‘వుండాల్సిన మ‌నిషి సాకం నాగ‌రాజ’

శ‌నివారం ఆవిష్క‌ర‌ణ‌

(రాఘ‌వ‌శ‌ర్మ‌)

స్నేహ‌శీలి,  ప్రేమాస్ప‌దుడు, ప‌రోప‌కారి,  పుస్త‌క వార‌ధి,  పుస్త‌క బానిస‌, మొండిమ‌నిషి,  భోళాశంక‌రుడు,  కొమ్ములు  మొల‌వ‌ని మొన‌గాడు, పుస్త‌క ప్ర‌చారోద్య‌మ కారుడు ; ఇన్ని విశేష‌ణాలున్న వ్య‌క్తి ఒక్క తిరుప‌తిలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఎవ‌రంటే ఏం చెపుతాం!
సాకం నాగ‌రాజు కాక మ‌రెవ‌రుంటారు!?

సాకం నాగ‌రాజ నిజంగా ఉండాల్సిన మ‌నిషి.

అందుకే ఆ పుస్త‌కానికి ఆ పేరు పెట్టారు.

సాకం  నాగ‌రాజ వ‌క్తిత్వాన్ని గురించి ఎన్ని మెచ్చుకోళ్ళు! ఎన్ని పూల‌జ‌ల్లులు! ఒక‌రా ఇద్ద‌రా! 152 మంది రాశారు ఈ పుస్త‌కంలో ఆయ‌న గురించి. నేటి సాహిత్య లోకంలో సాకం నాగ‌రాజ తెలియ‌ని వారుండ‌రు.

ఆయ‌న‌కు 70 ఏళ్ళు పూర్త‌యిన సంద‌ర్భంగా ‘వుండాల్సిన మ‌నిషి సాకం నాగ‌రాజ’ పుస్త‌కాన్నిఅచ్చేసి, తిరుప‌తిలోని క‌ర‌కంబాడి రోడ్డులో, శ్రీ‌బాలీజీ ఫెడ్ టాప్ కెమిస్ఠ్ భ‌వ‌నంలో శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఆవిష్క‌రించ‌బోతున్నారు.

త్యాగ‌రాజ కీర్త‌న‌లో చ‌ర‌ణం ఒక్క‌టే, రాగాలు వేరు. నాగ‌రాజ గురించి ఈ పుస్త‌కంలో ఎంద‌రు ఎన్నిర‌కాలుగా చెప్పినా ఆయ‌న వ్య‌క్తిత్వం ఒక్క‌టే.

ఒక‌ప్పుడు గ్రంథాలయోద్య‌మం.ఇప్పుడు సాకం  నాగ‌రాజ చేప‌ట్టింది ప‌ఠ‌నోద్య‌మం. పుస్త‌కాల‌ను అచ్చేస్తారు, ఇంటింటికి అందిస్తారు.

అర్ధ‌శ‌తాబ్దంగా సామాజిక స్పృహ పెంచ‌డంలో కృషిచేస్తున్నారు. రాడిక‌ల్ విద్యార్థి సంఘం వ్య‌వ‌స్తాప‌కుల్లో ఒక‌రు.

విద్యార్థి ఉద్య‌మం నుంచి సాహిత్యోద్య‌మంలోకి ప‌య‌నం. ఒక‌ప్పుడు విర‌సంలో ఉన్నా, ఇప్పుడు  అర‌సం రాష్ట్ర అధ్య‌క్షుల‌లో ఒక‌రైనా, మౌలికంగా నాగ‌రాజ అభ్యుద‌యం నుంచి ప‌క్క చూపులేదు.

భాషా బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రిగినా, క‌న్యాశుల్కం వందేళ్ళ కార్య్ర‌క‌మం జ‌రిగినా, చ‌లం, శ్రీ‌శ్రీ సాహిత్యాన్ని తిరువీధుల‌లో ఊరేగించినా, త్రిపుర‌నేని సాహితీ  స‌ర్వ‌స్వాన్ని ఆవిష్కరించినా, 47 ఏళ్ళ త‌రువాత చిత్తూరు జిల్లా ర‌చ‌యిత‌ల మ‌హాస‌భ‌లను నిర్వ‌హించినా, వ‌చ్చేనెల‌లో రాయ‌ల‌సీమ సాహిత్య స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నా, వాటి వెనుక క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ  నాగ‌రాజే.

నేటి అక్ష‌రాలు రేపు మ‌హావృక్షాల‌వుతాయ‌ని పిల్ల‌ల మ‌న‌సుల్లో అక్ష‌రాలు నాటిన సేద్య‌గాడు. డెబ్బై ఏళ్లు నిండినా, తిరువీధుల‌లో నిత్య సంచారి.

సాకం నాగ‌రాజ తిరుప‌తి సౌజ‌న్యారావే.

(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *