హుజూరాబాద్ ఉపఎన్నిక నిజంగా చాలా చిన్న విషయమా!

‘హుజూరాబాద్ ఉప ఎన్నిక మా దృష్టిలో చాలా చిన్నది,’ అనడంలో ఎంతో  దాగి ఉన్నది. ఈ ప్రకటనకు హుజూరాబాద్ లో ప్రభుత్వం చేస్తున్నహంగామా భిన్నంగా వుంది కదా!

(వడ్డేపల్లి మల్లేశము)

 

మాకేమీ తెలియదనడంలోను, అలాంటి ఆశలు లేవని చెప్పడంలోనూ అంతరార్థం ఎంతో దాగి ఉంటుంది. ఒక విషయం పై  మనసు వేసి,  కన్ను పైకి దాన్ని పట్టించుకోనట్లు, అదేమంత పెద్ద విషయం కాదని బుకాయించే  కుట్రదారులు ఈ సమాజంలో ఎందరో ఉంటారు.

పచ్చి స్వార్థంతో, ప్రలోభాలతో ఇతరుల ఆస్తిపాస్తులను, అవకాశాలను కొల్లగొట్టడానికి చూసేవారి సంగతి ఈ రకంగానే ఉంటుంది అనడంలో సందేహం లేదు.

మాట్లాడేది ఒక రకం మనసులో ఉండేది మరొక రకం. ఇదే ఇప్పటి  రాజకీయం. అక్రమంగా కొల్లగొట్టడానికి క్షేత్ర స్థాయిలో ఎన్నో జరుగుతున్నప్పటికీ ఆ విషయంలో తమ ప్రమేయం లేదని అది మా దృష్టిలో పెద్ద విషయం కాదని చెప్పేటువంటి వ్యక్తులు, సందర్భాలు ముఖ్యంగా రాజకీయ నాయకులు మన మధ్యన కోకొల్లలు.

హుజురాబాద్ ఉప ఎన్నిక నిజంగా చిన్నదా?

రాష్ట్రంలో సుమారుగా రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లుగా ఇటీవల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రకటిస్తూ వెంటనే భర్తీ చేయడానికి డిమాండ్ చేయడాన్ని బట్టి ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ ఉదాసీనత ఏమిటో మనకు తెలియ వస్తుంది. ఏ కారణం వల్ల నైతేనేమి ఒక నియోజకవర్గ కేంద్రంలో ఉప ఎన్నిక అనివార్యమైనప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించడం ఎన్నికల సంఘం ఆమోదించి తగు చర్యలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. మరి ఉద్యోగాల భర్తీ విషయంలో ఇంత ఆరాటం పోరాటం ప్రభుత్వానికి ఎందుకు ఉండటం లేదు.?

ఈ రకంగా చూసినప్పుడు హుజురాబాద్ లో జరగవలసిన ఉప ఎన్నిక నిజంగా చిన్న అంశమే. అయితే దానిని పెద్దగా చేస్తున్నది ఎవరు? టిఆర్ఎస్ అధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల అనేక సందర్భాలలో ఆ ఎన్నిక మా దృష్టిలో ఒక లెక్కే కాదని అది చాలా చిన్న విషయమని దానిని స్థానికంగా ఉన్న నాయకులు చూసుకుంటారని విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సందర్భం మనమందరం చూసినం. మరి అలాంటప్పుడు అక్కడ రెండు మూడు మాసాలుగా మంత్రులు తిష్ట వేసి ప్రచారం చేయడంలో అర్థం ఏమిటి.?

హుజురాబాద్ ఎన్నిక నిజంగా స్థానిక అంశమే

ఎన్నికలను ఎన్నికల సంఘం చూసుకుంటుంది. నోటిఫికేషన్ వెలువడగానే ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఆ తర్వాత ప్రచార కార్యక్రమం ఎన్నికల ఫలితాలతో ఆ తంతు ముగుస్తుంది. ఎలాంటి నోటిఫికేషన్ వెలువడక కుండా అధికారపక్షం తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అనేకసార్లు మంత్రులను నియోజకవర్గంచుట్టూ తిప్పుతూ లెక్కలేనన్ని రాయితీలను ప్రకటించడం ఏమిటి? టిఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు గ్రామ గ్రామాన తిరుగుతూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రకటనలు, పథకాలు, హమీలకే లెక్కేలేదు. ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజూరాాబాద్ లోనే తిష్టవేశారు. ఆయన నియోజకర్గంవదలి రాజధానికి వెళ్తున్నట్లే లేరు. హుజూరాబాద్ చిన్న నియోజకవర్గమే. ఏమంత ప్రాముఖ్యం ఉన్న నియోజకవర్గంకాదు.  కాాదు, రోజూ పత్రికల్లో ప్రధానవార్త కూర్చుంది. దీనికి అక్కడ  ముఖమంత్రి, మంత్రులు చేస్తున్న హంగామా కాదా.

ప్రచారానికి అర్హత ఎక్కడిది?

ప్రజల కోసం పని చేయవలసిన ప్రభుత్వం, మంత్రులు, యంత్రాంగం, అధికారులు చిన్న ఎన్నిక అంటూనే హుజురాబాద్ కేంద్రంగా రెండు మూడు మాసాలుగా పనిచేయడం దేనికి సంకేతం? మంత్రులు ఇక్కడ తిష్ట వేస్తే పరిపాలన ఏమైనట్లు? స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ‘దళిత బంధు’ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించడానికి లబ్ధిదారులను రప్పించడానికి ఉపాధ్యాయులను సైతం ఉపయోగించుకున్న వైనాన్ని లోకం అప్పుడే మర్చిపోయిందా?

ఇప్పటికీ ప్రతి రోజూ మంత్రులు అక్కడే ఏదో రకంగా ఒక వర్గానికి స్థలాలు, ఇల్లు, రకరకాల రాయితీలతో కోట్లను ప్రకటిస్తూ దళిత బంద్కు సంబంధించి రెండు వేల కోట్లను ఇప్పటికే మంజూరు చేసి ఉన్నారు. ఎన్నికలు జరగనున్న హుజురాబాద్ ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించడం ఎన్నికల్లో గెలవడానికి కాదా? ఇన్ని రాయితీలను ప్రకటిస్తూ ఇక్కడే ఉండటం ఈ అంశము చిన్నది ఎలా అవుతుంది? అయితే టిఆర్ఎస్ పార్టీ దృష్టిలో ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా స్థానిక నాయకులేనా?

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం

యుద్ధరంగంలో యుద్ధనీతిని ప్రదర్శించడానికి వ్యూహాలు ఎత్తుగడలు ఎన్నో ఉన్నప్పటికీ అక్రమ పద్ధతులకు పోకుండా బహిరంగంగానే ప్రదర్శించడం చారిత్రకంగా ఆనవాయితీ. హుజరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ చర్యలు మిగతా ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా అక్రమ మార్గాలకు పాల్పడేందుకు విధంగా ప్రోత్సహించడమే అవుతుంది. అధికారం ఉంది గనుక టిఆర్ఎస్ పార్టీ అటు ప్రభుత్వ అండతో అనేక పథకాలను అప్పటికప్పుడే మంజూరు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? నియోజక వర్గంలో ఉన్నటువంటి లక్ష పైచిలుకు ఓటర్లలో 50,000 ఉన్నటువంటి దళితులకు మాత్రమే దళిత బందును ప్రకటించి ఆశ చూపడం మిగతా వర్గాలను విస్మరించడం శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కాదా? హుజురాబాద్ లో ప్రభుత్వ పక్షంగా అధికార పార్టీ పక్షాన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఏ విధంగానైనా టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలనే ఏకైక లక్ష్యం ప్రభుత్వం ముందు ఉండడం నిజంగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం వంటిదే అని చెప్పక తప్పదు.

సుమారుగా రెండు దశాబ్దాలుగా టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగి నటువంటి ఈటెల రాజేందర్ ప్రభుత్వ సాచివేత వైఖరి కి నిరసనగా అవినీతి పేరున బర్తరఫ్ అయి ఇన్ని మాసాలు అయినా అవినీతిని రుజువు చేయకపోవడం ఏమిటి?

స్థానికంగా తన పరువు ప్రతిష్టలను కాపాడుకుని పార్టీ శ్రేణులను పెద్దగా తయారుచేసుకున్న ఈటెల రాజేందర్ యొక్క శక్తిని క్రమంగా నిర్వీర్యం చేయడానికి చిన్న ప్రజాప్రతినిధుల నుండి పెద్ద రాజకీయ నాయకుల వరకు ఆర్థికంగా లాభాలు ప్రయోజనాలను కల్పించడానికి ప్రలోభ పెడుతూ ప్రభుత్వము ఎన్ని వీలైతే అన్ని పనులు చేస్తుంది.

ఎన్నికలు ఉంటేనే ప్రజలా?

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మాత్రమే ప్రభుత్వం స్పందించి కోట్ల రూపాయలను స్థానికంగా కేటాయించడం చట్ట సభలను విస్మరించి అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా? బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులను ఆయా వర్గాలకు ఆయా శాఖలకు ఖర్చు చేసే బదులు ఆ నిధులను మళ్ళించడం పట్ల కాగ్ వంటి సంస్థలతో పాటు ఎన్నికల సంఘం నిఘా ఉంచవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. అభివృద్ధి పాలన లో భాగంగా ఉండాలి కానీ ఎన్నికల కోసం కాదు. ఈ కనీస అవగాహన లేని అధికార పార్టీ ప్రభుత్వాలు, మిగతా రాజకీయ పక్షాలు ప్రజలను బానిసలుగా తయారు చేసే విధంగా వాగ్దానాలను కుమ్మరిస్తూ రాజకీయ లబ్ధి పొందే విధానం పైన న్యాయ వ్యవస్థ చురకలు అంటించిన వలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

ఇంకా ఎన్నికలు ఎప్పుడో తెలియదు. అప్పటికే పలుమార్లు ప్రచారాల తో హోరెత్తించిన అన్ని రాజకీయ పక్షాల పైన ఎన్నికల సంఘం, సిబిఐ, న్యాయవ్యవస్థ, కాగు వంటి సంస్థలు వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సామాన్య ప్రజానీకం కోరుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నీచమైన దుష్ట సంప్రదాయాలను పక్కన పెట్టి ప్రత్యామ్నాయ రాజకీయ విలువలను ఎన్నికలలో చూసే విధంగా విజ్ఞులు, మేధావులు, రాజకీయ నిపుణులు, విశ్లేషకులు ప్రభుత్వాల పైన, న్యాయ వ్యవస్థ పైన, ఎన్నికల సంఘం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.

గమ్మత్తయిన విషయం ఏమిటంటే మంత్రులు హుజరాబాద్ లో పర్యటించి ప్రణాళికలు ఏర్పాటు చేసి నిరంతరం ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది మా దృష్టిలో ఎన్నికే కాదు అక్కడ స్థానిక నాయకులు చూసుకుంటారని రాష్ట్ర అధినాయకత్వం ప్రకటించడం లోని ఆంతర్యం ఏమిటి? అక్కడ రాజకీయ కార్యక్రమాలను కొనసాగిస్తున్న మంత్రులు స్థానికులే అనబడతారా?

ప్రభుత్వం తన అధికార దుర్వినియోగంతో ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ నియంతృత్వానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ట్లు గా భావిస్తున్న ఈ ఎన్నిక పూర్తిగా స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరగాలంటే అధికార పార్టీ తన కార్యక్రమాలను వెంటనే ఆపివేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మాత్రమే పరిమిత సమయంలో ప్రచారం చేసుకుని అప్పుడు మాత్రమే గెలుపు ఓటములను అంచనా వేసుకోవాలి. కానీ ప్రజలను నిత్యం రాజకీయాల్లో మంచి రాజకీయాలు కలుషితం చేయకూడదని ప్రజలు కోరుతున్నారు.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *