తిరుమ‌ల‌ పూర్వకాలపు కాలిబాట ‘పుల్లుట్ల దారి’ గాలింపు ట్రెక్

(రాఘ‌వ శ‌ర్మ‌)

ప‌చ్చ‌ని చెట్లు.. పారే సెల ఏళ్ళు.. మ‌ధ్య‌లో లేళ్ళు..  జ‌ల‌పాతాలు..ప్ర‌కృతి అందాల మ‌ధ్య తిరుమ‌ల‌కు వెళ్ళే అతి పురాత‌న‌మైన‌ది  పుల్లుట్ల దారి. ఇప్పుడు పెద్ద‌గా వాడుక‌లో లేదు. దీనికి చాలా చ‌రిత్ర ఉంది.

క‌డ‌ప వైపు నుంచి తిరుమ‌ల వెళ్ళే వారికి చాలా ద‌గ్గ‌ర మార్గం. భూమ‌న్ సార‌థ్యంలో, అట‌వీ అధికారుల స‌హ‌కారంతో గురువారం పుల్లుట్ల దారిని ఇలా అన్వేషించాం.

తిరుప‌తి నుంచి క‌డ‌ప వెళ్ళే దారిలో మామండూరుకు కిలో మీట‌రు ఇవ‌త‌ల ఎడ‌మ వైపున ఒక దారి వస్తుంది. అక్క‌డ‌ రైల్వే వంతెన క‌నిపిస్తుంది.ఆ వంతెన కింద నుంచి ‘ప్ర‌కృతి బాట’ మొద‌ల‌వుతుంది.శ‌తాబ్దాల నాటి  పురాత‌న‌మైన బాట‌.

గుర్ర‌పు బండ్ల‌లో తిరుమ‌ల వెళ్ళ‌డానికి బ్రిటిష్ వారి కాలంలో వేసిన 22 కిలోమీటర్ల ర‌హ‌దారి. ఆ బాట‌కు ఇరు వైపులా నేరేడు, రావి, వేప వంటి ర‌క‌ర‌కాల చెట్లు.

చెట్ల నిండా కిచ‌కిచ‌ల‌తో పిచ్చుక‌ల ప‌ల‌క‌రింపులు. పక్షుల శబ్దాల పులకరింతలు

అడవిలో మాకు తారస పడ్డ జింకల గుంపు

మేం వెళుతుంటే  మ‌మ్మ‌ల్ని చూసి జింక‌ల గుంపు ప‌రుగు తీసింది.అక్కడి లోతైన కాలువ‌లో నీళ్ళు ప్ర‌వ‌హించిన ఆన‌వాళ్ళు.కొండ‌ల‌పై కురిసిన వ‌ర్షాల‌కు ఈ కాలువ నిండుగా ప్ర‌వ‌హిస్తుంది. ఒక‌టిన్న‌ర కిలో మీట‌రు వెళ్ళ‌గానే దారి రెండుగా చీలుతుంది.


తిరుప‌తి జ్ఞాప‌కాలు-41


కుడివైపు దారిలో వెళితే బ్ర‌హ్మ‌దేవగుండం, క‌లివిలేటి కోన‌, జ‌డ‌లపునుగు, గ‌తంలో మేం వెళ్ళిన మార్కండేయ తీర్థం (తిరుప‌తి జ్ఞాప‌కాలు-38) వ‌స్తాయి.

ఎడ‌మ వైపున‌కు వెళితే పుల్లుట్ల దారిలో తిరుమ‌ల వెళ‌తాం. మ‌రొక కిలోమీట‌రున్న‌ర వెళితే కుడివైపున అడ‌విలో 50 అడుగుల జ‌ల‌పాతాలు. అవి రామ‌ల‌క్ష్మ‌ణ తీర్థాలు. కానీ, ఇప్పుడక్క‌డ‌ నీళ్ళు లేవు.

ఊడిగ మాను దొడ్డి బేస్ క్యాంపు వద్ద ప్రకృతి ప్రియులు

మ‌రికాస్త ముందుకు వెళితే ఊడిగ‌మాను దొడ్డి అట‌వీ బేస్ క్యాంపు క‌నిపిస్తుంది. అక్క‌డే మాకు ‘ఆడ‌ప‌క్షి ఆకు’ మొక్క‌లు క‌నిపించాయి. కాళ్ళు  చేతులు మెలివేసుకుని పుట్టిన పిల్ల‌ల‌కు ఈ ‘ఆడ‌ప‌క్షి ఆకు’  ప‌స‌రు పోస్తే న‌య‌మ‌య్యేద‌ని ఒక విశ్వాసమని మామండూరుకు చెందిన అట‌వీ ఉద్యోగి ర‌విబాబు  చెప్పాడు.

అక్క‌డ ఎర్ర‌చంద‌నం, క‌ర‌క్కాయ చెట్లు అధికం.మ‌రికాస్త ముందుకు వెళ్ళి, ఎడ‌మ వైపున అడ‌విలోకి తిరిగితే ’తూకి ఆకువ‌ల‌స‌లు‘ చిన్న‌ జ‌ల‌పాతం. ప‌ది అడుగుల ఎత్తైన‌ బండ‌పైనుంచి జాలువారిన జ‌ల‌పాత‌పు ఆన‌వాళ్ళు.ఆ నీరు ద‌క్షిణం వైపు నుంచి ఉత్త‌ర దిశ‌గా లోయ‌లోకి ప్ర‌వ‌హిస్తుంది.

 

ప్రకృతి బాట లో నడక

 

ఆ కొండ దారి మ‌లుపులు తిరుగుతూ ముందుకు సాగుతున్నాం.‘పెద్ద బండ‌ల చేను’ వ‌ద్ద కుడివైపున‌ ఒక శిలాఫ‌ల‌కం. దాన్ని చూడ‌గానే అట‌వీ ఉద్యోగుల్లో ఒక ఉద్వేగం. మాట‌లు పెగ‌ల‌ని, చెప్ప‌న‌ల‌వి కాని బాధ‌.ఎనిమిదేళ్ళ క్రితం అక్క‌డే ఒక దారుణ సంఘ‌ట‌న‌!

ఆ రోజు 2013, డిసెంబ‌ర్ 15వ తేదీ. ఎర్ర‌చంద‌నం దొంగ‌ల గాలింపు కోసం మూడు జీపుల్లో 15 మంది అట‌వీ అధికారులు, సిబ్బంది బ‌య‌లు దేరారు. ఈ పెద్దబండ‌ల చేను ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఎర్ర‌చంద‌నం దొంగ‌లు తార‌స‌ప‌డ్డారు. అట‌వీ అధికారుల‌ను చూసి అంతా అడ‌విలోకి పారిపోయారు.  వారిలో న‌లుగురిని ప‌ట్టుకుని జీపులో కూర్చోబెట్టారు.

కొంద‌రిని వారికి కాప‌లాగా పెట్టి, మిగ‌తా వారి కోసం అడ‌విలో గాలించ‌డానికి వెళ్ళారు. అక్క‌డ పెద్ద‌ సంఖ్య‌లో ఎర్ర‌చంద‌న దొంగ‌ల గుంపు వీరి కోసం కాపు కాచి ఉంది. అట‌వీ అధికారుల‌పై రాళ్ళ‌తో, క‌త్తుల‌తో మూకుమ్మ‌డి దాడి చేశారు.

ఊహించ‌ని ప‌రిణామంతో 13 మంది అట‌వీ అధికారులు అవాక్కయ్యారు  ఎటుప‌డితే అటు ప‌రుగులు తీసి త‌ప్పించుకున్నారు. అసిస్టెంట్ బీట్ ఆఫీస‌ర్ ఎన్‌. డేవిడ్ క‌రుణాక‌ర‌న్ పారిపోతుంటే ఎర్ర‌చంద‌నం దొంగ‌లు గురి చూసి రాయితో కొట్టారు.

ఆ రాయి వెనుక‌నుంచి అత‌ని త‌ల‌కు బ‌లంగా త‌గిలి అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. డెప్యూటీ రేంజ్ ఆఫీస‌ర్ శ్రీ‌ధ‌ర్ వారి చేతికి చిక్కాడు. శ్రీ‌ధ‌ర్ శ‌రీర అవ‌య‌వాలను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి చంపేశారు. ఇద్ద‌రు అట‌వీ అధికారులు అడ‌విని కాపాడ‌డానికి బ‌లిదానం చేసిన ప్రాంతం అది. అందుకే ఆ ఉద్వేగం.

అటవీ అధికారులు కేసు పెట్టినా కోర్టు లో నిలువ లేదు. పెద్ద‌బండ‌ల‌చేను వ‌ద్ద వారి స్మృతి  చిహ్నంగా ఒక‌ శిలాఫ‌ల‌కం. మా బృందం స‌భ్యులంతా ఆ శిలాఫ‌ల‌కం వ‌ద్ద వారికి నివాళులు అర్పించారు.

భూమ‌న్‌, వారి స‌తీమ‌ణి ఆచార్య కుసుమ‌కుమారి (మాజీ వైస్ చాన్స్ లర్, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం) ఆ శిలాఫ‌ల‌కంపైన పూలు పెట్టి, కొబ్బ‌రికాయ కొట్టారు.

అటవీ అధికారుల స్మృతి చిహ్నం వద్ద …

ముందుకు పోతే ఊడ‌ల మాను దొడ్డి బేస్ క్యాంపు వ‌స్తుంది. పెద్ద పెద్ద ఊడ‌లు దిగిన చెట్లు క‌నిపిస్తాయి. ఇక్క‌డ బిక్కి పండ్లు ఎక్కువ‌గా దొరుకుతాయి.

అలా ఆ ద‌ట్ట‌మైన అట‌వీ దారిలో ముందుకు వెళితే, కుడివైపున స‌త్రాలు, మార్కండేయ తీర్థం వెళ్ళే దారి వ‌స్తుంది. అటు నుంచి అన్న‌మ‌య్య మార్గం వ‌స్తుంది.

ఇది కూడా చదవండి

*మార్కండేయ తీర్థాన్ని సంద‌ర్శించ‌డం మ‌ర‌చిపోని ఒక మ‌నోల్లాసం.

నేరుగా వెళితే  పార్వేటి మండ‌పం ద‌గ్గ‌ర ఉన్న‌ శ్రీ‌గంధంతోట వ‌స్తుంది. కానీ, ఎడ‌మ వైపున ఒక న‌డ‌క దారి ఉంది.ఇది అన్న‌మ‌య్య మార్గం నుంచి తిరుమ‌ల వెళ్ళే దారి.

ఈతకాయల మండపం

 

ఈ దారిలో ఒక‌టిన్న‌ర  కిలోమీట‌రు న‌డిస్తే, ఈత‌కాయ‌ల మండ‌పం  వ‌స్తుంది. నిజానికి  తిరుమ‌ల వైపునుంచి అన్న‌మ‌య్య మార్గానికి వెళ్ళే దారికి ఇది ముఖ ద్వారం. అస‌లిది అన్న‌మ‌య్య మండ‌పం.

ఇక్క‌డ ఈత చెట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల దీనికి ఈత‌కాయ‌ల మండ‌పం అన్న పేరొచ్చింది. ఈ అన్న‌మ‌య్య మార్గంలో ఇప్ప‌టికీ యాత్రికులు పెద్ద సంఖ్య‌లో తిరుమ‌ల  వ‌స్తున్నారు. శ‌తాబ్దాల నాటి మండపం ఇది.

ఈతకాయల మండపం వద్ద యాత్రికులు వదిలేసిన చెప్పులు

తిరుమ‌ల కొండ ప‌విత్ర‌మైన‌ద‌ని భ‌క్తుల విశ్వాసం. రామానుజుడు పాదం మోప‌కుండా మోకాళ్ళ పైనే తిరుమ‌ల ఎక్కాడ‌ని ప్ర‌శ‌స్తి.

ఇప్పుడ‌లా ఎక్క‌లేక‌పోవ‌చ్చు కానీ, ఆ విశ్వాసం వారిలో ఇప్పటికీ గూడుక‌ట్టుకుని ఉంది. ఇప్ప‌టికీ చాలా మంది తిరుమ‌ల కొండ‌కు చెప్పులు వేసుకోకుండానే వెళ‌తారు.

తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులు త‌మ చెప్పుల‌ను ఈత‌కాయ‌ల మండ‌పం వ‌ద్ద వ‌దిలేసి  సాగుతారు. అందుకే కుప్ప‌తెప్ప‌లుగా చెప్పులు, బూట్లు ఇక్క‌డ  ప‌డి ఉన్నాయి. తిరిగి వ‌చ్చేట‌ప్పుడు ఆ  చెప్పులు వేసుకోరు. అటునుంచి అటే వెళ్ళిపోతారు. అట‌వీ సిబ్బంది ఈ చెప్పుల‌న్నిటినీ ఏరి లారీల‌లో చెత్త‌లోకి త‌ర‌లిస్తారు.

 

ఈత కాయల మండ పం వద్ద దట్టంగా పెరిగిన పైన్ చెట్లు

ఇక్క‌డ నుంచి తిరుమ‌ల‌కు రెండు కిలోమీట‌ర్లు. ఈ రెండు కిలో మీట‌ర్లు చెప్పులు లేకుండానే న‌డుస్తారు. అలాగే కుక్క‌ల దొడ్డి వైపు నుంచి వ‌చ్చే అన్న‌మ‌య్య మార్గంలో కొంద‌రు  చెప్పులు అక్క‌డే వ‌దిలేసి వ‌స్తారు. వాటిని మ‌ళ్ళీ వేసుకోరు.

ఈ చెప్పుల ద‌రిద్రం ఇక్క‌డితో ఒదిలిపోయింద‌నుకుంటారో, ఏమో!. ఈ పుల్లుట్ల దారిని పున‌రుద్ద‌రిస్తే తిరుమ‌ల ప్ర‌యాణం తేలిక‌వుతుంది. తిరుమ‌ల‌కు వెళ్ళే రెండు ఘాట్ రోడ్ల‌లో ఉన్న తీవ్ర‌మైన మ‌లుపులు ఈ దారిలో లేవు.  ప్ర‌మాదాలూ జ‌ర‌గ‌వు.

మామండూరు నుంచి మ‌రొక దారిలో తిరుమ‌ల‌కు న‌డుచుకుంటూ వ‌చ్చి, ఈ పుల్లుట్ల దారిలో తిరిగి వెళ్ళే వారు. తిరుమ‌ల‌కు  ఈ దారుల‌ను పున‌రుద్ద‌రిస్తే తిరుప‌తి పైన ఒత్తిడి త‌గ్గుతుంది. అడ‌వి మ‌ధ్య‌నుంచి, తిరుమ‌ల‌కు వెళ్ళే ఈ ‘ప్ర‌కృతి బాట’ మ‌ళ్ళీ క‌ళ‌క‌ళ‌లాడుతుంది.

(రాఘవశర్మ,సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

 

ఇది కూడా చదవండి

 

https://trendingtelugunews.com/top-stories/travel/trek-in-seshachalm-forest-in-search-ancient-tirumal-footpath-pulltla-daari/

One thought on “తిరుమ‌ల‌ పూర్వకాలపు కాలిబాట ‘పుల్లుట్ల దారి’ గాలింపు ట్రెక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *