట లేకుండా సంకల్పబలంతో పట్టుదలగా నడిచారు. చిన్న నీటి బాటిల్ ఆయన చేతిలో ఉంటే, ఒక మహిళ నేను తీసుకొస్తా ఇవ్వండంటే, వద్దులేమ్మా! మోయగలను అన్నారు. పలచటి తెల్ల చొక్కా, పంచ ధరించారు. బనియన్ కూడా లేదు. చెమటలతో చొక్కా ముద్దముద్దగా తడిచిపోయింది.
పాపినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అమరావతి రాజధాని నిర్మాణానికి 13 ఎకరాల భూమి ఇచ్చిందట. అందులో సగం భూమి వారసత్వంగా ఆ కుటుంబానికి సంక్రమిస్తే మిగిలిన సగం భూమిని వారు కష్టపడి సంపాదించుకొన్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ సమానంగా భూమిని పంచిపెట్టారు. మెట్ట భూమి. పొగాకు, పత్తి పంటలు పండించుకొని జీవనం సాగించేవారు. కుమారుడు వ్యవసాయం మీదే ఆధారపడి జీవించేవారు. ఒక కుమార్తె టీచర్. మరొక కుమార్తె గృహిణి. అమరావతి రాజధాని నిర్మాణానికి ఉన్న భూమి ఇచ్చేశామని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న విధ్వంసకర విధానం పర్యవసానంగా రోడ్డెక్కి రెండేళ్లుగా పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో నడవడం నాకు గొప్ప అనుభూతి. ఆయనాలాగే అనేక మంది వృద్ధ్యాప్యంలో ఉన్న మహిళలు, పురుషులు పాదయాత్రలో పాల్గొన్నారు. టీవీ చర్చల్లో అమరావతి రాజధాని అంశంపై నా వైఖరిని విస్పష్టంగా తెలియజేస్తుంటాననే సదాభిప్రాయం ఉద్యమకారుల్లో ఏర్పడింది. దాంతో నా పట్ల అభిమానం కనబరుస్తూ, వారు పడుతున్న కష్టాలు, ఉద్యమ అనుభవాలను తెలియజేస్తుంటారు.
రాజధాని నిర్మాణానికి భూమిచ్చిన ఒక మధ్య వయస్సు మహిళ తన కుటుంబ గాధ వినిపించారు. తమ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన కొద్దిపాటి భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. ఆమె భర్త ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటే కక్షగట్టి తన భర్తను ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తారేమో! అన్న అభద్రతా భావం వెంటాడుతున్నా ఉద్యమంలో పాల్గొంటున్నానని ధైర్యంగా చెప్పారు. ఉన్న భూమి రాజధానికి ఇచ్చేశాం. జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్నా,
జీతం నెల నెలా సక్రమంగా వస్తుందో! లేదో! అన్న అనుమానం వెంటాడుతున్నది. పిల్లలకు ఫీజులు కట్టాలన్నా చేతుల్లో డబ్బుల్లేని దుస్థితి. పిల్లల భవిష్యత్తు తలచుకొంటేనే ఏడుపోస్తుందని మౌనంగా రోధించారు. ఎవరిని కదిపినా వారుపడుతున్న కష్టాలు, ఉద్యమ అనుభవాలను పుసగుచ్చినట్లు వివరిస్తున్నారు.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *