తిరుపతి ‘డేర్ డెవిల్’ ట్రెకర్స్ వీళ్లే…

(రాఘవ శర్మ)

వారికి అడివంటే ఇష్టం.. అడివంటే ప్రేమ.. అడివంటే ఆనందం.. అడివంటే గౌరవం.. అడివంటే తీరని దాహం.. అడివంటే అంతులేని వ్యసనం. వారు పదిహేనుమంది ‘తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్’ సాహసికులు.

కొండలు గుట్టలు ఎక్కడం, ప్రమాదపు అంచుల్లో నడవడం, లోతైన లోయల్లోకి దిగడం, నీటి గుండాలలోకి దూకడం, ఎత్తైన జలపాతాల కింద తడిసిముద్దవడం, అడవి తల్లి ఒడిలో సేదదీరడం వారికి ఇష్టమైన వ్యాపకం, వారాంతంలో ప్రీతిపాత్రమైన సాహసం.

వారు అడివిని దత్తత తీసుకున్నా రో, అడివే వారిని దత్తత తీసుకు న్న దో తెలియదు.

మార్కండేయ తీర్థంలో ‘డేర్ డెవిల్’ మధుసూదన్

స్విమ్స్ లో టెక్నీషియన్ గా చేస్తున్న మధుసూదన్ ఈ 15 మంది సాహసికుల దండలో దారంలా పని చేస్తాడు. వారికి అడవిలో ఒక దారి దీపం లా మార్గదర్శకుడయ్యాడు. వీరిలో వివిధ వృత్తుల వారున్నారు.చాలా మంది వైద్యరంగంలో పనిచేస్తున్నారు.

చూస్తే యువకుల్లా ఉంటారు, కానీ వయసులో నడివయస్కులు !

తూర్పున ఏర్పేడు నుంచి పడమరన తలకోనవరకు, దక్షిణాన తిరుపతి నుంచి ఉత్తరాన కడప జిల్లాలోని కోడూరు వరకు విస్తరించిన శేషాచలం కొండలన్నిటినీ జల్లెడ పట్టేశారు.


తిరుపతి జ్ఞాపకాలు-40


ఆ కొండల్లో ఉన్న 108 తీర్థాలను తిరిగేశారు.గూగుల్ మ్యాప్తో అడవి దారులన్నిటినీ పసిగట్టారు. ఏ తీర్థం ఎక్కడ ఉందో, ఏదారెటుపోతుందో తెలుసుకున్నారు.

అటవీ అధికారులకు సైతం అంతుచిక్కని కొండ కోనల ఆనుపానులు వారికి తెలుసు. వారంతా అడవి అందాలను అనుభవిస్తున్నారు. ఆ అనుభవాలను పదుగురికి పంచుతున్నారు.

ఎక్కడా కాసులకు వెనుకాడడం లేదు.చూసిన తీర్థాలే మళ్ళీ చూస్తున్నారు. ఎంత చూసినా తనివి తీరడం లేదు. స్విమ్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ ఒక ట్రెక్కర్. ఆయన 2003లో మధుసూదనకు అడవిని చూపించారు. ఆయనతో కలిసి మధుసూదన్ మూడేళ్ళలో పదితీర్థాలు తిరిగాడు .

అడవి అందాల రుచిమరిగిన మధుసూదన్, ‘తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్’ పెట్టి, స్విమ్స్ లో మిగతా డాక్టర్లకు కూడా ఆ రుచి చూపించాడు.

ట్రెకింగ్ లో లంచ్ బ్రేక్ (నారాయణ తీర్థం)

ఒక పుష్కర కాలం వరకు వీరి ట్రెక్కింగ్ స్విమ్స్ ఉద్యోగులకే పరిమితమైంది. రెండేళ్ళ నుంచి ఇతరులు కూడా వీరితో కలిసి అడవిలోకి నడక సాగించారు. క్లబ్ లో సభ్యులు రెండు వందలు దాటారు.

కీలకమైన ఈ పదిహేను మంది ప్రతి ట్రెక్ లోనూ తప్పకుండా ఉంటారు.ఒక్క సారి ట్రెక్ కు పిలుపిస్తే 50 మందికి తగ్గకుండా వచ్చేస్తారు.వీరి సాహసాలు ఒకటా రెండా! అన్నీ ఊహకందనివే!

వీరితో కలిసి నేను, భూమన్ కొన్ని కొండలెక్కాం, తీర్థాలు తిరిగాం.వీరితో కలిసి చూసిన నారాయణ తీర్థం మా వరకు మాకు మహాద్భుతమైనది. వాళ్ళకదొక లేక్కలేనిది.

అడవిలో మా జీపులు వెళుతుంటే, రోడ్డుకు అడ్డంగా ఏనుగులు విరిచేసిన వెదుర్లు, కొమ్మలు. జీపు దిగిన మధుసూదన్, మరొక రి తో కలిసి కత్తులు పుచ్చుకుని పరుగులు తీశారు.

యుద్ధంలో సైనికులలాగా అలివ్ గ్రీన్ దుస్తులు, జంగిల్ బూట్లు ధరించారు. యంత్రం లాగా చెకా చెకా కొమ్మల్ని నరుక్కుంటూ వెళ్ళిపోయారు.

కంగు మడుగు, మూడేళ్ళ కురవ దాటాక ఈత వచ్చిన వాళ్ళం మడుగులోకి దిగాం. ఈతరాని వాళ్ళను గాలి నింపిన జీపు ట్యూబులపై కూర్చోబెట్టి తాళ్ళతో లాక్కుపోయారు.

మూడు పెద్ద పెద్ద నీటి మడుగులలో ఈదుకుంటూ, జలపాతం పక్క నుంచి, ఏటవాలుగా ఉన్న ముప్ఫై అడుగుల కొండ ఎక్కారు. కొండ పైన ఒక పెద్ద బండరాయికి తాడు కట్టి కిందకు వదిలారు. కొండ పైనుంచి నీటి మడుగులోనున్న వారిని తాడు ద్వారా పైకి ఎక్కించారు.

ఆ పదిహేను మందిలో ఒకరిద్దరు మినహా అంతా మంచి ఈతగాళ్ళే! నీళ్ళ దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కరి కోసం అందరూ నిలబడతారు.

శక్తి కటారి తీర్థం- తాంత్రిక లోయ దారిలో ప్రమాదపుటంచున సాహసికులు

శక్తికటారి తీర్థం నుంచి భార్గవ తీర్థం దారిలో తాంత్రిక లోయకు వెళ్ళే టప్పుడు ఎదురెదురుగా ఎత్తైన రెండు కొండలు. వాటి మధ్యలో అర కిలోమీటరు లోతైన లోయ. ఏటవాలు కొండ అంచునే జాగ్రత్తగా నడవాలి.

రెండు కొండల నడుమ వారధిగా ఉన్న చిన్న మిట్టపై పాక్కుంటూ మరొక కొండను దాటాలి. వారికి అదురు లేదు, బెదురు లేదు కానీ, మనకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది!

ఏ మాత్రం అదుపు తప్పినా అంతే సంగతులు.ఇన్నేళ్ళుగా ఒక్క అపశృతీ దొర్లలేదు.ఎంత జాగ్రత్తలు పాటిస్తున్నారో!

వారి ట్రెక్కింగ్ లో మరొక సాహసం విష్వక్సేన తీర్థం.

మామండూరు నుంచి తిరుమలకు వెళ్ళే పుల్లుట్ల దారిలో కుడివైపున 450 అడుగుల ఎత్తు నుంచి లోతైన లోయలోకి పడుతున్న జలపాతం.ఆ లోయలో వరుసగా విరూపాక్ష, విశ్వేశ్వర, విశ్వనాథ, విఘ్నేశ్వర, విష్వక్సేన తీర్థాలు. ఆ లోయలోకి దిగుతుంటే ప్రాణాల పైన ఆశ వదులుకోవాలి.

శక్తి కటారి తీర్థంలో తిరుపతి ట్రెకర్స్

చెప్పనలవి కాని మరొక సాహసం గుంజన జలపాతం. ఎత్తైన రెండు కొండల నడుమ నుంచి జాలువారుతున్న జలపాతం. ఆ జలపాతం అనేక గుండాలలో పడి ముందుకు సాగుతుంది. జలపాతం వెనుక భాగాన ఉన్న నీటి గుండాలను చూడగలుగుతాం. కొండ అంచుల నుంచి దూరంగా ఉన్న జలపాతాన్ని వీక్షించగలుగుతాం.

జలపాతం కిందకు వెళ్ళలేం. కానీ, ‘తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్’ బృందం ఆ సాహసం చేసింది.కొండ అంచులనుంచి జలపాతానికి దారిచేసుకుని వెళ్ళారు. ఒక్కొక్క జలపాతపు గుండంలోకి తాళ్ళతో దిగారు. వారి సాహస యాత్రలో ఇవి కొన్ని మైలు రాళ్ళు మాత్రమే.

అడవిలో అర్థరాత్రి ఇలా ఉంటుంది…

అడవిలో ఒకటి రెండు రాత్రుళ్ళు కూడా గడుపుతారు. అడవిలో వంటలు చేసుకుని, టెంట్లు వేసుకుంటారు.అడవికి వెళుతుంలే భుజానికి పెద్ద బ్యాగ్ ఉంటుంది.

ఆ బ్యాగులో టెంట్లు, ట్యూబులు, తాళ్ళు, మంచి నీళ్ళు, ఆహారం, దుస్తులు, టార్చిలైట్లు; ఇలా ఒకటేమిటి అవసరమైనవన్నీ ఉంటాయి. ఆ బ్యాగు బరువు 20 నుంచి 40 కిలోలుంటుంది.

ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో వీరు అడవికి వెళుతుంటే యుద్ధానికి వెళుతున్న సైనికుల్లా ఉంటారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సహాయకు ల్లా ( డిజాస్టర్ మేనేజ్ మెంట్) కనిపిస్తారు. కొండ లెక్కుతుంటే సైనిక కమాండోల్లాగా అనిపిస్తారు.

ఈ పదిహేను మంది ప్రకృతి ప్రేమికులు.వీరి సాహసాలు శేషాచలం కొండలకు పరిమితం కాలేదు. రామచంద్రాపురం నుంచి చంద్రగిరి మీదుగా నారావారిపల్లెవరకు ఉన్న కొండలన్నిటి పైన జైత్ర యాత్ర చేశారు.

పాపానాయుడుపేట నుంచి అటు పుత్తూరు, ఇటు శ్రీకాళహస్తి కొండలన్నిటిపైనా దండయాత్ర చేశారు. మధుసూదన్, చంద్రవిశ్వనాథ, డాక్టర్ గోవిందరాజు భాస్కర్, డాక్టర్ జగదీష్, మురళి, శివ, మధు, బాల చంద్రయ్య, చలపతి, యుగంధర్, తిరుమలరెడ్డి, రమేష్,
రాధాకృష్ణ, రాజేష్, శ్రావణ్.

వీరంతా ‘తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్’ లో కీలక సభ్యులు.వీరంతా అడవి తల్లి కనురెప్పల నీడల్లో ప్రతి వారం సేదదీరుతారు. అడవిని ఆవాహనం చేసుకుంటారు. పచ్చని కొమ్మలను, చల్లని గాలులను ఆస్వాదిస్తారు.

కొండలను,కోనలను చూసి తన్మయులైపోతారు. పక్షుల పలకరింపులకు పులకించి పోతారు.ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయరు. ఎంత కాలం ఈ సాహసాలు?’ అంటే, ‘శరీరం సహకరించినంత కాలం’ అంటారు.

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *