నేటి ట్రెక్: నాడు అన్నమయ్య తిరుమలకు నడిచిన దారిలో…

 

(రాఘ‌వ శ‌ర్మ‌)

మార్కండేయ తీర్థాన్ని సంద‌ర్శించ‌డం మ‌ర‌చిపోని ఒక మ‌నోల్లాసం. శేషాచ‌లం కొండ‌ల్లోని ఏడు దేవతీర్థాల‌లో ఒక‌టిగా ఇది ప్ర‌సిద్ధి చెందింది. చుట్టూ ఉన్న రాతి కొండ‌ల‌ మ‌ధ్య‌లో దీర్ఘ చతురస్రాకారం గా ఒక లోతైన  నీటి గుండం.

రాళ్ళ‌లోంచి ఊట‌లూరుతూ, పడమరన మెట్లు మెట్లు గా ఉన్న కొండ రాళ్ళ పైనుంచి తూర్పు నకు జాలువారుతూ,  నీటి గుండంలోకి దూకుతున్న జ‌ల‌ధార‌. ఆ జ‌ల‌ధార  నీటి గుండంనుంచి ఉత్తరా న ఉన్న లోయ‌లోకి  సాగిపోతుంది.

తీర్థానికి దక్షిణ దిక్కున రెండు కొండలను కలుపుతూ పెద్ద పెద్ద బండ రాళ్ళు కలిసి ఉంటాయి. ఈ తీర్థానికి వెళ్ళడానికి అసలు దారెలా ఉంది? నీళ్ళున్నాయా? అన్న‌ది ఒక సందేహం. ఈ సందేహాల‌న్నిటినీ భూమ‌న్ నివృత్తి చేశారు.

ప్ర‌ముఖ ట్రెక్క‌ర్ మ‌ధు ఆధ్వ‌ర్యంలో  న‌లుగురు స‌భ్యుల బృందాన్ని ముందు రోజు ఈ తీర్థానికి పంపించారు. అట‌వీ అధికారుల అనుమ‌తి తీసుకుని భూమ‌న్ ఈ తీర్థ సంద‌ర్శ‌న‌కు  ప‌చ్చ‌జెండా ఊపారు.

జులై 11వ తేదీ ఆదివారం  ఉద‌యం ఈ తీర్థానికి బయలు దేరాము. మ‌న‌సు నిండా ఒక  ఆనందాన్ని, అనుభూతిని నింపుకుని మ‌రీ తిరిగి వ‌చ్చాం.

 


తిరుప‌తి జ్ఞాప‌కాలు-38


 

టీటీడీ అట‌వీ రేంజ‌ర్  అధికారులు వెంక‌ట‌సుబ్బ‌య్య‌, ప్ర‌భాక‌ర రెడ్డి, డెప్యూటీ రేంజ‌ర్ శ్రీ‌నివాసులు, సిబ్బంది వెంక‌టేశ్వ‌ర్లు,  మ‌రొక ఇద్ద‌రు కూడా మాతో వ‌చ్చారు.

మార్కండేయ తీర్థానికి వెళ్లే దారిలో స‌త్రాల  వ‌ద్ద ప్ర‌కృతి ప్రియులు

 

మొత్తం పాతిక మంది  ప్ర‌కృతి ప్రియులు క‌లిసి ఈ తీర్థాన్ని సంద‌ర్శించాం. ఈ తీర్థానికి వెళ్ళాలంటే  ఉత్త‌ర దిక్కుగా ఉన్న పాప‌నాశ‌నం దారిలో సాగాలి. పార్వేట మండ‌పం దాటాక కుడివైపున పురాత‌న‌మైన అన్న‌మ‌య్య‌మార్గం వ‌స్తుంది.

పురాత‌న కాలంలో క‌డ‌ప జిల్లా వైపు నుంచి  చాలా  మంది భ‌క్తులు ఈ అన్న‌మ‌య్య మార్గం నుంచే   తిరుమలకు వ‌చ్చేవారు. ప‌ద‌క‌వితా పితామ‌హుడు అన్న‌మ‌య్య 16వ శ‌తాబ్దంలో  ఈ దారిలోనే  తిరుమ‌ల‌కు నడిచి వ‌చ్చాడ‌ని ప్ర‌శ‌స్తి.

కుక్కల దొడ్డి నుంచి తిరుమలకు ప‌దిహేను కిలోమీట‌ర్లున్న ఈ దారిలో ఘాట్ రోడ్డు లాగా ఎక్క‌డా మెలిక‌లు లేవు. అన్న‌మ‌య్య మార్గం ప్రారంభంలో టీటీడీ అట‌వీ శాఖ గేటు వ‌స్తుంది.

శ్రీ‌గంధం తోట‌

ఈ గేటు దాటితే టీటీడీ నాటిన శ్రీ‌గంధం తోట క‌నిపిస్తుంది. తిరుమ‌ల ఆల‌యంలో ఉప‌యోగించే శ్రీ‌గంధం కోసం ఏడేళ్ళ క్రితం టీటీడీ ఈ మొక్క‌ల‌ను నాటింది.

మ‌రో ప‌దేళ్ళ‌కు కానీ ఈ చెట్లు ఉప‌యోగంలోకి రావు. ఇప్ప‌టి వ‌ర‌కు  మైసూరు నుంచి శ్రీ‌గంధం చెక్క‌లు తెప్పిస్తున్నారు. గ‌త ఏడాది మొద‌లైన క‌రోనా లాక్‌డౌన్  స‌మ‌యంలో పెద్ద ఎత్తున ఏనుగులు ఈ శ్రీ‌గంధం తోట‌లోనే విడిది చేశాయి.

ఏనుగులు ఒక మేర‌కు శ్రీ‌గంధం చెట్ల‌ను కూడా ధ్వంసం చేసిన‌ట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ శ్రీ‌గంధం తోట‌కు ద‌క్షిణ దిశ‌గా ఎత్తైన కాకుల కొండ‌పైన ప‌వ‌న విద్యుదుత్ప‌త్తి కోసం అమర్చిన పెద్ద పెద్ద పంఖాలు క‌నిపిస్తాయి.

ముందుకు  సాగుతుంటే ద‌ట్ట‌మైన అడ‌వి. మా అలికిడికి అడ‌వి మ‌ధ్య‌లో తారాడుతున్న నెమ‌లి పారిపోయింది.

పాడుప‌డిన పురాత‌న కోనేరు

 

కొంద దూరం వెళ్ళాక ఎడ‌మ వైపున సీత‌మ్మ ధార‌కు వెళ్ళే దారి వ‌స్తుంది. గ‌తంలో ఈ పుల్లుట్ల దారిలోనే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్లు ఇద్ద‌రు అటవీ అధికారుల‌ను చంపేశారు. మూడున్న‌ర కిలోమీట‌ర్లు వెళ్ళాక ఎడ‌మ వైపున కొంత‌ దూరం న‌డిస్తే ఒక పాడుప‌డిన కోనేరు క‌నిపిస్తుంది.

ఇప్పుడది అడ‌విలో జంతువుల‌కు, ముఖ్యంగా ఏగుల‌కు దాహార్తి తీరు స్తున్న ది. కోనేరు దాటి ముందుకు వెళితే శిథిల‌మైన స్ర‌తాలు క‌నిపిస్తాయి. ఇటుక , సున్నంతో దాదాపు మూడ‌డుగుల వెడ‌ల్పైన గోడ‌లతో వీటిని నిర్మించారు.

ఇప్పుడ‌వి పూర్తిగా శిథిల‌మై, గోడ‌ల్లో మొక్కలు మొలిచి, పెద్ద  పెద్ద వృక్షా లుగా పెరిగి ఊడ‌లు దిగిపోయాయి. ఆ వృక్షాల కొమ్మ‌లు, వేళ్ళు గోడ‌ల బాహువుల్లోకి కలసి పోయాయి.

శిథిల‌మైపోయిన స‌త్రాలు

 

ఈ  ప్రాంతాన్ని 14, 15 శ‌తాబ్దాల‌లో ఏలిన రాజులు తిరుమ‌ల‌కు వెళ్ళే యాత్రికుల కోస‌మే  ఇక్కడ ఈ కోనేరును, సత్రాలను నిర్మించారు. ఈ దారి పూర్తిగా మూత‌ప‌డి, శిథిల‌మైన‌ కోనేరు, స‌త్రాలు ఇప్పుడు ఇలా బావురు మంటున్నాయి.

ఇక్క‌డే ఆకాశాన్ని తాకుతున్న‌ట్టున్న  అడ‌వి మామిడి వృక్షాలు.నేలంతా రాలిన ప‌సుపు ప‌చ్చ‌టి అడ‌వి మామిడి ప‌ళ్ళు. పులుపు, తీపి క‌లిసి మాకు కొత్త‌ రుచిని చ‌విచూపించాయి. అన్న‌మ‌య్య మార్గానికి  ఇరువైపులా ద‌ట్టంగా పెరిగిన అడ‌వి.

ఆ దట్టమైన అడవిలో వెళుతుంటె, ఏ దిక్కు ఎట న్న ది తెలియ లేదు. వెదురు  పొద‌లు, ఏనుగులు విరిచేసిన ఆన‌వాళ్ళు. అక్క‌డ‌క్క‌డా ప‌చ్చిగా  ఉన్న ఏనుగు ల‌ద్దెలు. ఈ ప్రాంతంలో ఇటీవ‌ల ఏనుగులు సంచ‌రించాయ‌న‌డానికి ఆన‌వాళ్ళు. ఎర్ర‌చంద‌నం చెట్ల మ‌ధ్య పెరిగిన ఈత చెట్లు. చెట్ల నిండా ప‌ళ్ళే. ఈత‌ప‌ళ్ళంటే  ఎలుగు బంట్ల‌కు ఎంత ఇష్ట‌మో!

సత్రాలు దాటాక మ‌రొక మూడున్న‌ర కిలోమీట‌ర్లు సాగితే, ఎడ‌మ వైపు లోయ‌లోకి స‌న్న‌ని కాలిబాట‌. ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళ గలి గి నంత సన్నని దారి. లోయ‌లోకి దిగుతుంటే ఇరువైపులా ఈత చెట్లే. వాటి మ‌ధ్య‌లో అనేక ర‌కాల ఎత్తైన చెట్లు.

రాళ్ళ కాలువ‌

ఆ చెట్ల‌ మ‌ధ్య నుంచి లోయ‌లోకి ఏట‌వాలుగా  దిగుతున్నాం. దాదాపు ఒక‌టిన్న‌ర కిలోమీట‌ర్లు లోయ‌లోకి దిగాక ఎదురుగా రాళ్ళ తో నిండిన నీళ్ళు లేని పెద్ద కాలువ‌. కాలువకు ఇరువైపులా ఎత్తైన కొండ.

స‌త్రాలు, కోనేరు వ‌ద్ద మొద‌లైన‌ ఈ కాలువ  మార్కండేయ తీర్థం వ‌ర‌కు సాగుతుంది. ఈ కాలువ వెంబ‌డి ఉత్త‌ర దిశ‌గా ముందుకు సాగితే అవిగో నీటి శ‌బ్దాలు. ఈ కాలువ రాళ్ళ‌లోంచి  ఊట‌లూరుతూ తీర్థం లోకి ప‌డుతున్న జ‌ల‌ధార‌. రాళ్ళ కాలువ  నుంచి  తీర్థంలోకి మెల్లిగా దిగుతున్నాం. ఎక్క‌డ జారుతుందోన‌న్న భ‌యం. తూర్పువైపు ఎదురుగా మార్కండేయ తీర్థం.

ఈ కాలువ‌లో మాకు క‌నిపించ‌కుండా  రాళ్ళ కింద నుంచి మాతోనే వ‌చ్చిన జ‌ల‌ ధార గుండంలోకి మెల్లిగా జాలువారుతోంది. మార్కండేయ తీర్థం పొంగి  పొర‌లి ద‌క్షిణం నుంచి ఉత్త‌రానికి ప్ర‌వ‌హిస్తోంది.

 

మార్కండేయ తీర్థంలో ఈదులాడుతున్న ప్ర‌కృతి ప్రియులు

ఈ నీటి గుండాన్ని చూడ‌గానే మా వాళ్ళంద‌రిలో  ఒక్క‌సారిగా ఎక్క‌డ‌లేని ఆనందం ఉబికి వ‌చ్చింది. అది ఊరికే ఉండ‌నీయ‌లేదు, సేద‌దీర‌నీయ లేదు. అంతే..ఒక‌రొక‌రు గుండంలోకి దూక‌డం మొద‌లు పెట్టారు.

గుండం లోకి నిటారుగా దూకడం , తలకిందుల దూకడం; ఎన్ని విన్యాసా లో! ఆకాశం నిండా మబ్బులు కమ్మి వాతావరణం ఆహ్లాదంగా ఉంది. సూర్యుడు కనిపించడం లేదు. మిట్ట మధ్యాహ్నం దాటింది. కాలం తెలియడం లేదు. ఆకలి తెలియడం లేదు.

ఒక సత్రం దగ్గిర వ్యాస రచయిత రాఘవ శర్మ

ఎంత సేపు ఇలా!

గుండం నుంచి  లేచి,  ప్ర‌వాహం సాగుతున్న ఉత్త‌ర దిశ‌కు వెళితే, దీనిని మించిన నీటి గుండాలు! తిండి తీర్థం అక్కడే ముగించి మళ్ళీ వెనుదిరిగా ము. తీర్థం చూడాలని ఎంత ఉత్సాహంగా వచ్చా మో, తిరిగి వెళ్లే సమయంలో మా అడుగులు అంత భారంగా పడ్డాయి. లోయ నుంచి కొండ ఎక్క డం పెద్ద ప్రయాస. మార్కండేయ తీర్థం చూసిన ఆ ఆనందమే మమ్మల్ని ముందుకు నడిపించింది.

(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు,తిరుపతి)

More on Trekking

 

https://trendingtelugunews.com/top-stories/gallery/markandeya-tirtham-trek-photo-gallery/

2 thoughts on “నేటి ట్రెక్: నాడు అన్నమయ్య తిరుమలకు నడిచిన దారిలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *