TV5 మీద అలాంటి వార్త ఎందుకొచ్చింది?

(తోట భావనారాయణ)

టీవీ5 యాజమాన్యం తమ చానల్స్ ను అమ్మేసినట్టు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది నిజం కాదు అని చెప్పటానికి చాలా కథ చెప్పాలి.

ఎందుకంటే, సాక్షాత్తూ సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ వారి వెబ్ సైట్ లోనే టీవీ 5 డైరెక్టర్ల పేర్లు మారిపోయి ఉండటం వలన రకరకాల ఊహాగానాలతో కథనాలు వెలువడటానికి ఆస్కారం ఏర్పడింది.

ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్ళిందంటే దీనికి రఘురామకృష్ణం రాజుతో ఆర్థిక వ్యవహారాల మీద వచ్చిన ఆరోపణలతో ముడిపెట్టేదాకా. అమ్మేసినట్టు కొంతసేపు, ప్రభుత్వమే చర్యలకు ఉపక్రమించినట్టు ఇంకోవైపు విశ్లేషణలు సాగాయి. ఇదిగో ఈ కథనం అలాంటి పొరపాటు ఆధారంగా సాగిన ఊహాగానాలకు మచ్చుతునక: TV5 ఛానల్స్ అమ్మేశారు.. మారిన డైరెక్టర్లు.. ఢిల్లీ స్థాయిలో చర్చలు అనే వార్త.

అసలెక్కడ మొదలైంది?

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తరచూ అనుమతి పొందిన శాటిలైట్ చానల్స్ సమాచారాన్ని అప్ డేట్ చేస్తూ ఉంటుంది. అందులో చానల్స్ పేర్లు ( మారి ఉంటే అంతకు ముందు పేర్లు), వాటి యాజమాన్య సంస్థ పేరు, డైరెక్టర్ల పేర్లు, లైసెన్స్ పొందిన తేదీ, గడువు తేదీ, ఏ భాషల్లో ప్రసారానికి అనుమతి తీసుకున్నారు, న్యూస్ అనుమతి లేదా నాన్-న్యూస్ అనుమతి అనే అంశాలు అందులో పొందుపరుస్తారు. అయితే, ఈ సంవత్సరం జూన్ 30న అప్ డేత్ చేసిన జాబితాలో టీవీ5, టీవీ 5 కన్నడ, హిందూ ధర్మం చానల్స్ యాజమాన్య సంస్థ అయిన శ్రేయా బ్రాడ్ కాస్టింగ్ పేరు ఎదురుగా దివ్యేశ్ మాణెక్ లాల్ షా, స్మృతి మాణెక్ లాల్ షా, స్మృతి శ్రేయాన్ష్ షా, శ్రేయాన్ష్ శాంతిలాల్ షా పేర్లు డైరెక్టర్లుగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్క సారిగా కలకలం మొదలైంది. యాజమాన్యం మారిపోయిందన్న వాదనకు ఇదే పునాదిగా మారింది.

కార్పొరేట్ ఎఫైర్స్ మినిస్ట్రీ వెబ్ సైట్ లో ఏముంది?

అయితే, ఈ అనుమానం వచ్చిన వెంటనే సహజంగా ఎవరైనా చెక్ చేసేది కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారి వెబ్ సైట్ లో డైరెక్టర్ల పేర్లు ఇవే ఉన్నాయా అని. కానీ అందులో మాత్రం టీవీ5 అసలు యజమానుల పేర్లే ఉన్నాయి. కానీ ఇక్కడొక సాంకేతిక అంశం ఉంది. ఎవరైనా ఒక కంపెనీని కొనుగోలు చేస్తే వెంటనే కొత్త డైరెక్టర్ల పేర్లు ఆ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. కానీ శాటిలైట్ చానల్స్ నడిపే సంస్థలు మాత్రం దీనికి మినహాయింపు.

ఎవరైనా కొత్తగా డైరెక్టర్ గా రావాలంటే కేవలం వాటాలు కొన్నంత మాత్రాన సరిపోదు. ఆ వ్యక్తిని డైరెక్టర్ గా చేర్చుకోబోతున్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ముందుగా తెలియజేయాలి. వారిమీద మనీలాండరింగ్, ఫెమా లాంటి చట్టాలకింద కేసులు లేవని, ఎలాంటి నేరచరిత్రా లేదని హోం, ఆర్థిక మంత్రిత్వశాఖలనుంచి క్లియరెన్స్ రావాలి.

అలా వచ్చేవరకూ వాళ్ళు మెజారిటీ వాటాదారులైనా సరే డైరెక్టర్ గా చేరటానికి వీల్లేదు. అందువలన బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ అమ్మకం జరిగినా, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ క్లియరెన్స్ ఇస్తే తప్ప వాళ్ళ పేర్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఎక్కించటానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరైనా ఒక బ్రాడ్ కాస్టింగ్ సంస్థను కొనుగోలు చేసినా, వాళ్ల పేర్లు ఇంకా ఈ వెబ్ సైట్ లోకి ఎక్కకపోవచ్చు. ఈ అవకాశాన్ని కూడా ఆసరాగా చేసుకొని తమకు అనుకూలమైన భాష్యం చెప్పుకొని ఈ బ్రాడ్ కాస్టింగ్ సంస్థను కొనుగోలు చేసి ఉంటారని అనుమానపడి ఉంటారు.

ఇంతకీ ఏం జరిగింది?

ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న డైరెక్టర్ల పేరుతో ఏవైనా కంపెనీలు ఉన్నాయా అని పరిశీలిస్తే శ్రేయార్థ్ ఆస్ పాస్ లిమిటెడ్ అనే సంస్థ పేరు, అది జీఎస్ టీవీ నడుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే శ్రేయా కు, శ్రేయార్థ్ కు ఉన్న పోలిక కారణంగా మంత్రిత్వశాఖ అధికారులు ఆ సంస్థ డైరెక్టర్ల పేర్లనే ఈ సంస్థ పేరు ఎదుట కూడా ఎక్కించటం వలన ఈ అనర్థం జరిగింది. సాధారణంగా ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని చానల్ యాజమాన్యాలు తనిఖీ చేసుకొకపోవటం వలన ఇలాంటి పొరపాట్లు గుర్తించలేకపోవచ్చు. నెలరోజులక్రితం అప్ డేట్ చేసినట్టు మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉండటాన్ని బట్టి చూస్తే ఈ నెలరోజులుగా ఇది ఎవరి దృష్టికీ రాలేదని అర్థమవుతోంది. మొత్తంగా ఎం ఐ బి సిబ్బంది పొరపాటు కారణంగా టీవీ 5 యాజమాన్య సంస్థ రకరకాల ఊహాగానాలకు గురైంది.

ఈ వెబ్ సైట్ ప్రామాణికత ఎంత?

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖవారి వెబ్ సైట్ లో అనుమర్తి పొందిన శాటిలైట్ చానల్స్ జాబితాలో తప్పులకు కొదవలేదు. అవి నిర్లక్ష్యం వలన జరిగినవా, అసలు సరైన నియంత్రణ లేకపోవటం వలన అలా జరుగుతున్నదా అనే విషయం అర్థం కాదు. ఉదాహరణకు రాజ్ న్యూస్ తెలుగు పేరుతో ఉన్న చానల్ అందరికీ తెలిసిందే. పేరులోనే తెలుగు ఉన్నప్పటికీ ఎంఐబి వారి వెబ్ సైట్ లో మాత్రం దాని ప్రసార భాష తమిళం అని ఉంటుంది. అనుమతి తీసుకునేటప్పుడే ఆ పొరపాటు జరిగిందా, లేదా ఎంఐబి నిర్లక్ష్యమా అనేది తెలియదు. ఎన్నో ఏళ్ళుగా ఇలాగే కొనసాగుతోంది. ఎటీవీ పేరుతో నాన్-న్యూస్ చానల్ గా అనుమతి పొందిన చానల్ చాలా కాలం పాటు నిబంధనలకు విరుద్ధంగా వార్తలు ప్రసారం చేసినా పట్టించుకోలేదు. పైగా, రాష్ట్ర సమాచార శాఖ అధికారులు అక్రెడిటేషన్లు కూడా ఇచ్చి వాళ్ళ అమాయకత్వాన్ని చాటుకున్నారు.

సాక్షి టీవీ లైసెన్స్ గడువు 2018 డిసెంబర్ 30 తో ముగిసినట్టు ఎర్ర అక్షరాలతో రాశారు తప్ప దానర్థం ఏంటో ఎవరికీ తెలియదు. మహా న్యూస్ విషయమూ అంతే. 2018 నవంబర్ 25 తో లైసెన్స్ గడువు ముగిసినట్టు ఉంటుంది. అంతకు మించి సమాచారం ఉండదు.

ఏపీ 24X7 యాజమాన్య సంస్థకు 2018 ఆగస్టు 6 తో లైసెన్స్ గడువు పూర్తయింది. ఆ తరువాత కూడా ఆ చానల్ పేరు మార్పును అనుమతించారు తప్ప లైసెన్స్ రెన్యువల్ సంగతి ప్రస్తావించలేదు. ఇలాంటి లోటుపాట్లు కోకొల్లలు కాబట్టే ప్రభుత్వ వెబ్ సైట్ అయినా దాని సంపూర్ణత, ప్రామాణికత ప్రశ్నార్థకమే.

(తోట భావనారాయణ, సీనియర్ ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *