శేషాచలం అడవుల్లో తరిగొండ వెంగమాంబ ప్రయాణమార్గ అన్వేషణ

(భూమన్ )

తరిగొండ వెంగమాంబ శేషాచలం అడవిగుండా తిరుమలకు చేరుకున్నదారిని చూడాలనిపించింది. నేను మా శ్రీమతి ఫ్రొఫెసర్ కుసుకుమారి (SK యూనివర్శిటీ మాజీవైస్ చాన్స్ లర్)  నా ట్రెకింగ్ మిత్రుడు, ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు ప్రభాకర్ రెడ్డి, రఘు మరొక నలుగురు అటవీ శాఖ సిబ్బంది కలసి ఉదయం పది గంటలకు తిరుమల నుంచి బయలుదేరాం.

అక్కడి వేదిక్ పాఠశాలకు కుడి వైపున కుమారధార, పసుపు ధార  ప్రాజక్టులకు పోయే దారి గుండా మా ప్రయాణం మొదలయింది. వాతావరణం  ఆహ్లాదకరంగా ఉంది. ఎటుచూసినా పచ్చదనం కనువిందు చేస్తున్నది. చక్కటి అడవి వాసనను ఆఘ్రాణిస్తూ ప్రయాణిస్తూ ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్న ‘అన్నదమ్ముల బండ’ ను చేరుకున్నాం.

అన్నదమ్ముల బండ

అక్కడొక జలపాతం హొయలుగా సవ్వడి చేస్తూ  దూకుతూ ఉంది. అది మమ్మల్ని ముందుకు పోకుండా చాలా సేపు కట్టి పడేసింది. అక్కడి నుంచి ముందుకు సాగే కొద్దీ అద్భుతాలే. కొద్ది దూరం పోగానే విస్మయం కలిగించే రాతి గోడలు కనిపిస్తాయి. నిజానికవి రాతిగోడులు కాదు, కొండ అలా అందంగా గోడలాగా తీర్చిదిద్దినట్లు తయారయింది.

 

ఆ కొండల అంచున దాదాపు ఒక కిలో మీటర్ నడుచకుంటూ ప్రయాణించాం. పక్కన లోతైన లోయ అబ్బురపరుస్తుంది. లోయలను చూడ్డానికి మన వాళ్లు ఎంతో దూరం హిమాయలయాలకు, ఊటీకి, నార్త్ ఈస్టుకు వెళ్తుంటారు, అయితే, ఇక్కడ మన పక్కనే కూతవేటు దూరాన అద్భుతమయిన, సుందరమయిన లోయ ఉందని, లోయలో చిందులేస్తూ పారే సెలయేర్లు, వాటితో శ్రుతికలిపే పక్షుల కిలకిలా రావాలు, అందునా నెమళ్ల అరుపులు… ఇంతమయిన ప్రదేశాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.

ఇక్కడి లోయ సౌందర్యం చూపరులను ఆశ్చర్య చకితులను చేస్తుంది. దీనిని చామల కోన అంటారని అటవీ అధికారులు చెప్పారు.

చామల కోన

చామలకోనలో పచ్చటి సిల్క్ దుప్పటి కప్పినట్లు ప్రకృతి కనుచూపు మేరా పరచుకుని కనిపిస్తుంది. దీన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు. కల్యాణి డ్యామ్ వైపు నుంచి వస్తే నేరుగా అన్నదమ్ముల బండ లోయ కింది బాగానికి  చేరుకుంటాం. అక్కడ కొన్ని కోనేరులున్నాయి. పాతకాలపు కట్టడాలు కూడా ఉన్నాయని వారు చెప్పారు.  అయితే, ఇపుడక్కడికి వెళ్లలేమని, ఏనుగులు తిరుగుతున్నాయని వారు చెప్పారు. ఒక గంటసేపు మాత్రమే గడిపాం. ఎందుకంటే మా ప్రయాణం ఇంకా చాలా సాగాల్సి ఉంది. అలా పాములా మెలికలు తిరిగిన ఈ దారి గుండా నడచి నడిచి చివరకు కొండ శిఖరం చేరుకున్నాం.

 

అడవిలో కనిపించిన మరొక విచిత్రం ఈ చెట్టుబోదె

దానిని జొన్నరాతి కుప్పఅంటారు. ఈ శిఖరం మీద జొన్న రాతి కుప్పఏమిటి? ఆశ్చర్యం. పూర్వం ఎపుడైనా ఇక్కడ జొన్నలు పండించారా, జొన్నలు కుప్పలు, రాశులు పోశారా అని అనుమానం వస్తుంది. మూడు నాలుగు వందల సంవత్సరాల కిందట ఇక్కడ తప్పనిసరిగా గిరిజనులు నివసించే ఉంటారని నాకెపుడూ అనిపిస్తూ ఉంటుంది.

ఏదో ఆధునిక శిల్పం లాగా ఉంది కదూ!

వారిక్కడ సేద్యం చేసి ఉండాలి. వారి జీవితాల్లోని ఎంతో విస్మృత సమాచారం  ఇందులో దాగి ఉంటుందని నాకు అనిపిస్తా ఉంటుంది. అక్కడి నుంచి మేం కుడివైపు మళ్లాం. కనుచూపు మేరా కొండలు, గుట్టలు. పచ్చదనం. మేం చూడాలనుకుంటున్నది ఒకపుడు తరిగొండ వెంగమాంబ  ప్రయాణించిన దారి. అది తిరుమలకు  30 కి.మీ దూరాన ఉంటుంది. అక్కడి కాలినడకన ఒకరోజు పోయి రావడం కష్టం కాబట్టి, మేం జీపులను కూడా తీసుకున్నాం. కొద్ది దూరం నడవడం, కొద్ది సేపుజీపుల్లో ప్రయాణించడం చేస్తున్నాం.

మోగి చెట్లు

జొన్నరాతి కుప్పనుంచి బయలుదేరాక దారిపోడుగునా మాకు మోగి చెట్లు కనిపించాయి. మోగి చెట్లు తిరుపతి శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే ఓషధి అని అటవీ శాఖ మిత్రులు చెప్పారు. ఈ ప్రాంతంలో మోగి చెట్లు తప్ప మరేమీ కనిపించవు. ఎర్రచందనం చెట్లు లేవీ ప్రాంతంలో. అట్లాగే బిక్కి చెట్లు, ఈత చెట్లు న్నాయి. బిక్కికాయలు కోసుకుని తిన్నాం.

బ్రిటిష్ వాళ్ల విశ్రాంతి గృహం అవశేషం

 

అడవిలో నక్షత్ర తాబేళ్లు

మరి కొంతదూరం పోయాక నక్షత్ర తాబేళ్లు కనిపించాయి. వీటిని ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారని మనం పేపర్లలో చదువుతుంటాం. ఈ తాబేళ్లు నీళ్లలో ఉండవు, భూమ్మీదే ఉంటాయి. దగ్గిరి కొస్తే చాలా కంపు. వాటితో కొద్ది సేపు గడిపి ముందుకు పోతూ ఉంటే రెండు బలయిన దుప్పులు కనిపించాయి. తర్వాత తలకోన వైపు మరలాం. ఒక  రెండు కిలోమీటర్లు ప్రయాణించాక దారి మూసుకుపోయింది. దారితప్పాం అనిపించింది. అతి కష్టం మీద అక్కడ జీపులను వెనక్కి తిప్పుకుని, మరొక దారి పట్టాం.

పేరు లేని పుష్పాలు

కొంతదూరం పోయాక ఒక ‘వై’ జంక్షన్ వచ్చింది. దానిని మూడు రాళ్ల కురువ అంటారట. అక్కడి నుంచి ఎడమ వైపు దారి తీసుకుంటే తలకోనకు చేరుకోవచ్చు. తలకోనం 8 కి.మీ దూరం. కుడివైపు ఒక నాలుగు కిలోమీటర్లు వెలితే మెగిలిపెంట అనే ప్రాంతం వస్తుంది. దీన్నే రుద్రగళం, యుద్ధగళం అని కూడా పిలుస్తారు. ముందు మేం తలకోన వెళ్లాలనుకున్నాం. ఆ దారిలో ఒక స్వచ్ఛమయిన సెలయేరు కనిపించింది.  అక్కడ మధ్యాహ్నం భోజనానికి ఉపక్రమించాం.

శేషాలచం అడవుల్లో ట్రెక్…

మేమేదో చిత్రాన్నం, పెరుగన్నం తీసుకువచ్చాం. మా మిత్రుడు రఘు  అనంతపురం నుంచి జొన్నరొట్టెలు, శనక్కాయ పొడి, పప్పు తీసుకువచ్చాడు. ఆ అడవిలో వాటిని ఆరగించడం కూడా గొప్ప అనుభవం. భోజన విరామం తర్వాత తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం. ఈసారి బలిష్టమయిన ఎగులుబంట్లు కనిపించాయి.

ఇలాంటి వన్యప్రాణులు దర్శనాలు అరుదు. వాటిని కొద్దిసేపు చూసి ముందుకు పోగానే, మాకొక్క రెక్కమాను కనిపించింది. అది బ్రిటిష్ కాలం నాటి రెక్కమాను అని మనవాళ్లు చెప్పారు. ఇది మూడు దారులను చూపిస్తుంది. ఒకటి తలకోన, రెండు మొగలిపెంట, మూడోది తుమ్మల బయలు. తుమ్మలబయలు నుంచి వెళితే,  రాజంపేటకు చేరుకోవచ్చు. ఎపుడోఒకసారి ఆదారి గండా ఒక యాత్ర చేయాలి.

కొండరాతి విచిత్రాలు

 

కొంచెం దూరం వెళ్లాక రుద్రగళం అనే బోర్డు కూడా కనిపించింది. అక్కడి నుంచి తలకోన శిఖర భాగానికి చేరాం. శేషాచలపు కొండల తల భాగమే ఈ తలకోన.తిరుమల కొండలు ప్రారంభమయ్యేది ఈ తలకోన నుంచే. అక్కడ బ్రిటిష్ వాళ్లు కట్టిన కొన్ని కట్టడాలు, అటవీ శాఖ వారు కట్టుకున్న షెడ్లు కూడా ఉన్నాయి.నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వారి స్థావరం అనికూడా విన్నాను. అక్కడి నుంచి మెట్ట మార్గాన కిందకు దిగితే జలపాతం వస్తుంది. గతంలో వచ్చినపుడు ఇక్కడ ఉండే ఎగువ జరిలో  ఈదులాడాను.  ఈసారి టైం లేదు కనుక ఆ పని చేయలేదు. ఈ సారి తలకోన జలపాతం పుట్టే బుగ్గను చూశాం. అదొక అద్భుతమయిన అనుభవం.

 

వెంగమాంబ గీచిన ఆంజనేయ స్వామి

నేను గతంలో తిరగొండ వెంగమాంబ వ్యవస్థాపక సంచాలకుడిగా ఉన్నపుడు ఆమె జీవిత చరిత్రను క్షుణ్ణంగా చదివాను. వెంగమాంబ కష్టాలు భరించలేక తరిగొండ వదలి తిరుమలకు చేరుకుంటుంది. ఆమె తిరుమలకు చేరుకున్న మార్గం తలకోన మార్గమే. ఇది 280 యేళ్ల కిందటి మాట.

 

అన్నమయ్య ఏ విధంగా అడవిగుండా తిరుమలకు చేరుకున్నాడో, వెంగమాంబ కూడా ఈ దారిలో తిరుమలకు చేరుకుంది. మా తిరుగు ప్రయాణంలో తరిగొండ వెంగమాంబ ఎక్కడ తపస్సు చేసిందో అక్కడికి వెళ్లాం. అక్కడ ఆమె గీచిన ఆంజనేయుడి బొమ్మని చూశాం. అది బాగాశి ధిలావస్థలో ఉంది. తర్వాతి సమయంలేదు కనుక తిరుగు ప్రయాణం మయ్యాం.

 

(ఫోటోలు:శ్రీనివాస్, తిరుపతి)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *