Sunday Special: వనాల, ఉద్యానవనాల తిరుమల

(రాఘవ శర్మ)

తిరుమల కొండెక్కుతుంటే ఎటు చూసినా పచ్చదనం!  ఏ మలుపులో చూసినా పచ్చదనం!  ఏ కొండను చూసినా పచ్చదనమే!

తూర్పు నుంచి పడమరకు విస్తరించిన ఈ శేషాచలం కొండ ఆకుపచ్చని అతి పెద్ద సరీసృపంలా అనిపిస్తుంది. తిరుమలకు చేరుతుండగానే చల్లని గాలులు, పచ్చని వనాలు ఆహ్వానిస్తాయి. రోడ్డుకు ఎటుచూసినా కనుచూపు మేరలో పచ్చదనం పరుచుకుని ఉంటుంది! ఇరువైపులా పచ్చదనం కనువిందు చేస్తుంది! కొండ ఏటవాలులోనూ పచ్చదనమే!  రోడ్డు మధ్యలోనూ పచ్చదనమే!

తిరుమల అంతా ఎత్తైన పచ్చని వనాలు, ఉద్యానవనాలతో నిత్యం కళకళలాడుతుంది! వేలాది యాత్రికులకు తెలియకుండానే వారి కళ్ళను కట్టిపడేసేది ఈ పచ్చదనమే. వారి మనసులను మంత్రించేది ఈ పచ్చదనమే.

తిరుమలలోని 2,900 హెక్టార్లలో వనాలను, ఉద్యానవనాలను పెంచి పోషిస్తున్నదెవరు? బిడ్డ‌ల‌లాగా సాకి సంతరిస్తున్న దెవరు?  ఇక్కడ ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుతున్న దెవరు?

ఆకాశగంగ పార్కు లో రాతి పై చెక్కిన బెట్టుడత, దేవాంగపిల్లి

తిరుమలలో యాత్రికులు ఎటువెళ్ళినా ఈ పచ్చని వనాలలో సేదదీరుతారు.  ఆకాశ గంగ పార్కు ఎంత హాయిగా ఉంటుందో! అనేక మలుపులు తిరిగిన కాలిబాటలో రకరకాల మొక్కలు.

నిలబెట్టిన రాతి కూసాలపై ఊసరవెల్లి, దేవాంగ పిల్లి, బెట్టుడత వంటి జంతు జాలాలు రాతిపై చెక్కినవే. పార్వేటి మంటపం వద్ద ఉన్న వనంలో 27 నక్షత్రాల పేర్లతో నక్షత్రానికొక చెట్టు.  నేలంతా పరుచుకున్న పచ్చని గరిక.

గోగర్భం డ్యాం నుంచి పాపనాశనం వెళ్ళే ప్రాంతంలో ఇరు వైపులా పెద్ద పెద్ద వృక్షాలు. ఈ మధ్య కాలంలో కుడి వైపున అకేషియా చెట్లను తొలగించారు.

ఏడేళ్ళ క్రితం ఇక్కడే 45 హెక్టార్లలో శ్రీ గంధం తోటను వేశారు.మరో పది హెక్టార్లలో శ్రీగంధం నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని 65 హెక్టార్లలో ఇప్పటికే శ్రీగంధం వనం ఉంది.

భాకరాపేట వద్ద ఉన్న కమిలయ్యగారి పల్లె వద్ద 15 హెక్టార్లలోనూ టీటీడీకి శ్రీగంధ వనం ఉంది. తిరుమల ఆలయానికి మరో ఇరవై సంవత్సరాలకు అవసరమైన శ్రీగంధం చెక్కల నిల్వ ఉన్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల కోసం పెద్ద ఎత్తున ఈ శ్రీగంధం చెట్లను పెంచుతున్నారు.

శ్రీవారి ఆలయలంలో పూజాది కార్యక్రమాలకు నిత్యం కిలోన్నర శ్రీగంధం అవసరమవుతుంది. అంటే నెలకు అరటన్ను శ్రీగంధం చెక్కలు వాడతారు.

శీలా తోరణం వద్ద శిలలు.

ప్రపంచంలోనే అరుదైనది, సహజసిద్ధమైది శిలాతోరణం. ఒకప్పుడు దాన్ని చూసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడలా కాదు. శిలాతోరణం పక్కన చూడముచ్చటగా అనేక శిలలు. ఇప్పుడు వాటిని ఎక్కే వీలును కూడా కల్పించారు.

ఏనుగుల గుట్ట

ఈ శిలల మధ్య నుంచి  ట్రెక్ కు దారి. ఇక్కడా అనేక జంతుజాలాలు; పరికించి చూస్తే తప్ప బొమ్మలని తెలియదు. చిరుత పులి, కొండచిలువ, పెనవేసుకున్న పాముల బొమ్మలు సహజసిద్ధంగా ఉన్నాయి.

ఆ పక్కనే పిల్లల పార్కు. శిలా తోరణం ఎదురుగా ఏనుగు ఆకారాన్ని పోలిన ఒక చిన్న కొండలాంటి పెద్ద శిల . ఇదే ఏనుగుల గుట్ట. ఇరవైరకాల శిలలు(గ్రానైట్) వాటి పక్కనే పేర్లు. ఇక్కడే ఒక పెద్ద పవిత్రవనం. సంపంగి, పొగడ, పొన్న, రుద్రాక్ష, ఉసిరి, నాగలింగం, మనోరంజని వంటి ఏడు రకాల తోటలను పెంచుతున్నారు.

రోడ్ల మధ్యలో కూడా అందంగా ఒదిగిన మొక్కలు

తిరుమల ఒక ఉద్యానవన పట్టణం. రోడ్డు మధ్య డివైడర్లలోనూ రకరకాల క్రోటన్లు. రోడ్ల కూడళ్ళలో అందమైన మొక్కలతో ఐలాండ్లు. ఏ కూడలికి ఆ కూడలి ప్రత్యేకం. ఏ డివైడరుకు ఆ డివైడరు ప్రత్యేకం. రింగు రోడ్డును కూడా వదలలేదు. రింగు రోడ్డు నుంచి ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోనూ పచ్చని గరిక (లాన్) పరుస్తున్నారు. బెంగుళూరు నుంచి తెప్పించిన లాన్ అది.

శంఖు తీర్థం

శంఖుతీర్థంవైకుంఠం క్యూకాంప్లెక్స్ దగ్గర నడిచే నేలంతా రాతి మయంచేసినా, ఇరు వైపులా మొక్కలే.  పైనకూడా వేలాడుతున్న తీగలే.

ఎడమవైపు క్యూకాంప్లెక్స్, కుడివైపున ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోనూ అంగుళం వదలలేదు. అంతా రంగురంగుల ఆకులున్న మొక్కలే. ఆ ఏటవాలులోనే శంఖం ఆకారంలో రాతి బండలో నిలువ ఉన్న నీళ్ళు. అదే శంఖుతీర్థం.

వీటన్నిటినీ చూడడానికి అనుకూలంగా ఈ ఉద్యానవనాలన్నిటిలోనూ చక్కని కాలి బాటలు. రోడ్ల పక్క పేవుమెంట్ల కోసం ఉపయోగించగా మిగిలిన వ్యర్థపు పలకలను తీసుకొచ్చి ఈ కాలిబాటలలో పరిచారు.

తిరుమలలో సైకస్ (cycas)

శేషాచలానికే పరిమితమైన కొన్ని అరుదైన మొక్కలున్నాయి. 1. సైకస్ బెట్టోమి(పేరిత) 2. టెర్మినలిస్ పల్లిక(తెల్లకరక) 3. షోరియా తుంబగ్గి (తంబ జలారి) 4. పింపినెల్ల తిరుపట్టెన్సిస్ (కొండ కొత్తిమీర) 5. బోవెల్లియా ఒవెలిఫోలియోలటా (గుగ్గిలం) 6. సౌజియం ఆబ్జర్నీఫోలియం (మోగి) 7. ఇండిగో ఫెరాబారబెరి (కొండనెలి) 8. రించోసియా సువియో లెన్స్ ( అడాబి కండి) మొదలైనవి ఈ తిరుమల కొండలలో మాత్రమే మనకు కనిపిస్తాయి.

ఇక ఎర్రచందనం గురించి వేరే చెప్పనవసరం లేదు. తిరుమల అడవులు వైవిధ్యమైన వృక్షసంపదకు నిలయం. ఇక్కడ బంగారు బల్లి వంటి అరు దైన జంతుజాలాలూ ఉన్నాయి.

బహుశా ఏ పట్టణంలో , ఏ నగరంలో లేనటువంటి రాత్రి, పగలు మానవ సంచారం ఉండే అరుదైన ప్రాంతం తిరుమల. ఇలాంటి ప్రాంతంలో అటు అడవులను కాపాడాలి, ఇటు జంతు జాలాన్ని రక్షించాలి. గాలి వానలకు చెట్లు పడిపోతే కొమ్మలను తొలగించాలి.

ఈ ఉద్యానవనాలు, రోడ్ల కూడళ్ళు, డివైడర్లు పచ్చగా కళకళ లాడుతూ నిత్య నూతనంగా ఉంటాయి.  వీరి గురించి లోకానికి పెద్దగా తెలియదు. నిత్యం వీటిని పెంచి పోషించి, కాపాడే అజ్ఞాత శ్రామికులు టీటీడీ అటవీ ఉద్యోగులు.

నర్స రీ లో అందమైన పూలు

నేషనల్ పార్క్ వైల్డ్ లైఫ్ శాంచరీ కిందకు వచ్చే తిరుమల అంతా చాలా సున్నితమైన ప్రాంతం. దీనిని నీలాద్రి, గోగర్భం అనే రెండు భాగాలుగా విభజించారు.  నీలాద్రిలో వెంకటసుబ్బయ్య, గోగర్భంలో ప్రభాకర రెడ్డి అటవీ రేం జాఫీసర్లు.

ఈ పచ్చదనాన్ని ఎలా పెంపొందించాలని, ఎలా పరిరక్షించాలని వీరు నిత్యం పథకరచన చేస్తూనే ఉంటారు. వారి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో సిబ్బంది నిత్యం పనిచేస్తూనే ఉంటారు.

ఆలయ అవసరాలను టీటీడీ అటవీ శాఖ నిత్యం తీరుస్తూ ఉంటుంది. జమ్మి, రావి, పత్తి, మోదుగ, ఉత్తరేణి, తెల్లజిల్లేడు, దర్భ, గరికను ఈ అటవీ శాఖే సరఫరా చేస్తుంది. వీటిని అభిషేకాల సమయంలో, యజ్ఞాల సమయంలో ఉపయోగిస్తారు.  శ్రీవారి వాహనాలను మోసే తండ్లను మర్రి ఊడలతో చేస్తారు. ధ్వజస్తంభాలకు కొయ్యను, దివిటీలకు వెదురు కొయ్యలతో చేసిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజస్తంభానికి ఉన్న పాత దర్భ చాపను తీసేసి, వీరు తయారు చేసిన కొత్త చాపను ఎక్కించి ఎగరేస్తారు.

గోగర్భం రేంజరు ప్రభాకరరెడ్డికి మొక్కల పెంపకమే ఉపిరి

పాపనాశనం వెళ్ళే దారిలో టీటీడీ అటవీ శాఖకు ఒక పెద్ద నర్సరీ ఉంది. తిరుమలలో ఏ ఉద్యానవనంలో పెరిగినా, ఏ రోడ్డు పక్కనో, డివైడర్ల మధ్యనో, ఐలాండ్లలోనో కనువిందు చేసే రకరకాల మొక్కలకు ఈ నర్సరీనే జన్మస్థానం. ఎన్ని రకాలు! ఎన్ని రంగులు!  అవ్వన్నీ పూలు కాదు ఆకులే!

తిరుమలలోని చల్లని వాతావరణానికి మాత్రమే పెరిగే హైడ్రోజన్ పువ్వు, గరుగు, కాస్మస్ వంటి మొక్కలు ఎంత చూడముచ్చటగా ఉంటాయో! ఇక్కడ అరటి తోట ఉంది. తులసి వనమూ ఉంది. మన ఇళ్ళలో నాలుగు మొక్కలు పెంచడానికే ఆపసోపాలు పడిపోతాం. అదొక పెద్ద యజ్ఞంలా భావిస్తాం.

ఇన్ని ఎకరాలలో వనాలను, ఉద్యానవనాలను పెంచడం అంత తేలికా!?  తిరుమల  కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు, ఒక పర్యాటక కేంద్రం, ఒక విజ్ఞాన కేంద్రం. ఇక్కడ అడుగడగానా ఊపిరితిత్తుల నిండా స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చుకుంటాం.

చెట్ల నుంచి వీస్తున్న శీతవాయువులు, నీలాకాశంలో సాగిపోతున్న మబ్బులు మన మనసుల్ని దూదిపింజలను చేసి గాలిలోకి ఎగురవేస్తాయి. ఆ అనుభూతి లోకాలలో పయనింపచేస్తాయి.

(అలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *